Uttar Pradesh: హిందూ దేవుళ్ల బొమ్మలున్న న్యూస్ పేపర్లో చికెన్ అమ్మినందుకు ముస్లిం వ్యక్తి అరెస్టు

ఫొటో సోర్స్, Anwar Kamal
- రచయిత, అనంత్ ఝణాణే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్ ప్రదేశ్‌లో హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న న్యూస్ పేపరులో చికెన్ ప్యాక్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలతో తాలిబ్ హుస్సేన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల మీద ఆయన దాడి చేశారనేది మరొక ఆరోపణ.
పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
'సంభల్ నగరంలోని మంజర్ మెడికల్ షాపు వద్ద ఉండే మహక్ రెస్టారెంట్‌లో దేవుళ్ల బొమ్మలు ఉండే సుమారు 100 న్యూస్ పేపర్లను, చికెన్ ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి' అంటూ సంభల్ పోలీసులను ట్యాగ్ చేస్తూ జులై 4న చందన్ ఆర్య అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.
'ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేశాం. సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టాం' అని ట్విటర్ ద్వారా చందన్ ఆర్యకు ఆ తరువాత సంభల్ పోలీసులు బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అసలు ఏం జరిగిందో సంభల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్ మీడియాకు వివరించారు. 'సమాచారం రాగానే వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. అక్కడ చట్ట విరుద్ధమైన వస్తువులున్నాయి. వాటిని మా కస్టడీలోకి తీసుకున్నాం. పరిస్థితి సున్నితత్వం దృష్ట్యా కేసు బుక్ చేశాం. సంబంధిత సెక్షన్ల కింద నిందితున్ని అరెస్టు చేశాం' అని ఆయన తెలిపారు.
పోలీసులు వెళ్లేసరికి మహక్ రెస్టారెంట్ వద్ద చాలా మంది హిందువులు గుమిగూడి ఉన్నారు. కానీ ఈ విషయం మీద వాంగ్మూలం ఇచ్చేందుకు అక్కడ ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పోలీసులే స్వయంగా కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
'రెస్టారెంట్ వద్దకు పోలీసులు వెళ్లేసరికి చాలా మంది హిందువులు గుమిగూడి ఉన్నారు. ఏప్రిల్ 2, 2022 తేదీతో పాటు ఇతర వార్తా పత్రికలు అక్కడ ఉన్నాయి. హిందూ దేవతల బొమ్మలు వాటి మీద ముద్రించి ఉన్నాయి. ఆ కాగితాల్లో నాన్ వెజ్ పార్శిల్ చేయడం మీద అక్కడి హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మత విశ్వాసాలను ఇది దెబ్బ తీస్తోందని వారు అన్నారు. అప్పుడు మహక్ రెస్టారెంట్ యజమాని అక్కడే ఉన్నారు. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు, ఆయన పోలీసుల మీద కత్తితో దాడి చేశారు' అని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు.

ఫొటో సోర్స్, TWITTER@sambhalpolice
153ఏ(విద్వేషాలు రెచ్చగొట్టడం), 295ఏ(మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం), 307(హత్యకు ప్రయత్నించడం) సెక్షన్ల కింద తాలిబ్ మీద కేసులు పెట్టారు.
తన తండ్రిని కావాలనే ఈ కేసులో ఇరికించారని తాలిబ్ హుస్సేన్ కుమారుడు ఆమిర్ తాలిబ్ ఆరోపించారు. 'వాళ్లు చెప్పింది వేరు. మాది హోటల్ బిజినెస్. ఈ వ్యాపారంలో పాత న్యూస్ పేపర్లను వాడటమనేది మాములే. పని చేసే అబ్బాయి పేపరులో ప్యాక్ చేసి ఇచ్చాడు. కానీ అది మా నాన్న చేసినట్లుగా చిత్రీకరించారు' అని ఆమిర్ అన్నారు.

ఫొటో సోర్స్, Anwar Kamal
పాత న్యూస్ పేపర్ల మీద హిందూ దేవతల బొమ్మలున్నాయా? అని అడిగినప్పుడు ఆమిర్ ఇలా స్పందించారు.
'మా వద్ద ఉన్న పాత న్యూస్ పేపర్లను మార్కెట్లో కొనక్కొచ్చుకుంటాం. మార్కెట్ నుంచి తెచ్చుకునే పాత న్యూస్ పేపర్లను ఎలా వాడతారో అలాగే మేం ఉపయోగిస్తాం. పేపర్ల మీద హిందూ దేవతల బొమ్మలు ఉంటాయా? ఉండవా? ఉంటే ఎప్పుడు ఉంటాయి అనే విషయాలను మేం గమనించం. దేవతల బొమ్మలు ఉన్నట్లు గమనిస్తే మేం అలా ఎందుకు చేస్తాం? ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీయాల్సిన అవసరం మా నాన్నకు ఏముంది? 25 ఏళ్లుగా మేం ఇక్కడే ఇదే వ్యాపారం చేస్తున్నాం. ఇందులో మతాలకు సంబంధించిన ప్రస్తావన అనేదే లేదు' అని ఆమిర్ చెప్పుకొచ్చారు.
తన తండ్రి ఎటువంటి తప్పు చేయలేదని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆమిర్ తాలిబ్ కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పులి, ఎలుగుబంట్లు, ఏనుగులు... ఊళ్ళ మీద ఎందుకు పడతాయి... అవి ఎదురైతే ఏం చేయాలి?
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- ఆరెంజ్ జ్యూస్ తాగితే అసిడోసిస్ తగ్గుతుందా... ఈ పాపులర్ పండ్ల రసం కథేమిటో తెలుసా?
- 'కాళి' పోస్టర్‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు
- ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?
- ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











