Twitter: భారత ప్రభుత్వంతో ట్విటర్ న్యాయస్థానాల్లో ఎందుకు తలపడుతోంది, వివాదం ఎక్కడ మొదలైంది

ఫొటో సోర్స్, Getty Images
కంటెంట్ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాలను కోర్టులో సవాల్ చేస్తూ ట్విటర్ భారతదేశంలో చట్టపరమైన పోరాటాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి తనకు వచ్చిన అనేక ఆదేశాలను వ్యతిరేకిస్తూ ట్విటర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు బీబీసీకి తెలిపాయి.
''మా ఆదేశాలను పాటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' అంటూ జూన్ లో ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖకు స్పందనగా ట్విటర్ కోర్టుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఒక అంచనా ప్రకారం ట్విటర్‌కు భారతదేశంలో 2.4 కోట్లమంది యూజర్లు ఉన్నారు.
అదే సందర్భంలో, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని కేంద్ర ఐటీ శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరోవైపు విదేశీ ఇంటర్‌నెట్ ప్లాట్‌ఫామ్‌లు భారతీయ చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని ట్విటర్ పిటిషన్ దాఖలు చేసిన కొద్ది గంటల తర్వాత కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తాజాగా వచ్చిన ఆదేశాలలో ''ఇదే ఆఖరి అవకాశం'' అని పేర్కొనడంతోనే ఆ సంస్థ కోర్టుకెక్కినట్లు ఈ వ్యవహారాలపై ఉన్న అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాలు బీబీసీకి తెలిపాయి.
దేశ భద్రతకు ముప్పు కలిగించే, ప్రజల్లో శాంతి సామరస్యాలను దెబ్బతీసే ఆన్ లైన్ కంటెంట్ ను నిరోధించే అధికారం భారతదేశ సమాచార సాంకేతిక చట్టం పరిధిలో ఉంటాయి. చట్టాన్ని పాటించడంలో విఫలమైతే క్రిమినల్ ప్రొసీడింగ్‌లకు దారి తీయవచ్చు కాబట్టి "హెచ్చరికల తీవ్రత" కారణంగా ట్విటర్ కోర్టును ఆశ్రయించిందని ఆ వర్గాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియమాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, అందులో చాలా నిబంధనలు అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు అవకాశం కల్పించేలా ఉన్నాయని ట్విటర్ భావిస్తోంది.
పలు సందర్భాల్లో ప్రభుత్వానికి, ట్విటర్ కు మధ్య వివాదాలున్నాయని, కొన్ని అకౌంట్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుందని ఈ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని సందర్భాల్లో వివాదాస్పద కంటెంట్ వివిధ రాజకీయ పార్టీల నేతల అధికారిక హ్యాండిల్ నుంచి పోస్టు అవుతుంటాయని తెలిపాయి.
ట్విటర్‌కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇది తాజా ఉదంతం.
పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుందని హెచ్చరిస్తూ అనేక ట్వీట్లను తొలగించాలని, బ్లాక్ చేయాలని ట్విటర్ కు అధికారుల నుంచి గతంలో అనేక ఆదేశాలు వచ్చాయి. గత సంవత్సరం రైతుల నిరసనల సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక ఖాతాల నుంచి ట్వీట్లు ఎక్కువగా పోస్ట్ అయ్యాయి. అలాగే, కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై అనేక విమర్శలతో ట్వీట్లు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
రైతుల ఆందోళనల సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వెలువడుతున్న సమయంలో ప్రభుత్వ నోటీసులకు స్పందించిన ట్విటర్, 250 ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేసింది.
బ్లాక్ చేసిన ఖాతాలలో పరిశోధనాత్మక జర్నలిజం నిర్వహించే వార్తా పత్రికలు, రైతుల ఆందోళనలకు మద్ధతిచ్చే గ్రూపులు, ఉద్యమకారుల అకౌంట్లు ఉన్నాయి. అయితే, ఈ సస్పెన్షన్‌ను ఎక్కువకాలం కొనసాగించాల్సిన అవసరం లేదని, బ్లాక్ చేయడానికి తగిన ఆధారాలు లేవంటూ ఆరు గంటల్లో ట్విటర్ వాటిని పునురుద్ధరించింది.
భారతదేశంలో వ్యాపారానికి గత ఏడాది ఫిబ్రవరిలో ట్విటర్ కు అనుమతులు ఇచ్చారు. అయితే తన సొంత నిబంధనలతో పాటు, భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు.
గత ఏడాది మే నెలలో దిల్లీలోని తమ కార్యాలయాలలో పోలీసులు ప్రవేశించడంపై ట్విటర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతంగా అభివర్ణించింది. బీజేపీ చేసిన ఓ ట్వీట్‌కు "మానిప్యులేటెడ్ మీడియా" అని లేబుల్ వేయడంతో పోలీసులు ట్విటర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోనే పోలీసులు ట్విటర్ కార్యాలయంలో ప్రవేశించారు.

ఫొటో సోర్స్, AFP
గత ఏడాది ట్విటర్, ప్రభుత్వానికి మధ్య వివాదం ఏంటి?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) పేరుతో ఈ నిబంధనలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి ప్రకారం సోషల్ మీడియా దిగ్గజాలు ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ప్రత్యేకంగా నియమించుకోవాల్సి ఉంటుంది.
వీరిలో ఒకరు నిబంధనల అమలుకు, మరొకరు ప్రజల సాధకబాధకాల పరిష్కారానికి, మరొకరు ప్రభుత్వ సంస్థలతో సమన్వయానికి పని చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారతీయులై ఉండాలి. అవి పూర్తికాల ఉద్యోగాలై ఉండాలి.
అయితే, ట్విటర్ నియమించుకున్న వారిలో ఇద్దరు పూర్తికాల ఉద్యోగులు కారని భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. వీరి ఇద్దరి ఆఫీస్ చిరునామా పరిశీలిస్తే, ఏదో న్యాయ సేవల సంస్థ చిరునామా ఉందని, మూడో ఉద్యోగి వివరాలు కూడా సమర్పించలేదని వివరిస్తోంది.
ముఖ్యంగా నిబంధనలను అమలుచేసే చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం సూచించిన సమాచారాన్ని 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు.
అశ్లీల దృశ్యాలు సహా అభ్యంతరకర సమాచారాన్ని తొలగించేందుకు ఆటోమేటెడ్ విధానాలను అనుసరించాలని సూచించారు.
అంతకు ముందు ట్విటర్ వేదికగా షేర్ అయిన ఓ వీడియోతో ఈ వివాదం మొదలైంది. ఈ వీడియోలో 72ఏళ్ల ముస్లిం వృద్ధుణ్ని కొందరు చితకబాదుతూ కనిపిస్తున్నారు. కొట్టిన అనంతరం ఆయన గడ్డాన్ని కూడా కోసేశారు. ఈ వీడియోను జర్నలిస్టులు సహా చాలా మంది షేర్ చేశారు.
ఆ వృద్ధుణ్ని కొట్టడానికి మతం కారణం కాదని పోలీసులు చెప్పారు. ఆయన అమ్మిన ఓ ఆభరణమే వివాదానికి మూలకారణమని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అదే సమయంలో ట్విటర్ ఇండియా, న్యూస్ వెబ్‌సైట్ ‘ది వైర్’, ముగ్గురు జర్నలిస్టులు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా తీవ్రమైన నేరారోపణలతో కేసులు నమోదుచేశారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురూ ముస్లింలే. అయితే, ముస్లిమేతరులు కూడా ఈ వీడియోను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ''ఇంటర్మీడియరీ'' సంస్థల కిందకు వస్తాయి.
వీరి సైట్లు, ప్లాట్‌ఫామ్‌లపై నెటిజన్లు పెట్టే పోస్టులకు వీరిని బాధ్యులుగా చేయకూడదని భారత చట్టాలు చెబుతున్నాయి. అయితే, వీరు చట్టాలను అనుసరిస్తూ ఆ కంటెంట్‌ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది.
అయితే, ఫిబ్రవరిలో విడుదల చేసిన కొత్త ఐటీ నిబంధనల అనంతరం, ఇంటర్మీడియరీ హోదా ట్విటర్‌కు వర్తించదని భారత ప్రభుత్వం చెప్పింది.
ఇంటర్మీడియరీ హోదాను వెనక్కి తీసుకుంటే భారత్‌లో సోషల్ మీడియా దిగ్గజాలు మనుగడ సాగించడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మతపరమైన మనోభావాలు చాలా తేలిగ్గా దెబ్బతింటాయి.
ఉదాహరణకు హిందువులు పవిత్రంగా భావించే ఆవుపై వేసే కార్టూన్లతో వేలకొద్దీ కేసులు వచ్చిపడతాయి. దీనికి కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు బాధ్యులు అవుతారు. ఇలాంటి కేసులు చాలా వచ్చిపడే అవకాశముందని సోషల్ మీడియా సంస్థలు అంటున్నాయి.
అయితే , "భావ ప్రకటనా స్వేచ్ఛ జెండాను మోస్తున్నట్టు ట్విటర్ తనను తాను వర్ణించుకుంటోంది. కానీ గైడ్‌లైన్స్ విషయానికి వస్తే మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. వీటితోపాటూ, ట్విటర్ భారత చట్టాలను పాటించడానికి నిరాకరిస్తోంది. యూజర్ల ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేస్తోంది. తన సౌకర్యం, ఇష్టాయిష్టాలను బట్టి వ్యవహరిస్తోంది" అని అప్పటి ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్: అరెస్టయిన అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్‌తో బీజేపీకి సంబంధం ఏంటి?
- డార్క్ మ్యాటర్ అంటే ఏంటి... ఈ రహస్యాన్ని సైంటిస్టులు త్వరలో ఛేదించబోతున్నారా?
- 'కాళి' పోస్టర్‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు
- ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?
- ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













