చంద్రకాంత్ పండిత్: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్ కథేంటో తెలుసుకోండి

వినోద్ కాంబ్లీతో చంద్రకాంత్ పండిత్

ఫొటో సోర్స్, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వినోద్ కాంబ్లీతో చంద్రకాంత్ పండిత్
    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ కోసం

పూర్తి పేరు: చంద్రకాంత్ సీతారామ్ పండిత్

వయస్సు: 60 సంవత్సరాలు

భారత మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్. అయితే, క్రికెటర్‌గా కాకుండా ఒక కోచ్‌గా ఆయన పేరు మార్మోగుతోంది.

23 ఏళ్ల క్రితం, అంటే 1999లో కెప్టెన్‌గా సాధించలేని ఘనతను తాజాగా ఆయన కోచ్‌గా అందుకున్నారు. ఆయన కోచింగ్‌లో తొలిసారి మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.

1999లో కూడా ఆయన కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చారు. కానీ విజేతగా నిలపలేకపోయారు.

ఈసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు వేదిక అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే, చంద్రకాంత్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ జట్టు కూడా 1999లో ఫైనల్ ఆడింది. కానీ కర్ణాటక చేతిలో ఓడిపోయింది.

తాజా సీజన్‌లో మధ్యప్రదేశ్ జట్టు 6 వికెట్ల తేడాతో 41 సార్లు రంజీ చాంపియన్ ముంబైపై గెలుపొంది తొలిసారి విజేతగా నిలిచింది. ఆదిత్య శ్రీవాస్తవ సారథ్యంలో మధ్యప్రదేశ్ జట్టు ఆడింది. ఆయన తొలిసారి మధ్యప్రదేశ్‌కు సారథ్యం వహించారు.

కెప్టెన్‌గా చేజార్చుకున్న ట్రోఫీని కోచ్‌గా అందుకోవడంతో చంద్రకాంత్ పండిత్ ఉద్వేగానికి లోనయ్యారు. ఫైనల్ గెలుపొందిన తర్వాత ఆయన మాట్లాడుతూ... ''ప్రతీ ట్రోఫీ సంతృప్తిని ఇస్తుంది. కానీ, ఇది మరింత ప్రత్యేకమైన ట్రోఫీ. ఇన్నాళ్లూ ఏదో కోల్పోయాను అనే భావన నన్ను వెంటాడేది. అందుకే ఇప్పుడు నాకు చాలా ఉద్వేగంగా ఉంది'' అని అన్నారు.

ఎట్టకేలకు ఆయన 23 ఏళ్ల నిరీక్షణకు సంతోషకరమైన ముగింపు లభించింది. కోచ్ రూపంలో చంద్రకాంత్‌కు ఇది కొత్త విజయమేమీ కాదు. కోచ్‌గా ఇది ఆయనకు ఆరో రంజీ ట్రోఫీ టైటిల్.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన కోచింగ్‌లో ముంబై మూడు సార్లు, విదర్భ జట్టు రెండు సార్లు రంజీ చాంపియన్లుగా నిలిచాయి.

కోచ్‌గా ఆయన పర్యవేక్షణలోనే విదర్భ జట్టు వరుసగా 2018, 2019లలో రంజీ టైటిల్‌ను గెలుచుకుంది.

తమ కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్లే టైటిల్ గెలిచామని మధ్యప్రదేశ్ కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ అన్నారు. కోచ్ వల్లే జట్టు నాయకత్వం గురించి తెలుసుకున్నానని చెప్పారు.

1986లో చంద్రకాంత్ పండిత్

ఫొటో సోర్స్, ADRIAN MURRELL/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1986లో చంద్రకాంత్ పండిత్

ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం

చంద్రకాంత్ పండిత్ భారత మాజీ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్. ఆయన 1987 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడారు.

ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో దిలీప్ వెంగ్సర్కార్ స్థానంలో ఆడిన చంద్రకాంత్ 24 పరుగులు చేశారు. సెమీఫైనల్లో భారత్ ఓడిపోయింది.

దీనితో పాటు 5 టెస్టుల్లో, 36 వన్డేల్లో ఆయన భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

భారత దేశవాళీ క్రికెట్‌లో ఇప్పుడు ఆయన అత్యంత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు పొందారు. ఆయన కోచింగ్‌లోని ప్రత్యేకత ఏంటి?

చంద్రకాంత్ పండిత్ కోచింగ్ గురించి క్రికెట్ విమర్శకులు విజయ్ లోకపల్లి మాట్లాడారు.

కోచ్‌గా మధ్యప్రదేశ్ జట్టును రంజీ చాంపియన్‌గా నిలబెట్టడం ఆయన సాధించిన అతిపెద్ద ఘనత అని విజయ్ అన్నారు.

''కొన్నిసార్లు ముంబై ఆయనను తిరస్కరించింది. అప్పుడు ఆయన విదర్భను చాంపియన్‌గా నిలబెట్టారు. ఎప్పుడూ ఈ ట్రోఫీని నెగ్గని మధ్యప్రదేశ్‌ను ఇప్పుడు విజేతగా నిలిపారు. మధ్యప్రదేశ్ క్రికెట్ చరిత్ర చాలా బావుంది. కానీ, చంద్రకాంత్ పండిత్ ఏకైక లక్ష్యం ఏంటంటే.. కొత్త చాంపియన్ ప్లేయర్లను తయారు చేయడం, ఆటగాళ్లందరినీ మానసికంగా దృఢంగా మార్చడం. ఆటగాళ్లను ఇలా మార్చడం చంద్రకాంత్‌కు చాలా సులభమైన విద్య. ముంబై జట్టుతో పనిచేసినప్పుడు కూడా ఆయన ఇదే సూత్రాన్ని పాటించారు.

చంద్రకాంత్, ఆటగాళ్లతో ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడుతుంటారు. వారికి క్రికెట్ కథలు చెబుతుంటారు. ఉదాహరణలతో ఆటను వివరిస్తారు. క్రికెట్‌పై ఆయనకున్న అవగాహన, పరిస్థితులకు అనుగుణంగా ఆటను అర్థం చేసుకునే తీరు చాలా అద్భుతంగా ఉంది. ఆయన పనులు చాలా సాధారణంగా, ప్రాక్టికల్‌గా ఉంటాయి.

ఈరోజు ఆయనను మించిన కోచ్‌లు లేరు. ల్యాప్‌టాప్‌ను ఉపయోగించకుండా క్రికెట్ గురించి మాట్లాడుతుంటారు. ఆయనను 'క్రికెట్ పురుగు (క్రికెట్ కా కీడా)' అని పిలుస్తుంటారు. ఆయన క్రికెట్ ఆడిన కాలం నుంచి తన గురించి నాకు తెలుసు. ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ ఆయనలో గర్వం లేదు. తన పని తను చూసుకుంటారు. అతనో అద్భుతమైన వ్యక్తి'' అని వివరించారు.

సచిన్‌తో చంద్రకాంత్

ఫొటో సోర్స్, Getty Images

సాధారణ జట్టును చాంపియన్ జట్టుగా మార్చడం

చంద్రకాంత్ పండిత్ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్, కోచ్ మదన్ లాల్ మాట్లాడారు.

''మధ్యప్రదేశ్ జట్టును విజేతగా నిలపడం చాలా పెద్ద విషయం ఎందుకంటే రంజీ సీజన్ సుదీర్ఘంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు టోర్నమెంట్ జరుగడం వల్ల ఒక్కోసారి జట్టు ప్రదర్శన పడిపోతుంటుంది. ఇలాంటి విజయం వల్ల ఆటగాళ్ల టాలెంట్ కూడా బయటకు వస్తుంది. మేం కూడా రంజీ ట్రోఫీ గెలవగలమనే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో కలుగుతుంది. భారత క్రికెట్ చరిత్రలో రంజీ ట్రోఫీ అనేది అతిపెద్ద దేశవాళీ టోర్నమెంట్. ఇందులో వందలాది మంది ఆటగాళ్లు పాల్గొంటారు'' అని మదన్ లాల్ అన్నారు.

టైటిల్ గెలుపొందిన ఆటగాళ్లతో పాటు కోచ్ చంద్రకాంత్ పండిత్‌కు ఆయన ప్రత్యేకగా అభినందించారు.

''ఇది సమష్టి విజయం. కోచ్ రూపొందించిన వ్యూహాలు మైదానంలో ఆటగాళ్లను విజయవంతం అయ్యేలా చేస్తాయి. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా బయటకు తీయాలో చంద్రకాంత్‌కు తెలుసు'' అని మదన్ లాల్ ప్రశంసించారు.

ఈ విజయంతో చంద్రకాంత్‌కు భారీ ఊరట కలిగి ఉంటుందని విజయ్ లోకపల్లి అన్నారు.

''ఇదే మైదానంలో ఒకప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఇదే వేదికలో విజయాన్ని అందుకున్నారు. కానీ ఈ గెలుపు క్రెడిట్ అంతా ఆయన ఆటగాళ్లకే ఇస్తున్నారు. ఆయన ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు, తీసుకోరు కూడా. అప్పుడప్పుడు కోపం కూడా చేస్తుంటారు. కానీ, ఆయన ఆటగాళ్లతో స్నేహంగా ఉంటారనే సంగతి కూడా అందరికీ తెలుసు'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

కోచింగ్‌లో కొత్త విధానం

చంద్రకాంత్ పండిత్ రాత్రి ఒంటి గంటకు ఆటగాళ్లను లేపి మైదానానికి తీసుకెళ్తుంటారని చెబుతుంటారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఉదయం 5 వరకు వారితో కఠోర ప్రాక్టీస్ చేపిస్తుంటారని అంటారు. ఇలాంటి కఠిన శిక్షణ కారణంగానే యశ్ దుబే, శుభమ్ శర్మ, రజత్ పాటిదార్, గౌరవ్ యాదవ్ వంటి క్రికెటర్లు భారత్‌కు దొరికారు.

క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా దేశవాళీ క్రికెట్‌లో 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 48.57 సగటుతో 8,209 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వికెట్ల వెనుక 281 క్యాచ్‌లు అందుకున్నారు. 41 స్టంపౌట్‌లు చేశారు.

కానీ, గత కొన్నేళ్లుగా కోచ్‌గా తన క్రికెట్ నైపుణ్యాలతో రంజీ ట్రోఫీలో చంద్రకాంత్ పండిత్ సాధించిన ఘనతల పట్ల క్రికెట్ విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)