భారత్ - పాకిస్తాన్ సరిహద్దులు దాటిన ప్రేమ కథలు

ఫొటో సోర్స్, Sarita
- రచయిత, డెవీనా గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
20 ఏళ్ల సరితా కుమారి పాకిస్తాన్‌లోని సింధ్‌లో గత రాజపుత్ రాష్ట్రం ఉమర్ కోట్‌లోని పుట్టింటి నుంచి భారతదేశానికి బయల్దేరారు.
దారిలో సింధూ నదిపై ఉన్న ఒక వంతెన దగ్గర ఆగిన ఆమె, నీళ్లలోకి ఒక నాణెం విసిరి భారతదేశంలోకి అడుగుపెట్టడానికి నదిని అనుమతి అడిగారు.
భారత్‌లో అత్తవారింట తన వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టడానికి ముందు, ఆమె ఆ నది దగ్గర ఆగి తన కోరికను కోరుకున్నారు.
రాజస్థాన్‌లోని ఘనేరావ్ దగ్గర సరిహద్దులను దాటిన ఆమె, 1984లో ఠాకూర్ హిమ్మత్ సింగ్‌ను పెళ్లాడారు.
"కోరికలు నెరవేర్చమని నదిని కోరుకునే సంప్రదాయాన్ని నాకు మా నాన్నగారు నేర్పించారు. అది నాకు బాగా గుర్తుంది. రాజపుత్ అమ్మాయిలు సొంత వంశంలో వారిని పెళ్లి చేసుకోలేరు. పాకిస్తాన్‌లో సోథా రాజపుత్ వంశానికి చెందినవారం మేం ఒక్కరిమే కావడంతో, నేను నా కాబోయే భర్తను భారత్‌లోనే చూసుకోవాలనే విషయం నాకు బాగా తెలుసు. నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు ఒక పెళ్లికి భారత్ వచ్చాను. అక్కడే నా కాబోయే అత్తగారు నా జాతకం, వాళ్ల అబ్బాయి జాతకంతో కుదిరిందని చెప్పారు. నేను నా భర్తను చూసింది పెళ్లి జరిగే సమయంలోనే" అని సరితా కుమారి చెప్పారు.

ఫొటో సోర్స్, SARITA
సరిత హిందీ నేర్చుకోవడంతో తన వైవాహిక జీవితం మొదలుపెట్టారు.
"రాజస్థాన్ సింధ్ రాష్ట్రంతో సరిహద్దులు పంచుకుంటున్నా, మొదట్లో ఇక్కడ పద్ధతులకు అలవాటు పడటం చాలా కష్టమయింది".
"రాజస్థాన్‌లో అందరూ 'ఈమెకు ఏం రాదు' అనే వాళ్లు. నేను పత్రికలు, బోర్డులపై రాసిన వాటిని చదవలేకపోయేదాన్ని. దాంతో, ఏదో కోల్పోయినట్లు అనిపించేది. నాకు కొడుకు పుట్టాక తనతో పాటే హిందీ నేర్చుకున్నాను. ఆ తర్వాత పురాణాలు చదవడానికి సంస్కృతం కూడా నేర్చుకున్నాను" అని సరిత వివరించారు.
మొదట్లో చుట్టు పక్కల వారి నుంచి ఎదురైన వివక్ష ఆమెకు బాగా గుర్తుంది. భాష విషయంలో మాత్రమే కాదు, వంటల విషయంలో కూడా ఆమె పుట్టింటికీ, అత్తింటికీ మధ్య చాలా తేడా ఉండేది.
సరితకు పెళ్లైన ఐదేళ్లలోనే భారత పౌరసత్వం లభించింది. ఆమె ప్రస్తుతం భారత్‌లో యువకులను పెళ్లి చేరుకుని పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చే హిందూ వధువులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఒక పుస్తకం కూడా రాస్తున్నారు. ఆ పుస్తకం వల్ల ఇక్కడకు వచ్చిన తర్వాత వారి జీవితం సులభంగా ఉంటుందని భావిస్తున్నారు.
సరిత భర్త 2017 నుంచి ఘనేరావ్ ప్రాంతానికి 18వ ఠాకూర్ సాహెబ్‌గా ఉన్నారు. వీరి కుటుంబం ఆ ప్రాంతంలో ఒక హోటల్, లాడ్జి నిర్వహిస్తోంది.
అయితే, తన తండ్రి మరణించినప్పుడు, పాకిస్తాన్ వెళ్లలేకపోయానే అనే బాధ ఇప్పటికీ సరితను వెంటాడుతుంటుంది.
"90లలో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో నేను మూడు నాలుగేళ్లు పాకిస్తాన్ వెళ్ళలేకపోయాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేకపోయాను. నా పిల్లలు పుట్టినప్పుడు, పుట్టింటి నుంచి చూడ్డానికి ఎవరూ రాలేదు. అలాగే, నా కుటుంబం పాకిస్తాన్‌లో కష్టాల్లో ఉన్నప్పుడు, అక్కడ ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు నేను వెళ్ళలేకపోయాను" అని సరిత తెలిపారు.
సరిత తల్లి, అన్నదమ్ములు, ఉమర్ కోట్‌లోనే నివసిస్తున్నారు. వారి పూర్వీకులు మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కి ఆశ్రయం ఇచ్చారు. హుమాయూన్ కొడుకు అక్బర్ ఉమర్ కోట్‌లోనే జన్మించారు. ఆ గత చరిత్ర వైభవానికి ఇప్పుడు నగరంలోని శిథిలాలు సాక్ష్యంగా నిలిచాయి.
ప్రేమ, నిరీక్షణ, ఫైజ్ కవిత్వం
"నహీ నిగాహ్ మే మంజిల్, జూస్తుజు హీ సహీ
నహీ విశాల్ ముయస్సార్ తో ఆర్జూ హీ సహీ"
ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ఈ కవిత్వంలోని వాక్యాలు ప్రేమికుల నిరీక్షణ గురించి వర్ణిస్తాయి.
"ప్రేమికులకు కలవలేకపోతే, కనీసం కలుస్తామనే ఆశ అయినా మిగిలి ఉంటుంది. ఇప్పటికి అది చాలు".
2008లో కరాచీ నుంచి భారత్ రావల్సిన విమానం కూడా రద్దయినప్పుడు మన్సూర్, షాజ్మన్‌లకు కూడా అలాగే అనిపించింది.
భారత్‌కు కచ్చితంగా తిరిగి రావల్సిన వీసాపై ఆయన భార్య పాకిస్తాన్‌లోని స్వగ్రామానికి వెళ్లారు. ఆమె కోసం మన్సూర్ ముంబయిలో ఎదురు చూస్తున్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను చివరి క్షణంలో రద్దు చేశారు.
సమయానికి భారత్ చేరుకోకపోతే ఆమె వీసా రద్దవుతుంది.
"నాలుగు రోజుల పాటు మేము చాలా ఆందోళనకు లోనయ్యాం. దాంతో, నేను శ్రీలంక మీదుగా భారత్ వచ్చేందుకు తనకు టికెట్ బుక్ చేశాను" అని మన్సూర్ చెప్పారు.
భారతదేశంలో స్థిరపడేందుకు పాకిస్తాన్ నుంచి వచ్చిన వందలాది మంది పెళ్లి కూతుళ్లలో షాజ్మన్ ఒకరు. 2005లో మన్సూర్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె భారత్ వచ్చేశారు.
"మా నాన్నగారు బెంగళూరులో ఉండేవారు. దేశ విభజన సమయంలో చిన్నతనంలోనే కుటుంబంతో పాకిస్తాన్‌కు వలస వెళ్లారు. కానీ, బెంగళూరులో పెరిగిన జ్ఞాపకాలు మాత్రం ఆయన మనసులో అలాగే ఉండిపోయాయి. మన్సూర్‌తో పెళ్లితో నన్ను ఆ జ్ఞాపకాలతో కలపాలని ఆయన అనుకున్నారు. అందుకే ఈ వివాహానికి ఒప్పుకున్నాను" అని షాజ్మన్ చెప్పారు.
కానీ, ఇక్కడ జీవించాలంటే, రెండు దేశాల మధ్యా మారుతున్న రాజకీయ సమీకరణల వాస్తవాలను ఆకళింపు చేసుకోవాల్సిందే. ఈ మార్పులు ఎక్కువగా రెండు దేశాల మధ్య రాకపోకలపై ప్రభావం చూపిస్తాయి.

ఫొటో సోర్స్, ZOYA FATIMA RIZVI
భారత యువకులను పెళ్లి చేసుకున్న పాకిస్తానీ అమ్మాయిలు సాధారణంగా షార్ట్ టర్మ్ వీసాపై వస్తూ ఉంటారు.
వారు దేశంలో ఎంత కాలం ఉంటారన్నది పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలి. ప్రతి కొన్ని వారాలకోసారి పోలీసు తనిఖీలు జరుగుతుంటాయి. వాళ్ళు పౌరసత్వంతోపాటూ, లాంగ్ టర్మ్ వీసాకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2011 నుంచీ మార్చి 2020 వరకు 4085 మంది పాకిస్తానీ జాతీయులకు, భారత పౌరసత్వం ఇచ్చినట్లు డెక్కన్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది.
అదే సమయంలో 15 వేల మంది బంగ్లాదేశీయులకు కూడా భారత పౌరసత్వం లభించింది. మతం, లైంగిక పరమైన వివరాలను కేంద్ర గృహమంత్రిత్వ శాఖ ఆ సమాచారంలో చెప్పలేదు.
షాజ్మన్‌కు 2018లో భారత పౌరసత్వం లభించింది. ఆమె పాకిస్తాన్‌కు వెళ్లడం అదే ఆఖరిసారి.
ఆమె ప్రస్తుతం భారత పౌరురాలు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా ఆమె పాకిస్తాన్ మూలాల గురించి ఎవరికీ చెప్పడం లేదు.
"నాకో నియమం పెట్టుకున్నా, నేనెవరినైనా మొదటిసారి కలిస్తే, వారికి నేను పాకిస్తాన్‌కు చెందినదానినిచెప్పను. వాళ్ళు నేను బాధపడేలా ఏదైనా అనే అవకాశం ఉంటుంది. నేనొక రోజు మా పాపతో పార్కులో ఉన్నాను. అప్పుడు నా దుపట్టాను మరోలా వేసుకున్నాను. దాంతో, ఒకామె నా దగ్గరకు వచ్చి, నా వివరాలు అడిగారు. నేను పాకిస్తాన్ నుంచి వచ్చాను అని చెప్పగానే, 'పాకిస్తానీయులు తీవ్రవాదులు' అని ఆమె అరవడం మొదలుపెట్టారు. నేను షాక్ అయ్యా. ఇక్కడ ఎవరూ పాకిస్తాన్‌కు వెళ్ళలేదు. కానీ, పాకిస్తాన్ వాళ్లంతా తీవ్రవాదులు అనే అభిప్రాయంతో ఉన్నారు. నా కుటుంబం మానసికంగా గాయపడటం నాకిష్టం లేదు" అన్నారు.
ఆమె భర్త మన్సూర్ అలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు కోపాన్ని నిగ్రహించుకోవడం, జోకులు పేల్చి నవ్వించడం లాంటి చిట్కాలు పాటిస్తారు.
"నేను మౌనంగా 20 లెక్కపెట్టుకుంటాను. ఎందుకంటే, నాకు త్వరగా కోపం వచ్చేస్తుంది. పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదనే తప్పుడు సిద్ధాంతాలతో ఉన్నవాళ్లను నేను కలిసాను. నన్ను ఆ విషయం ఎవరైనా అడిగితే... తోటి భారతీయులంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అని భారత రాజ్యాంగంలో ఉంది. అందుకే, నేను పాక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని సమాధానం చెబుతాను. కొందరు వెంటనే నవ్వడం మొదలుపెడతారు. దాంతో ఉద్రిక్తత తగ్గిపోతుంది" అని మన్సూర్ చెప్పారు.

ఫొటో సోర్స్, SHAZMAN MANSOOR
"భారత పాకిస్తాన్ మూలాలతో కలవడానికి మేము కెనడా పౌరులు కావాలనుకున్నాం".
దుబాయ్‌లో మీర్ ఇర్ఫాన్ నజాఫీ తన స్నేహితురాలి కోసం పాకిస్తాన్ షాపుల్లో మాత్రమే దొరికే హష్మీ సుర్మా అనే కాటుక కోసం వెతుకుతున్నారు. కానీ, తన భవిష్యత్తు ఆ స్టోర్‌లోనే ఉందనే విషయం అప్పటికి ఆయనకు తెలీదు.
మీర్ జుట్టు, ఆకర్షణీయమైన రూపం చూసి జోయా ఫాతిమా రిజ్వీ ఆయనతో ప్రేమలో పడిపోయారు.
కానీ, ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకోవాలని అనుకునేటప్పటికి ఆమె మరో పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
"పెళ్లి చేసుకుని భారత్ వచ్చిన అమ్మాయిలు, వీసా కోసం, వివిధ దేశాల వెళ్లడానికి ప్రభుత్వ అనుమతుల కోసం చాలా ఇబ్బందులు పడిన కథలను విన్నాను. అందుకే నేను భయంతో తటస్థంగా ఉండే కెనడా, లేదా దుబాయిలో ఉండాలనుకున్నా" అని జోయా చెప్పారు.
కానీ, రెండు దేశాల మధ్య నెలకొన్న శత్రుత్వంతో ఆగ్రహించిన ప్రజల నుంచి ఈ ప్రేమికులు వివక్షను ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, SHAZMAN MANSOOR
"భారతదేశానికి ద్రోహం చేశానని నా స్నేహితుడు ఒకరు నా పెళ్లికి రావడానికి ఒప్పుకోలేదు. కొంత మంది మా బంధువులు, వధువు కుటుంబంతో ఫొటోలు కూడా తీయించుకోలేదు. ఇరు దేశాల మధ్య చరిత్ర పట్ల వాళ్లింకా ద్వేషంతోనే ఉన్నారు" అని మీర్ ఇర్ఫాన్ చెప్పారు.
ఇరు దేశాల యుద్ధ చరిత్ర, రాజకీయాలు తమ బంధంపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, క్రికెట్ విషయం వచ్చేసరికి మాత్రం, మా మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడతాయని ఆయన చెప్పారు.
"నేనెప్పుడూ భారతదేశానికి మద్దతిస్తే, జోయా పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తుంది" అని మీర్ ఇర్ఫాన్ చెప్పారు.
ఈ దంపతులు ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నారు. తమ ఇద్దరు అమ్మాయిలూ వారి వారి దేశ మూలాలతో కలిసి ఉండాలంటే, అక్కడ నివసించడమొక్కటే మార్గమని మీర్ ఇర్ఫాన్ అంటారు.
వీసా నిబంధనల వల్ల ఈ కుటుంబం కలిసి ఇండియాకు గాని, పాకిస్తాన్‌కు గానీ వెళ్లలేకపోయింది.
"నాకు నా ఇద్దరి కూతుళ్లను తీసుకని రెండు దేశాలకూ వెళ్లాలని ఉంది. త్వరలోనే వెళ్లగలననే అనుకుంటున్నా" అని ఆయన అన్నారు.
ఇరు దేశాలు స్వతంత్ర వేడుకలను కెనడాలో జరుపుకునే ఈ కుటుంబానికి ప్రస్తుతం అది అడియాశలాగే కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- 12 నెలలు, 12 మంది జీవితాలు: ఒక ఏడాదిలో కశ్మీరీల పరిస్థితి ఎలా మారిందంటే...
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- భారత్ బానిసత్వంలో ఉన్నది 150 ఏళ్లా.. 1200 ఏళ్లా?
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- చైనా నుంచి దిగుమతులు తగ్గితే.. చైనాకు భారత ఎగుమతులు పెరిగాయి.. ఎందుకు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








