ఆంధ్రప్రదేశ్: వాలంటీర్ల న్యూస్‌పేపర్ ఖర్చును ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది, విపక్షాలకు అభ్యంతరం ఎందుకు?

వార్తాపత్రికలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కునేందుకు నెల‌కు రూ. 5.32 కోట్లు చెల్లించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఈ విషయమై జూన్ 29న జీవో నంబరు 12ని విడుదల చేసింది. విస్తృత (Widely) సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రిక కొనుక్కోవాలని వాలంటీర్లకు ప్రభుత్వం చెప్పింది.

ఈ నిర్ణయంతో వాలంటీర్లు వార్తాపత్రిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమకాలీన అంశాల గురించి తెలుసుకోవచ్చని, ఇది మంచి పాలనకు దోహదపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. వార్తాపత్రిక కొనుక్కునేందుకు వాలంటీర్లకు ప్రజల డబ్బు ఎలా ఇస్తారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇంతకూ జీవోలో ఏముంది? ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏ విధంగా చూస్తున్నాయి?

పేపర్

ఆ జీవోలో ఏముంది?

కొంతమంది వాలంటీర్లు దినపత్రిక లేదా దినపత్రికలు కొనుక్కునేందుకు గౌరవ వేతనంతో పాటు అదనపు ఆర్థిక సాయం అందించాలని కోరారని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జీవోలో ఉంది.

ప్రభుత్వ పథకాలు, ఇతర సమకాలీన అంశాల సమాచారం వార్తాపత్రికలు ద్వారా తెలుసుకోవడం ద్వారా సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు ఏదైనా పత్రికలో తప్పుడు వార్తలు వస్తే దానిపై ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతుందని జీవోలో ఉంది.

గ్రామ/వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం ప్రతి గ్రామ/వార్డు వాలంటీర్‌కు వార్తాపత్రికలు కొనుక్కునేందుకు అదనపు ఆర్థిక సహాయం రూ. 250 ఒక్కొక్కరికి చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ప్రతి వాలంటీరుకు రూ. 200 చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఆర్థిక సహాయాన్ని జూలై, 2022 నుంచి మార్చి, 2023 వరకు ఇస్తున్నట్లు జీవోలో తెలిపింది.

పేపర్

ఫొటో సోర్స్, Getty Images

వాలంటీర్లపై ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2.66 లక్షల మంది వాలంటీర్లున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 చొప్పున నెలకు రూ. 5.32 కోట్లు ఖర్చవుతుంది. 9 నెలలకు రూ. 47.88 కోట్లు ఖర్చు అవుతుంది.

వైసీపీ ప్రభుత్వం 2019 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వీరికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పింది. దీనికి ఏడాదికి రూ. 1,596 కోట్లు ఖర్చవుతుంది.

“రెండేళ్ల క్రితమే వాలంటీర్లు వేతనాలు పెంచాలంటూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో, ప్రభుత్వం ఇది సేవా భావంతో చేయాల్సిన పనే కానీ, ప్రభుత్వ ఉద్యోగం కాదని, పైగా రూ. 5 వేలు గౌరవ వేతనం కూడా ఇస్తున్నామని తెలిపింది. దాదాపు వాలంటీర్లందరికీ రూ.10 వేల చొప్పున ఏటా వివిధ అవార్డుల పేరుతో చెల్లింపులు చేస్తోంది. దీనితో పాటు పనితీరు ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర పేరుతో రూ.30 వేలు, మరో 20 మందికి సేవా రత్న పేరుతో రూ.20 వేల చొప్పున నగదు అందిస్తోంది. వీటన్నింటికి ఏటా రూ.250 కోట్లు ఖర్చు పెడుతోంది. అలాగే స్మార్ట్ ఫోన్లు అందించారు. వీటికి తోడు ఇప్పుడు ఈ వార్తాపత్రికలకు డబ్బులు చెల్లిస్తుంది. ప్రజల సొమ్మును వాలంటీర్లకు చెల్లించడమేంటి?” అని సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సీహెచ్ నరసింహరావు బీబీసీతో అన్నారు.

“రోజూ వాలంటీరు సాక్షి పేపరుని తనతో పాటు తీసుకుని వెళ్లి...అందులో ప్రభుత్వానికి డప్పు కొతుతూ రాసే వార్తల్ని ప్రజలకు చూపించి వారితో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం పూర్తిగా ఇతర వ్యవస్థలను పక్కన పెట్టేసి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

పేపర్

ఫొటో సోర్స్, Getty Images

‘వాలంటీర్లు మన కార్యకర్తలే’

వాలంటీర్ల వ్యవస్థపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. అయితే వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని, వాలంటీర్ల పోస్టులు ఇచ్చింది కూడా వైసీపీ కార్యకర్తలకే అని పబ్లిక్ వేదికలపైనే వైసీపీ నాయకులు, మంత్రులు అన్నారు. ఇటీవల నెల్లూరులో జిల్లా స్థాయి ప్లీనరీలో జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

“వాలంటీర్లు అందరూ మన పార్టీకి సమాచారం చేరవేసే సైనికులే. పార్టీ పట్ల విధేయంగా, క్రమశిక్షణతో మెలగాలి. కాదని ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యవహరించినా వెంటనే వాలంటీర్‌ ఉద్యోగంలో నుంచి తీసేస్తాం. పార్టీలో వాలంటీర్లుగా పనిచేసేందుకు చాలా మంది ఉన్నారు. కనుక కొత్తవారిని నియమించుకోగలం” అని రాంబాబు చెప్పారు.

“వాలంటీర్ పోస్టులన్నీ మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం” అని కొన్నాళ్ల క్రితం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తాజాగా హోంశాఖ మంత్రి తానేటి వనిత వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలే అనే వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం- “గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ సుపరిపాలన కోసం తీసుకొచ్చాం. ఉద్యోగుల్లా కాకుండా సేవాభావంతో పనిచేసే ఈ వాలంటీర్ల వ్యవస్థ వైపు దేశం మొత్తం చూస్తుంది. కుల, మత రాజకీయాలను పట్టించుకోకుండా వాలంటీర్‌ వ్యవస్థ పని చేస్తుంది” అని పదే పదే చెబుతుంటారు.

పేపర్

ఫొటో సోర్స్, Getty Images

వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలే అని మంత్రులు, ఎంపీలే చెబుతుంటే, వాలంటీర్ల దినపత్రిక ఖర్చులు ప్రభుత్వం ఇవ్వడం అంటే వైసీపీ పార్టీ సభ్యులకు ఇస్తున్నట్లే కదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. వైసీపీ కార్యకర్తలందరినీ వాలంటీర్లుగా పెట్టుకుని వైసీపీ కోసం పని చేయిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపిస్తోంది.

“వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లకి రూ. 233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. ఖజానాలో డబ్బులు లేవని ప్రజా సంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం సాక్షికి వందల కోట్ల ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి వేయించుకోవాలని నెలకి రూ. 5.32 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాలంటీర్లు అందరూ వాడేది స్మార్ట్ ఫోన్లు, అందులో అన్నీ ఈ-పేపర్లు ఉంటాయి. మళ్లీ దినపత్రికలకంటూ జనం సొమ్ము ఇలా మళ్ళించడమెందుకు?” అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

లోకేశ్ విమర్శలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో తప్పుబట్టారు.

హైదరాబాద్‌లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం ఆఫీసుగా మార్చడానికి, హోటల్ హయత్‌లో ఏడాది కాలం విడిదికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిన మీరు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే ఎందుకు ఇంత బాధపడుతున్నారంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/APCM

‘అంతర్గత ఆదేశాలుంటాయి’

జీవో 12లో విస్తృత (widely) సర్క్యూలేషన్ ఉన్న దినపత్రిక అని రాశారని, ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రికైన సాక్షి సర్క్యూలేషన్ పెంచడం కోసమే ఈ జీవో విడుదల చేశారని విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు విమర్శించారు.

“దినపత్రికల ఖర్చులంటూ ఇచ్చే రూ.200కు ఏదో ఒక దినపత్రిక మాత్రమే వస్తుంది. అది సీఎం సొంత పత్రికే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అత్యధిక (Highest) సర్క్యూలేషన్ అనకుండా, విస్తృత (Widely) సర్క్యూలేషన్ అని జీవోలో రాశారని ఆయన ఆరోపించారు.

“ఏ వాలంటీర్ అయినా సీఎం సొంత పత్రిక మినహా మరో పేపరును కొంటారా? ఏ పేపరు కొనాలో వాలంటీర్లకు అంతర్గత ఆదేశాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ పేపరే కనిపిస్తోంది. ఇప్పుడు వాలంటీర్లకు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి మరికొంత సర్క్యూలేషన్ పెంచుకుంటోంది. నిజంగా సమాచారం తెలుసుకోవడానికే అయితే వాలంటీర్లకు ఉచితంగా సాక్షి పేపరును ఇవ్వొచ్చు కదా” అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు.

11వ పే-కమిషన్ రిపోర్టులో యూనివర్సీటీ ప్రొఫెసర్లకు న్యూస్ పేపర్లు, ఇంటర్నెట్ బిల్లు చెల్లించాలని ఉందని, కానీ అది అమలు కావడం లేదని ఆయన చెప్పారు.

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, వాళ్లు చేసేది స్వచ్ఛంద సేవ అని చెబుతున్న ప్రభుత్వం వాలంటీర్లకు న్యూస్ పేపరుకు కూడా బిల్లులు చెల్లించడం ఆశ్చర్యమేనని వ్యాఖ్యానించారు.

వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులైతే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్లు ఎలా పాల్గొంటారని రిటైర్డ్ ఎమ్మార్వో ఒకరు ప్రశ్నించారు.

“వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటో ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. వాలంటీర్లు తప్పులు చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్

‘జీవో చూడాలి, అప్పటివరకు స్పందించలేం’

జీవో నంబరు 12తో ప్రజల సొమ్మును వైసీపీకి అనుకూలంగా ఉండే వాలంటీర్ల వ్యవస్థకు అడ్డగోలుగా వాడుతున్నారంటూ విపక్షాలు, మేధావులు చేస్తున్న విమర్శలపై స్పందన కోసం రాష్ట్ర మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌లను బీబీసీ సంప్రదించింది.

“వాలంటీర్ల న్యూస్ పేపర్ల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ విడుదల చేసిన జీవోను చూడలేదు. జీవో చూసి అందులో ఏముందో చదివి, అప్పుడు దానిపై స్పందించగలం. అంత వరకు దానిపై స్పందించలేం. అయితే వాలంటీర్ల వ్యవస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించే గొప్ప వ్యవస్థ” అని ఇరువురు మంత్రులు అన్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: నర్సరీలు పెట్టి పెంచిన ఈ మొక్క ఇప్పుడు ప్రభుత్వాలను ఎందుకు భయపెడుతోంది?

‘వేతనం పెంచితే చాలు’

వాలంటీరు తాను నియమితమైన ప్రాంతంలోని 50 ఇళ్ల బాధ్యతలు చూస్తారు. ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను అంద చేయాలి. పెన్షన్లు, ఆరోగ్యం, విద్య, రేషన్, పథకాలకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేయాలి. పథకాల విషయంలో లబ్ధిదారుడికి ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలి. అలాగే వాలంటీర్ పరిధిలో ఉన్న కుటుంబాల నుంచి లబ్ధిదారుల ఎంపికలో ఆయా శాఖలకు సహాయకారిగా ఉండాలి.

తాము వేతనాలు పెంచాలని రెండేళ్లుగా అడుగుతున్నామని, రూ. 5 వేల నుంచి రూ.8 వేలు చేయాలని అందోళనలు కూడా చేశామని విశాఖపట్నంలోని ఒక సచివాలయంలో పనిచేసే వార్డు వాలంటీరు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’

ఇప్పటిదాకా తమ వేతనాల పెంపుకు సంబంధించి ఎలాంటి మాట ప్రభుత్వం నుంచి వినలేదని ఆ వాలంటీర్ చెప్పారు. “న్యూస్ పేపరుకు డబ్బులు ఇవ్వడం మంచిదే, కానీ మాకు మంచి గౌరవవేతం అందిస్తే...న్యూస్ పేపర్లు మేమే వేయించుకోగలం. మాకు వేతనాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని కోరారు.

ఈ అంశంపై విజయవాడకు చెందిన వార్డు వాలంటీర్ ఎస్.కుమార్ బీబీసీతో మాట్లాడుతూ- గ్రామ సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే తాము చాలా తక్కువ వేతనానికే పనిచేస్తున్నామని చెప్పారు.

“రెండు రోజుల క్రితమే మాకు అధికారులు చెప్పారు.. ఇకపై నెలకు రూ. 200 పేపరు ఖర్చుకు డబ్బులు వస్తాయని. సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే మేం చాలా తక్కువ వేతనానికే మేం పని చేస్తున్నాం. ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేసినట్లే, మాక్కూడా వేతనం పెంచితే బాగుంటుంది” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)