మహేంద్ర సింగ్ ధోని: ది బెస్ట్ ఫినిషర్ కెరీర్‌లో 5 బెస్ట్ ఇన్నింగ్స్

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సి.వెంకటేశ్ , క్రీడా విశ్లేషకులు
    • హోదా, బీబీసీ కోసం..

సచిన్, కోహ్లీల మాదిరిగా మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద బోలెడన్ని బ్యాటింగ్ రికార్డులు లేవు. వారిలా అతను టన్నుల కొద్దీ పరుగులు కూడా చేయలేదు. కానీ గంగి గోవు పాలు గరిటడైనా చాలు అన్నట్టుగా ధోనీ చేసిన రన్స్ తక్కువే అయినా మ్యాచ్ ఫలితం పైన వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ.

ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్‌లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో అతని ప్రతిభ అద్వితీయం. తన సుదీర్ఘమైన కెరీర్‌లో ధోనీ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. వాటిలో కేవలం ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఎంపిక చేయడం అంత సులువేమీ కాదు గానీ ఆ ప్రయత్నం చేద్దాం.

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

(5) 148 - విశాఖ వన్డే 2005

ఈ మ్యాచ్‌కు కొద్ది నెలల ముందే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ధోనీ, తన మొదటి నాలుగు వన్డేల్లో చేసిన స్కోర్లు 0,12,7*,3 మాత్రమే. అయితే ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు దిగడం వల్ల తన సత్తా చూపడానికి అతనికి సరైన అవకాశం రావట్లేదని జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుర్తించాడు. అందుకే విశాఖపట్నం వన్‌డేలో వన్‌డౌన్ స్థానంలో ధోనీని బ్యాటింగ్‌కు పంపాడు.

మామూలుగానైతే నంబర్ 3 స్థానంలో గంగూలీనే బ్యాటింగ్‌కు వెళ్తాడు, కానీ కొత్త కుర్రాడికి ఆ చాన్స్ ఇచ్చి చూశాడు. అలా దొరికిన అవకాశాన్ని ధోనీ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 రన్స్ చేసి ఇండియాను గెలిపించాడు. అలా భారత క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అనే ఓ సువర్ణ అధ్యాయం ఆవిష్కరణకు మన విశాఖ వేదికైంది.

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

(4) 183 నాటౌట్ - జైపూర్ వన్‌డే 2005

వైజాగ్ సెంచరీ తర్వాత ఆడిన 16 వన్‌డేల్లో ధోనీ ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మళ్లీ ఆ సెంచరీ నాటి జోరు కనిపించలేదు. అతని స్పెషల్ టాలెంట్ పైన ఎవరికైనా అనుమానాలుంటే అవన్నీ ఈ జైపూర్ ఇన్నింగ్స్‌తో పటాపంచలై పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 298 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, యువరాజ్ - వీరెవ్వరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

కానీ మళ్లీ నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ మాత్రం తన పవర్ గేమ్‌ను లంక బౌలర్లకు రుచి చూపించాడు. 15 ఫోర్లు, 10 సిక్సర్లతో కేవలం 145 బంతుల్లో 183 రన్స్ చేసి ఒంటి చేత్తో ఇండియాను గెలిపించాడు. ఇప్పటికీ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక వన్‌డే స్కోరుగా ఇది ప్రపంచ రికార్డు. ఈ ఇన్నింగ్స్‌తోనే ధోనీ ఓ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు.

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

(3) 45 నాటౌట్ - ముక్కోణపు వన్‌డే సీరీస్ ఫైనల్, పోర్టాఫ్ స్పెయిన్, 2013

ధోనీని గ్రేటెస్ట్ ఫినిషర్ అని, కెప్టెన్ కూల్ అని ఎందుకు అంటారనేదానికి ఈ ఇన్నింగ్స్ ఒక మంచి ఉదాహరణ. శ్రీలంకతో జరిగిన ముక్కోణపు సీరీస్ ఫైనల్లో ఇండియా విజయ లక్ష్యం 204 పరుగులు మాత్రమే. కానీ టాప్ ఆర్డర్ కుప్పకూలి జట్టు కష్టాల్లో పడింది. 167 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన దశలో ఓటమి తప్పదనిపించింది.

వీడియో క్యాప్షన్, జమ్మూ కశ్మీర్‌లో మొట్టమొదటి టీ20 క్రికెట్ టోర్నమెంట్

కానీ కెప్టెన్ ధోనీ కూల్‌గా జట్టును విజయం వైపు నడిపించాడు. మూడున్నర ఓవర్ల ఆట మిగిలి ఉండగా 9వ వికెట్ కూడా పడింది. స్ట్రయిక్ తన దగ్గరే ఉంచుకునే ప్రయత్నంలో ధోనీ సింగిల్స్ తీయకపోవడంతో 44-49 ఓవర్ల మధ్య 36 బంతుల్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. గెలవాలంటే ఆఖరు ఓవర్లో 15 రన్స్ అవసరం.

ఇలా చివరిదాకా కూల్‌గా ఆడి క్లైమాక్స్ దశలో గేరు మార్చడం ధోనీ మహేంద్రజాలంలో భాగమే. 49 ఓవర్ల నాటికి మలింగ, అంజెలో మాథ్యూస్ లాంటి ప్రధాన బౌలర్ల ఓవర్లు పూర్తయిపోయాయి. పెద్దగా అనుభవం లేని షమిందా ఎరంగా అనే బౌలర్ 50వ ఓవర్ వేయాల్సి వచ్చింది. ధోనీ ఎదురు చూసింది ఆ అవకాశం కోసమే. ఒక డాట్ బాల్ తర్వాత వరుసగా ఒక ఫోర్, రెండు సిక్సులు కొట్టి అసంభవమనుకున్న విజయాన్ని సంభవం చేశాడతను.

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

(2) 76 నాటౌట్ - లార్డ్స్ టెస్ట్, 2007

వీడియో క్యాప్షన్, అతిపెద్ద క్రికెట్ ఫ్యాన్ గ్రూప్స్ భారత్ ఆర్మీ, బర్మీ ఆర్మీ

టెస్టుల్లో కూడా ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ మన జార్ఖండ్ డైనమైట్ బ్యాట్ నుంచి వచ్చాయి. లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో తన మామూలు స్టయిల్‌కు భిన్నంగా 159 బంతుల్లో ఓపికగా 76 రన్స్ చేసి టీమ్‌కు ఓటమి తప్పించాడు. నెంబర్ 11 బ్యాట్స్‌మన్ శ్రీశాంత్‌తో కలిసి ఆఖరు రోజు టీ విరామం వరకు ధోనీ... జిమ్మీ ఆండర్సన్‌తో సహా ఇంగ్లండ్ బౌలర్లను నిలువరించగలిగాడు.

ఇండియా తరఫు నుంచి అతనే టాప్ స్కోరర్. టీ బ్రేక్ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ డ్రా అయింది. ఇండియా 1-0 తేడాతో ఆ మూడు మ్యాచ్‌ల సీరీస్ గెలవడంలో ఈ డ్రా ఎంతో ఉపయోగపడింది.

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

(1) 91 నాటౌట్ - ప్రపంచ కప్ ఫైనల్, ముంబై, 2011

ధోనీ బ్యాటింగ్ విషయంలో అన్నిటిలోకి తలమానికమైనది, మనకు ఎప్పటికీ గుర్తుండేది 2011 ప్రపంచ కప్ గెలిపించిపెట్టిన ఇన్నింగ్స్. 275 పరుగుల భారీ లక్ష్యం ఛేజ్ చేస్తూ 114 పరుగులకే సెహ్వాగ్, సచిన్, కోహ్లీ వికెట్లు కోల్పోయి మన టీమ్ ఇబ్బందుల్లో కనిపించింది. నిజానికి మూడో వికెట్ పడ్డాక యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కు దిగాలి. అతను చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు కూడా.

కానీ ఆ దశలో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, సురాజ్ రణదీవ్ బౌలింగ్ చేస్తున్నారు. ఆఫ్ స్పిన్ బంతులు ఆడడం యువరాజ్ లాంటి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కంటే రైట్ హ్యాండరైన ధోనీకి సులువుగా ఉంటుంది. అందుకే ధోనీ ఆ కీలకమైన దశలో తానే బ్యాటింగ్‌కు దిగాడు. అతను గనుక త్వరగా ఔటై పోయి ఉంటే, యువరాజ్ కంటే ముందు ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చాడంటూ విమర్శలు వెల్లువెత్తేవి.

అయినా ధోనీ ఆ సాహసం చేశాడు. అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అతని బలం. బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ 79 బంతుల్లో అజేయంగా 91 రన్స్ చేసి కప్ గెలిపించిపెట్టాడు. విన్నింగ్ షాట్‌గా అతను కొట్టిన సిక్స్ ఎప్పుడూ మన కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. 'నేను ఇంకాసేపట్లో చనిపోతానని తెలిస్తే చివరిసారి ఆ ధోనీ సిక్స్ చూసి హాయిగా వెళ్లిపోతా' అని సునీల్ గావస్కర్ అంటుంటాడు. ఆ ఇన్నింగ్స్, ఆ షాట్ అంత స్పెషల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)