Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బంగారం

ఫొటో సోర్స్, THE ROYAL MINT

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

రాబోయే రోజులలో ఉద్యోగులు మరింత దీక్షగా పనిచేయాలని గత వారంలో గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ పిలుపునిచ్చారు. ఆర్థిక ఒడిదొడుకుల నడుమ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండాలని ఉద్యోగులకు గూగుల్ సూచించింది.

ఇదే సందేశాన్ని మన వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులకు కూడా అన్వయించుకోవచ్చు. గతంలో జీతాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసిన ఖర్చులు భవిష్యత్తులో బరువు కావచ్చు. గతంలో మంచి రాబడి ఇచ్చిన మదుపు మార్గాలు ఇప్పుడు అంత రాబడి ఇవ్వలేకపోవచ్చు.

ఒకటిన్నర సంవత్సరాల పాటు బుల్ మార్కెట్ చూసిన స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బేర్ మార్కెట్ దశలో ఉంది.

ఇలా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల మన ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే సరైన ప్రణాళిక చాలా ముఖ్యం. ఇలా ఒక బలమైన ప్రణాళిక తయారు చేసుకోవాలంటే మదుపు మార్గాల మీద అవగాహన చాలా ముఖ్యం.

బంగారం

ఫొటో సోర్స్, Reuters

ఆర్థిక లక్ష్యాలలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ద్రవ్యోల్బణాన్ని ఎలా అధిగమించాలి? సహజంగా బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ పనితీరు ఈ విషయంలో అంత బాగుండదు. కాబట్టి వేరే మదుపు మార్గాల మీద దృష్టి పెట్టాలి.

స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ మార్గాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉంది. గత రెండు వందల సంవత్సరాలలో స్టాక్ మార్కెట్ బాగా ప్రాచుర్యం పొందింది. కానీ సంపదను బంగారం రూపంలో దాచుకోవడం వేల సంవత్సరాలుగా వస్తోంది.

చరిత్ర ప్రకారం క్రీస్తు పూర్వమే బంగారు నాణేలు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలో కూడా బంగారాన్ని సంపదకు మారుపేరుగా చూడటం అనాదిగా వస్తోంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభసూచకంగా కొందరు భావిస్తారు. 2013లో ఉన్నట్టుండి బంగారం పడిపొయినప్పుదు ప్రజలు షాపుల దగ్గర క్యూ కట్టిన వైనం మనకు కనిపించింది.

మన ప్రస్తుత పరిస్థితి గతంతో పోలిస్తే భిన్నమైనది. కాబట్టి ఈ విషయంలో గతంలో పాటించిన పద్ధతులు ఇప్పుడు గుడ్డిగా పాటించలేం. బులియన్ మార్కెట్ మీద అవగాహన పెంచుకుని తద్వారా మనం లాభపడే అవకాశాలను వదులుకోకూడదు. ఇప్పుడు బులియన్ మార్కెట్ ద్వారా పొందగలిగే లాభాలు ఏమిటో చూద్దాం.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం..

పైన చెప్పినట్టుగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం బులియన్ మార్కెట్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటుంది. గత 50 సంవత్సరాలలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం ధర పెరిగిన ఉదంతాలు చాలా ఉన్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా బంగారం ధరలు తగ్గలేదు. 2016 నుంచీ ఇప్పటిదాకా బంగారం ధర 60% పెరిగింది.

అస్థిరత నుంచీ కాపాడే సాధనం

1990లో మొదలైన మొదటి గల్ఫ్ యుద్ధం నుంచీ ఇప్పటి యుక్రెయిన్ యుద్ధం దాకా ఏదో ఒకరకమైన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల ఆర్థిక వ్యవస్థల మీద భారం పడిందనే విషయాన్ని మర్చిపోకూడదు.

ఉదాహరణకు కొన్ని డజన్ల అమెరికన్ కంపెనీలు యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో తమ కార్యకలాపాలు ఆపేశాయి. దీని వల్ల సదరు కంపెనీల లాభాలు తగ్గుతాయి. దీంతో ఆ కంపెనీలలో మదుపు చేసిన మదుపరుల మీద ప్రభావం పడుతుంది. ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో బంగారం మీద చేసే మదుపుకు స్టాక్ మార్కెట్ కంటే నష్టభయం తక్కువ.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

తగ్గుతున్న బంగారం సరఫరా

2008 ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం పెను మార్పులకు లోనైంది. అలాంటి మార్పుల్లో ఒకటి బంగారం సరఫరా తగ్గడం.

2000లో ఏడాదికి 2500 మెట్రిక్ టన్నుల బంగారం సరఫరా అయ్యేది. 2007 తర్వాత ఏడాదికి 2300 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే సరఫరా అవుతోంది.

ఒక బంగారు గని ఉపయోగంలోకి రావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుంది. కాబట్టి వచ్చే ఐదేళ్లలో కూడా బంగారం సరఫరా పెరిగే సూచనలు కనిపించడం లేదు. సరఫరా తక్కువగా ఉన్నప్పుడు గిరాకీ ఎక్కువగా ఉండటంతోపాటు ధర పెరగడం అనేది ఆర్థిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బులియన్ పోర్ట్ ఫోలియో

స్టాక్ మార్కెట్లో పోర్ట్‌ఫోలియో నిర్మించుకున్నట్టు బులియన్ మార్కెట్లో కూడా పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవచ్చు. వివిధ రకాలైన బులియన్ మార్కెట్ మదుపు మార్గాలను మన రిస్క్ వెసులుబాటును బట్టి వాడుకోవచ్చు. కింద ఇచ్చిన బులియన్ మార్కెట్ మదుపు మార్గాల పనితీరు.. మార్కెట్ గమనం మీద, సదరు కంపెనీల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది.

1. బంగారు ఫ్యూచర్స్

ఇవి కూడా మిగిలిన ఫ్యూచర్స్ లాగే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన తేదీన నిర్దిష్టమైన బరువు గల బంగారానికి సంబంధించిన విషయం. చాలా ఎక్కువ రిస్క్ కలిగిన మదుపు మార్గం. ఎంతో అనుభవం ఉన్న మదుపరులు కూడా ఫ్యూచర్స్ విషయంలో బోల్తా పడుతుంటారు.

ఎస్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images

2. బంగారు నాణేలు

మిగిలిన మదుపు మార్గాలతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైన విషయం. భౌతికంగా లేక వర్చువల్ నాణేలు కొనే సౌలభ్యం బంగారం విషయంలో ఉంది. ఒకవేళ దీన్ని క్యాష్ రూపంలో మార్చుకోవాలంటే చాలా సులభం. గతంలో ప్రముఖ బ్యాంకులలో మనకు కావలసిన మొత్తానికి బంగారం నాణేలు కొనే అవకాశం ఉండేది.

3. బంగారు వ్యాపారం చేసే కంపెనీలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు బంగారు వ్యాపారం చేస్తున్నాయి. వాటి షేర్లు కొనడం ద్వారా ఆ కంపెనీలలో మదుపు చేయవచ్చు. కానీ మిగిలిన లోహాల లాగే ఈ కంపెనీలలో కూడా రిస్క్ ఎక్కువ.

వీడియో క్యాప్షన్, హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేకపోతే ఏం చేయాలి?

4. బంగారు ETFs

ఇవి క్రియాశీలం కానీ మదుపు మార్గం. రిస్క్ పరంగా ఫ్యూచర్స్ కంటే మేలైనవి.

5. బంగారం మీద ఆధారపడ్డ మ్యూచువల్ ఫండ్స్

పైన చెప్పిన మూడు, నాలుగు రకాలలో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి నిచ్చేవి మ్యూచువల్ ఫండ్స్. సహజంగానే మిగిలిన వాటితో పోలిస్తే వీటిలో రిస్క్ తక్కువ.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

6. బులియన్

ప్రత్యక్షంగా బంగారు కడ్డీల రూపంలో లేదా మరేదైనా రూపంలో కొనడం. బంగారానికి ఉన్న విలువ కారణంగా వీటిని సురక్షితంగా ఉంచుకోవడం కష్టం.

7. బంగారు నగలు

బంగారానికి సంబంధించిన మదుపు మార్గాలు ఎన్ని ఉన్నా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం ఆభరణంగా ధరించడం. ముఖ్యంగా మనదేశంలో బంగారం ధరించడాన్ని ప్రోత్సహించే కారణాలు చాలా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్ డబ్బుతో ఇల్లు కొనడం మంచిదేనా?

ఇప్పుడు బంగారం మీద మదుపు చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు చూద్దాం:

1. బంగారం మీద చేస్తున్న మదుపు ఏ ఆర్థిక లక్ష్యం కోసం చేస్తున్నామనే స్పష్టత ఉండాలి. సదరు ఆర్థిక లక్ష్యానికి బంగారం కంటే సులువైన మదుపు మార్గం ఉందో లేదా బేరీజు వేసి చూసుకోవాలి.

2. ఎలాంటి మదుపు అయినా భావోద్వేగాలతో ముడిపెట్టకూడదు. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాథమిక సూత్రం. కానీ బంగారం విషయంలో ఈ సూత్రం పాటించడం కష్టం. బంగారం నాణేలు లేదా కడ్డీల రూపంలో మదుపు చేసిన వాటిని క్యాష్ రూపంగా మార్చుకోవడానికి చాలామంది ఇష్టపడరు.

3. మిగిలిన మదుపు మార్గాల లాగే ఇందులో కూడా దీర్ఘకాలిక పనితీరు మీద దృష్టి సారించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)