శ్రీలంక: మత రాజకీయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందా

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
- రచయిత, నితిన్ శ్రీ వాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంకలోని రెండు పెద్ద విలాసవంతమైన గేట్ల ముందు భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్నారు. ఈ గేట్ల పై "రాజపక్ష లేని శ్రీలంక" "గొటా వెళ్లిపోయారు" లాంటి రాతలతో కూడిన గ్రాఫిటీ నిండిపోయింది.
కొన్ని రోజుల క్రితం వరకు ఈ విలాసవంతమైన అధ్యక్ష భవనం ఒక మ్యూజియంను తలపించేది.
ఈ భవనంలో మాజీ శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష గడుపుతున్న విలాసవంతమైన జీవితాన్ని చూసేందుకు కొలొంబోతో సహా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే శ్రీలంక పౌరుల క్యూ ఒక కిలోమీటరు పైగా ఉండేది.
ఇలా వచ్చే వారిలో సింహళీయులు, తమిళ హిందువులు, తమిళ ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉండేవారు.
ఆ రోజు నేను గుణశేఖర అనే వ్యక్తిని కలిసాను. ఆయన ఒక చంటి బిడ్డను ఎత్తుకున్నారు. "మేమంతా శ్రీలంక పౌరులం. మతం, కులం, చరిత్ర ఇప్పుడు కొత్తగా లిఖిస్తాం" అని అన్నారు.
ఒకవైపు దేశంలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం ముగిసే పరిస్థితులు కనిపించకపోగా, ప్రజల సామాజిక, మత సంబంధాల్లో మాత్రం ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. రాజపక్ష కుటుంబాన్ని అధికారంలోంచి తప్పించేందుకు మాత్రం అందరిలోనూ ఒక ఐక్యత కనిపిస్తోంది.
కొలొంబోలోని హోటల్ సినమన్ గ్రాండ్ వెనుకనున్న అందమైన కొలను తీరంలో ఒక పెద్ద బౌద్ధ మందిరం ఉంది.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
రెండున్నర కోట్ల జనాభా
కొన్ని నెలల క్రితం వరకు రాజపక్ష కుటుంబీకులందరూ ప్రతీ వారం ఈ గుడికి వచ్చేవారు. కానీ, ఇప్పుడు రాలేరు. గొటాబయ దేశం విడిచి వెళ్లిపోయారు. మహింద రాజపక్ష గుర్తు తెలియని ప్రాంతంలో ఉన్నారు.
శ్రీలంకలో నెలకొన్న ద్రవ్యోల్బణం, ఆహార, చమురు కొరత వల్ల కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసనల తర్వాత నిరసనకారులు ప్రధాని కార్యాలయం నుంచి అధ్యక్ష భవనం వరకు ముట్టడించారు. ప్రస్తుతం ఈ భవనాల నుంచి నిరసనకారులు వైదొలిగారు.
శ్రీలంకలోని 2.5 కోట్ల జనాభాలో మూడొంతుల మంది సింహళీయులే. వీరంతా బౌద్ధ మతస్థులు.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
దేశంలో గొడవలు
శ్రీలంకను ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలన్నీ మెజారిటీ జనాభా ప్రయోజనాల కోసమే పని చేశాయి. దీంతో తమిళులు, ముస్లింలలో ఆగ్రహం పెరుగుతూ వచ్చింది.
తమిళుల హక్కుల కోసం దేశంలో కొన్ని దశాబ్దాల పాటు అంతర్యుద్ధం సాగింది. 2009లో అప్పటి ప్రధాని మహీంద రాజపక్ష, రక్షణ కార్యదర్శి గొటాబయ రాజపక్ష ఈ పోరులో విజయం సాధించే బాధ్యతను తమ నెత్తిన పెట్టుకున్నారు.
పోరు ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సింహళ జాతీయతను ప్రధానాంశంగా తీసుకుని రాజపక్ష కుటుంబం విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గొటాబయ మాట్లాడుతూ, "సింహళ ప్రజల ఓట్లతో ఈ ఎన్నికల్లో గెలుస్తానని నాకు తెలుసు" అని అన్నారు.
"దేశంలో చాలా సార్లు పరస్పర వైరుధ్యంతో చాలా గొడవలు చోటు చేసుకున్నాయి. 30 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధం కూడా దీనికొక కారణం. ఇప్పుడు రాజకీయాల కోసం వ్యక్తులను లేదా ధర్మాన్ని వాడుకుంటున్నారు. శ్రీలంకలో అత్యధికంగా బౌద్ధ మతస్థులు ఉంటారు. దీంతో బౌద్ధ మతాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు" అని శ్రీ బోధి ఆలయం ప్రధాన అర్చకులు యతగామా రాహుల్ అన్నారు.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
"కానీ, మతం కంటే కూడా మానవత్వం ముఖ్యం. మీరే నగరానికి వెళ్లిచూసినా బౌద్ధ కుటుంబానికి చెందిన ఇంటి పక్కనే ఒక ముస్లిం కుటుంబం, ఎదురుగా ఒక క్రైస్తవ కుటుంబం ఉంటాయి. ఒక దేశంగా మేము పురోగతి సాధించాలంటే, అందరూ కలిసి బ్రతకాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
శ్రీలంకలో గత కొన్ని దశాబ్దాలుగా వర్గ విబేధాలు పెరుగుతున్నాయి, 2019లో ఈస్టర్ నాడు కొలొంబోలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 250 మంది మరణించారు.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
పరిస్థితులు మారతాయనే ఆశ
ఈ బాంబు పేలుళ్ల వెనుక ఇస్లామిక్ స్టేట్ స్థానిక యూనిట్ హస్తం ఉందని అంటారు. ఈ పేలుళ్ల తర్వాత పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయని ఇక్కడి తమిళ ముస్లింలు భావించడం మొదలుపెట్టారు.
"మాకు చాలా సమస్యలుండేవి. ఈస్టర్ బాంబు పేలుళ్ల తర్వాత ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ దాడులతో ముస్లిం సమాజానికి ఎటువంటి సంబంధం లేదు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు" అని కొలొంబోలోని అక్బర్ జుమా మసీదు ఇమామ్ రిఫ్ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
"కోవిడ్ సమయంలో రాజపక్ష సోదరులు మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అనుమతించలేదు. శవాలను కాల్చాలని చెప్పారు. వారిని అధికారం లోంచి తప్పించిన తర్వాత మా భవిష్యత్ బాగుంటుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.
గాల్ ఫేస్ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మంది నిరసనలు చేస్తున్నారు. అక్కడే నేను అష్ఫక్ అనే కాలేజీ విద్యార్థిని కలిసాను.
"గత ప్రభుత్వాలు కాలేజీ అడ్మిషన్‌లలో కూడా ముస్లింలకు కొంత శాతం మాత్రమే ఇచ్చేవారు. పరిస్థితులు మారొచ్చని అనుకుంటున్నాను" అని అన్నారు.
సింహళ జాతీయతను ప్రచారం చేసిన రాజపక్ష కుటుంబం కూడా సింహళ జనాభా వారికి ఎదురు తిరుగుతుందని ఊహించి ఉండరు.
సింహళీయులు ఎక్కువగా ఉండటం వల్ల కళ్లు మూసుకుని అల్ప సంఖ్యలో ఉన్న వర్గాల వారిని బయట వారిగా చూసేవారు.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
అందరం కలిసిమెలిసి ఉండాలి
కుమార పెరెరా ఒక మొబైల్ షాపును నిర్వహిస్తున్నారు. దేశంలో ఈ పరిస్థితి ఏర్పడటం పట్ల ఆయన చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు.
"శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం అంతర్యుద్ధం జరిగింది. ఆ పరిస్థితిని అర్ధం చేసుకోగలం. ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది. కానీ, అకస్మాత్తుగా ఒక కొత్త రకమైన జాతీయతా భావన నాటుకోవడం మొదలయింది. ఇది నెమ్మదిగా చాలా మందికి వ్యాపించింది. కానీ, నేడు తిండి, నీరు కరువు రావడంతో దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు" అని అన్నారు.
రాజపక్ష కుటుంబానికి వ్యతిరేకంగా చేస్తున్న శాంతియుత పోరాటంలో సైన్యం వ్యవహరించిన తీరు కూడా ఒక పెద్ద సంకేతాన్నిస్తోంది.
శ్రీలంక సైన్యంలో ఉన్న సైనికులు, కమాండర్లలో ఎక్కువ మంది సింహళీయులే. కానీ, నిరసనకారులను అణచివేసే విషయంలో వారు చాలా తేలిక పాటి ధోరణిని కనబరిచారు.

ఫొటో సోర్స్, Nitin Srivastava/BBC
"దేశంలో అంతర్యుద్ధం ముగిసిన 13 సంవత్సరాల తర్వాత ఇలా జరగడం వింతగా అనిపిస్తోంది" అని కొలొంబోలోని సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్‌లో రాజకీయ విశ్లేషకురాలు భవానీ ఫోన్సెకా అన్నారు.
"ఇక్కడున్న వారంతా కలిసి నివసించాలనే భావన నెమ్మదిగా పెరుగుతోంది. ఈ నిరసనల వల్ల పరస్పర అభిప్రాయం, సంభాషణలు, చర్చలకు మార్గం తెరుచుకుంటోంది. ప్రజలు తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించవచ్చు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- గోదావరి 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటిగట్లు నిలుస్తాయా
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













