Hokey: భారత్, పాకిస్తాన్‌ల హాకీ ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌ డ్రా

హాకీ

ఫొటో సోర్స్, Getty Images

హాకీ ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్‌లకు చెందిన పురుషుల జట్లు సోమవారం తలపడ్డాయి. ఈ సిరీస్‌లో రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఇండోనేసియాలోని జకార్తాలో సాయంత్రం ఐదు గంటలకు ఈ మ్యాచ్ మొదలైంది.

భారత్ సెల్వం కార్తి, పాకిస్తాన్‌కు అబ్దుల్ రానా చెరో గోల్ కొట్టారు. దీంతో రెండు జట్ల స్కోర్ 1-1గా మారింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ స్కోర్ ఇలానే కొనసాగింది. దీంతో మ్యాచ్ డ్రా అయ్యింది.

గత సిరీస్‌, 2017లో, ఈ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఈ సారి కూడా ఈ కప్‌ను మళ్లీ గెలిచేందుకు భారత్ సిద్ధమవుతోంది.

భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఈ కప్‌ను మూడేసి సార్లు గెలుచుకున్నాయి.

క్రికెట్ తరహాలోనే భారత్, పాకిస్తాన్‌లలో హాకీని కూడా చాలా మంది ఆదరిస్తుంటారు. ఈ గేమ్‌కు దేశ భక్తితో ముడిపెడుతుంటారు.

ఈ రెండు టీమ్‌లూ ఒకప్పుడు హాకీపై ఆధిపత్యం ప్రదర్శించాయి. ఒలింపిక్స్ పతకాలతోపాటు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు కూడా చేరుకున్నాయి. కానీ, ఆ తర్వాత హాకీని క్రికెట్ దాటిపోయింది. క్రికెట్‌కు విశేష ప్రజాదరణ లభించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కానీ, భారత్‌లో మాత్రం మళ్లీ హాకీకి ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది ఒలింపిక్స్‌లో జర్మనీపై పైచేయి సాధించి భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గత 41ఏళ్లలో భారత్ హాకీ జట్టు ఒలింపిక్ పతకాన్ని గెలవడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం భారత హాకీ జట్టు ర్యాంకింగ్‌లలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.

వీడియో క్యాప్షన్, ఒలింపిక్స్ (1996) హాకీ టీం గోల్ కీపర్‌ ఎడ్వర్డ్స్‌తో బీబీసీ ఇంటర్వ్యూ

‘‘పాకిస్తాన్‌తో ఆడేటప్పుడు మాపై చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది’’అని భారత జట్టు వైస్ కెప్టెన్ ఎస్‌వీ సునిల్.. మ్యాచ్‌కు ముందుగా రిపోర్టర్లతో చెప్పారు.

‘‘ఒత్తిడికి గురికావొద్దని మేం క్రీడాకారులకు చెబుతుంటాం. దీన్ని మామూలు మ్యాచ్‌గానే చూడాలని చెబుతాం. ఫలితం గురించి ఆలోచించొద్దని, కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని వివరిస్తాం’’అని ఆయన అన్నారు.

ఈ రెండు జట్లూ గత డిసెంబరులో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌లో ఆడాయి. ఆరోజు 4-3 తేడాతో భారత్ విజయం సాధించింది.

వీడియో క్యాప్షన్, భారత్ పురుషుల హాకీ: నాలుగు దశాబ్దాల కల నిజమైన వేళ

ప్రస్తుతం ఆసియా కప్‌కు ఇండోనేసియా అతిథ్యం ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 1న జరగనుంది.

ఈ ఆసియా కప్‌లోని మొదటి మూడు జట్లూ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నమెంట్‌లో ఎలాగైనా కప్ గెలవాలని పాకిస్తాన్ భావిస్తోంది.

రెండు జట్లలోనూ సీనియర్లతోపాటు కొత్త ప్లేయర్లు కూడా ఉన్నారు.

‘‘మా జట్టులో చాలా మంది యువ ప్లేయర్లు ఉన్నారు. ఎందుకంటే మా టీమ్‌ను మేం రీబిల్డ్ చేయాలని భావించాం. ఆడుతుంటే వారికి అనుభవం కూడా పెరుగుతుంది’’అని పాకిస్తాన్ జట్టు కోచ్ సీగ్‌ఫ్రైడ్ అయిక్‌మన్ గత వారం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)