రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు: ‘ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ అంటున్న వీడియో వైరల్... కేసు నమోదు

జ్ఞానదేవ్ అహుజా

ఫొటో సోర్స్, ANI

''పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం. వాళ్లు ఒకరిని చంపారు. చంపటానికి కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. బెయిల్ కూడా ఇప్పించాం'' అంటూ రాజస్థాన్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజా చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆయన మాటలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఆయన మీద గోవింద్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ, ''ఈ ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు చేపట్టటానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి?'' అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న అని పేర్కొన్నారు.

దిగ్విజయ్ షేర్ చేసిన వైరల్ వీడియోలో జ్ఞానదేవ్ అహుజా తన పక్కన కూర్చుని ఉన్న వ్యక్తితో, ''పండిట్‌జీ, అబ్ తక్ తో పాంచ్ హమ్నే మారే హై, లాల్వాండీ మే మారా, చాహే బేరార్ మా మారా, చాహే (స్పష్టత లేదు) మే మారా, అబ్ తక్ తో పాంచ్ హమ్ నే మారే హై. ఇస్ ఏరియా మే పెహ్లీ బార్ హువా హై కే ఉన్హోనే మారా హై (పండిట్‌జీ, మేం ఇప్పటి వరకూ ఐదుగురిని చంపాం. లాల్వాండీలో, బేరార్‌లో ఇలా ఇప్పటివరకూ ఐదుగురిని మేం చంపాం. ఈ ప్రాంతంలో ఒకరిని వాళ్లు చంపడం ఇదే మొదటిసారి)'' అని చెబుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

గోవింద్‌గఢ్‌లో మూక దాడిలో హత్యకు గురైనట్లు చెప్తున్న చిరంజీలాల్ అనే వ్యక్తి ఇంటి వెలుపల.. కొందరు వ్యక్తులతో కలిసి కూర్చున్నపుడు జ్ఞానదేవ్ అహుజా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాటల్లో లాల్వాండీ, బేరార్ ప్రస్తావనలు.. 2018లో రక్బార్, 2017లో పేహ్లూ ఖాన్‌లను మూక దాడిలో కొట్టి చంపిన ఉదంతాలకు సంబంధించినవి కావచ్చునని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ఇక 'ఈ ప్రాంతంలో మొదటిసారి జరిగిన ఘటన'ను.. చిరంజీలాల్ అనే వ్యక్తిని మూక దాడిలో కొట్టి చంపిన ఘటనకు ప్రస్తావన భావిస్తున్నారు. ఒక ట్రాక్టర్ దొంగతనం నేపథ్యంలో.. చిరంజీలాల్‌ను దొంగగా భావించి మూకదాడిలో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

‘...బారీ భీ కర్వాయాంగే, జమానత్ భీ కర్వా దేంగే...’

జ్ఞానదేవ్ అహుజా వైరల్ వీడియోలో ఇంకా ఈ మాటలు కూడా అన్నారు: ''మైనే ఖుల్లం ఖుల్లా ఛూట్ దే రఖీ హై కార్యకర్తావోం కో, మారో సా...కో జో గోకషి (స్పష్టతలేదు)... బారీ భీ కర్వాయాంగే, జమానత్ భీ కర్వా దేంగే (కార్యకర్తలకు నేను పూర్తి స్వేచ్ఛనిచ్చేశా. గోవధ వెనుక ఉన్న ఆ ....ని చంపండి, మిమ్మల్ని బయటకు రప్పిస్తాం. బెయిల్ మీద కూడా బయటకు తెస్తాం)''.

జ్ఞానదేవ్ వ్యాఖ్యల వీడియోను కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా శనివారం ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ''బీజేపీ మత ఉగ్రవాదానికి, మతోన్మాదానికి ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి. బీజేపీ అసలు ముఖం ప్రపంచానికి తేటతెల్లమైంది'' అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే.. జ్ఞానదేవ్ ఈ వ్యాఖ్యలు చేసిన ప్రాంతంలో విధుల్లో ఉన్న ఒక బీట్ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. జ్ఞానదేవ్ అహుజా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అల్వార్ ఎస్‌పీ తేజస్విని గౌతమ్ చెప్పినట్లు ది సండే ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఐపీసీ సెక్షన్ 153ఎ (వేర్వేరు సముదాయాల మధ్య శత్రుత్వాన్ని పెంచటం, సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం) కింద ఈ కేసు నమోదు చేశామని, దర్యాప్తు సమయంలో అదనపు సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని ఎస్‌పీ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ముస్లింలను సీఎం గెహ్లాట్ రక్షిస్తున్నారు: జ్ఞానదేవ్ అహుజా

వైరల్ అయిన వీడియో విషయమై జ్ఞానదేవ్ అహుజా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

''ముస్లింలకు ముఖ్యమంత్రి గెహ్లాట్ పూర్తి మద్దతు ఉంది. కాబట్టి గోవధ పెరిగింది. లేకపోతే ముస్లిం సోదరులకు అంత ధౌర్యం ఉండేది కాదు. అలా గోవధ పెరిగినపుడు.. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని నేను నా కార్యకర్తలకు చెప్పాను. ఎవరైనా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే వాళ్లని పట్టుకుని, కొట్టి, పోలీసులకు అప్పగించాలని చెప్పాను. చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోను'' అని వివరణ ఇచ్చారు.

''మేవాట్‌లో గోవుల విషయంలో జనం చాలా సున్నితంగా ఉంటారు. అందుకే చాలా సార్లు ఎక్కువగా కొడుతుంటారు. చాలాసార్లు గోవధ తర్వాత వాళ్లు పారిపోతారు'' అని కూడా ఆయన పేర్కొన్నారు.

గోవింద్‌గఢ్‌లో తన మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తనకు సమాచారం అందిందని జ్ఞానదేవ్ చెప్పారు. అయితే ఆ కేసు గురించి తనకు భయమేమీ లేదన్నారు.

ఇదంతా బూటకమని ఆయన అభివర్ణించారు.

జ్ఞానదేవ్ అహుజా

ఫొటో సోర్స్, @GyanDevAahuja

ఆయన పార్టీలో ఉన్నారు కానీ.. పదవిలో లేరు: బీజేపీ

జ్ఞానదేవ్ అహుజా బీజేపీలో ఉన్నారు కానీ, ఆయనకు ఎటువంటి పదవీ లేరని, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని రాజస్థాన్ బీజేపీ స్పందించింది.

''బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసిస్తుంది. చట్టాన్ని ఒకరు చేతుల్లోకి తీసుకోవటాన్ని విశ్వసించదు. ఒకవేళ ఎవరైనా నేరానికి పాల్పడితే వారిని చట్టం పరిధిలో శిక్షించాలి. జ్ఞానదేవ్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారో ఆయన మాత్రమే వివరణ ఇవ్వగలరు'' అని బీజేపీ రాజస్థాన్ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ చెప్పినట్లు ద సండే ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ఆ పత్రిక కథనం ప్రకారం.. జ్ఞానదేవ్ అహుజా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1998లో 2008లో, 2013లో ఆయన శాసనసభ్యుడిగా గెలిచారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడ్డ కొందరు పార్టీ నేతలకు 2018 శాసనభ ఎన్నికల్లో బీజేపీ టికెట్లు నిరాకరించింది. వారిలో జ్ఞానదేవ్ కూడా ఉన్నారు. దీంతో ఆగ్రహించిన జ్ఞానదేవ్ పార్టీ విడిచి బయటకు వెళ్లి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, బీజేపీ ఆయనను పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిని చేయడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.

2021లో అల్వార్ పోలీసులు ఆయన మీద విద్వేషపూరిత ప్రసంగం కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజా వీడియో నేపథ్యంలో ఆయన మీద మరో కేసు నమోదు చేశారు.

వీడియో క్యాప్షన్, కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)