హోవర్డ్ హ్యూజెస్: చీకట్లో నగ్నంగా కూర్చుని సినిమాలు చూసే ఈ బిలియనీర్ ఎవరు

హోవర్డ్ హ్యూజ్
    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. నేను కొనలేనిది, నాశనం చేయలేనిది ఏదీ లేదు.’’

ఇవి ప్రపంచంలోనే ఒకప్పటి ధనవంతుడి మాటలు. ఆయన పేరు హోవర్డ్ హ్యూజెస్. పారిశ్రామికవేత్త, పరిశోధకుడు, సినీ ప్రముఖుడిగా ఆయన చాలా మందికి సుపరిచితులు. అయితే, ఆయన 26 ఏళ్లు ఒంటరిగా ఒక గదిలో లాక్ చేసుకుని గడిపారు.

తన జీవితం చివరి రోజుల్లో ఆయన గోర్లను కత్తిరించుకోవడం ఆపేశారు. తన మూత్రాన్ని కూడా సీసాల్లో నింపుకొని భద్రపరచుకునే వారు.

హోవర్డ్ హ్యూజెస్ 1905లో జన్మించారు. ఆయన తండ్రి పేరు హోవర్డ్ హ్యూజ్స్ ఎస్ఆర్. ఆయన చమురును వెలికితీసే వ్యాపారం చేస్తూ భారీగా ఆర్జించారు.

ఎస్ఆర్ హోవర్డ్ హ్యూజెస్ భార్య కూడా సంపన్న కుటుంబం నుంచే వచ్చారు. 1909లో ఎస్ఆర్ హోవర్డ్ ఒక డ్రిల్ మెషీన్‌ను కనుగొన్నారు. ఇది చమురు అన్వేషణా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కఠినమైన గ్రానైట్ నేలను చీల్చుకుంటూ చమురును అన్వేషించేలా ఈ మెషీన్‌ను అభివృద్ధి చేశారు.

ఆ మెషీన్ ఆవిష్కరణ తర్వాత ఎస్ హ్యూజ్ ఇంటికి చమురు కంపెనీలు వరుసకట్టాయి. ఈ మెషీన్ సాయంతో హ్యూజ్ చాలా డబ్బు సంపాదించారు.

హోవర్డ్ తల్లికి పరిశుభ్రత అంటే పట్టింపు ఎక్కువ. ఒక విధింగా అది ఆమెకు వ్యసనంగా మారిందని చెప్పుకోవాలి. హోవర్డ్‌కు కూడా ఇది అలవాటైంది.

చిన్నప్పుడు హోవర్డ్ చాలా సన్నగా, అనారోగ్యంతో ఉండేవారు. ఒక చెవి మాత్రమే ఆయనకు వినిపించేది. దీంతో అతడిపై తల్లి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేది.

మరోవైపు హోవర్డ్‌ను తండ్రి చాలా బోర్డింగ్ స్కూళ్లకు మార్చారు. డబ్బుల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించేవారు కాదు. కొడుకు చదువు కోసం వెచ్చిందుకు ఆయన చెక్‌బుక్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేది.

ఒక చెవి వినిపించకపోవడంతో హోవర్డ్ కాస్త ఎక్కువ బిడియంతో ఉండేవారు. ఆయన ఇంటిలో ఇద్దరు గొప్ప వ్యక్తులున్నా ఆ ప్రభావం ఆయనపై కనిపించేది కాదు.

హోవర్డ్ హ్యూజ్

స్కూల్‌లో ఎవరితోనూ హోవర్డ్ మాట్లాడేవారు కాదు. ఆయన తన ఒంటరితనాన్ని జయించేందుకు ఆయన రెండు మార్గాలను ఎంచుకున్నారు. వాటిలో మొదటిది సినిమా. రెండోది విమానాలు.

ఆవిష్కరణలంటే ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. 14ఏళ్ల వయసులో రెండు అమెరికన్ యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్ష కోసం హోవర్డ్‌ను ఆయన తండ్రి తీసుకెళ్లారు.

ఈ పోటీలో ఉత్తీర్ణత సాధిస్తే, నీకు మంచి బహుమతి ఇస్తానని హోవర్డ్‌కు తండ్రి చెప్పారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైన హోవర్డ్ తండ్రి నుంచి ఐదు డాలర్లను అడిగి తీసుకున్నారు.

ఆ పరీక్ష జరుగుతున్నప్పుడే ‘‘లో-ఫ్లైయింగ్ ప్లేన్’’ ప్రకటనను చూశారు. దానిలో ప్రయాణించాలని హోవర్డ్ భావించారు. దీంతో ఆ ఐదు డాలర్లను దాని కోసం ఉపయోగించారు.

హోవర్డ్ తల్లి ఆ తరువాత రెండేళ్లకు మరణించారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి కూడా మరణించారు. దీంతో 18ఏళ్లకే చదువు పూర్తికాకముందే, పెద్ద మొత్తంలో ఆస్తి హోవర్డ్ చేతుల్లోకి వచ్చింది.

తన తండ్రి ఆస్తితో ఈ ప్రపంచంలో కొనలేనిదంటూ ఏమీలేదని హోవర్డ్ భావించేవారు.

హోవర్డ్ తండ్రికి చమురు అన్వేషణ వ్యాపారం ఉన్నప్పటికీ, దానిపై హోవర్డ్‌కు అంత ఆసక్తి ఉండేది కాదు. హాలీవుడ్ ఆయన దృష్టిని ఆకర్షించేది.

హోవర్డ్ హ్యూజ్

హాలీవుడ్ దిశగా అడుగులు..

హాలీవుడ్‌లో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, తండ్రి డబ్బుల్ని హోవర్డ్ వృథా చేయడం మొదలుపెట్టారు. ఆయన డబ్బులను ఎలా ఖర్చుపెట్టేవారో ఆయన జీవిత చరిత్రను రాసిన పీటర్ హెన్రీ బ్రౌన్, ప్యాట్ బోర్సెక్ తమ పుస్తకంలో వెల్లడించారు.

‘‘హోవర్డ్ ఎప్పుడూ ఒక జత బూట్లు కొనేవారు కాదు. కనీసం 20 జతలు కొనాల్సిందే. ఒక కారుకు బదులు.. ఆరు కార్లను ఆయన కొనేవారు’’అని బ్రౌన్ పేర్కొన్నారు.

‘‘అత్యంత ఖరీదైన వాచ్‌లను కొనుగోలు చేసేవారు. ఒకేసారి 20 సూట్లను కూడా కొనేవారు.’’

అదే సమయంలో తండ్రి కంపెనీ నుంచి తమ కుటుంబీకులను హోవర్డ్ వెళ్లగొట్టారు. 3.8 మిలియన్ల (రూ. 29.57 కోట్లు)తో మొత్తం షేర్లను ఆయనే కొనుగోలు చేసేశారు.

తన తండ్రి కంపెనీ నుంచి వచ్చే సంపాదన మొత్తాన్ని ఆయన సినిమాల్లో పెట్టేవారు.

ఆయన తీసిన తొలి సినిమా ‘‘టు అరేబియన్ నైట్స్’’ హిట్ అయ్యింది. ఇది పాత రికార్డులను బద్దలు కొట్టింది.

మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అప్పుడే తొలిసారి ఎగురుతున్న విమానాలను ప్రజలు చూశారు.

హోవర్డ్ హ్యూజ్ పాత్రలో డికాప్రియో

ఫొటో సోర్స్, Warner Brothers Pictures

ఫొటో క్యాప్షన్, హోవర్డ్ హ్యూజ్ పాత్రలో డికాప్రియో

ఆ సమయంలో కొన్ని దేశాల సైన్యాల దగ్గరుండేవాటికంటే ఎక్కువ విమానాలు, పైలట్లను ఈ సినిమాలో చూపించారు.

సినిమా కథ కూడా చాలా భిన్నంగా ఉండేది. హోవర్డ్ అన్నింటినీ చాలా కొత్తగా చేసేందుకు ప్రయత్నించేవారు. ఇదే ఆయనకు ఓసీడీ జబ్బుగా అలవాటైంది.

చాలాసార్లు సినిమా స్క్రిప్ట్‌లో హోవర్డ్ మార్పులు చేసేవారు. కొన్నిసార్లు పూర్తిగా తిరగరాసేశారు. ఆయనకు మేఘాలు కనిపిస్తే అసలు నచ్చదు. అందుకే ఆ సీన్‌ను మళ్లీ షూట్ చేసేవారు. ఒక సీన్‌లో మేఘం కనిపించినా మళ్లీ ఆ సీన్‌ను తీయాలని ఆయన పట్టుబట్టేవారు. అప్పట్లో గ్రాఫిక్స్ లేకపోవడంతో, అన్నింటినీ షూట్ చేయాల్సి వచ్చేది.

ఇలా మళ్లీమళ్లీ తీయడానికి చాలా సమయం, డబ్బు, శ్రమ అవసరం అయ్యేవి. సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

దీంతో మళ్లీ హోవర్డ్ మార్పులు చేశారు. కొత్త డైలాగ్స్‌ను రాశారు. మళ్లీ చాలా సీన్లను రీషూట్ చేశారు. సంగీతాన్ని కూడా మార్చేశారు. దీంతో సినిమా విడుదల కావడానికి చాలా సమయం పట్టింది.

మొత్తానికి ఈ సినిమా ఖర్చు 4 మిలియన్ డాలర్లు (రూ.31.12 కోట్లు)కు పెరిగింది. అయితే, బాక్సాఫీస్‌లో ఇది సత్తా చాటింది. పెట్టుబడికి రెండింతల లాభాలను తెచ్చింది.

హోవర్డ్ హ్యూజ్ పాత్రలో డికాప్రియో

ఫొటో సోర్స్, Warner Brothers Pictures

చాలా మంది మహిళలు..

హోవర్డ్ జీవితంలో చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా హాలీవుడ్ నటీమణులు ఆయనతో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు.

అయితే, చివర్లో ఆయన తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డాయి. అప్పుడే ‘‘సాక్రిఫైస్’’ సినిమాను ఆయన తీశారు. ఇది తొలి గ్యాంగ్‌స్టర్ సినిమా. దీనిలో చాలా హింస కనిపించేది.

ఈ సినిమాకు అమెరికాలోని సెన్సర్ బోర్డు చాలా కట్‌లు చెప్పింది. దీనికి వ్యతిరేకంగా హోవర్డ్ కోర్టుకు వెళ్లారు. చివరకు ఆయన కేసు గెలిచారు. ఆయన సినిమాలో ఒక్క కట్ కూడా చేయలేదు.

ఆ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రతి సినిమాతోనూ హోవర్డ్ ఏదైనా కొత్త ప్రయోగం చేయాలని భావించేవారు. తన తర్వాతి సినిమా ‘‘అవుట్‌లా’’లో హీరోయిన్‌కు పెద్ద రొమ్ములు ఉన్నట్లు చూపించాల్సి వచ్చింది. దీని కోసం ప్రత్యేకమైన బ్రా అవసరం పడింది. ఆ బ్రా వల్ల రొమ్ములు కాస్త ఉబ్బినట్లు పైకి కనిపించాలని హోవర్డ్ భావించారు.

‘‘ఇది చిన్న ఇంజినీరింగ్ సమస్య’’అని అప్పట్లో హోవర్డ్ చెప్పారు. దీని కోసం ఆయన స్పెషల్ పుషప్ బ్రాను తయారుచేయించారు. అయితే, దీన్ని వేసుకునేందుకు హీరోయిన్ జేన్ రషెల్ తిరస్కరించారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ కుంభకోణం ఇదేనా?

నచ్చింది చేసేవారు..

హోవర్డ్ తన జీవితంలో నచ్చింది చేసేవారు. క్రమంగా హోవర్డ్ దృష్టి సినిమాల నుంచి విమానాలవైపు మళ్లింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే విమానాన్ని ఆయన తయారుచేయాలని భావించారు. 1935లో ఆయన ఈ కల నెరవేర్చుకున్నారు. 1938లో ఈ విమానంలో ఆయన ప్రపంచాన్ని చుట్టి రావాలని అనుకున్నారు. అలానే ఆయన ప్రపంచ పర్యటన చేశారు. మూడు రోజుల 19 గంటల్లో ఆయన ప్రపంచాన్ని చుట్టివచ్చారు.

ఆయన కంపెనీ విమాన నైపుణ్యాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు వచ్చేవి. అప్పట్లో విమానయాన రంగానికి మంచి గిరాకి రావడం మొదలైంది. దీంతో అమెరికా సైన్యం సైతం విమానాల కోసం ఆయన కంపెనీకి వచ్చేది.

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నేవీకి అవసరమైన జలాంతర్గాములను ఆయన అభివృద్ధి చేశారు.

వీడియో క్యాప్షన్, మొత్తం రూపాయి కాయిన్లే ఇచ్చి, రూ.2.6 లక్షల బైక్ కొన్నారు

‘‘మతిస్థిమితం కోల్పోయారు’’

అయితే, క్రమంగా హోవర్డ్ మతిస్థిమితం కోల్పోతూ వచ్చారు. ఓసీడీ ఆయన జీవితంపై చాలా ప్రభావం చూసేది.

ఆయన తరచూ చేతులను కడుక్కునేవారు. ఎంతలా కడుక్కొనేవారంటే, కొన్నిసార్లు చేతుల్లో నుంచి రక్తం కూడా వచ్చేది. ఆయన జీవితంపై ‘‘ఏవియేటర్’’పేరుతో ఒక సినిమా వచ్చింది. దీనిలో లియోనార్డో డీకాప్రియో నటించారు.

ఆ సినిమాలోనూ చేతుల్లో నుంచి రక్తం కారేలా హోవర్డ్ చేతులను శుభ్రం చేసుకున్నట్లు చూపించారు.

ప్రతిపనినీ ఆయన ఐదుసార్లు చెక్‌ చేసేవారు. దీని వల్ల అమెరికా సైన్యంతో ఒప్పందాలు ఆలస్యం అయ్యేవి. దీంతో బడ్జెట్ కూడా పెరిగేది.

1946లో ఆయన విమానం ఒకటి కుప్పకూలింది. ఇది ఐదో విమాన ప్రమాదం. ఆ సమయంలో హోవర్డ్ కూడా విమానంలోనే ఉన్నారు.

ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నొప్పి తగ్గించుకునేందుకు ఆయన డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ అలవాటు జీవితాంతం ఆయన్ను వెంటాడింది.

వీడియో క్యాప్షన్, రిటైర్ అయిన తరువాత కూడా నెలనెలా తగినంత డబ్బు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?

యుద్ధాన్ని అసరాగా చేసుకొని ఆయన డబ్బులు సంపాదించేవారని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చేవి. ఈ విషయంలో అమెరికా కాంగ్రెస్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు.

ఆ సమయంలో తాను దేశ భక్తుడినంటూ ప్రసంగమిచ్చారు. ప్రజలకు ఆయన కనిపించడం అదే చివరిసారి. ఆ తరవాత 26ఏళ్లు ఆయన ప్రజలకు కనిపించలేదు.

హోవర్డ్ వ్యాపారాలు ఇంకా కొనసాగుతూనే ఉండేవి. 1966 నుంచి 68 మధ్య ఆయన భూములు, క్యాసినోలు, హోటళ్లను కొనుగోలు చేశారు. చంద్రుడిపై కాలు మోపేందుకు తొలి అమెరికన్ వ్యోమనౌక సర్వైవర్-1ను కూడా 1966లో హోవర్డ్ సంస్థ తయారుచేసింది.

లాస్‌వేగస్‌లో ఆయన ఒక టీవీ చానెల్‌ను కూడా కొనుగోలు చేశారు. తనకు నచ్చిన సినిమాలను ఆయన ఇందులో చూసేవారు. రాత్రిపూట తనకు నచ్చిన సినిమా వేయాలని ఆయన సూచించేవారని ఆయన సన్నిహితులు చెప్పేవారు.

అదే సమయంలో ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించింది. ఆయన చుట్టూ క్రిములు ఉన్నట్లు ఆయన భావించేవారు. కొన్నిసార్లు తన వార్డ్‌రోబ్‌లోని బట్టలన్నీ తగులబెట్టేసేవారు.

వీడియో క్యాప్షన్, కేజీఎఫ్ అసలు కథ తెలుసా?

ఒక రోజు ఆయన కొన్ని ఫోటోలు చూసేందుకు స్టూడియోకు వెళ్తున్నానని ఇంట్లో పనిచేసే వారికి చెప్పి వెళ్లారు. స్టూడియాలోని ఒక చీకటి గదిలోకి వెళ్లి అక్కడే ఉండిపోయారు. దాదాపు నాలుగు నెలలపాటు ఆయన బయటకు రాలేదు.

రాత్రి, పగలు ఆయన నగ్నంగానే ఉండేవారు. తన మూత్రాన్ని ఆయన సీసాలో నింపుకునేవారు. గోర్లను కూడా కత్తిరించుకునేవారు కాదు.

పాలు లేదా చాక్లెట్‌లే ఆయన ఆహారం. తన ఇంట్లో పనిచేసేవారికి ఆయన లేఖలు రాసేవారు. ‘‘నావైపు చూడొద్దు. నాతో మాట్లాడొద్దు’’అని ఆయన చెప్పేవారు.

ఆ తర్వాత వేర్వేరు హోటళ్లలో ఆయన ఉండేవారు. కానీ, ఎక్కడికెళ్లినా ఆయన చీకటి గదిలోనే ఉండేవారు. చీకట్లో నగ్నంగా కూర్చొని సినిమాలు చూసేవారు.

1976లో ఒక విమాన ప్రమాదంలో హోవర్డ్ మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)