SPORTS BRA: 'జాక్‌స్ట్రాప్ బ్రా' ఎలా పుట్టింది.. అది మహిళల క్రీడలను ఎలా మలుపు తిప్పింది?

ఫొటో సోర్స్, JOGBRA, INC. RECORDS, ARCHIVES CENTER, NATIONAL MU
- రచయిత, హోలీ హోండెరిక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలకు క్రీడల్లోగానీ, యోగా, జిమ్, రన్నింగ్ దేనికైనా స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లోదుస్తుల కథ 1970లలో ఆరంభమైంది.
అది 1977 వేసవి కాలం. వెర్మోంట్ యూనివర్సిటీ విద్యార్థి లిసా లిండాల్‌కు రన్నింగ్‌పై మక్కువ ఏర్పడింది. ప్రతి వారం 30 మైళ్లు జాగింగ్ చేసేవారు.
రన్నింగ్ తిన్నగా ఉండేదిగానీ, లోదుస్తులు తిన్నగా ఉండేవి కావు.
"రన్నింగ్‌లో ఒకే ఒక్క అసౌకర్యం రొమ్ముకు తగిన సపోర్ట్ ఉండేది కాదు" అని లిసా చెప్పారు.
అప్పటికి లిసాకు 28 ఏళ్లు. పరిగెడుతున్నప్పుడు వక్షోజాలు బిగుతుగా ఉండడానికి ఎలాస్టిక్ బ్యాండేజీ కట్టుకుని చూశారు. అసలు బ్రా వేసుకోకుండా పరిగెత్తారు. ఏమీ ఫలించలేదు. చివరికి మాములు బ్రా, చిన్న సైజుది వేసుకోవడం మొదలుపెట్టారు.
ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదు. చివరికి విసిగిపోయి తన చెల్లితో కలిసి దాని మీద జోకులు వేయడం మొదలుపెట్టారు.
"ఆడవాళ్లకు జాక్‌స్ట్రాప్ ఎందుకు లేదు?" అని నవ్వుకునేవాళ్లు.
జాక్‌స్ట్రాప్ అంటే మగవాళ్లకు మర్మావయవాలను బిగించే పట్టీలతో చేసిన లోదుస్తులు. ఆటల్లో పాల్గొనే పురుషులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసే జాక్‌స్ట్రాప్స్ మహిళలకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వారికి వచ్చింది.
లిసా లిండాల్ దీని గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. తన బెస్ట్ ఫ్రెండ్ పాలీ పామర్ స్మిత్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేర్చారు. అప్పటికి పాలీ, వెర్మోంట్‌లోని బర్లింగ్‌టన్‌లో జరగనున్న షేక్స్‌పియర్ ఫెస్టివల్ కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
పాలీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మరో కాస్ట్యూమ్ డిజైనర్ హిండా మిల్లర్ కూడా వీళ్ల బృందంలో చేరారు.
ముగ్గురూ చేరి లిసా వాళ్ల ఇంట్లో ప్రయోగాలు మొదలుపెట్టారు. హిండా మిల్లర్ కొన్ని నమూనాలు తయారుచేశారు. లిసా వాటిని ధరించి రన్నింగ్‌కు పనికొస్తాయో లేదో టెస్ట్ చేసేవారు.

ఫొటో సోర్స్, JOGBRA, INC. RECORDS, ARCHIVES CENTER, NATIONAL MU
'జాక్‌స్ట్రాప్‌తో బల్బు వెలిగింది'
వాళ్ల ప్రయోగాలేవీ ఫలించలేదని లిసా చెప్పారు.
అప్పుడే లిసా భర్త జాక్‌స్ట్రాప్‌ను ఛాతీ మీదకు లాక్కుని మెట్లు దిగుతూ కనిపించారు. అది చూడగానే వీళ్లకు మంచి ఐడియా వచ్చింది. అదే "జాక్ బ్రా".
"అది చూడగానే మాకు బల్బు వెలిగింది" అని పాలీ చెప్పారు. వెంటనే ఆమె రెండు జాక్‌స్ట్రాప్‌లు కలిపి కుట్టారు. అలా 'జాగ్‌బ్రా' పుట్టింది. అదే నేటి స్పోర్ట్స్ బ్రా కు పునాది.
ఆ ముగ్గురు మహిళలూ జాగ్‌బ్రా డిజైన్ మీద మరి కొంచం వర్క్ చేశారు. Jogbra Inc. అనే సంస్థ ప్రారంభించి పేటెంట్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు.
అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన 'నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్'లో లిసాకు, తన సహ-ఆవిష్కర్తలకు చోటు దక్కింది. స్పోర్ట్స్ బ్రా ఎంత అవసరమైన ఆవిష్కరణకో చెప్పడానికి ఇదే ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
'మహిళల క్రీడల్లో విప్లవాత్మకమైన మార్పు'
స్పోర్ట్స్ బ్రా ఆవిష్కరణ మహిళల క్రీడల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది.
లిసా, పాలీ, హిండా కలిసి జాగ్‌బ్రా కనిపెట్టడానికి అయిదేళ్ల ముందు అమెరికా ప్రభుత్వం 'టైటిల్ IX' చట్టాన్ని ఆమోదించింది. పౌర హక్కుల అంశంలో ఇదొక మైలురాయి. ఈ చట్ట ప్రకారం, విద్యలో లింగ వివక్ష చూపకూడదు.
ఈ విధానాల ఫలితంగా, నేడు అమెరికాలో అయిదుగురు అమ్మాయిల్లో ఇద్దరు క్రీడలు ఆడుతున్నారు. 1970లో 27 మంది మహిళల్లో ఒకరు క్రీడల్లోకి వచ్చేవారని వుమెన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
టైటిల్ IX వలన మహిళలు క్రీడల్లోకి రావడం మొదలుపెట్టారు. స్పోర్ట్స్ బ్రా ఆవిష్కరణ వారికి సౌకర్యాన్ని చేకూర్చింది.
"టైటిల్ IX వలన వనరులు, మౌలిక సదుపాయాలు సమకూరాయి. కానీ, మహిళల్లో ఆత్మవిశ్వాసం కొరవడింది. క్రీడల్లో పాల్గొనడానికి సౌకర్యవంతమైన దుస్తులు లేకపోవడం ఒక ముఖ్య కారణం" అని లిసా చెప్పుకొచ్చారు.
మహిళా అథ్లెట్లకు "సౌకర్యం, విశ్వాసం" సమకూర్చిన గొప్ప ఆవిష్కరణగా నేడు స్పోర్ట్స్ బ్రా ను ఒక విప్లవంగా పరిగణిస్తారు.
ఇప్పుడు ఇది రూ. 70,036 కోట్ల పరిశ్రమ. 2026 కల్లా ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. అథ్లీజర్ మార్కెట్ కూడా రూ. 1,94,546 కోట్ల మార్కెట్ విలువతో అభివృద్ధి చెందుతోంది. అథ్లీజర్ అనేవి ఒక రకమైన దుస్తులు. ఇది క్రీడలకు పనికొస్తాయి. ఇతర సందర్భాల్లోనూ ధరించవచ్చు.
Jogbra Inc. సంస్థ మార్కెట్లోకి దూసుకెళ్లింది
1977లో జాగ్‌బ్రా ప్రారంభమైనప్పటి కథ వేరు. దూరం పరిగెత్తడం మహిళల ఆరోగ్యానికి, స్త్రీత్వానికి మంచిది కాదని వాళ్లను పరుగు పందేలకు దూరం ఉంచిన రోజుల నుంచి అప్పుడప్పుడే మహిళలు బయటికొస్తున్నారు.
అంతకు కేవలం అయిదేళ్ల ముందే మారథాన్లలో మహిళలు పాల్గొనడంపై నిషేధం ఎత్తివేశారు. మరో ఏడేళ్లకు ఒలింపిక్స్‌లో 3,000మీ. కన్నా ఎక్కువ దూరం పరిగెత్తేందుకు మహిళలకు అనుమతి లభించింది.
జాగ్ బ్రా సంస్థ ప్రారంభించిన కొద్ది రోజులకే పాలీ న్యూయార్క్ వెళిపోయారు. అక్కడ జిమ్ హెన్సన్ కంపెనీలో కాస్ట్యూం డిజైనర్‌గా చేరారు. జాగ్ బ్రా సంస్థను లిసా, హిండా చూసుకునేవారు.
హిండా తన తండ్రి వద్ద రూ. 3.9 లక్షలు అప్పు తీసుకుని 60 డజన్ల స్పోర్ట్స్ బ్రాలను ఉత్పత్తి చేశారు. వాటి అమ్మకానికి స్పోర్ట్స్ దుకాణాలను సంప్రదించడం ప్రారంభించారు.
వాళ్లు డిజైన్ చేసినది లోదుస్తులు కాదు, కేవలం ఒక స్పోర్ట్స్ ఉపకరణం మాత్రమేనని హిండా చెప్పారు.
అయితే, దుకాణదారులు "మేం బ్రాలు అమ్మం" అని చెప్పినప్పుడల్లా లిసా, హిండా నవ్వుకునేవాళ్లు. వీళ్లంతా చాలావరకు పురుషులే.
ఇలా లాభం లేదని, వాళ్లిద్దరూ దుకాణాల్లో అసిస్టెంట్ మేనేజర్లను కలవడం ప్రారంభించారు. వీరిలో చాలామంది మహిళలు. వారికి జాగ్‌బ్రా ఇచ్చి, వేసుకుని చూడమనేవారు.
మాములు బ్రాల లాగ రకరకాల కప్ సైజులు కాకుండా, స్మాల్, మీడియం, లార్జ్ అని మూడే కప్ సైజులు తయారుచేశారు.
ఈ వ్యూహం పనిచేసింది. 1978లో తొలిసారిగా జాగ్‌బ్రా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పట్లో ఒక బ్రా ధర 16 డాలర్లు (రూ. 1,245).

ఫొటో సోర్స్, JOGBRA, INC. RECORDS, ARCHIVES CENTER, NATIONAL MU
వాళ్లే మోడల్స్..
లిసా, హిండా మోడల్స్‌గా జాగ్‌బ్రా ధరించి వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం మొదలెట్టారు. బయట నుంచి మోడల్స్‌ను పెట్టుకునేంత డబ్బు వారి వద్ద లేదు.
"నో మ్యాన్-మేడ్ స్పోర్టింగ్ బ్రా కెన్ టచ్ ఇట్" ఇదీ వారి నినాదం. 'డీలర్స్ మమ్మల్ని సంప్రదించవచ్చు' అని వారి ప్రకటనలకు మరో వాక్యం జోడించారు హిండా.
"నిజంగా, దానర్థం ఏమిటో నాకప్పుడు తెలీదు. కానీ, మాకు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి" అని లిసా చెప్పారు.
మొదటి విడత బ్రాలన్నీ త్వరగా అమ్ముడైపోయాయి. సంవత్సరం తిరిగేసరికి లిసా, హిండా రూ. 3.8 కోట్ల అమ్మాకాలు జరిపారు. వారికి లాభాలు వచ్చాయి.
ఇక వాళ్లు వెనక్కి తిరిగి చూదలేదు. ఒక దశాబ్దం పాటు జాగ్‌బ్రా ఇంక్ సంస్థ ఏడాదికి 25 శాతం చొప్పున వృద్ధి చెందింది. అయితే, ఆ తరువాత వాళ్ల సేల్స్ గ్రాఫ్ బాగా పడిపోయింది.
అప్పట్లో ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ తమకు మెసేజ్ చేశారని లిసా గుర్తుచేసుకున్నారు.
"నాకప్పుడు రిప్రజెంటేటివ్ అంటే ఏమిటో కూడా తెలీదు" అని ఆమె చెప్పారు.
లిసా అమ్మకాలు, మార్కెటింగ్ చూసుకునేవారు. హిండా ఉత్పత్తి, స్టాకు చూసుకునేవారు.
సుమారు 200 మందిని ఉద్యోగంలో పెట్టుకున్నారు. ఉత్పత్తిని ప్యూర్టో రికోకు తరలించారు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ, పెద్ద రొమ్ములు ఉన్న మహిళల కోసం స్పోర్ట్‌షేప్ బ్రా, పొట్ట కవర్ చేయడానికి బ్రా-టాప్ తీసుకొచ్చారు.
జాగ్‌బ్రా ఇంక్ సంస్థ మార్కెట్లో దూసుకెళ్ళిపోయింది. అప్పుడే, లిసా, హిండాల మధ్య భేదాభిప్రాయాలు రావడం మొదలైంది. ఇద్దరి మధ్య తరచూ తగవులు వచ్చేవి.
"ఒకరి మీద ఒకరు అరచుకునేవాళ్లం" అని లిసా చెప్పారు.
1980ల చివరికొచ్చేసరికి జాగ్‌బ్రా ఇంక్ సంస్థ కుంటుపడడం ప్రారంభమైంది. వారి అమ్మకాలు మందగించాయి. మరో పక్క, నైక్, రీబాక్ లాంటి కంపెనీలు గట్టి పోటీనిచ్చాయి. మార్కెట్లో పోటీకి నిలబడాలంటే అప్పులు చేయాల్సి వచ్చింది.
1990లో జాగ్‌బ్రా ఇంక్ సంస్థను ప్లేటెక్స్ కంపెనీకి అమ్మేశారు.
"మాలో కలహాలు పెరిగిపోయాయి. మేం బాగా అలిసిపోయాం అనిపించినప్పుడు మా సంస్థను అమ్మేశాం" అని హిండా చెప్పారు.
నేడు ఆ మచ్చలన్నీ మాసిపోయాయి.
"మేమంతా 70లలోకి అడుగుపెట్టాం. ఇంకా బతికున్నందుకు సంతోషిస్తూ, పాత జ్ఞాపకాలను తలుచుకుని నవ్వుకోవచ్చు. జాగ్‌బ్రాను వీలైనంత ఎక్కువమంది మహిళలకు అందించాలని ప్రయత్నించాం. అది మేం సాధించాం" అన్నారు హిండా.

ఫొటో సోర్స్, NATIONAL INVENTORS HALL OF FAME
నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి...
ఈ ఏడాది మే మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో లిసా, హిండా, పాలీల పేర్లు ఎక్కాయి.
లేజర్ డెర్మటాలజీ, ఐబ్రూఫిన్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఆవిష్కర్తలతో పాటు తమ పేర్లు కూడా ఈ జాబితాలో నమోదయ్యాయని తెలియగానే, నమ్మలేకపోయామని ఆ ముగ్గురు మహిళలూ చెప్పారు.
"మిగతా ఆవిష్కర్తలతో పాటు మా పేర్లు చూసుకున్నప్పుడు, అప్పట్లో మేమేమీ అంత సీరియస్‌గా ఆలోచించలేదని ఆర్గనైజర్లకు చెప్పాలనుకున్నాం" అని పాలీ అన్నారు.
ఇప్పటికీ స్పోర్ట్స్ బ్రా ధరించే మహిళలను చూస్తే వాళ్లకు ఉత్సాహం కలుగుతుందని ఆ ముగ్గురూ అన్నారు. అప్పట్లో తాము కుట్టిన నమూనా గుర్తొస్తుందని చెప్పారు.
"వాటిని చూస్తే గర్వంగా, ఆనందంగా ఉంటుంది. హేయ్ 'నేనే వాటిని తయారుచేశాను' అనుకుంటా" అని పాలీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా ఉండే బిలియనీర్.. సినిమాలు, విమానాలు అంటే విపరీతమైన పిచ్చి
- ఫ్రాంక్ గార్డెనర్: 'మళ్లీ ఇలాగే జరిగింది' - విమానంలో వీల్ చైర్ వాళ్లని ఎందుకు వదిలేస్తారు?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ‘నేను చచ్చిపోయానని అనుకుంటామన్నారు.. కానీ ఇప్పుడు కాపుకాసి నా భర్తను చంపేశారు’
- తిరుపతికి సమీపంలో 300 అడుగుల ఎత్తు నుంచి నేలకు దూకే జలపాతం.. దట్టమైన అడవిలో నడిచి మరీ వెళ్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















