అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ. 21 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ. ఈమె ఎవరు? మమత ప్రభుత్వంలోని మంత్రికీ ఆమెకూ లింకేంటి?

ఫొటో సోర్స్, Instagram
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ హిందీ కోసం
పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) నియామకాల్లో జరిగిన అవకతవకలను విచారిస్తున్న ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ఉదయం పరిశ్రమల శాఖ మంత్రి పార్థ్ ఛటర్జీను అరెస్ట్ చేశారు. ఆయన మమత ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్నారు.
ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి ముందు 27 గంటల పాటు ప్రశ్నించారు. కానీ, ఆయన అరెస్టు కంటే కూడా ఇంత వరకూ ఎక్కడా వినిపించని అర్పిత ముఖర్జీ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె పార్థ్ ఛటర్జీకి సన్నిహితురాలని చెబుతున్నారు. పార్థ్ ఛటర్జీ తృణమూల్ కాంగ్రెస్ జనరల్ కార్యదర్శిగా ఉన్నారు.
అర్పిత ముఖర్జీ ఇంటి నుంచి రూ.21 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బును గోనె సంచుల్లో కట్టి కప్‌బోర్డులో దాచారు. ఈ డబ్బులు ఎస్‌ఎస్‌సీ నియామకాల కుంభకోణానికి సంబంధించినవై ఉంటాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
అర్పితను కూడా అరెస్ట్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేసిందని నిపుణులు చెబుతున్నారు.
పార్థ్ ఛటర్జీ అరెస్టు, అర్పిత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్న అంశాల గురించి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అరెస్టుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ఫొటో సోర్స్, Sanjay Das
టీఎంసీ మౌనం. ఈడీ ఏమి చెబుతోంది?
గతంలో ఈడీ, సీబీఐ విచారణలు బీజేపీ చేస్తున్న ప్రతీకార రాజకీయాలని మమత అన్నారు. కానీ, బలమైన ఆధారాలు బయటపడుతూ ఉండటంతో ప్రస్తుతం ఎవరూ ఎవరూ నోరు విప్పలేదు.
ఈ విషయం బయట పడిన తర్వాత అర్పిత, పార్థ్ ఛటర్జీలతో మమతకున్న సాన్నిహిత్యం గురించి అనేక పుకార్లు, వదంతులు వ్యాపిస్తున్నాయి.
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శుక్రవారం సాయంత్రం టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత సంబంధిత వ్యక్తిదని అన్నారు. మంత్రిని ప్రశ్నించడం కేవలం ప్రతీకారంతో చేస్తున్న చర్య అని శుక్రవారం మంత్రి చంద్రమ భట్టాచార్య ఆరోపించారు.
ఇప్పటి వరకు రూ. 21 కోట్ల డబ్బు, 50 లక్షల విలువైన నగలు లభించినట్లు ఈడీ అధికారులు చెప్పారు. 20 ఐ ఫోన్లతో పాటు కొంత విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. "అయితే, ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయన్నదానికి ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు" అని ఈడీ అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Sanjay Das
సినిమాల్లో నటన
అర్పిత ఏమి చేస్తారు? ఆమెకు అంత డబ్బెలా వచ్చింది? ఆమెకు పార్థ్ ఛటర్జీతో ఎటువంటి సంబంధాలున్నాయి?
ప్రస్తుతం చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అర్పిత తానొక నటినని తన సంపాదన అంతా నటన నుంచే వస్తుందని చెబుతున్నారు.
ఆమె ఈడీ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్‌లో కూడా తానొక నటి ననే రాసుకున్నారు.
అర్పిత 2005లో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె కొన్ని బెంగాలీ, ఒడియా సినిమాల్లో నటించారు.
ఆమె ప్రసేన్ జీత్ నటించిన 'మామా భాగ్నే' దేవ్ నటించిన 'పార్టనర్' అనే సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. 2008లో విడుదల అయినా పార్టనర్ సినిమా ఆమె నటించిన తొలి బెంగాలీ సినిమా.
అర్పిత ఒడియా, తమిళ సినిమాల్లో కూడా నటించినట్లు ఆమె తల్లి మినాటీ ముఖర్జీ చెబుతున్నారు. ఆమె కొన్ని ప్రకటనల్లో కూడా నటించారు. నెయిల్ ఆర్ట్ వేయడంలో కూడా శిక్షణ తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Sanjay Das
ఆమెకు మంత్రికి మధ్య ఉన్న పరిచయం గురించి ఈడీ ఏమి చెబుతోంది?
అర్పిత దక్షిణ కోల్‌కతా లోని నకటాల ఉదయన్ సంఘ నిర్వహించే దుర్గా పూజ కోసం కొన్ని ప్రకటనలు చేశారు. ఆ కమిటీకి పార్థ్ ఛటర్జీ అధినేతగా ఉన్నారు. ఇక్కడ జరిగే పూజను కోల్‌కతాలో అత్యంత భారీగా జరిగే ఉత్సవంగా చూస్తారు.
ఈ పూజ మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే నిర్వహిస్తారు. ఈ ప్రకటన చేసిన తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఉంటుందని ఈడీ అధికారులు అంటున్నారు. ఈ పూజను మమతా బెనర్జీ ప్రారంభించినప్పుడు స్టేజీ పై అర్పిత కూడా ఉన్నారు.
అర్పిత పార్థ్ ఛటర్జీతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆమె గురించి వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత పార్థ్‌తో కలిసి ప్రజలను ఓట్లను అడుగుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పార్థ్ ఛటర్జీ ముఖ్య అతిధిగా ఉన్న చాలా కార్యక్రమాల్లో కూడా ఆమె కనిపించారు.
అర్పిత ఆమె ఆరోగ్యం గురించి శరీర సౌష్టవం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో తరచుగా యోగా, వ్యాయామం చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Sanjay Das
అర్పిత తల్లి ఏమంటున్నారు?
అర్పిత సినిమాలతో పాటు మోడలింగ్ కూడా చేసేవారని ఆమె తల్లి మినాటీ చెబుతున్నారు. ఇవి కాకుండా ఆమె ఏమి చేసేవారో వారికి తెలియదు.
"అర్పిత జీవితం, చేస్తున్న పనుల గురించి తెలుసుకోవాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు" అని ఆమె అన్నారు.
"అర్పిత పేరు మొదట జాబితాలో లేదు. కానీ, పార్థ్ ఇంటిని వెతుకుతుండగా, ఒక కాగితం దొరికింది. దాని పై అర్పిత పేరు, చిరునామా రాసి ఉన్నాయి. అప్పుడే అర్పిత ఇంటి పై దాడి నిర్వహించాం" అని పేరు చెప్పని అధికారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Sanjay Das
"భారీ మొత్తం"
పార్థ్ అర్పితకు మధ్యనున్న సంబంధం గురించి ఈడీ విచారణ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. అర్పిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బుకు ఎస్‌ఎస్‌సీ నియామకాల కుంభకోణానికి నేరుగా సంబంధం ఉందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బును దాచి పెట్టి ఉంచేందుకు పార్థ్ అర్పిత ఇంటిని ఎంచుకుని ఉంటారని ఈడీ అధికారులు భావిస్తున్నారు.
అర్పిత విచారణలో సహకరించటం లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందుకే ఆమెను ముందు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. కోల్‌కతాలోని బెల్‌ఘారియా ప్రాంతంలోనున్న బహుళ అంతస్థు భవనంలో మరో రెండు ఫ్లాట్‌లు ఉన్నట్లు తెలిసింది. రెండు నెలల క్రితం వరకూ అర్పిత అక్కడకు తరచుగా వస్తూ ఉండేవారని ఆ ఫ్లాట్స్‌లో నివాసం ఉంటున్నవారు చెబుతున్నారు.
కొంత మంది రెడ్ లైట్ కార్లు ఉన్న వారు కూడా తరచుగా వస్తూ ఉండేవారని చెప్పారు. "గెస్ట్ రిజిస్టర్ చూస్తేనే అర్పిత కోసం ఎవరు వచ్చేవారో తెలుస్తుంది" అని స్థానికులు అంటున్నారు.
అదే ప్రాంతంలో అర్పితకు మరో ఇల్లు ఉన్నట్లు తెలిసింది. అందులో అర్పిత తల్లి, మరి కొంత మంది బంధువులు ఉంటారు. కానీ, కేవలం మోడలింగ్, ప్రాంతీయ సినిమాల్లో నటిస్తూ అంత పెద్ద మొత్తం సంపాదించగలరా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Sanjay Das
'వెలుగులోకి రావల్సింది మరింత ఉంది' - శుభేందు అధికారి
ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు మమతా బెనర్జీ ప్రభుత్వం పై దాడి చేయడం మొదలుపెట్టాయి. బీజేపీ ఇప్పటికే అవకాశం కోసం పొంచి చూస్తోంది.
"ఇప్పుడు దొరికిన సొమ్ము మచ్చు తునక మాత్రమే. ఇది కేవలం ఒక ట్రైలర్ లాంటిది. బయటకు రావల్సింది చాలా ఉంది" అని శాసనసభ ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి అన్నారు.
"ఇది 'బెంగాల్ మోడల్' అని అంటూ తృణమూల్ కాంగ్రెస్ అవినీతి రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసింది" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు.
"ఎస్‌ఎస్‌సీ నియామకాల కుంభకోణంలో రాష్ట్ర మంత్రి అరెస్టు కావడం బెంగాల్ ప్రతిష్టను దెబ్బ తీసింది. ఈ కేసులో పార్థ్‌తో పాటు చాలా మంది తృణమూల్ నాయకులకు కూడా పాత్ర ఉంది" అని సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి అన్నారు.
"ఈ కుంభకోణం తీవ్రత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం చోటు చేసుకున్న తాజా పరిణామాలను చూస్తుంటే ఇవనీ బెంగాల్ రాజకీయాల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని అనిపిస్తోంది" అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సమీరన్ పాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌కు ప్రధాన మంత్రి అవుతారా?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














