IND vs ENG: ఐదో టెస్టులో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం.. టీమిండియా పొరపాట్లు ఇవేనా?

జో రూట్, బెయిర్ స్టో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో రూట్, బెయిర్ స్టో
    • రచయిత, స్టీఫెన్ షెమిల్ట్
    • హోదా, బీబీసీ చీఫ్ క్రికెట్ రైటర్, ఎడ్జ్‌బాస్టన్

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదవ రోజు ఉదయం చరిత్రాత్మక విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది.

రికార్డు స్థాయిలో 378 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.

దీంతో టెస్టు సిరీస్ 2-2తో సమం అయ్యింది.

ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో చేధించిన అత్యధిక పరుగుల లక్ష్యం ఇదే. మొత్తంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద పరుగుల లక్ష్య ఛేదన.

ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ 142 పరుగులతోనూ, బెయిర్‌స్టో 114 పరుగులతోనూ అజేయంగా నిలిచారు.

బెయిర్‌స్టో ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేయడం విశేషం.

వీరిద్దరూ కలసి ఐదో వికెట్‌కు 269 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇంగ్లండ్ జట్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌‌ల సారథ్యంలో ఇంగ్లండ్ జట్టుకు ఇది రికార్డు విజయం.

ఐదువారాల కిందట ఇంగ్లండ్ టెస్టు జట్టు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. 17 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగలిగింది. దీంతో జట్టుకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యతలను కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌కు అప్పగించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.

న్యూజీలాండ్‌తో సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 3-0తో గెలిచినప్పటికీ.. బలమైన భారత జట్టుపై ఐదో టెస్టును గెలుపొందడం, అదికూడా రికార్డు స్థాయి పరుగులను చేధించడం, సిరీస్‌ను సమం చేయడం గమనార్హం.

భారత జట్టు పొరపాట్లు ఇవేనా?

భారత జట్టుకు ఇది భారీ పరాజయం. గతేడాది ఈ సిరీస్ ప్రారంభమైనప్పుడు భారత జట్టు ఇంగ్లండ్‌ కంటే బలమైన స్థితిలో ఉంది. జట్టు సభ్యులకు కరోనా సోకడంతో ఈ సిరీస్‌లో ఐదో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో 2007 తర్వాత తొలిసారి ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలుపొందే అవకాశాన్ని భారత జట్టు కోల్పోయింది.

  • రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి ఎంపిక చేయకుండా భారత జట్టు పొరపాటు చేసింది. అలాగే, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు చేజేతులా వికెట్లు కోల్పోయింది.
  • ఇంగ్లండ్ జట్టు పరుగుల ఛేదనలో దూసుకుపోతుంటే భారత జట్టు పోరాటం తేలిపోయింది.
  • భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో తాత్కాలిక కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ బుమ్రాను జట్టు యాజమాన్యం నియమించింది.

ఒకవేళ తాత్కాలిక కెప్టెన్ కాకుండా రెగ్యులర్ కెప్టెన్ ఉండి ఉంటే భారత జట్టు ఈ మ్యాచ్‌ను, సిరీస్‌ను దక్కించుకునేదా?

వాస్తవంగా చెప్పాలంటే మాత్రం.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆడిన ఆటను బట్టి చూస్తే ఆ జట్టును ఎవ్వరూ ఆపగలిగేవాళ్లు కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)