ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్: ‘విదేశీ టెక్నాలజీ’ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయా?

ఓలా ఎలక్ట్రిక్ పరిశ్రమ

ఫొటో సోర్స్, Ola Electric

ఫొటో క్యాప్షన్, తమిళనాడులోని తమ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఫ్యాక్టరీగా నిలుస్తుందని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆశించింది

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థకు చెందిన తమిళనాడులోని భారీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫ్యాక్టరీలో రోబోలు నిశబ్దంగా కదులుతున్నాయి.

జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులతో మొదలైన ఈ స్టార్టప్‌కు చాలా ఆకాంక్షలున్నాయి. పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవటం మొదలైతే ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా ఇది అవతరిస్తుందని ఈ కంపెనీ ఆశిస్తోంది.

స్కూటర్ల అసెంబ్లీ పనిని చాలా వరకూ రోబోలు చేస్తుంటాయి. స్కూటర్ విడిభాగాలను వేగంగా పంపిస్తూ వాటిని కలిపి వెల్డింగ్ చేస్తుంటాయి.

దాదాపు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీలో చాలా ప్రస్పుటంగా కనిపించే అంశం దీని వైశాల్యం కాదు - ఇందులోని శ్రామికులు.

సిబ్బందిలో అత్యధికంగా ఉండేది మహిళలే. ప్రస్తుతం 1,700 మంది నుంచి 1,800 మంది వరకూ మహిళలు ఇక్కడ షిఫ్ట్ మేనేజర్లుగా, టెస్ట్ రైడర్లుగా, టెక్నీషియన్లుగా, ట్రైనర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలా మందికి వారు చేస్తున్న తొలి ఉద్యోగం ఇదే.

వరదల్లో వాహనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో రహదారుల పరిస్థితులు వాహనాలకు కఠినంగా ఉంటాయి

ఓలా ఎలక్ట్రిక్ తన తొలి మోడళ్లు ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను 2021 ఆగస్టులో ప్రారంభించింది. రీచార్జ్ చేసుకోగల బ్యాటరీలతో నడిచే ఈ స్కూటర్లకు తొలి 24 గంటల్లోనే లక్ష ఆర్డర్లు లభించాయి.

కానీ, డిసెంబర్‌లో మొదటి డెలివరీలు అందించిన తర్వాత ఈ స్కూటర్లలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయంటూ కొందరు కస్టమర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. ఈ వారం ఆరంభంలో ఈ సంస్థ ఒక బ్యాచ్‌కు చెందిన 1,441 స్కూటర్లను రీకాల్ చేయాల్సి వచ్చింది.

మార్చి 26వ తేదీన పూణేలో ఒక కస్టమర్‌కు చెందిన కొత్త స్కూటర్.. పార్క్ చేసిన వెంటనే మంటలు చెలరేగి దగ్ధమయిన ఘటన నేపథ్యంలో ఈ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ రీకాల్ చేసింది.

అలాంటి ఘటన 'అది ఒక్కటే కావచ్చునని ప్రాధమిక అంచనా' చూపుతోందని, అయితే ఆ స్కూటర్ బ్యాచ్‌కు చెందిన స్కూటర్లన్నిటినీ రీకాల్ చేశామని, వాటి పటిష్టతను తనిఖీ చేస్తామని కంపెనీ ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది.

''ఈ స్కూటర్లను మా సర్వీస్ ఇంజనీర్లు తనిఖీ చేస్తారు. అన్ని బ్యాటరీ వ్యవస్థలూ, థర్మల్ వ్యవస్థలూ, భద్రత వ్యవస్థలన్నిటినీ క్షుణ్నంగా పరిశీలిస్తాం'' అని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ఒక ప్రకటనలో చెప్పారు.

దీనిపై మరింత సమాచారం కోసం బీబీసీ న్యూస్ కంపెనీని సంప్రదించగా.. మరిన్ని వివరాలు చెప్పటానికి తిరస్కరించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకొవటం ఒక్క ఓలాకే పరిమితం కాలేదు. భారతీయ స్టార్టప్ సంస్థలైన ఒకినావా, ప్యూర్ ఈవీ కంపెనీలు సహా వేరే బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమైన ఘటనలు మరో మూడు చోటుచేసుకున్నాయి.

కాలిపోయిన కృష్ణా జైస్వాల్ స్కూటర్

ఫొటో సోర్స్, Krishna Jaiswal

ఫొటో క్యాప్షన్, ఓ రొటీన ప్రయాణం తర్వాత తన స్కూటర్‌ను పార్క్ చేసిన వెంటనే అందులో పేలుడు సంభవించి మంటల్లో కాలిపోయిందని కృష్ణా జైస్వాల్ చెప్పారు

విద్యుత్ వాహనాల దిశగా భారత్ పయనం

భారతదేశంలో అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు గత ఏడాది మార్కెట్‌లో ప్రవేశించాయి. ఇది వినియోగదారులకూ, ప్రభుత్వానికి కూడా ఒక ముఖ్యమైన పరిణామం.

చాలా దేశాల్లగానే భారతదేశం కూడా తన 140 కోట్ల జనాభాను పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లించటానికి ప్రయత్నిస్తోంది.

జీరో ఉద్గారాల లక్ష్యాల సవాళ్లే కాకుండా.. తన పొరుగునున్న చాలా దేశాల్లగానే ఇండియా కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది.

''ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ 'టూవీలర్స్‌లో టెస్లా'గా విజయవంతంగా ముందు నిలిచింది'' అని మోటార్ వాహనాల జర్నలిస్ట్ పార్థ్ చరణ్ పేర్కొన్నారు. ఈ కంపెనీ వాహనాలను ఆయన రోడ్డు మీద పరీక్షించారు.

భారత ప్రభుత్వం చమురు దిగుమతుల వ్యయాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా.. ఈ సంస్థ 20 గిగావాట్-అవర్ విద్యుత్‌ను నిల్వ చేయగల ఎలక్ట్రిక్ బ్యాటరీలను తయారు చేయటానికి ప్రభుత్వ మద్దతు అందిస్తామని గత మార్చిలో ప్రకటించింది.

భవీష్ అగర్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ భవీష్ అగర్వాల్ ఓలా క్యాబ్స్ యజమాని కూడా

అయితే, భారత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు.. దేశీయ పరిస్థితులకు అనుగుణమైన టెక్నాలజీ మీద పరిశోధనలు, సరైన నియంత్రణ లోపించటానికి సంబంధం ఉందని మార్కెట్ భాగస్వాములు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

''మనం సుదీర్ఘ కాలంగా ఇతర దేశాల్లో ఇతర దేశాల కోసం తయారు చేసిన టెక్నాలజీల మీద ఆధారపడుతూ ఉన్నాం. అవి భారత పర్యావరణ వ్యవస్థకు ఎంతవరకూ అనుగుణంగా ఉంటాయనేది ఎప్పుడూ ప్రశ్నించలేదు. భారతదేశానికి పర్యావరణపరంగానూ, నిర్వహణా కోణంలోనూ తనవైన డైనమిక్స్ ఉన్నాయి'' అంటారు లాగ్9 మెటీరియల్స్ వ్యవస్థాపకుడు అక్షయ్ సింఘాల్. ఈ సంస్థ ద్విచక్ర వాహనాలకు రాపిడ్ చార్జింగ్ బ్యాటరీలను తయారు చేస్తుంది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు, నాణ్యతా నిర్వహణలు పేలవంగా ఉండే రహదారుల వల్ల.. ఇది వాహన తయారీ సంస్థలకు చాలా సవాళ్లతో కూడిన మార్కెట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

అలాగే కఠినమైన నియంత్రణ లోపించటం కూడా.. తయారీ సంస్థలు తగినంత నాణ్యతా నియంత్రణ, పరీక్షలు లేకుండానే ఉత్పత్తులను వేగంగా మార్కెట్‌లోకి పంపించటానికి వీలుకల్పిస్తోందని సింఘాల్ అభిప్రాయపడ్డారు.

కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్

ఫొటో సోర్స్, UGC

భారతదేశపు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) కూడా.. విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మీద కఠిన నియంత్రణ ఉండాలని పిలుపునిస్తోంది.

అయితే, ''మనం కఠినంగా వ్యవహరించటం లేదని నిర్ధరించటం పూర్తిగా తప్పవుతుంది'' అంటారు నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా. ఇప్పటికే భారతదేశంలో దాదాపు 37,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించారని, అందులో కేవలం ఓ పిడికెడు వాహనాల్లో మాత్రమే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నది గమనించాలని ఆయన చెబుతున్నారు.

''మొత్తం పరిశ్రమను లేదా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను మనం నిందించలేం. బహుళ కారణాలు ఉండొచ్చు. దర్యాప్తులు పూర్తయ్యేవరకూ దీనిపై వ్యాఖ్యానించటం సరికాదు. భద్రత మా ప్రధాన లక్ష్యం'' అని ఆయన పేర్కొన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన స్కూటర్లను 15 గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో క్షుణ్నంగా తనిఖీ చేశారని.. వాహనానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో పది లక్షలకు పైగా కిలోమీటర్లు పరీక్షించారని ఉద్ఘాటిస్తోంది.

అయితే, తన స్కూటర్‌లో మంటలు చెలరేగటంతో వణికిపోయిన కృష్ణ జైస్వాల్ వంటి వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవటం కష్టమైన పనే. ''15 నిమిషాల్లోనే స్కూటర్ బూడిదగా మారిపోయింది'' అని ఆయన బీబీసీకి ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.

''ఓలా మీద మా నమ్మకం పోయింది. నా ఫ్రెండ్స్ కొనాలనుకున్నారు. కానీ ఇప్పుడు కొనొద్దని నిర్ణయించుకున్నారు'' అన్నారాయన.

వీడియో క్యాప్షన్, ఎలక్ట్రిక్ బైకులు ఎందుకు పేలిపోతున్నాయి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)