Godavari Floods: ‘‘గోదావరికి వచ్చే ప్రతి వరదా మాకొక జీవిత పాఠమే’’-మూడు భారీ వరదలను చూసిన వ్యక్తి అనుభవాలు

1986, 2006 వరదలను చూసిన బీర చిన్నారావు
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది జులై వరదలతో పాటు 1986, 2006 వరదలను చూసిన బీర చిన్నారావు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

చిన్నిచిన్ని ముత్యాల మాదిరిగా చినుకులు జాలువారుతుంటే చూడటానికి బాగానే ఉంటుంది. కానీ అవే చినుకులు ఒక ప్రవాహంలా మారి చుట్టుముడితే జీవితం తలకిందులవుతుంది.

గోదావరికి పోటెత్తిన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎంతో మంది బతుకు దెరువు కోల్పోయారు. కట్టుబట్టలతో వీధిన పడ్డారు. చాలా మంది కొత్తతరాలకు వరదల వల్ల కలిగే నష్టం, కష్టం ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీర చిన్నారావు మూడు వరదలను చూశారు. ముమ్మిడివరం మండలంలోని కమినికి చెందిన చిన్నారావు వయసు నలభై ఆరేళ్లు. 1986, 2006 వరదలను ఆయన చూశారు. ఆ అనుభవాలను ఆయన మాటల్లోనే...

'అప్పటికి నాకు 10 ఏళ్లు ఉంటాయి. 1986లో ఆగష్టు 15 నాడు జెండా పండుగ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నాం. రేపు జెండా ఎగురవేయాలనగా 14వ తేదీనే మమ్మల్ని ఒడ్డుకి తీసుకెళ్లిపోయారు. పడవలు వేసుకుని వచ్చి పిల్లలందరినీ పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. 14వ తేదీ మధ్యాహ్నానికే మా ఊరిలోకి వరద వచ్చింది.

చిన్నోళ్లం కాబట్టి మాకు వరదల గురించి పెద్దగా ఏమీ తెలిసేది కాదు. అప్పుడప్పుడూ వరద నీరు రావడం, రెండు మూడు రోజులకు తగ్గిపోవడం మాత్రమే అప్పటికి తెలుసు. కాబట్టి ఆ వరదలు కూడా అలాంటివే అనుకున్నాం.

కానీ అధికారులు వచ్చి పడవల్లో మమ్మల్ని సత్రంలోకి తీసుకెళ్లిపోయారు. ఎందుకు తీసుకెళుతున్నారన్నది కూడా మాకు పూర్తిగా తెలియదు. అమ్మానాన్న రాకుండా మా ఇంట్లో ముగ్గురు పిల్లల్ని పంపేశారు. ఇంట్లో సామాన్లున్నాయని వాళ్లు అక్కడే ఉండిపోయారు.

ఇతర పిల్లలు కూడా అంతా కలిసి సత్రంలోకి వచ్చాం. ఆ రోజు నుంచి పది రోజుల పాటు అక్కడే గడపాలనే సంగతి ఆ సమయానికి మాకు తెలియదు. పది రోజుల తర్వాత కానీ ఇంటికి వెళ్లలేకపోయాం.

సత్రంలో రోజూ భోజనాలు పెట్టేవారు. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపాం. వరదలతో ఇక జెండా వందనం లేదూ ఏమీ లేదూ... ఎటు చూసినా వరదలే. అంతటా నీరే. అందుకే ఆ సంవత్సరం ఎప్పటికీ మరచిపోలేం.

వరదలతో ఇంట్లోకి వచ్చిన నీరు

ఫొటో సోర్స్, UGC

అమ్మానాన్నకు బాగా ఇబ్బంది

వరదలు భారీగా రావడంతో ఇంట్లో ఉన్న అమ్మానాన్న చాలా ఇబ్బంది పడ్డారని తర్వాత తెలిసింది. ఆనాటికి ఊళ్లో దాదాపు అన్నీ పూరిళ్లే. కొబ్బరి కాయలు, ధాన్యం దాచుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఇంటి నిండా నీరు వచ్చేసినా ఆ ఏడాది అంతటికీ అవసరమైన తిండిగింజలు కాపాడేందుకు అమ్మానాన్న చాలా కష్టపడ్డారు. కొన్ని సామాన్లు, బట్టలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొన్ని తిండిగింజలు నీటిపాలయ్యాయి. ఉన్న వాటిని కాపాడి మా కడుపు నింపడం కోసం వాళ్లు పది రోజులు కష్టపడాల్సి వచ్చింది.

వెళ్లినప్పుడు వరద... వచ్చేసరికి బురద

వరద నీరు మా వాకిట్లోకి వచ్చేసింది. రాత్రికి ఇంట్లోకి వచ్చేస్తుందని అధికారులు చెప్పారు. నిద్రపోవడానికి కూడా వీలుండదని, పునరావాస కేంద్రానికి మమ్మల్ని తరలించారు. అప్పుడు మేం బోటు ఎక్కి చూస్తే అంతా వరద నీరే.

కానీ, పది రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పటికీ ఎక్కడ చూసినా బురదే. వరద మట్టి పేరుకుపోయి మా ఇల్లు, బడి కూడా చిందరవందర అయిపోయాయి. కొన్ని బట్టలు సహా అన్నీ కొట్టుకుపోయాయి. మళ్లీ మేం కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది.

ఈలోగా మళ్లీ 1990లో మరోసారి వరదలు వచ్చాయి. అప్పటికి కొంచెం వరదల అనుభవం ఉండటం వల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకొని పెద్ద నష్టం రాకుండా బయటపడ్డాం.

అసలే మా బడి కొబ్బరి ఆకులతో వేసిన పాక. నేల మీదనే కూర్చోవాలి. వరదలతో బడి పాక కొట్టుకుపోయింది. దానిని మళ్లీ నిలబెట్టడానికి మాస్టారుతో కలిసి ఊళ్లో వాళ్లంతా కష్టపడ్డారు. చాలా రోజులు బడి లేదు. దాంతో కొందరు పూర్తిగా బడికి దూరమయ్యారు.

నెల రోజులు స్కూలు నడవకపోవడంతో ఇక పూర్తిగా బడి మానేసి, పొలం పనుల్లోకి వెళ్లిపోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. వరదలతో వచ్చిన కష్టాలకు తోడుగా చదవులకు దూరమై భవిష్యత్తు నాశనమైంది.

2006 ముమ్మిడివరంలో వచ్చిన వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2006 ముమ్మిడివరం గ్రామాన్ని చుట్టుముట్టిన వరద

2006...ఊహించని వరదలు

మధ్య మధ్యలో కొన్ని వరదలు వచ్చినా అవి పెద్దగా నష్టాన్ని కలిగించలేదు. కానీ 2006లో మాత్రం పెద్ద విపత్తు వచ్చింది. అప్పటికీ కొన్ని చోట్ల గట్లు తెగిపోవడంతో వరద ఒక్కసారిగా చుట్టుముట్టింది. ఇది ఊహించలేదు.

అంతకుముందు 1986లో వరదలకు ముందుగా మమ్మల్ని తరలించారు. కానీ 2006లో మాత్రం వరద వేగంగా పెరిగింది. ఉన్నపళంగానే చాలామంది ఇళ్లు ఖాళీ చేశారు. అందరినీ మళ్లీ పడవల్లో ఒడ్డుకు తీసుకెళ్లారు. ఈ వరదల నాటికి నాకు పెళ్లయ్యింది. ఊళ్లో చాలామందిని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చే పనిలో నేను కూడా నా వంతు సాయం చేశాను.

ఊహించని రీతిలో 2006 ఆగష్టు 6వ తేదీన వచ్చిన వరద అపార నష్టాన్ని మిగిల్చింది. పంటలన్నీ నాశనమైపోయాయి. వరద నీరు తగ్గడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 15 రోజులు పునరావాస కేంద్రంలోనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి గ్రామంలో ఉన్న వారి బాగోగులు తెలుసుకోవడం, వారికి అవసరమైన ఆహారం అందుతుందా లేదా అని తెలుసుకోవడం వంటివి చేశాను.

వరద బాధితుల కోసం అన్నం వండుతున్న స్థానికులు

స్వచ్ఛంద సంస్థల సాయం

1986 వరదల నాటికి ప్రభుత్వ సహాయమే మాకు దిక్కు. వాళ్లిచ్చిన ఆహారమే తినాలి. కానీ 2006లో స్వచ్ఛందంగా చాలామంది సాయం చేశారు. అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. ఆహారం, బట్టలు అందించాయి.

ముమ్మిడివరం చుట్టుపక్కల నడింపల్లి శ్రీనివాసరాజు అనే నాయకుడు ఉండేవారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన స్వయంగా అందరికీ భోజనం ప్యాకెట్లు పంపించారు. ఎవరికీ లోటు రాకుండా చాలా మంచి భోజనం, సహాయం అందింది. 2006 వరదల్లో ప్రభుత్వ సహాయం కన్నా ఇతరుల నుంచి వచ్చిన సాయమే పెద్దది.

వరద తాకిడి 1986లోనే ఎక్కువ. అప్పట్లో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 35 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. మా లంకల్లో చాలా ఇళ్లు మునిగిపోయాయి. కానీ మాకు కలిగిన నష్టం మాత్రం 2006లోనే ఎక్కువ.

గట్లు తెగడం వల్ల ఒక్కసారిగా వరద వచ్చేసింది. ఎవరికీ సర్దుకునే అవకాశం కూడా దొరకలేదు. చాలా తీవ్రంగా నష్టపోయాం. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అంతటి భారీ నష్టం ఎప్పుడూ జరగలేదని మా పెద్దవాళ్లు కూడా చెప్పారు. నాడు చాలామంది ఉదారంగా చేదోడుగా నిలవడం ఆనందాన్నిచ్చింది.

అదే సమయంలో 2006లో పునరావాస కేంద్రంలోనే వరదల మధ్య జెండా వందనం చేయడం నాకు ఇంకా గుర్తుంది. అప్పటి ఎమ్మెల్యే విశ్వరూప్ వంటి వారు కూడా మాకు సహాయం అందించారు.

వరదలో చిక్కుకున్న వృద్ధురాలిని తరలిస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, UGC

ఈసారి ఊరి వదిలిన వారు తక్కువే

దాదాపు 1986 తర్వాత నా అవగాహన ప్రకారం ఎక్కువ నీరు ఈ ఏడాది జులై వరదల్లోనే ఊళ్లలోకి వచ్చింది. మా ఇంటి వరకూ వచ్చేసింది. చాలా ఇళ్లు నీటిలో నానిపోయాయి. కానీ ఈసారి ఊరు విడిచి బయటకు వెళ్లింది తక్కువే. పునరావాస కేంద్రాలు పెట్టినా ఎవరు కదలలేదు.

అందుకు కారణం 1986 నాటికి అందరివీ పూరిళ్లుండేవి. 2006 నాటికి 20 శాతం మందికి పక్కా ఇళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 90 శాతం మంది బిల్డింగులు కట్టేశారు. కిందన నీరు ఉంటే పైకి ఎక్కి తలదాచుకున్నారు. వర్షం వస్తే టార్పలిన్ వంటివి, బరకాలు లాంటివి కప్పుకుని అక్కడే ఉన్నారు.

విలువైన సామాన్లు పైకి చేర్చుకున్నారు. కాబట్టి వరద ఎక్కువే వచ్చింది. అయినా ఎవరూ ఇళ్లు ఖాళీ చేయలేదు. మిగిలిన కొద్ది మంది కూడా అటూఇటూ సర్దుకున్నారు.

జులై 14 నాటికే వరద మొదలైంది. 16కి బాగా పెరిగింది. కానీ ఇంటి నుంచి కదలలేదు. బాగా వృద్ధులు, వైద్య సహాయం అవసరమైన వారిని మాత్రం తరలించేందుకు ప్రభుత్వం బోటు పంపించింది.

బియ్యం, కందిపప్పు పంపించారు. రెండు, మూడు పూటలు ఆహారం ప్యాకెట్లు కూడా వచ్చాయి. వాటిని అందరికీ చేర్చేందుకు ప్రయత్నించాం. ఎవరూ ఆకలితో లేకుండా ఊళ్లోనే ఓ చోట అన్నం వండించి కూడా పంచాం. ఎవరికీ ఇప్పుడు తలదాచుకోవడానికి, కడుపు నింపుకోవడానికి పెద్ద లోటు లేదు.

1986 నాటి వరదల్లో ఆహారం ఎప్పుడు అందిస్తారా అని ఎదురుచూసిన కాలం నుంచి ఎవరికి అవసరం మేరకు వాళ్లు ఆహారం తయారు చేసుకునే స్థితి నేడు కనిపించింది. ప్రభుత్వం కూడా పెద్దగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం రాలేదు.

వరద బాధితులకు సాయం

ఫొటో సోర్స్, UGC

మళ్లీ వరదలు వస్తాయనే భయం

మొదటి రెండు పెద్ద వరదలు ఆగష్టులో వచ్చాయి. ఈసారి మాత్రం జులైలోనే వరదల తీవ్రత ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో మరోసారి ఈ సీజన్‌లోనే పెద్ద వరదలు చూడాల్సి వస్తుందేమోననే ఆందోళన మా అందరిలో ఉంది. స్కూల్ కూడా మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. 13వ తేదీ తర్వాత స్కూల్ తెరుచుకోలేదు. మళ్లీ నాలుగైదు రోజుల వరకూ ఇంకా కష్టమే. బాగా బురద నిండి ఉంది.

నీరు పూర్తిగా తీసేసిన తర్వాత దానిని శుభ్రం చేయాలి. నాడు-నేడులో భవనం కట్టారు. కానీ వరద నీటితో అది బాగా దెబ్బతింది. దానిని సరిచేయాలి. ఈసారి కూడా 10 రోజుల పాటు బడి మూసివేసినట్టే.

1986 వరదల్లో పది రోజులు, 2006లో పదిహేను రోజులు పునరావాస కేంద్రంలో గడిపాం. ఈసారి మాత్రం అలాంటి అవసరం లేదు. కానీ ఎక్కువ రోజులున్న వరద 2006లోదే. ఎక్కువ నష్టం కూడా అప్పుడే.

1986 తర్వాత మాకు పెద్ద వరద మాత్రం ఈ ఏడాది వచ్చింది. ఏటా వరదల్లో నష్టపోవడం, మళ్లీ నెమ్మదిగా కోలుకోవడం అలవాటు అయిపోయింది. ఈసారి కొంచెం ఎక్కువ దెబ్బతిన్నాం కాబట్టి టైమ్ ఎక్కువ పడుతుంది. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నాం.

కానీ, పిల్లలకు మాత్రం చదువుల విషయంలో జరిగే నష్టమే అతి పెద్దది. దానిని పూడ్చేందుకు సెలవుల్లో అదనపు తరగతుల వంటివి వరద బాధిత గ్రామాల్లో ఏర్పాటు చేయాలి.'

చిన్నారావు మాదిరిగానే గోదావరి లంక గ్రామాల్లో చాలా మందికి వరద జ్ఞాపకాలు, అనుభవాలున్నాయి. వ్యవసాయం చేస్తూ సొంతూరులోనే స్థిరపడిన చిన్నారావు వంటి వేల మంది ఏటా కోనసీమ ప్రాంతంలో వరదల తాకిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

కానీ వరదల అనుభవాలతో పాఠాలు నేర్చుకుంటూ వాటిని ఎదుర్కొనేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. ఇళ్ల నిర్మాణంలో పిల్లర్ల మీద ఓ అంతస్తు ఖాళీగా ఉంచేసి ఆపైన గదులు కట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వరదలు పొంగినా ఇంట్లోకి నీరు ప్రవేశించకుండా జాగ్రత్త పడవచ్చనేది వారి ఆలోచన.

వీడియో క్యాప్షన్, పక్షుల పెంపకంపై ప్రజల్లో అవగాహన తేవడమే లక్ష్యం అంటోన్న క్లోయ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)