Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌‌కు ప్రధాన మంత్రి అవుతారా?

రిషి సునక్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జాహ్నవీ మూలే
    • హోదా, బీబీసీ మరాఠీ

బ్రిటన్‌ ప్రధాన మంత్రి పదవి రేసులో రిషి సునాక్ ముందున్నారు. రిషిపై భారత్‌లో చాలా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన భారత సంతతి వ్యక్తి. అంతేకాదు భారత వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సుధా మూర్తిల అల్లుడు ఈయన.

బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో చాన్సెలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ (ఆర్థిక మంత్రి)గా రిషి పనిచేశారు. అనూహ్య పరిణామాల నడుమ జాన్సన్ రాజీనామా చేయడంతో.. కాన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో రిషి నిలబడ్డారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే.. భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు.

అయితే, ప్రస్తుతం ప్రధాన మంత్రి పదవి రేసులో రిషి ఎక్కడున్నారు? తర్వాత ఏం జరుగుతుంది? అసలు బ్రిటన్‌లో ప్రధాన మంత్రిని ఎలా ఎన్నుకుంటారు?

బోరిస్ జాన్సన్
ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్

ప్రధాన పదవి రేసు ఇలా..

బ్రిటన్‌లో ఎవరు అధికారంలోకి వస్తారా? అని భారత్‌లో చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య దృఢమైన ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయి.

భారత్‌ తరహాలో బ్రిటన్‌లో లిఖితపూర్వకమైన రాజ్యాంగం ఉండదు. అయితే, భారత్‌లానే ఇక్కడ కూడా ప్రధాన మంత్రి కావాలంటే మొదట పార్లమెంటులో సభ్యుడు కావాలి.

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ అర్హతలు ఉండాలో బ్రిటన్‌ పార్లమెంటు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దీనిలోని వివరాల ప్రకారం

  • అభ్యర్థి వయసు 18 ఏళ్లకు పైనే ఉండాలి.
  • అతడు లేదా ఆమెకు బ్రిటన్ పౌరసత్వం (ఇంగ్లండ్, స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్) లేదా ఐర్లాండ్ పౌరసత్వం ఉండాలి.
  • బ్రిటన్‌లో ఉండేందుకు అర్హులైన కామన్వెల్త్ దేశాల పౌరులు కూడా పోటీ చేయొచ్చు.

వీరు బ్రిటన్‌ లేదా కామన్వెల్త్ దేశాలకు బయట జన్మించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఉదాహరణకు బోరిస్ జాన్సన్ న్యూయార్క్‌లో జన్మించారు.

బోరిస్ జాన్సన్ , రిషి సునక్

ఫొటో సోర్స్, NO 10

ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్ తో రిషి సునక్

బ్రిటన్‌లో ప్రతినిధుల సభలో (హౌస్ ఆఫ్ కామన్స్)లో ఆధిక్యంలోనున్న పార్టీ నాయకుడు ప్రధాన మంత్రి అవుతారు. అయితే, ఒక్కో పార్టీ తమ నాయకుడిని ఒక్కోలా ఎన్నుకుంటుంది.

2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (దీన్నే టోరీ పార్టీ అని కూడా పిలుస్తారు) ఆధిక్యం సంపాదించింది. అప్పట్లో పార్టీ నాయకుడిగా బోరిస్ జాన్సన్ ఉండేవారు. ఇప్పుడు ఆయన రాజీనామా సమర్పించడంతో.. పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు మార్గం సుగమమైంది.

టోరీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. ప్రస్తుతం ఎనిమిది మంది అభ్యర్థులు ఇలా మద్దతును కూడగట్టగలిగారు.

  • ఈక్వాలిటీస్ శాఖ మాజీ మంత్రి కెమీ బాడెనాక్
  • అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవర్‌మన్
  • ఆరోగ్య శాఖ మాజీ మంత్రి జెరెమీ హంట్
  • వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డంట్
  • మాజీ చాన్సెలర్ రిషి సునాక్
  • విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్
  • విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ టామ్ టుగెన్‌ఢాట్
  • చాన్సెలర్ నధీమ్ జహావీ

తర్వాతి దశల్లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని రేసు నుంచి తప్పిస్తారు. అలా రేసులో ఇద్దరు మిగిలేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

వీడియో క్యాప్షన్, మరి బీజింగ్‌ అణచివేతపై పోరాడిన ఆందోళనకారులేమంటున్నారు?

బరిలో ఇద్దరు మాత్రమే మిగిలినప్పుడు.. దేశ వ్యాప్తంగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి దేశ ప్రధాన మంత్రి అవుతారు.

తమ పార్టీలో ఎంత మంది సభ్యులు ఉన్నారో రాజకీయ పార్టీలు ముందుగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే, గతసారి టోరీ నాయకత్వ ఎన్నికల్లో దాదాపు 1,60,000 మంది పాలుపంచుకున్నారు. అయితే, ఇప్పుడు తమ సభ్యుల సంఖ్య పెరిగిందని కన్జర్వేటివ్ పార్టీ చెబుతోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబరు 5నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు ప్రధాన మంత్రిగా బోరిస్ జాన్సన్ కొనసాగుతారు.

రిషి సునక్

రిషి సునాక్ ఎవరు?

సౌథంప్టన్‌లో రిషి సునాక్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. అయితే, వీరి మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి.

రిషి తండ్రి యశ్వీర్.. కెన్యా నుంచి, రిషి తల్లి ఉష.. టాంజానియా నుంచి బ్రిటన్‌కు వచ్చారు. యశ్వీర్ వైద్యుడిగా పనిచేసేవారు. ఉష మందుల షాపును నడిపేవారు. అయితే, రిషి మాత్రం ఆర్థిక రంగాన్ని కెరియర్‌గా ఎంచుకున్నారు.

వెంచెస్టర్ కాలేజీలో రిషి చదువుకున్నారు. వేసవి సెలవుల్లో సౌథంప్టన్ కర్రీ హౌస్‌లో వెయిటర్‌గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. స్టాన్‌ఫర్డ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

2001 నుంచి 2004 మధ్య గోల్డ్‌మన్ సాక్స్‌లో విశ్లేషకుడిగా రిషి పనిచేశారు. రెండు హెడ్జ్ ఫండ్స్‌లలోనూ విధులు నిర్వర్తించారు.

అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి పేరు కూడా వార్తల్లో నిలిచింది. అయితే, తన దగ్గర ఎంత డబ్బుందో ఎప్పుడూ ఆయన బహిరంగంగా వెల్లడించలేదు. ఆయనకు క్రికెట్, ఫుట్‌బాల్, ఫిట్‌నెస్, సినిమాలంటే ఇష్టమని తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.

రిషికి రాజకీయాలు కొంచెం కొత్తే. 2014 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిచ్‌మండ్ నుంచి పోటీచేసి ఆయన గెలిచారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఆ స్థానంలో ఆయన గెలిచారు. మొదట కేంద్ర సహాయక మంత్రిగా, ఆ తర్వాత చాన్సెలర్‌గా పనిచేశారు.

బ్రిటన్ క్యాబినెట్‌లో చాన్సెలర్ అనేది రెండో ముఖ్యమైన మంత్రిత్వ శాఖ. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి రిషి కావడం విశేషం.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలని పిలుపునిచ్చిన వారిలో రిషి ఒకరు. కన్జర్వేటివ్ పార్టీ కొత్తతరం నాయకుడిగా ఆయనను పిలుస్తుంటారు.

వీడియో క్యాప్షన్, బోరిస్ జాన్సన్: హీరో నుంచి జీరో ఎలా అయ్యారు

వివాదాల్లో కూడా..

కోవిడ్-19 వ్యాప్తి ముందువరకు మీడియాలో రిషికి మద్దతుగా వార్తలు వచ్చేవి. కానీ, మహమ్మారి వ్యాపించిన సమయంలో కొన్ని వివాదాలకు ఆయన కేంద్ర బిందువయ్యారు.

స్టాన్‌ఫర్డ్‌లో చదివేటప్పుడే నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె అక్షతా మూర్తిని రిషి కలిశారు. పెళ్లి తర్వాత కూడా అక్షతా మూర్తి తన భారత పౌరసత్వాన్ని అట్టిపెట్టుకున్నారు. దీంతో బ్రిటన్‌లో ఆమెకు నాన్-డొమిసైల్ రిసిడెంట్ హోదా ఉండేది. అంటే బ్రిటన్ వెలుపలి ఆదాయంపై ఏడాదికి 30,000 పౌండ్లు (రూ.28.81 లక్షలు) చెల్లిస్తే ఇక ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో చాలా మంది రిషి దంపతులను విమర్శించడం మొదలుపెట్టారు.

భార్య అక్షతా మూర్తితో రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భార్య అక్షతా మూర్తితో రిషి సునక్

విదేశాల్లో సంపాదించిన ఆస్తులపై బ్రిటన్‌లో పన్నులు చెల్లిస్తానని అక్షతా మూర్తి వివరణ కూడా ఇచ్చారు.

ఏప్రిల్ 2022లో రిషికి అమెరికా శాశ్వత పౌరసత్వాన్నిచ్చే గ్రీన్ కార్డు ఉందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో చాన్సెలర్‌గా పనిచేస్తూ అక్కడి పౌరసత్వం ఉండటమేంటని మరో వివాదం కూడా చెలరేగింది.

అయితే, ప్రభుత్వ అధికారిగా తొలిసారి అమెరికాకు వెళ్లినప్పుడే అక్కడి గ్రీన్ కార్డును వెనక్కి ఇచ్చేసే ప్రక్రియలను రిషి మొదలుపెట్టారని ఆయన అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)