ఆరు జట్లతో 'మహిళల ఐపీఎల్' వచ్చే ఏడాది నుంచి ప్రారంభం.. ఈ ఏడాది సంగతేంటి

మహిళల ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్త్
    • హోదా, బీబీసీ కోసం

బీసీసీఐ ఇప్పుడు మహిళా క్రికెటర్లకూ ఐపీఎల్ తలుపులు తెరుస్తోంది. పుర్తి స్థాయిలో కాకపోయినా, 2018 నుంచీ బీసీసీఐ 'మహిళల టీ20 ఛాలెంజ్' నిర్వహిస్తోంది.

ఇప్పుడు ఆలస్యంగానైనా ఐపీఎల్ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2023 నుంచి మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ నిర్వహించనున్నారు. ఇందులో ఆరు జట్లు పాల్గొంటాయి.

'మహిళల టీ20 ఛాలెంజ్'కు బదులు 'మహిళ ఐపీఎల్'

ఈ సీరీస్‌ను 'మహిళల టీ20 చాలెంజ్'కు బదులుగా 'వుమెన్స్ ఐపీఎల్' అని పిలుస్తారు.

'మహిళల టీ20 ఛాలెంజ్' చివరి ఎడిషన్ 2020 సంవత్సరంలో జరిగింది. ఈ ఏడాది బీసీసీఐ మూడు మహిళా జట్ల మధ్య ఈ చాలెంజ్ నిర్వహించనుంది. వాటి పేర్లు 'ఐపీఎల్ సూపర్‌నోవాస్', 'ఐపీఎల్ ట్రయిల్‌బ్లేజర్స్', 'ఐపీఎల్ వెలాసిటీ '.

ఈ మ్యాచ్‌లు 2022 మే 23 నుంచి 28 వరకు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ ప్రాతిపదికన ఫైనల్ జట్లను తేలుస్తారు. మూడు జట్లకూ కెప్టెన్లు భారత క్రీడాకారిణులే.

ఐపీఎల్ సూపర్‌నోవాస్‌ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఐపీఎల్ ట్రయిల్‌బ్లేజర్స్ కెప్టెన్ స్మృతి మందన, ఐపీఎల్ వెలాసిటీకి కెప్టెన్ దీప్తి శర్మ.

మహిళల ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ సూపర్‌నోవాస్

ఐపీఎల్ సూపర్‌నోవాస్ జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, భారత క్రికెటర్లు ఆయుషీ సోనీ, చందు వెంకటేశప్ప, హర్లీన్ డియోల్, మాన్సీ జోషి, మేధనా సింగ్, మోనికా పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పూని, రాశి కనోజియా, తాన్యా భాటియా ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అలనా కింగ్, వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్, దక్షిణాఫ్రికా నుంచి సునే లూస్ ఉన్నారు.

అలనా 68 ప్రపంచ టీ20 మ్యాచ్‌లు ఆడి, 280 పరుగులు చేయడంతో పాటు 54 వికెట్లు తీసుకున్నారు. ఆమె జట్టుకు ఆల్ రౌండర్‌గా సహాయపడగలరు. డియాండ్రా దూకుడు బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె 124 ప్రపంచ టీ20 మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో 2680 పరుగులు చేశారు. 61 వికెట్లు కూడా తీశారు. సూనే లూస్ అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది. ఆమె 83 ప్రపంచ టీ20ల్లో 866 పరుగులు చేయడమే కాకుండా 47 వికెట్లు పడగొట్టారు. ఈ సంవత్సరం న్యూ జీలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో 100వ వన్డే ఇంటర్నషనల్ మ్యాచ్ ఆడారు.

ఐపీఎల్ ట్రయిల్‌బ్లేజర్స్

కెప్టెన్ స్మృతి మందనతో పాటు, ఐపీఎల్ ట్రయిల్‌బ్లేజర్స్‌లో అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్ యాదవ్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, సబ్బినేని మేఘన, సైకా ఇషాక్, శ్రద్ధా పోఖర్కర్, సుజాతా మాలిక్ ఉన్నారు. వీరితో పాటు జట్టులో వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్‌కు క్రికెటర్లు సల్మా ఖాతూన్, షర్మిన్ అక్తర్ ఉన్నారు. హేలీ మాథ్యూస్ 61 ప్రపంచ టీ20 మ్యాచ్‌లు ఆడి 1055 పరుగులు, 58 వికెట్లు సాధించారు.

ఐపీఎల్ వెలాసిటీ

మూడో జట్టు ఐపీఎల్ వెలాసిటీలో కెప్టెన్ దీప్తి శర్మ, ఆర్తి కేదార్, కీర్తి జేమ్స్, కిరణ్ నవ్‌గిరే, మాయా సోనావానే, ప్రణవి చంద్ర, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, శివాలి షిండే, సిమ్రాన్ బహదూర్, స్నేహ రాణా, యాస్తికా భాటియా ఉన్నారు. ఈ జట్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు అయాబొంగా ఖాకా, లారా వోల్వార్డ్ కూడా ఉన్నారు.

మహిళల ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచులు ఎప్పుడు?

2022 మహిళల టీ20 ఛాలెంజ్‌లో మ్యాచులన్నీ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనున్నాయి.

తొలి మ్యాచ్ మే 23 సోమవారం రాత్రి పూణేలో ఐపీఎల్ ట్రయిల్‌బ్లేజర్ల్స్, ఐపీఎల్ సూపర్‌నోవాస్ మధ్య జరిగింది. ఇందులో సూపర్‌నోవాస్ జట్టు గెలిచింది.

మే 24న మధ్యాహ్నం ఐపీఎల్ సూపర్‌నోవాస్, ఐపీఎల్ వెలాసిటీ మధ్య రెండో మ్యాచ్, మే 26న వెలాసిటీ, ట్రయిల్‌బ్లేజర్ల్స్ మధ్య మూడో మ్యాచ్ జరగనుంది.

వీడియో క్యాప్షన్, 15 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన చిన్న వయస్కురాలు షెఫాలీ

ప్రైజ్ మనీ ఎంత?

పురుషుల ఐపీఎల్‌లో విజేతలకు ప్రైజ్ మనీ ఎంత, ఏ ఆటగాడికి ఎంత డబ్బు ఇస్తారు లాంటి విషయాలన్నీ తేటతెల్లమే. కానీ, మహిళల ఐపీఎల్‌లో అన్నీ రహస్యంగానే ఉన్నాయి. వీటి గురించి ఎవరికీ సమాచారం లేదు.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి పరిమిత మ్యాచులు మహిళల ఐపీఎల్‌కు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి? భారత దేశవాళీ మహిళల క్రికెట్‌ను మెరుగుపరుస్తాయా?

అలా చూస్తే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందని క్రీడా విశ్లేషకుడు అయాజ్ మెమన్ అభిప్రాయపడ్డారు.

"ఒక విధంగా బీసీసీఐ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మహిళా క్రికెట్‌లో దీనికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న భారత మహిళా క్రికెటర్లందరూ ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావాలని కోరుకుంటారు. మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మహిళల టీ20 చాలెంజ్ ఆ దిశగా వేస్తున్న అడుగులు" అని ఆయన అన్నారు.

అయితే, మ్యాచుల షెడ్యూల్ సరిగా లేదు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆడే జట్టు, మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మరో మ్యాచ్ ఆడుతుంది. 24 గంటల లోపే రెండు మ్యాచులకు ఉపక్రమించడం జట్లకు సవాలే. అదీ ఈ మండుటెండల్లో.

ప్రైజ్ మనీ, మహిళా క్రీడాకారిణులకు ఇచ్చే డబ్బు విషయంలో గోప్యత గురించి అయాజ్ మెమన్ మాట్లాడుతూ, ప్రసార హక్కుల నుంచి ఎంత డబ్బు అందుతుందో బహుసా బీసీసీఐకి కూడా పూర్తిగా తెలియకపోవడమే ఈ సస్పెన్స్‌కు కారణం అన్నారు.

"పురుషుల ఐపీఎల్‌లో ఎక్కువ డబ్బు ప్రసార హక్కుల నుంచి వస్తుంది. మహిళల ఐపీఎల్ లేదా టీ20 చాలెంజ్ ప్రసార హక్కులకు అంత డబ్బు రాకపోవచ్చు. కానీ, మహిళా క్రీడాకారిణులూ ప్రొఫెషనల్ క్రికెటర్లే. అంతర్జాతీయ ప్రొఫెషనల్ మ్యాచులు ఆడుతున్నారు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నారు. కాబట్టి ఐపీఎల్ మహిళా క్రికెట్‌లో షరతులేంటో బహిరంగపరచడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.

మూడు జట్లే ఉన్నా, విదేశీ క్రీడాకారిణుల సంఖ్య పరిమితంగా ఉన్నా ఫరవాలేదని, అందుబాటులో ఉన్నవారు వస్తున్నారని మెమెన్ అన్నారు.

"మ్యాచ్ చూడడానికి ఎంత మంది ప్రేక్షకులు ఉంటారన్నది అన్నిటికన్నా పెద్ద విషయం. మైదానంలో అయినా, టీవీలో అయినా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అయినా ప్రేక్షకులు వస్తే, అప్పుడు మహిళల ఐపీఎల్ విజయవంతమవుతుంది. అంతేకాకుండా టైమింగ్, ప్రసారాలు సరిగ్గా జరిగితే ఫలితాలు బాగుంటాయి. ప్రేక్షకులు రాకపోతే ఎందుకు అలా జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయాలి.

ఐపీఎల్ వల్ల దేశవాళీ క్రికెట్ కూడా మెరుగవుతుంది. అది ముఖ్యం కూడా. దాని వల్ల, వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ ఆరు జట్లకు మంచి ఆటగాళ్లు లభిస్తారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు కూడా ఆసక్తి చూపిస్తారు.

మరో విషయం ఏమిటంటే, మహిళల ఐపీఎల్ లేదా మహిళల చాలెంజ్ మ్యాచులు తరచూ నిర్వహిస్తుంటే దేశంలో మహిళా క్రీడాకారులకు డిమాండ్ పెరుగుతుంది. యువతుల్లో ఆడాలనే ఆసక్తి, కోరిక పెరుగుతాయి" అని అయాజ్ మెమెన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)