కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శి లాయర్ అవబాయి వాడియా... ఎమర్జెన్సీ టైమ్‌లో ఈ కార్యక్రమానికి చెడ్డ పేరు ఎందుకు వచ్చింది?

భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూతో వాడియా

ఫొటో సోర్స్, COURTESY FPAI

ఫొటో క్యాప్షన్, భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూతో వాడియా
    • రచయిత, పరినాజ్ మదన్, డిన్యర్ పటేల్
    • హోదా, ముంబై

చీరకట్టుతో ఉన్న ఒక టీనేజర్, 1933లో అంతర్జాతీయ హెడ్‌లైన్స్‌లో నిలిచారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లో బార్ ఎగ్జామ్ పాసైన సిలోన్ (శ్రీలంక) తొలి మహిళగా 19 ఏళ్ల అవబాయి వాడియా ఘనత సాధించారు.

ఆమె సాధించిన ఈ విజయం దేశంలోని మహిళలను 'లా' చదివేందుకు అనుమతించేలా సిలోన్ ప్రభుత్వాన్ని ప్రోత్సహించింది.

మహిళల హక్కుల విషయంలో వాడియాను చూసి ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ఇక్కడితోనే ముగిసిపోలేదు.

2005లో మరణించే సమయానికి వాడియా, ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయమైన వ్యక్తిగా మారారు. కుటుంబ నియంత్రణ ఉద్యమంతో ఆమె చాలా పేరు సంపాదించారు. సామాజికంగా మహిళలను పైకి తీసుకురావాలనే అంకితభావాన్ని, లాయర్‌గా తన నైపుణ్యాలతో కలగలిపి ఆమె ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

1913లో కొలంబోలోని పార్సీ కుటుంబంలో వాడియా జన్మించారు. న్యాయవాదిగా అర్హత సాధించిన తర్వాత ఆమె లండన్, కొలంబోలో పనిచేశారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాంబే (ముంబై)కి మారిపోయిన తర్వాత సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. కుటుంబ నియంత్రణ ఉద్యమం ఆమెకు చాలా గుర్తింపు ఇచ్చింది.

''న్యాయవాదిగా కెరీర్‌ను కొనసాగించలేకపోవడాన్ని నేను నష్టంగా భావించలేదు. ఎందుకంటే నేను చేసే ప్రతీ పనిలో చట్టం అనే అంశం ఉంటుంది'' అని తన ఆత్మకథ 'ద లైట్ ఈజ్ అవర్స్'లో వాడియా రాశారు.

1940 చివర్లలో ఆమె ఫీల్డ్ వర్క్ మొదలుపెట్టినప్పుడు కుటుంబ నియంత్రణను ప్రపంచవ్యాప్తంగా చాలావరకు ఒక నిషిద్ధ అంశంగా పరిగణించేవారు.

మతపరమైన సంప్రదాయవాదులు, కుటుంబ నియంత్రణను వ్యతిరేకించేవారు. మతపరమైన అంశాలతో పాటు జాత్యహంకారం, వంశాభివృద్ధి సిద్ధాంతాలు కుటుంబ నియంత్రణ అంశాన్ని మరింత జటిలం చేశాయి.

''మొదటిసారి 'బర్త్ కంట్రోల్' అనే పదాలను విన్నప్పుడు నేను తిరగబడ్డాను'' అని నాడియా చెప్పారు.

కానీ, బాంబేలో ఒక మహిళా డాక్టర్ చెప్పిన విషయాలు ఆమెపై చాలా ప్రభావం చూపించాయి.

''మరణించే వరకు గర్భధారణ, పిల్లలకు పాలు ఇవ్వడం మధ్యే భారతీయ స్త్రీల జీవితం ఊగిసలాడుతుంది'' అని డాక్టర్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఆమెను ప్రభావితం చేశాయి.

1949లో భారత కుటుంబ నియంత్రణ సంఘం (ఎఫ్‌పీఏఐ) ఏర్పాటులో ఆమె కృషి ఉంది. ఈ సంస్థకు ఆమె 34 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా ఉన్నారు.

ఎఫ్‌పీఏఐ చేసే పనుల్లో గర్భనిరోధక పద్ధతులను ప్రోత్సహించడం నుంచి సంతానోత్పత్తి సేవల వరకు ఉన్నాయి. తనకు కూడా గర్భస్రావాలు జరగడం, పిల్లలు లేకపోవడం వల్ల వాడియాకు ఈ పని నిజమైన సంతృప్తిని అందించింది. 1951-52 కాలంలో కుటుంబ నియంత్రణ విధానాలను అధికారికంగా ప్రోత్సహించిన దేశం భారత్. వాడియా కృషి కారణంగానే భారత ప్రభుత్వం ఈ విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

వాడియా ఆధ్వర్యంలో వికేంద్రీకరణ, కమ్యూనిటీ ఆధారిత విధానాలను ఎఫ్‌పీఏఐ అనుసరించింది. దేశంలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాలు, అత్యంత పేద ప్రాంతాలపై ఎఫ్‌పీఏఐ దృష్టి సారించింది.

కుటుంబ నియంత్రణను విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం వంటి అంశాలతో ముడిపెడుతూ వాడియా బృందం పనిచేసింది.

దీని కోసం కొత్త మార్గాల్లో ప్రచారాన్ని చేపట్టింది. భజనలు చేయడం, సామాజిక సందేశాలను వ్యాప్తి చేయడం, దేశవ్యాప్తంగా రైళ్లలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన ప్రదర్శనల వంటి సృజనాత్మక పద్ధతులను అవలంభించారు.

ఎఫ్‌పీఏఐ పనితీరు, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించింది. గణనీయమైన మార్పులకు దారి తీసింది.

1970లో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించి ఏనుగు ద్వారా ప్రచారం

ఫొటో సోర్స్, HULTON-DEUTSCH COLLECTION/CORBIS/CORBIS VIA GETTY

ఫొటో క్యాప్షన్, 1970లో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించి ఏనుగు ద్వారా ప్రచారం

ఉదాహరణకు, 1970ల్లో కర్ణాటకలోని మలూర్‌లో చేపట్టిన ఒక ప్రాజెక్టు కారణంగా నవజాత శిశు మరణాలు తగ్గాయి. సగటు వివాహ వయస్సులో పెరుగుదల నమోదైంది. అక్షరాస్యత రేటు రెట్టింపు అయింది. ఈ ప్రాజెక్టుకు ఎంత మద్దతు లభించిందంటే, దీన్నుంచి ఎఫ్‌పీఏఐ తప్పుకున్న తర్వాత గ్రామస్థులు స్వయంగా దీని నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు.

బహుశా విదేశాల్లో పెరిగిన కారణంగా వాడియా, భారతీయ కుటుంబ నియంత్రణ విధానానికి ప్రపంచ దృక్పథాన్ని అందించగలిగారు.

దక్షిణ కొరియా మదర్స్ క్లబ్‌లు సాధించిన విజయాలు వాడియాకు స్ఫూర్తిగా నిలిచాయి. వీటి ప్రేరణతో భారత్‌లో ఆమె 'క్లోజ్-నైట్ గ్రూప్'లను ఏర్పాటు చేశారు. ఈ సమూహాల్లోని మహిళలు వరకట్నం నుంచి రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం వరకు ఇలా అనేక సామాజిక సమస్యలపై చర్చించవచ్చు.

అదే సమయంలో ఇంటర్నేషనల్ ప్లాన్డ్ పేరెంట్‌హుడ్ ఫెడరేషన్ (ఐపీపీఎఫ్)లో వాడియా ప్రముఖ వ్యక్తిగా మారారు. భారత్‌లోని ప్రత్యేక సవాళ్లను, జనాభా నియంత్రణ వంటి అంశాలను ఆమె సమాఖ్య ముందుకు తీసుకెళ్లారు.

ఈ సవాళ్లను రాజకీయాలు మరింత కష్టంగా మార్చాయి.

1975 నుంచి 1977 వరకు భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఆసమయంలో భారత ప్రభుత్వం నిర్బంధ స్టెరిలైజేషన్ వంటి కఠినమైన జనాభా నియంత్రణ చర్యలను అనుసరించింది. ఈ చర్యలను వాడియా ఖండించారు.

బలవంతంగా కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని స్వచ్ఛందం చేయాలని ప్రకటించారు.

'కుటుంబ నియంత్రణ' కార్యక్రమంతో మంచి ఫలితాలు రావడం మొదలయ్యాయి. కానీ, ఎమర్జెన్సీ కారణంగా ఈ మొత్తం కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

1980 తొలి నాళ్లలో ఐపీపీఎఫ్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వాడియా మరో కఠినమైన సవాలును ఎదుర్కొన్నారు.

అబార్షన్ సేవలను అందించే ఏ సంస్థలకైనా నిధులను తగ్గిస్తామన్న అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రభుత్వానికి ఆమె ఎదురు తిరిగారు.

ఐపీపీఎఫ్ అధికారికంగా అబార్షన్‌లను ప్రోత్సహించనప్పటికీ, దాని అనుబంధ సంస్థలు కొన్ని అబార్షన్ సేవలను అందించాయి. అబార్షన్లు చట్టబద్ధమైన దేశాల్లోనే ఈ సేవల్ని అందించాయి.

అమెరికా ఒత్తిడికి ఐపీపీఎఫ్ తలొగ్గలేదు. ఫలితంగా 17 మిలియన్ డాలర్ల (రూ. 134 కోట్లు) నిధుల్ని కోల్పోవాల్సి వచ్చింది.

కుటుంబ నియంత్రణ విషయంలో పలు దేశాల్లో ప్రస్తుతం అనేక చట్టాలు అమలు అవుతున్నాయి.

అమెరికాలో 'రో వర్సెస్ వేడ్' కేసులో అబార్షన్ హక్కులను రద్దు చేసిన తర్వాత ఆ తీర్పును మరోసారి పరిశీలించాలని సంప్రదాయవాదులు వాదించారు.

''కుటుంబ నియంత్రణను, అబార్షన్లతో సమానంగా పోలుస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు వ్యక్తిగత హక్కులను, మానవ హక్కులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు'' అని వాడియా అన్నారు.

నేడు భారత్‌లో కుటుంబాల పరిమాణాలను నియత్రించడానికి తీసుకోవాల్సిన నిర్బంధ చర్యల గురించి అనేక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి విధానాలను వాడియా వ్యతిరేకించారు.

''మానవ హక్కులను సమర్థించని ఏ చర్యలకు కూడా మేం మద్దతు ఇవ్వలేం. ఆచరణలో ఏవిధంగా కూడా ఇలాంటి పద్ధతులు పనికిరావని మేం గుర్తించాం'' అని 2000లో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా మూడో బిడ్డకు రేషన్, ఉచిత ప్రాథమిక విద్యను తీసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావించిన సమయంలో ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు.

కుటుంబ నియంత్రణ అనేది చట్టం, రాజకీయాలతో ముడిపడి ఉన్నట్లు ఈ ఘటనల ద్వారా తెలిసింది.

మొత్తం సామాజిక అభివృద్ధి నుంచి కుటుంబ నియంత్రణను విడదీయరాదని వాడియా కెరీర్ గుర్తు చేస్తుంది.

వాడియా మారణానికి కొన్ని సంవత్సరాల ముందు ఎంఎస్ స్వామినాథన్ మాట్లాడుతూ... ''మన జనాభా విధానాలు తప్పుగా ఉంటే, మిగతా ఏదీ కూడా సరిగ్గా ఉండే అవకాశమే లేదనే సంగతి అందరికంటే ఎక్కువగా వాడియాకు తెలుసు'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, పాక్ ఫ్యామిలీ ప్లానింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)