‘ముస్లింలు మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనండి’ అని పాకిస్తాన్ మంత్రి ఎందుకు అన్నారు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో పెరుగుతున్న జనాభాను అదుపు చేసేందుకు.. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని అనుకుంటున్న వారు ముస్లిం జనాభా మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనాలని పాకిస్తాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ సూచించారు.

ప్రపంచ జనాభా దినోత్సవం నాడు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది నవంబరు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందని ఐక్య రాజ్య సమితి విడుదల చేసిన 'వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022' నివేదిక తెలిపింది.

వచ్చే ఏడాదికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానానికి చేరుతుందని కూడా అంచనా వేసింది. భారత్ తర్వాతి స్థానంలో చైనా నిలుస్తుందని చెప్పింది. పాకిస్తాన్ జనాభా 2050 నాటికి 36 కోట్లకు చేరుతుందని తెలిపింది.

ఇలాంటి పరిస్థితిలో, పాకిస్తాన్‌లో జనాభా నియంత్రణ గురించి ఎందుకంత ఆందోళన చెందుతున్నారు.

ఇదే కార్యక్రమంలో పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యురాలు సమీనా ముంతాజ్ జహారీ ఈ ప్రశ్నకు కొంత వరకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. ఆమె బలూచిస్తాన్ అవామీ పార్టీ సభ్యురాలు.

"ప్రపంచంలోని పెద్ద దేశాల్లో పాకిస్తాన్ 33వ స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ, జనాభా విషయానికొచ్చేసరికి అది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఐదవ స్థానంలో నిలుస్తోంది. ప్రస్తుత జనాభాకు తగినంత వనరులు పాకిస్తాన్‌లో లేవు. ఉన్న వనరులను పాకిస్తాన్ లో పౌరులందరూ వినియోగించుకోలేకపోతున్నారు.

పెరుగుతున్న జనాభా గురించి ఇదే విధమైన ఆందోళన పాకిస్తాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల్లో కనిపించింది.

వీడియో క్యాప్షన్, సంప్రదాయ కట్టుబాట్లు ఛేదించి... కరాటే పంచ్ విసురుతున్న మైనారిటీ హజారా మహిళలు

"2030 నాటికి పాకిస్తాన్ జనాభా 28.5 కోట్లకు చేరుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ముస్లిం జనాభాను తగ్గించే ప్రయత్నం చేయడం లేదు. ముస్లింలకు మెరుగైన జీవితం ఇవ్వాలని అనుకుంటున్నాం. ముస్లింలను ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా చేయాలని అనుకుంటున్నాం" అని అన్నారు.

"కొన్ని సార్లు కొంత మంది మా అభిప్రాయాలతో అంగీకరించరు. అల్లా ఇస్తున్నారు. మేము తీసుకుంటున్నాం" అని అంటూ ఉంటారు.

ముస్లిం జనాభా మైనారిటీగా ఉన్న దేశాలకు వెళ్లి కనాలని అనడంలో ఇదే నా ఉద్దేశ్యం. ఇక్కడ చాలా మంది ముస్లింలం ఉన్నాం" అని అన్నారు.

రానున్న 30 ఏళ్లలో పాకిస్తాన్ జనాభా రెట్టింపు అవుతుందని పాకిస్తాన్ కు బ్రిటన్ హై కమీషనర్ కూడా విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న వనరుల పై ఇప్పటికే పడుతున్న భారం మరింత పెరుగుతుందని అన్నారు.

పాకిస్తాన్‌లో పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు కుటుంబ నియంత్రణ గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

లింగ నిష్పత్తి

పాకిస్తాన్ జనాభా

ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా 22 కోట్ల 52 లక్షలు ఉందని ప్రపంచ బ్యాంకు అధికారిక వెబ్ సైటు చెబుతోంది.

ఇందులో ఒక కోటి 15 లక్షల మంది పురుషులు కాగా, ఒక కోటి 9లక్షల మంది మహిళలున్నారు. మొత్తం జనాభాలో మహిళల జనాభా 48 శాతం ఉంది.

లింగ నిష్పత్తి విషయంలో ప్రతీ 105 మంది పురుషులకు 100 మంది మహిళలున్నారు. 1950లో ప్రతీ 120 మంది పురుషులకు100 మంది మహిళలు ఉండేవారు.

ఈ ఏడాది భారతదేశంలో లింగ నిష్పత్తిలో సానుకూల మార్పులు కనిపించినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో ప్రతీ 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలున్నారు.

2050 నాటికి పాకిస్తాన్ జనాభా 56% పెరిగి 36.6 కోట్లు దాటిపోతుందని ఐక్యరాజ్య సమితి "వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్" నివేదిక చెబుతోంది.

పాకిస్తాన్‌లో తొలిసారిగా జనాభా లెక్కింపు 1998లో జరిగింది. అప్పటి నుంచి 2017 వరకు పాకిస్తాన్ జనాభా 57% పెరిగి 21 కోట్లకు చేరింది.

అప్పటి నుంచి పాకిస్తాన్ ప్రపంచంలో అత్యధిక దేశాల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేసియా అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత 1950లో పాకిస్తాన్‌లో 3.3 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా దేశాల్లో పాకిస్తాన్ 14వ స్థానంలో ఉండేది.

వీడియో క్యాప్షన్, మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి.

పాకిస్తాన్‌లో సంతానోత్పత్తి రేటు

ఒక దేశంలో జనాభా విస్ఫోటనం జరిగే పరిస్థితి ఉందేమోనని అంచనా వేసేందుకు ఆ దేశంలో ఉన్న సంతానోత్పత్తి రేటును ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు.

పాకిస్తాన్ లో ప్రతీ మహిళ సగటున 3.6 మంది పిల్లలకు జన్మనిస్తున్నట్లు పాకిస్తాన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జనాభా అత్యధికంగా ఉన్న ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది.

కానీ, గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్న రేటులో పాకిస్తాన్ దక్షిణ ఆసియాలోనే అత్యంత దిగువ ర్యాంక్ లో ఉంది.

భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2.0 ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా చెబుతోంది.

ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాకిస్తాన్ లో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు సుమారు ఒక కోటి మంది ఉన్నారు. ఇందులో 49 లక్షల మంది మహిళలు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్లో విచారం ఎందుకు వ్యక్తం అవుతోంది?

దేశంలో పెరుగుతున్న జనాభాతో పోలిస్తే వనరులను సమకూర్చుకునే వేగం మాత్రం చాలా మందకొడిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లో 15-64 సంవత్సరాల వయసులో ఉన్న వారి జనాభా ఒక కోటి 37 లక్షల మంది ఉన్నారు. 15 సంవత్సరాల పైనున్న పని చేసే వయసులో ఉన్న వారిలో 49.4 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలున్నాయి. అంటే సుమారు 51% మందికి ఉద్యోగాలు లేవు.

విద్య విషయంలో వెనుకబడిన దేశాల్లో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది.

పాకిస్తాన్‌లో 5 -16 సంవత్సరాల వయసులో ఉన్న సుమారు 2కోట్ల మంది పిల్లలు స్కూలుకు వెళ్ళటం లేదని యూనిసెఫ్ పాకిస్తాన్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ వయసులో ఉన్న పిల్లలు దేశ జనాభాలో 44% మంది ఉంటారు.

పాకిస్తాన్‌లో ప్రతీ 1000 జననాలకు సుమారు 54 మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

దేశ జనాభా, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ దేశ జనాభాలో ఎక్కువ మంది యువత ఉన్నారని పాకిస్తాన్ నిపుణులు షాహిద్ జావెద్ బుర్కీ చెప్పారు.

ప్రపంచ జనాభా సగటు వయసు సుమారు 31 ఏళ్ళు. దీనిని బట్టీ చూస్తే, పాకిస్తాన్‌లో సగం జనాభా అంత కంటే తక్కువ వయసులోనే ఉన్నారు. పాకిస్తాన్ లో సగటు వయసు 24 సంవత్సరాలుగా ఉంది.

కానీ, ఉద్యోగావకాశాల రీత్యా పాకిస్తాన్‌లోని కొన్ని నగరాల్లో సామర్ధ్యానికి మించి జనాభా నివసిస్తున్నారు.

20 శాతానికి పైగా పాకిస్తాన్ జనాభా దేశంలో ఉన్న 10 ప్రధాన నగరాల్లోనే ఉంటున్నారని డిప్లొమాట్ వెబ్ సైటు లో ప్రచురించిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ నగరాల్లో అత్యధిక జనాభా నివసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)