మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే..

మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే. ఎందుకంటే మగదోమలు కుట్టవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిమ్మల్ని దోమ కుట్టిందంటే.. అది కచ్చితంగా ఆడదోమే. ఎందుకంటే మగదోమలు కుట్టవు
    • రచయిత, రౌల్ రివాస్ గోన్జలెజ్,
    • హోదా, ది కన్వర్జేషన్

చరిత్ర మొత్తం మీద యుద్ధాల వల్ల ఎంత మంది చనిపోయారో.. వారికంటే ఎక్కువ మందిని దోమలు, అవి వ్యాపింపచేసే వ్యాధులు చంపాయి.

ఒక్క 2018వ సంవత్సరంలోనే 7,25000 మంది మరణించడానికి కారణం దోమలు.

ఆ సంవత్సరం అత్యధికంగా మానవుల మరణాలకు రెండో కారణం మానవులే. మనుషులే 437000 మంది సాటి మానవుల మరణాలకు కారణమయ్యారు. ఆ తర్వాత చాలా దూరంలో పాము కాట్లు, కుక్కలు, విషపూరితమైన నత్తలు, మొసళ్లు, హిప్పోలు, ఏనుగులు, సింహాలు, తోడేళ్లు, షార్క్‌లు ఉన్నాయి.

ఈ పరిస్థితి వల్ల ఆందోళన చెందిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ''గ్లోబల్ వెక్టర్ కంట్రోల్ రెస్పాన్స్ (జీవీసీఆర్) 2017-2030''ని ఆమోదించింది. మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వాహకాల నియంత్రణను బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా దేశాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేసే ప్రణాళిక అది. ఈ వాహకాల్లో దోమలు ముఖ్యమైనవి.

వ్యాధులను నిరోధించేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా అడ్డుకోవడానికి ఉద్దేశించిన కీలకమైన విధానం ఇది. ఎందుకంటే.. వెస్ట్ నైల్ ఫీవర్, జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా, సెయింట్ లూయిస్ ఎన్‌సెఫలిటీస్, లింఫాటిక్ ఫైలేరియాసిస్ (బోదకాలు), జపనీస్ ఎన్‌సెఫలిటీస్, రాస్ రివర్ ఫీవర్, బర్మా ఫారెస్ట్ ఫీవర్, మలేరియా వంటి వ్యాధులు ఒకరినుంచి మరొకరికి అంటుకునేలా చేసేవి దోమలే. (2020లో 627000 మంది మరణాలకు ఇవి కారణమయ్యాయి)

ఈ నేపథ్యంలో అసలు దోమలు కుట్టడానికి మనల్ని, లేదంటే మన పక్కన ఉన్నవాళ్లని ఎందుకు ఎంచుకుంటాయి? ఎలా ఎంచుకుంటాయి?

రక్తం పీలుస్తున్న దోమ

ఫొటో సోర్స్, Science Photo Library

కార్బన్ డయాక్సైడ్, శరీర వాసనలు

ఎవరినీ కుట్టకుండా కూడా దోమలు.. అవి ఆడవి అయినా మగవి అయినా కూడా.. బతకగలవు. అయితే, పునరుత్పత్తి చక్రాన్ని పూర్తి చేయాలంటే ఆడదోమలకు రక్తం అవసరం. కార్బన్ డయాక్సైడ్ (CO₂) దోమల్ని ఆకర్షిస్తుందని సుమారు శతాబ్ధం కిందట తేలింది.

గుడ్లు పెట్టేందుకు, అండాల ఫలదీకరణకు దోమలకు రక్తం అవసరం. ఇలా రక్తాన్ని కోరుకునే ఆడ దోమలను ఆకర్షించేందుకు ఒక ప్రయోగంలో కార్బన్ డయాక్సైడ్ వినియోగించారు.

అయినప్పటికీ.. దోమలను ఆకర్షించేందుకు కార్బన్ డయాక్సైడ్ వాహకంగా పనిచేస్తుంది అన్నదానికి ఆధారాలేమీ లేవు. అదేవిధంగా.. శరీరం నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ స్థాయిలను బట్టి దోమలు ఎవరిని కుట్టాలో ఎంచుకుంటాయి అనడానికి కూడా ఆధారాలు లేవు.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

అయితే.. మనిషి శరీరం నుంచి వెలువడే ఇతర భౌతిక, రసాయనిక సంకేతాల వల్ల దోమలు ఫలానా వారినే కుట్టాలి అనే నిర్ణయానికి వస్తుంటాయి. అవేంటంటే.. ఉష్ణం, (నీటి) ఆవిరి, తేమ, (దోమల) కంటికి కనిపించే సంకేతాలు, మరీ ముఖ్యంగా చర్మం నుంచి వెలువడే వాసనలు.

ఎలాంటి వాసనలు దోమలను ఆకర్షిస్తాయి అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, పలు అధ్యయనాలను బట్టి తెలుస్తోంది ఏంటంటే.. ఇండోల్, నాననోల్, ఆక్టెనోల్, లాక్టిక్ యాసిడ్ వంటివి దోమలను ప్రధానంగా ఆకర్షిస్తాయి.

ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన మాథ్యూ డిగెన్నారో ఆధ్వర్యంలోని బృందం ఒక వినూత్నమైన వాసన గ్రాహకం.. అయానోట్రోపిక్ రిసెప్టర్ 8ఎ (IR8a)ను గుర్తించింది. ఇది ఆడెస్ ఏజిప్టీ అనే దోమ లాక్టిక్ యాసిడ్‌ను గుర్తించేలా చేస్తుంది. ఏడెస్ ఏజిప్టీ అనేది దోమల్లో ఒక రకం. డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు ఈ దోమలే కారణం.

IR8a వాసన గ్రాహకం దోమల యాంటెన్నాపై ఉంటుంది. కొన్ని దోమల్లో ఈ వాసన గ్రాహకానికి శాస్త్రవేత్తలు మార్పులు చేశారు. ఇలా మార్పులకు గురైన దోమలు మనుషుల నుంచి వెలువడే లాక్టిక్ యాసిడ్ సహా, యాసిడ్ ఆధారంగా తయారయ్యే ఏ వాసనను కనుగొనలేకపోయాయి.

గుడ్లు ఉత్పత్తి చేసేందుకు, వాటిని ఫలదీకరించేందుకు ఆడ దోమలకు రక్తం అవసరం. అందుకే అవి కుడతాయి, రక్తం పీలుస్తాయి

ఫొటో సోర్స్, Gil Wizen/WPY

ఫొటో క్యాప్షన్, గుడ్లు ఉత్పత్తి చేసేందుకు, అండాలను ఫలదీకరించేందుకు ఆడ దోమలకు రక్తం అవసరం. అందుకే అవి కుడతాయి, రక్తం పీలుస్తాయి

దోమలను ఆకర్షించే 'పరిమళం'

మరోవైపు శాస్త్రవేత్తలు చేపట్టిన మరికొన్ని పరిశోధనలు చెబుతున్నది ఏంటంటే.. డెంగ్యూ, జికా వైరస్ వంటివి సోకినప్పుడు అవి మనుషులు, ఎలుకల నుంచి వెలువడే పరిమళభరితమైన వాసనను మార్చేసి, దోమలను ఆకర్షించేలా చేస్తాయి. ఇదొక ఆసక్తికరమైన వ్యూహం. దీనివల్ల ఆ వ్యాధి సోకిన మనుషుల్ని దోమలు ఎక్కువగా కుడతాయి. వారి రక్తాన్ని పీల్చి, ఇతరులకు కుట్టినప్పుడు వారికి ఈ వ్యాధులను అంటగడతాయి.

దోమల్ని ప్రత్యేకంగా ఆకర్షించే పరిమళభరితమైన కెటోన్, ఎసెటోఫెనోన్‌ ఉద్గారాలను సవరించి ఈ విషయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సాధారణంగా మనుషులు, ఎలుకల చర్మం సూక్ష్మ జీవుల జనాభాను నియంత్రించే అణువులను ఉత్పత్తి చేస్తుంటుంది.

కానీ, డెంగ్యూ, జికాలు సోకినప్పుడు మాత్రం ఎలుకల్లో ఈ అణువుల ఉత్పత్తి తగ్గిపోయి.. బాసిల్లస్ అనే రకానికి చెందిన సూక్ష్మజీవుల సంతతి పెరిగిపోయింది. దీంతో ఎసెటోఫెనోన్ ఉత్పత్తి పెరిగింది. మనుషుల్లో కూడా ఇలాంటిదే జరిగింది. డెంగ్యూ సోకిన వ్యక్తుల చంకల నుంచి వెలువడే వాసనల్ని పరిశీలించినప్పుడు అక్కడ ఆరోగ్యకరమైన మానవుల కంటే ఎక్కువ ఎసెటోఫెనోన్ ఉన్నట్లు తేలింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దీనిని సవరించొచ్చు. డెంగ్యూ సోకిన ఎలుకల్లో కొన్నింటికి ఐసోట్రెటినోయిన్‌తో చికిత్స చేశారు. ఆ తర్వాత వాటి నుంచి వెలువడే ఎసెటోఫెనోన్ తగ్గింది. ఆ ఎలుకలు దోమల్ని ఆకర్షించడం కూడా తగ్గింది.

ఇతర జీవుల కంటే మనుషుల చర్మం దోమలకు కుట్టడానికి, రక్తం పీల్చడానికి అనువుగా ఉంటుంది. మీరు వేసుకున్న బట్టలు కూడా దోమలు మిమ్మల్ని కుట్టాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడంలో కొంత పాత్ర పోషిస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇతర జీవుల కంటే మనుషుల చర్మం దోమలకు కుట్టడానికి, రక్తం పీల్చడానికి అనువుగా ఉంటుంది. మీరు వేసుకున్న బట్టలు కూడా దోమలు మిమ్మల్ని కుట్టాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడంలో కొంత పాత్ర పోషిస్తాయి

వాసనను మార్చే సూక్ష్మ జీవులు

సూక్ష్మజీవులు తమ చర్యలతో దోమలు, మానవుల శరీరాలను ప్రభావితం చేసే సందర్భం ఇదొక్కటే కాదు. ఉదాహరణకు ప్లాస్మోడియమ్ ఫాల్సిపరమ్ అనే పరాన్నజీవి మలేరియా సోకడానికి కారణం అవుతుంది. ఇది సోకినప్పుడు ఆ వ్యక్తులు అనొఫెలెస్ గాంబియే అనే రకం దోమలను ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే ఎక్కువగా ఆకర్షిస్తారు. అలా వీళ్లు వ్యాధికి వాహకాలు అవుతారు.

కారణాలేంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు కానీ, ప్లాస్మోడియమ్ ఫాల్సిపారమ్ ఒక ఐసోప్రినాయిడ్ పూర్వగామిని ఉత్పత్తి చేస్తుంది. దీనిపేరు (E)-4-హైడ్రాక్సీ-3-మిథైల్-బట్2-ఎనైల్ పైరోఫాస్ఫేట్(HMBPP). దీనివల్లే దోమల రక్తంలో ఆహారం కోసం వెతుక్కునే, రక్తం పీల్చే ప్రవర్తనలో తేడాలు వస్తుంటాయి. అలాగే ఆ దోమలు వ్యాధుల్ని వ్యాపింపజేయడంలో కూడా మార్పులు వస్తుంటాయి.

ప్రధానంగా.. మానవుల్లోని ఎర్ర రక్త కణాలు కార్బన్ డయాక్సైడ్‌, ఆల్డిహైడ్లు, మోనోటెర్పెనెస్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసేలా HMBPP ప్రేరేపిస్తుంది. ఇవి దోమల్ని విపరీతంగా ఆకర్షించి ''మా రక్తం పీల్చు'' అనే సిగ్నల్స్ ఇస్తాయి.

శాస్త్రవేత్తలు ఈ HMBPPను వేర్వేరు రక్తం నమూనాలకు జతచేశారు. అప్పుడు ఇతర రకాల దోమలు.. అనోఫెలెస్ కొలుజ్జీ, అనోఫెలెస్ అరేబియెనెసిస్, ఏడెస్ ఏజిప్టీలతో పాటు క్యూలెక్స్ పిపియన్స్/క్యూలెక్స్ టొరెంటియం రకం దోమలను ఈ రక్తం నమూనాలు ఎక్కువగా ఆకర్షించాయి.

దోమలు పదిమందిలో ఒక వ్యక్తిని ఎక్కువగా ఎందుకు కుడతాయి? ఇతరులను ఎందుకు అంతగా కుట్టవు? దోమలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏఏ అంశాలు దోహదం చేస్తాయి? అనేది అర్థం చేసుకుంటే.. అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

రౌల్ రివాస్ గోన్జలెజ్ యూనివర్శిటీ ఆఫ్ సలమన్కాలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్. ఈ కథనం తొలుత ది కన్వర్జేషన్‌లో ప్రచురితం అయ్యింది.

వీడియో క్యాప్షన్, మలేరియా: దోమలపై దోమలతో యుద్ధం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)