మిథాలీ రాజ్: భారత మహిళా క్రికెట్ రూపురేఖలు మార్చేసిన క్రీడాకారిణి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీప్తి పట్వర్ధన్
- హోదా, బీబీసీ స్పోర్ట్స్
భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మిథాలీ రాజ్ అన్ని ఫార్మాట్లకూ గుడ్ బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో భారత క్రికెట్‌లో గొప్ప విజయాలు నమోదుచేసిన ఒక దిగ్గజ బ్యాటర్ శకం ముగిసినట్లయింది. అంతేకాదు, మహిళల స్పోర్ట్స్‌ను అత్యంత ప్రభావితంచేసిన ఒక క్రికెటర్ ప్రస్థానం ముగిసింది.
తన 23ఏళ్ల కెరియర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మిథాలీ రాజ్ 333 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 10,868 రన్లు తీశారు. ప్రపంచ కప్ ఫైనల్స్‌కు భారత్‌ను రెండుసార్లు తీసుకెళ్లిన తొలి భారతీయ కెప్టెన్ ఆమె కావడం విశేషం.
అయితే, ఆమె ప్రత్యేకత కేవలం నంబర్లకు మాత్రమే పరిమితం కాదు. పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలో ఆమె తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది అమ్మాయిలు క్రికెట్‌లోకి వచ్చేలా ప్రేరణనిచ్చారు.
‘‘చిన్నప్పుడే బ్లూ జెర్సీ వేసుకుని భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు నా కెరియర్ మొదలుపెట్టాను’’అని సోషల్ మీడియా వేదికగా చెబుతూ 39ఏళ్ల మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎత్తు పల్లాలతో
‘‘ఈ కెరియర్ చాలా ఎత్తులు, కొన్ని పల్లాలు ఉన్నాయి. ప్రతిదీ నాకు ఏదో ఒక కొత్త విషయం నేర్పించింది. ఈ 23ఏళ్ల ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగింది. చాలా సవాళ్ల నడుమ దీన్ని నేను ఆస్వాదించాను’’అని ఆమె చెప్పారు.
ఆమె సుదీర్ఘ కెరియర్‌లో క్రమశిక్షణ ప్రధాన పాత్ర పోషించింది. ఈ క్రమశిక్షణను అలవరుచుకోవడానికి ఆమె చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మొదట్లో ఆమెకు బద్ధకం ఎక్కువగా ఉండేది.
ఆలస్యంగా నిద్రలేచే అలవాటును మాన్పించేందుకు ఆమెను తండ్రి దొరై రాజ్ సికింద్రాబాద్‌లోని జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. దీంతో అన్నయ్యతో కలిసి మిథాలీ కూడా క్రికెట్ కోచింగ్‌కు వెళ్లేవారు.

ఫొటో సోర్స్, Getty Images
బౌండరీ దగ్గర కూర్చొని హోంవర్క్
మొదట్లో ఎక్కువ సమయం మిథాలీ రాజ్ బౌండరీ దగ్గరే గడిపేవారు. బౌండరీకి అవతల మెట్లపై కూర్చొని ఆమె హోంవర్క్ చేసుకునేవారు. కొన్నిసార్లు బ్యాట్ పట్టుకొని షాట్‌లు కొట్టేందుకు కూడా ప్రయత్నించేవారు.
మిథాలీ క్రికెట్ ఆడే విధానం, టెక్నిక్‌లు బాగా నచ్చడంతో అక్కడి కోచ్ జ్యోతి ప్రసాద్.. ఆమెను మరో కోచ్ సంపత్ కుమార్ దగ్గరకు పంపించారు.
అప్పటికే సికింద్రాబాద్‌లో రెండు క్రికెట్ జట్లకు సంప్ కుమార్ మార్గనిర్దేశం చేశారు. ఆయన సూచనలతో మిథాలీ కెరియర్ వేగం పుంజుకుంది. అయితే, మొదట్నుంచీ మిథాలీకి శాస్త్రీయ నృత్యమంటే చాలా ఇష్టం. కానీ, తల్లిదండ్రులు సూచించిన క్రికెట్‌నే ఆమె కెరియర్‌గా ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె క్రికెట్ ట్రైనింగ్ ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యేది. రోజూ దాదాపు ఆరు గంటలు దీనికే ఆమె కేటాయించాల్సి వచ్చేది. స్కూల్ పరిసరాల్లోని సన్నని వీధుల్లో మిథాలీని ప్రాక్టీస్ చేయమని కుమార్ సూచించేవారు. ఆమెకు ఒక ప్రత్యేకమైన బ్యాట్ కూడా ఆయన తయారుచేయించారు.
‘‘పక్కనున్న గోడలకు బాల్ తగిలితే సర్ నన్ను కర్రతో కొట్టేవారు’’అని 2016లో క్రికెట్ మంత్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఆమెకు కుటుంబ వేడుకలకు హాజరయ్యేందుకు సమయం దొరికేది కాదు. ముఖ్యంగా స్పోర్ట్స్‌పైనే దృష్టి సారించాలని ఆమెకు తల్లిదండ్రులు సూచించేవారు.
ఏకాగ్రతతో దృష్టిసారించిన ఆ సమయమే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా స్థిరపడేందుకు ఆమెకు బాటలు పరిచింది. రికార్డు స్థాయిలో రన్లు కొట్టడంతోపాటు మంచి టెక్నిక్‌లతో మిథాలీ ముందుకు వెళ్లేవారు.
అంచెలంచెలుగా మిథాలీ పైకి ఎదుగుతూ వచ్చారు. 13ఏళ్ల వయసులోనే ఆమె ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు. 16ఏళ్ల వయసులో అంటే 1999లో ఆమె కెప్టెన్ అయ్యారు. ఇంగ్లండ్‌లోని మిల్టన్ కేన్స్‌లో తొలి వన్‌డే మ్యాచ్‌లో ఇర్లాండ్‌పై ఆమె 114 రన్లు కొట్టారు.
మిథాలీ మొత్తంగా వన్‌డే మ్యాచ్‌లలో 7,805 రన్లు కొట్టారు. ఆమె సగటు 50.68 రన్లు. వరుసగా ఏడు 50లు కొట్టిన రికార్డు ఆమె పేరిట ఉంది. విమెన్స్ క్రికెట్‌లో ఇదొక రికార్డు.

ఫొటో సోర్స్, Getty Images
2005లో కెప్టెన్సీ..
బ్యాటర్‌గా స్థిరపడిన ఆమెకు 2005లో భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఏడాది తర్వాత భారత జట్టును ఆమె వరల్డ్ కప్ ఫైనల్స్‌కు తీసుకెళ్లారు.
విమెన్స్ క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేని సమయంలో ఈ ఘనత సాధించి ప్రజల దృష్టిని ఆమె ఆకర్షించారు.
పురుషుల క్రికెట్‌కు విశేష ప్రజాదరణ ఉంటుంది. అదే సమయంలో మహిళల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. మౌలిక సదుపాయాలు, కోచింగ్ తదితర సదుపాయాలు మహిళా క్రికెటర్లకు అందటం లేదు. నేరుగా గ్రౌండ్‌లోనే వారు అన్నీ నేర్చుకోవాల్సి వస్తోంది.
అయితే, ఇన్ని సమస్యల నడుమే మిథాలీ లాంటి మహిళా క్రికెటర్లు తామేంటో నిరూపించుకున్నారు.
అయితే, తన 23ఏళ్ల కెరియర్‌లో మిథాలీ కేవలం 12 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. విమెన్స్ టెస్టు క్రికెట్‌లో రికార్డు స్థాయిలో ఆమె 214 రన్లు కొట్టారు. 2002లో ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో ఆమె ఈ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నాలుగేళ్లలో ఆమె ఐదే టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత ఎనిమిదేళ్లలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.
విమర్శలకు కూడా..
మీకు ఇష్టమైన మేల్ క్రికెటర్ ఎవరు? అని ఒక రిపోర్టర్ మిథాలీని ప్రశ్నించినప్పుడు.. ‘‘మీరు ఇలానే, మీకు ఇష్టమైన ఫిమేల్ క్రికెటర్ ఎవరని మేల్ క్రికెటర్లను అడుగుతారా?’’అని ఆమె తిరిగి ప్రశ్నించారు.
దాదాపు 20ఏళ్ల పాటు భారత్‌లో మహిళల క్రికెట్ ముఖచిత్రం, గళంగా ఆమె మారారు.
ప్రస్తుతం భారత మహిళల జట్టులోనున్న చాలా మంది మిథాలీ క్రికెట్‌ను చూస్తూ పెరిగారు. కొత్త వారికి ఆమె బ్యాటింగ్ టెక్నిక్‌లు, సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు.
ఆమె నేతృత్వంలో మహిళల స్పోర్ట్స్ కొత్త శిఖరాలకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సంపన్న క్రికెట్ బోర్డైన బీసీసీఐ 2005లో విమెన్స్ క్రికెట్‌నూ తమ పరిధిలోకి తీసుకుంది. 2016 నుంచి మహిళా క్రికెటర్లతో కాంట్రాక్టులు కూడా కుదుర్చుకోవడం మొదలుపెట్టింది.
2017లో మరో వరల్డ్ కప్ ఫైనల్‌కు మహిళల జట్టును మిథాలీ తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ లైవ్‌లకు విశేష ప్రజాదరణ వచ్చింది. అయితే, 9 రన్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. కానీ, ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకుంది.
‘‘ఏళ్లపాటు భారత జట్టుకు సారథ్యం వహించడం నిజంగా నాకు గర్వకారణం’’అని రిటైర్మెంట్ ప్రకటనలో మిథాలీ రాసుకొచ్చారు. ‘‘ఒక మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా మారడంతోపాటు మహిళల క్రికెట్‌కు ఒక రూపం ఇవ్వడంలోనూ ఇది ఎంతగానో తోడ్పడింది’’అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భూ పరిరక్షణ ఉద్యమం, వివాదాస్పద అంశాలపై జగ్గీ వాసుదేవ్‌తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..
- మ్యాపుల్లో ఉత్తరం దిక్కునే పైభాగంలో చూపుతారెందుకు? నార్త్ అంటే ఆధిపత్యమా? పేదవాళ్లంతా సౌత్‌లోనే ఉంటారా?
- జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













