Maruti Suzuki: కార్లలో ఎయిర్‌ బ్యాగ్‌లను పెంచొద్దని మారుతి సుజుకి ఎందుకు చెబుతోంది?

కార్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కార్లలో ఎయిర్‌ బ్యాగులు తెరచుకుంటాయి. దీంతో డ్రైవర్లతోపాటు ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడొచ్చు.

సీట్ బెల్టు తర్వాత వచ్చిన ఈ ఎయిర్ బ్యాగ్‌లు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కాపాడాయని మన్ననలు పొందాయి. కార్లను సురక్షితంగా మార్చే ఆవిష్కరణగా వీటిని చెబుతుంటారు.

ప్రస్తుతం ప్రతి కార్లలో ఇలాంటి రెండు బ్యాగులు తప్పనిసరి. అయితే, వీటి సంఖ్య ఆరుకు పెంచాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీనిపై దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రతి పది మందిలో ఒకరు భారత్‌లోనే ఉంటున్నట్లు తాజాగా ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

అయితే, ఇలా కార్లలో ఎయిర్ బ్యాగ్‌ల సంఖ్య పెంచితే కార్ల ధర కూడా పెరుగుతుందని, ఫలితంగా చిన్న కార్లు కొనేవారిపై ప్రభావం పడుతుందని మారుతి సుజుకి చెబుతోంది. మారుతి సుజుకిలో మెజారిటీ వాటా జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్‌ది.

''ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఈ ప్రభావం పడుతుంది. వీరు ఖరీదైన కార్లను కొనలేకపోవచ్చు''అని సంస్థ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ..రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

కార్లు

ఫొటో సోర్స్, Getty Images

రూ.18 వేలు అదనంగా...

ప్రస్తుతం డ్రైవర్‌తోపాటు ముందు సీటులో కూర్చుండే వారి కోసం కార్లలో రెండు ఎయిర్‌ బ్యాగులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అదనంగా మరో నాలుగు ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేస్తే కార్ల ధర మరో 230 డాలర్లు (రూ.18 వేలు) పెరుగుతుందని అంచనా.

భారత్‌లో కేవలం 8 శాతం మందికే కార్లు ఉన్నాయి. ఇక్కడ 4,250 డాలర్ల (రూ.3.39 లక్షల) నుంచి కార్ల ధర మొదలవుతుంది. అయితే, ముఖ్యంగా చిన్నకార్లు కొనేవారిపై ఈ ఎయిర్ బ్యాగుల పెంపు నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపుతుందని భార్గవ అన్నారు.

గత ఏడాది 30 లక్షల కార్లను భారత్‌లో విక్రయించారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, ఇది 13 శాతం ఎక్కువని ద సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ తెలిపింది. 44 కార్ల తయారీ సంస్థలు ఈ సొసైటీలో ఉన్నాయి.

ఎక్కువ మంది చిన్న కార్లు కొంటుంటారు. కానీ, ఇటీవల కాలంలో స్పోర్ట్స్, మల్టీ యుటిలిటీ కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కార్ మార్కెట్ అయిన భారత్‌లో ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధార పడుతున్నారు. కార్ల తయారీ వాటా జీడీపీలో ఆరు శాతం వరకూ ఉంటోంది.

ఎయిర్ బ్యాగులు

ఫొటో సోర్స్, Getty Images

మరణాలు చాలా ఎక్కువ..

ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న కారు ప్రమాద మృతుల్లో 10 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. కానీ, కార్ల సంఖ్య విషయానికి వస్తే భారత్‌లో ఉండేది కేవలం ఒక శాతం మాత్రమేనని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

2020లో మొత్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 1,30,000 మంది భారత్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో 70 శాతం మంది 18 నుంచి 45ఏళ్ల మధ్య వయసు వారే. వీరిలో సగం మంది రోడ్డుపై నడుస్తున్నవారు లేదా ద్విచక్ర వాహనాలు నడిపేవారున్నారు. కారు ప్రమాదాల వల్ల భారత్‌ ఏటా మూడు శాతం జీడీపీని కోల్పోతోంది.

2025నాటికి ఈ రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యంగా ఆటోమొబైల్ సేఫ్టీ ఫీచర్లను మరింత పెంచాలని భారత్ భావిస్తోంది. దీనిలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకొస్తున్నారు. మరోవైపు కార్ల సేఫ్టీ రేటింగ్ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా భారత్ ఎన్‌సీఏపీ పేరిట ఒక ప్రాధికార సంస్థను కూడా తీసుకొస్తున్నారు. టెస్టుల్లో పనితీరు ఆధారంగా కార్లకు ఒకటి నుంచి ఐదు స్టార్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఎయిర్ బ్యాగులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కొత్త సేఫ్టీ వ్యవస్థలతో ప్రపంచ ఆటో మొబైల్ హబ్‌గా భారత్ మారుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

భారత్‌ కార్ల మార్కెట్‌పై ధర ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ కార్లు సాధారణంగా రూ.3.40 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ ఉంటాయి.

అయితే, విడి భాగాలు, పన్నులు పెరుగుతుండటంతో చిన్న కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారుదామని భావిస్తున్న వారిపై ఈ ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పెరుగుతున్న పెట్రోలు ధరల భారం దీనికి అదనం.

ఆర్థిక మందగమనం నడుమ చాలా మంది భారతీయుల ఆదాయం స్థిరంగా ఉండిపోయింది. మరోవైపు డబ్బులు పెట్టగలిగేవారు సెడాన్లు లేదా యుటిలిటీ వెహికల్స్ వైపు వెళ్తున్నారు. ఫలితంగా చిన్నకార్ల విక్రయాలపై ప్రభావం పడుతోంది. గత నాలుగేళ్లలో చిన్నకార్ల విక్రయాల్లో 25 శాతం తగ్గుదల కనిపించిందని మారుతి సుజుకి కూడా వెల్లడించింది.

ఎయిర్ బ్యాగులు

ఫొటో సోర్స్, GLOBAL NCAP

కార్లు సురక్షితమైనవేనా?

భారత్‌లో తయారుచేసిన కార్ల భద్రత విషయంలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. 2014లో మొత్తం చిన్న కార్ల విక్రయాల్లో 20 శాతం వరకూ ఉండే ఐదు ప్రధాన చిన్న కార్లు పరీక్షల్లో విఫలమైనట్లు బ్రిటన్‌కు చెందిన కార్ సేఫ్టీ వాచ్‌డాగ్ గ్లోబల్ ఎన్‌సీఏపీ తెలిపింది. ఈ కార్లలో టాటా, ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ కార్లు కూడా ఉన్నాయి.

ఆ తర్వాత 50కిపైగా మోడల్స్ కార్లకు గ్లోబల్ ఎన్‌సీఏపీ పరీక్షలు నిర్వహించింది. దీనిలో టాటా, మహీంద్రా కార్లు అత్యంత సురక్షితమైనవని తేలింది. మరోవైపు టాటా నెక్సాన్.. భారత్‌లో తయారుచేసిన తొలి 5స్టార్ ఎస్‌యూవీగా మారింది.

''కార్ల భద్రత విషయంలో పురోగతి కనిపిస్తోంది. తాజా పరీక్షల ఫలితాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో చేయాల్సింది చాలా ఉంది''అని గ్లోబల్ ఎన్‌సీఏపీ సెక్రటరీ జనరల్ అలెజాండ్రో ఫ్యూరాస్ అన్నారు.

ఎయిర్ బ్యాగులు

ఫొటో సోర్స్, AFP

''భారత కార్ల తయారీ సంస్థలు భద్రతా ప్రమాణాలు మెరుగుపరుచుకున్నాయి. కానీ, ప్రపంచ బ్రాండ్లుగా చెప్పుకొనే కొన్ని సంస్థలు ఈ విషయంలో వెనుకబడ్డాయి''అని ఫ్యూరాస్ వివరించారు. ముఖ్యంగా ఈ సేఫ్టీ ఫీచర్లను తొలగించడం ద్వారా కార్ల ధరను తగ్గించుకొని భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆ బ్రాండ్లు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

అయితే, గత దశాబ్దంతో పోల్చిచూసినప్పుడు భారత కార్లు చాలా సురక్షితంగా మారాయని ఆటోమొబైల్ మ్యాగజైన్ ఆటోఎక్స్ మేనేజింగ్ ఎడిటర్ ధ్రువ్ భేల్ చెప్పారు. ఈ సేఫ్టీ ఫీచర్లతో మొదట ధర పెరిగినప్పటికీ.. క్రమంగా మళ్లీ తగ్గుతాయని అన్నారు.

వీడియో క్యాప్షన్, గాలి అవసరం లేని టైర్లు వచ్చేస్తున్నాయ్...

అయితే, మంచి సేఫ్టీ ఫీచర్లుండే కారు ఎంత ముఖ్యమో.. మంచి డ్రైవర్ కూడా అంతే ముఖ్యమని ఆటోమొబైల్ రైటర్ కుషాన్ మిత్ర చెప్పారు.

''భారతీయులు సరిగా డ్రైవింగ్ చేయరు. సేఫ్టీ ఫీచర్ల గురించి పెద్దగా తెలుసుకోరు. మా అబ్బాయిని ఒక ఖరీదైన స్కూల్‌లో చేర్పించాను. అక్కడకు వచ్చే పిల్లల్లో కేవలం పది శాతం మంది మాత్రమే పిల్లల సీట్లలో కూర్చొని స్కూలుకు వస్తున్నారు''అని ఆయన చెప్పారు.

ఆయన చెప్పేది నిజమే. సాధారణంగా పిల్లలు ప్రయాణికుల ఒళ్లోనే లేదా ముందు సీట్లలోనో కూర్చుకుంటారు. సీటు బెల్టులు కూడా పెట్టుకోరు. మరోవైపు కొందరు డ్రైవర్లు తప్పుడు మార్గాల్లో వెళ్లిపోతుంటారు.

అతివేగం, మద్యం తాగి కారు నడపడం లాంటివి కూడా సాధారణంగా కనిపిస్తుంటాయి. భారీ వాహనాలను కూడా రోడ్డు పక్కనే పార్క్ చేస్తుంటారు. క్యాబ్‌లలోనూ చాలా మంది సీటు బెల్టులు పెట్టుకోరు. రోడ్లు కూడా చాలా చోట్ల అధ్వానంగా ఉంటాయి. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలను కూడా చాలా మంది పట్టించుకోరు.

వీడియో క్యాప్షన్, ఈ కారు పది నిమిషాల్లో విమానంలా మారిపోతుంది

''కారును కొనడానికి వెళ్లినప్పుడు లెదర్ సీట్లు, సన్ రూఫ్‌లు, స్టీరియోల గురించి ప్రజలు అడుగుతుంటారు. సేఫ్టీ గురించి చాలా మంది పట్టించుకోరు''అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ చెప్పారు.

''సేఫ్టీ విషయంలో కార్లను తిరస్కరించే వినియోగదారులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే, ఈ విషయంలో అవగాహన క్రమంగా పెరుగుతోంది''అని ఆయన చెప్పారు.

అలా సేఫ్టీ కోసం ఆలోచించే వారిలో అర్చనా పంత్ తివారీ ఒకరు. 58ఏళ్ల ఆమె త్వరలో ఒక ఎస్‌యూవీ కొనాలని ప్రణాళికలు రచిస్తున్నారు. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తోపాటు ఎక్కువ ఎయిర్ బ్యాగ్‌లు ఉండే కారును ఎంచుకోవాలని తను భావిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం ఎక్కువ ధర చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని వివరించారు.

''ఆ కారు నాకు అన్ని వేళలా రక్షణ కల్పించాలి''అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)