ఆస్ట్రేలియా: డెంగ్యూ దోమలపై పోరాడే కొత్త రకం దోమల్ని కనుగొన్న పరిశోధకులు

ఫొటో సోర్స్, Peter Illiciev/Fiocruz
డెంగ్యూ విష జ్వరాల నుంచి ఒక నగరాన్ని మొదటిసారి పూర్తిగా రక్షించామని ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పారు.
సహజంగా ఏర్పడే ఒక బ్యాక్టీరియాతో ప్రత్యేకంగా పెంచిన దోమలను టౌన్స్‌విల్లీ నగరంలో విడుదల చేసిన పరిశోధకులు అవి.. స్థానిక దోమలతో జతకట్టేలా చేశారు.
ఇవి వోల్బాచియా అనే బ్యాక్టీరియాను విస్తరిస్తాయి. ఆ బ్యాక్టీరియా డెంగ్యూ వ్యాప్తిని అడ్డుకుంటుంది. టౌన్స్‌విల్లీ నగరం 2014 నుంచి డెంగ్యూ నుంచి విముక్తి పొందిన నగరంగా ఉంది.
మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ పరీక్షలతో దోమల వల్ల వ్యాపించే జికా, మలేరియా లాంటి వ్యాధులను కూడా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.
"దోమల వల్ల ఏర్పడే వ్యాధులను తగ్గించడానికి మాకు ఏ దారీ లేకుండాపోయింది. అవి చాలా దారుణంగా వ్యాపించాయి" అని వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం డైరెక్టర్ స్కాట్ ఓనీల్ అన్నారు.
"ఈ ప్రయోగం, దోమల ద్వారా వచ్చే వ్యాధులపై గణనీయమైన ప్రభావం చూపబోతోందని అనిపిస్తోంది. ఈ అధ్యయనం చాలా ఆశాజనకంగా ఉందనడానికి ఇది తొలి సంకేతం అనుకుంటున్నా."

పరిశోధకులు నాలుగు వర్షాకాలాల నుంచీ ఈ పరీక్షలు చేస్తున్నారు. వోల్బాచియా బ్యాక్టీరియాను తీసుకెళ్లే దోమలను క్వీన్స్‌లాండ్‌లో ఉన్న టౌన్స్‌విల్లీలో 66 చదరపు కిలోమీటర్ల పరిధిలో విడుదల చేశారు. ఇక్కడ మొత్తం లక్షా 87 వేల మంది నివసిస్తున్నారు.
నగర ప్రజలు కూడా ఈ ప్రాజెక్టును స్వాగతించారు. స్కూలు పిల్లలు కూడా ప్రత్యేక దోమలను స్థానికంగా ఉన్న దోమలపై విడిచిపెట్టారు.
ఈ పరిశోధన ఫలితాలను ఈ మధ్యనే ప్రచురించారు. నగరవ్యాప్తంగా జరిగిన మొదటి విడత ప్రయోగం విజయవంతం అయ్యిందని తెలిపారు.
ఒక వ్యక్తికి సుమారు 757 రూపాయల ఖర్చుతో టౌన్స్‌విల్లీలో చేసిన ప్రయోగం చాలా త్వరగా ప్రభావం చూపుతుందని నిరూపించింది. "నగర ప్రజలకు దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ అందించడానికి ఈ నిధులను సమర్థంగా ఖర్చు చేశాం" అని ప్రొఫెసర్ ఒనీల్ చెప్పారు.

ప్రత్యేక దోమలతో డెంగ్యూను అడ్డుకునే ఈ కార్యక్రమం ప్రస్తుతం 11 దేశాల్లో అమలవుతోంది. వోల్బాచియా దోమలను ప్రపంచంలోని పేద దేశాలకు కూడా చేర్చాలనే ఉద్దేశంతో.. ఒక్కో వ్యక్తికి అయ్యే ఖర్చును 68 రూపాయలకు తగ్గించాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
తర్వాత దశలో ఈ బృందం ఇండోనేసియాలోని యోగ్యకర్త నగరంలో ఈ పరిశోధనలు చేస్తోంది. ఈ నగరంలో దాదాపు 4 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో వోల్బాచియా దోమలను విడుదల చేస్తున్నారు.
ఇవికూడా చదవండి:
- న్యూజిలాండ్: ప్రసూతి సెలవు ముగించుకుని పనిలో చేరిన ప్రధానమంత్రి
- ఇద్దరమ్మాయిలు.. ఒక చిన్న విమానం.. లక్ష్యం 23దేశాలు.. గడువు 100 రోజులు
- వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్లు, వంట మనుషులా?
- మాజీ గర్ల్ ఫ్రెండ్, మాజీ బాయ్ ఫ్రెండ్ : బంధాలపై గతాల నీలినీడలు
- BBC Special: విశాఖ రైల్వే జోన్ వస్తుందా, రాదా? వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- ఎన్ఐఎన్: హైదరాబాద్ ఆహారంలో ఎక్కువగా ‘పురుగు మందులు’, పిల్లలపై అధిక ప్రభావం
- 'నువ్వు ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు... కానీ 4వేల దహన సంస్కారాలు నిర్వహించాను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








