Dinesh Karthik: ఫినిష్ అయిపోయాడనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్ లాగా పైకి లేస్తున్న క్రికెటర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సి.వెంకటేశ్
- హోదా, క్రీడా విశ్లేషకులు
"మళ్ళీ ఇండియన్ టీమ్‌లోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నా" అని సరిగ్గా ఓ ఏడాది క్రితం దినేశ్ కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అది చూసి మనలో చాలా మంది నవ్వుకున్నారు.
అలా నవ్వుకోడానికి తగిన కారణాలు లేకపోలేదు. అప్పటికే అతని వయసు 36 సంవత్సరాలు. క్రికెట్ నుంచి రిటైరవ్వక పోయినా, వ్యాఖ్యాతగా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా క్రితం ఏడాది ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అతనికి కామెంటేటర్‌గా కొత్త కెరీర్ సిద్ధంగా ఉందనిపించింది.
మరోవైపు టీమిండియాలో వికెట్ కీపర్ స్థానానికి ముగ్గురు కుర్రాళ్ళు - రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, కె.ఎల్.రాహుల్ పోటీ పడుతున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలోనూ అలాంటి గట్టి పోటీనే ఉంది. అందుకే టీమ్‌లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలన్న అతని లక్ష్యం ఓ గొంతెమ్మ కోరిక లాగ అనిపించింది.
ఆఖరుసారి 2019 ప్రపంచ కప్‌లో భారతజట్టులో ఆడిన దినేశ్‌కి ఎప్పుడో తలుపులు మూసుకున్నాయని, ఇంక అతనికి చాన్సు ఎక్కడని క్రికెట్ పండితులు పెదవి విరిచారు. సీన్ కట్ చేస్తే ముప్పయ్యేడేళ్ళ వయసులో టీమిండియాలోకి మళ్ళీ వచ్చాడు డీకే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ రీఎంట్రీ ఎంత గొప్పగా ఉందంటే, ఇప్పుడు అతను బ్యాటింగ్‌కు దిగుతుంటే ప్రేక్షకులు "డీకే... డీకే…" అని అతనికి స్వాగతం పలుకుతున్నారు. సాధారణంగా కోహ్లీ లాంటి సూపర్‌స్టార్లకే అలాంటి స్వాగతం దక్కుతుంది.
అంతేకాదు, నాలుగు నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో కార్తీక్ ఆడటం కూడా ఖాయంగా కనిపిస్తున్నది.
డీకేకు ఇదేమీ కొత్త కాదు. టీమిండియా నుంచి సాగనంపడం, గోడకు కొట్టిన బంతిలాగ మళ్ళీ జట్టులోకి తిరిగిరావడం అతని పదహారేళ్ళ కెరీర్‌లో ఎన్నిసార్లు జరిగిందో లెక్క పెట్టడం కూడా కష్టం.
ధోనీ కంటే వయసులో దినేశ్ నాలుగేళ్లు చిన్న అయినా ఆ జార్ఖండ్ వీరుడి కన్నా ఏడాది ముందే అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన ప్రస్థానంలో ఇలా మూడేసి సంవత్సరాల పాటు భారత జట్టుకు దూరంగా ఉండడం కూడా మొదటిసారేమీ కాదు.
2010లో, మళ్ళీ 2014లో అతనికి అలా మూడేసి ఏళ్ల గ్యాప్ వచ్చింది. కానీ ఫినిష్ అయిపోయాడనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్ లాగా అతను మళ్ళీ పైకి లేస్తూనే ఉన్నాడు.

ఫొటో సోర్స్, @RCBTweets
కార్తీక్ కెరీర్‌లో ఇన్ని ఒడిదొడుకులకు కారణం స్వయంకృతాపరాధమా లేక టీమిండియా సెలెక్టర్ల తప్పిదమా? బహుశా వాటన్నికన్నా కూడా అతను మహేంద్ర సింగ్ ధోనీ సమకాలికుడు కావడమే ప్రధాన కారణమని చెప్పాలి.
2005లో ధోనీ రంగప్రవేశం తర్వాత ఓ పదిహేనేళ్ల పాటు మూడు ఫార్మాట్లలోనూ మరో వికెట్‌కీపర్‌కు భారత జట్టులో దారులన్నీ మూసుకున్నాయి. అయినా కూడా దినేశ్ కార్తీక్ నిరాశ చెందకుండా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాలో చోటు దక్కించుకుంటూ వచ్చాడు.
టాలెంట్ విషయంలో కానీ, టెక్నిక్ విషయంలో కానీ కార్తిక్ ఎవ్వరికీ తీసిపోడు. అతని ప్రత్యేకత ఏమిటంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడగలడు. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఫినిషర్‌గా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడతను.
అయితే ఎప్పుడూ తన ప్రతిభకు తగిన స్థాయిలో ఆడలేదతను. అతనితో వచ్చిన చిక్కంతా ఏమిటంటే కుదురుగా ఆడకపోవడం. ఒకటి రెండు అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వరసగా ఫెయిలవుతుంటాడు.

ఫొటో సోర్స్, INSTAGRAM/GETTY IMAGES
అతని వికెట్ కీపింగ్ కూడా అంతే, అతి కష్టమైన క్యాచ్‌లు పడతాడుగానీ తేలికైనవి జారవిడుస్తాడు. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కూడా చాలా హైపర్‌గా ఉండి వింత చేష్టలు చెస్తుంటాడు.
అందుకే ఒకనాటి ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌తో పోలుస్తూ అతన్ని "చోటా చిక్కా" అని పిలిచేవారు.
2007లో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సీరీస్‌లో ఓపెనర్‌గా రాణించి, ఇండియా టీమ్ ఆ సీరీస్ గెలవడంలో ముఖ్యపాత్ర వహించాడు. 2013లో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా మిడిలార్డర్లో ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
2019 నిదాహాస్ ట్రోఫీ టీ20 ఫైనల్లో అతను 8 బంతుల్లో 29 రన్స్ చేసి ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. అయితే ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ చాటునే బోలెడన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. అందుకే జట్టులో అతను నిలదొక్కుకోలేకపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక వ్యక్తిగత జీవితంలో కూడా డీకేకి ఒడిదొడుకులు తప్పలేదు. అతని మొదటి భార్య నికిత, మరో క్రికెటర్ మురళీ విజయ్‌తో ప్రేమలో పడింది. దాంతో ఆ పెళ్ళి తెగదెంపులైంది. కార్తీక్ కొన్ని రోజులు డిప్రెషన్‌లోకి వెళ్ళాడు.
కానీ ఆటలో లాగానే జీవితంలో కూడా మళ్ళీ పుంజుకున్నాడు. స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌తో పరిచయం ప్రేమగా మారి 2015లో ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఒక క్రీడాకారిణి భార్య కావడం.. అతను ఆటలో పూర్వ వైభవాన్ని అందుకునేలాగ చేసింది.
ఈ విషయంలో ముంబై ఆటగాడు అభిషేక్ నయ్యర్ ఇచ్చిన కోచింగ్ కూడా బాగా పని చేసింది. నయ్యర్ అతని చేత కఠోర సాధన చేయించాడు. ఏసీ లాంటి సౌకర్యాలు లేని ఇరుకు గదిలో అతని బస ఏర్పాటు చేసి నానా కష్టాలు పెట్టాడు.
బహుశా దినేశ్ కార్తీక్ టాలెంట్ చుట్టూ అలముకున్న బద్ధకాన్ని నయ్యర్ వదిలించినట్టున్నాడు. మొత్తం మీద ఆ కఠిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. అ శిక్ష(ణ) తర్వాతే నిదాహాస్ ట్రోఫీలో డీకే ఆ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీకి, తర్వాత టీమిండీయకి దాదాపు రెండు వందల స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడంటే దాని వెనుక అతను రోజుల తరబడి చేసిన కఠోర సాధన ఉంది.
లేటు వయసులో డీకే చేస్తున్న అద్భుతాలకు అసలు కారణం అతని పాజిటివ్ దృక్పధం. తమిళనాట స్థిరపడ్డ తెలుగు వాడు కాబట్టి టాలీవుడ్ సినిమాలు ఎక్కువ చుస్తుంటాడు. బొమ్మరిల్లు తన ఫేవరెట్ సినిమా అని అందులో హాసిని క్యారెక్టర్ ఇష్టమని చెబుతుంటాడు.
ఆ హాసిని లాగానే నవ్వుతూ, నవ్విస్తూ ముందుకెళ్తుంటాడు. స్లెడ్జింగ్ చేయడం గానీ, తోటి ఆటగాళ్లతో గొడవపడటం కానీ అతని విషయంలో ఎన్నడూ ఎరుగం మనం.
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యం కోల్పోకుండా పోరాడుతూనే ఉండాలన్నది డీకే కథలోని నీతి.
ఇవి కూడా చదవండి:
- ముంబయిలోని కమాఠీపురా రెడ్ లైట్ ఏరియాలో ఒకప్పటి జీవితం ఇలా ఉండేది...
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఉద్దానం: ఈ ప్రాంతంలో యువతీ యువకుల పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటే...
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
- సెక్స్‌లో మహిళల భావప్రాప్తికి, కటి భాగానికి సంబంధం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














