న్యూజిలాండ్: ప్రసూతి సెలవు ముగించుకుని పనిలో చేరిన ప్రధానమంత్రి

తన కూతురితో జసిండా ఆర్డెర్న్

ఫొటో సోర్స్, Getty Images

ఆరు వారాల పాటు ప్రసూతి సెలవులో ఉన్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ తిరిగి విధుల్లో చేరారు.

38 ఏళ్ల ఆర్డెర్న్‌కు జూన్ 21వ తేదీన ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు నీవ్ గేఫోర్డ్ అని పేరుపెట్టారు. ఈ పాప ఆర్డెర్న్ తొలి బిడ్డ.

అధికారంలో ఉండగా.. ఒక శిశువుకు జన్మనిచ్చిన ప్రపంచంలో రెండో మహిళా నాయకురాలు ఆర్డెర్న్.

తిరిగి విధుల్లో చేరాక మొదటి వారంలో తాను ఏమేం పనులు చేస్తానో వివరిస్తూ ఫేస్‌బుక్‌లో శనివారం ఒక వీడియో పోస్ట్ చేశారు ఆర్డెర్న్. ఈ ఆరు వారాల ప్రసూతి సెలవు సందర్భంగా తన బాధ్యతలను డిప్యూటీ ప్రధాని విన్‌స్టన్ పీటర్స్‌కు అప్పగించారు.

తన కూతురితో జసిండా ఆర్డెర్న్

ఫొటో సోర్స్, Getty Images

సెలవులో ఉన్నప్పటికీ ముఖ్యమైన కేబినెట్ పత్రాలను ఆమె పరిశీలించారు. అదేవిధంగా.. ప్రాముఖ్యత కలిగిన పలు అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం ఆమెను సంప్రదించింది.

2017 అక్టోబర్‌లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డెర్న్ తాను గర్భవతినని ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. తాను, తన సహచరుడు క్లార్క్ గేఫోర్డ్‌ తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపారు.

‘‘మల్టీ టాస్కింగ్ (ఒకేసారి చాలా బాధ్యతలు) చేసే మొదటి మహిళను నేను కాదు. పని చేస్తూనే పసిబిడ్డ బాధ్యతలు చూసుకుంటున్న మొదటి మహిళను కూడా నేను కాదు. ఇలాంటివన్నీ చేసిన చాలామంది మహిళలు ఉన్నారు’’ అని ఆమె అప్పట్లో చెప్పారు.

1856 తర్వాత న్యూజిలాండ్ దేశానికి ప్రధాని అయిన అత్యంత పిన్న వయస్కురాలు ఆర్డెర్న్.

అధికారంలో ఉండగా.. శిశువుకు జన్మనిచ్చిన ప్రపంచంలోని మొదటి మహిళా నాయకురాలు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన బేనజీర్ భుట్టో. 1990లో ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)