బంగ్లాదేశ్:‘‘ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వెంటనే హిందువుల ఇళ్లపై దాడులు జరిగాయి. నిజాలు ఎవరికీ అవసరం లేదు’’

అల్లరి మూకల దాడిలో దెబ్బతిన్న హిందువుల దేవాలయం

ఫొటో సోర్స్, Dipankar Roy

    • రచయిత, కాదిర్ కల్లోల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఢాకా

బంగ్లాదేశ్‌లో ఒక ఫేస్‌బుక్‌ పోస్ట్ మతపరమైన గొడవలకు దారి తీసింది.

మతవిశ్వాసాలను దెబ్బతీసేలా పోస్ట్ పెట్టారంటూ నరయిల్ జిల్లాలోని లోహ్‌గఢ్ ప్రాంతంలో గల దిఘ్‌లియా గ్రామంలో హిందువుల ఇళ్లు, హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది. దాడి జరిగిన రెండు రోజుల తరువాత అయిదుగురు అనుమానితులను అరెస్టు చేశారు.

ఇప్పటికీ ఆ ప్రాంతంలోని హిందువులు భయంభయంగా బతుకుతున్నారు.

దాడులు జరగడానికి కారణం ఫేస్‌బుక్ పోస్ట్ ఒక్కటేనా లేక ఇతర రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.

నరయిల్‌లోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ నేత, మాజీ బంగ్లాదేశ్ క్రికెటర్ మసర్ఫే బిన్ ముర్తాజా, హిందువుల మీద జరిగిన దాడిని ఖండించారు. ఈ ఘటన తనను కూడా బాధిస్తోందని చెప్పారు.

దాడి జరిగిన దిఘ్‌లియా గ్రామంలో హిందువులు ఎక్కువగా ఉంటారు. 'ఇక్కడ ముస్లింల ఇళ్లు 15 వరకు ఉంటాయి. 110 వరకు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. అనేక తరాలుగా హిందువులు ఇక్కడ నివసిస్తూ వస్తున్నారు. కానీ ఇలా దాడులు జరగడం మాత్రం ఇదే తొలిసారి' అని స్థానిక యూనియన్ కౌన్సిల్‌కు చెందిన మాజీ సభ్యురాలు బ్యూటీ రాణి మండల్ తెలిపారు.

రక్షణ కోసం బలగాలను మోహరించినా ఇక్కడి హిందువుల్లో భయం అయితే ఇంకా తగ్గలేదు. అంతేకాదు ఇప్పుడు రెండు వర్గాల మధ్య నమ్మకం అనేది కూడా ప్రమాదంలో పడింది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, Monirulalam/EPA-EFE/ShutterStock

ముందే ప్లాన్ చేశారా?

'దాడి తరువాత మహిళలు, పిల్లలు, యువత ఇళ్లలో నివసించడం లేదు. వేరే ప్రాంతాల్లో ఉండే వారి బంధువుల వద్దకు వెళ్లిపోయారు. ఇప్పుడు ముసలి వాళ్లు మాత్రమే ఉంటున్నారు. ఇక్కడ ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తారు. అలాంటిది ఒక్క ఫేస్‌బుక్ పోస్ట్ వల్ల ఇంత దాడి జరగదు. దీని వెనుక ఏదో కుట్ర ఉంది' అని బ్యూటీ రాణి మండల్ అన్నారు.

'ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇస్లామ్‌ను ఒక యువకుడు అవమానించాడనే వదంతులు శుక్రవారం సాయంత్రం వచ్చాయి. అందులో నిజానిజాలు తెలుసుకోకుండానే వెంటనే దాడులు జరిగాయి. 700 నుంచి 800 మంది వచ్చి దాడి చేశారు. యువకులు, పెద్దలు, మదర్సా విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. అల్లా హో అక్బర్ అంటూ వారు నినాదాలు చేశారు. హిందువులను చంపండి అంటూ అరిచారు' అని రాణి మండల్ వివరించారు.

'దాడులను అడ్డుకొని అల్లరి మూకను చెదరగొట్టేందుకు భారీ సంఖ్యలో పోలీసులను పంపించాం. టియర్ గ్యాస్ ప్రయోగించాం. లాఠీ చార్జ్ చేశాం. అల్లరి మూకలు పారిపోతూ కొన్నింటిని ధ్వంసం చేశారు' అని నరయిల్ జిల్లా అధికారి మహ్మద్ హబీబుర్ రెహ్మాన్ అన్నారు.

బంగ్లాదేశ్ హిందూ దేవాలయాలు

ఫొటో సోర్స్, Getty Images

కానీ హిందువుల మీద జరిగిన ఈ దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.

గతంలో ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని, ఇప్పుడూ తరచూ సంభవిస్తున్నాయని... అందుకు కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నట్లు మసర్ఫే బిన్ ముర్తాజా బీబీసీతో అన్నారు. కానీ ఎవరు చేశారో కచ్చితంగా తెలియడం లేదని, దీని వెనుక ఒక ముఠా ఉన్నట్లుగా అర్థమవుతోందని ఆయన అన్నారు.

అయితే బంగ్లాదేశ్‌ పాలక పార్టీ అయిన అవామీ లీగ్‌కు సంబంధించి స్థానిక నేతల అంతర్గత కుమ్ములాటల వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆరోపిస్తున్న వారు కూడా ఉన్నారు.

'మా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవు. మా పార్టీ ఎన్నడూ ఇలాంటి మతపరమైన దాడులకు పాల్పడదు. ఆ దాడులకు మాకు ఎటువంటి సంబంధం లేదు' అని నరయిల్ జిల్లా అవామీ లీగ్ పార్టీ ప్రెసిడెంట్ సుభాష్ బోస్ అన్నారు.

ఈ ఏడాది మార్చిలో ఢాకాలోని ఒక హిందూ దేవాలయం మీద దాడి జరిగింది

ఫొటో సోర్స్, Radhakanta Temple

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది మార్చిలో ఢాకాలోని ఒక హిందూ దేవాలయం మీద దాడి జరిగింది

ప్రభుత్వం, పాలక పార్టీ వైఫల్యాల వల్లే బంగ్లాదేశ్ అంతటా ఇటువంటి మతపరమైన దాడులు జరుగుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.

'బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన మతపరమైన దాడులకు, నరయిల్‌ దాడి మధ్య అనేక సారూప్యతలున్నాయి. గతంలో జరిగిన దాడుల్లో కూడా ముందు ఫేస్‌బుక్‌లో మతవిశ్వాసాలను దెబ్బతీశారనే వదంతులు వచ్చాయి.

ఆ తరువాత హిందువుల దేవాలయాలు, ఇళ్ల మీద దాడులు జరిగాయి. నరయిల్‌లో కూడా అచ్చం ఇలాగే జరిగింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం లేదా అధికారంలో ఉన్న పార్టీ అండ లేకుండా బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరగవు' అని రచయిత మొహియిద్దీన్ అహ్మద్ అన్నారు.

నరయిల్ హిందువుల మీద జరిగిన దాడి వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ కార్యక్రమంలో హిందూ పూజారి 'భూమిపూజ'పై డీఎంకే ఎంపీ సీరియస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)