రాజస్థాన్: ‘కుండలో నీళ్లు తాగినందుకు’ దళిత బాలుడిని కొట్టిన టీచర్.. 23 రోజుల తరువాత చనిపోయిన విద్యార్థి.. అసలు ఏం జరిగింది

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
- రచయిత, మొహర్ సింగ్ మీనా
- హోదా, జైపూర్, బీబీసీ హిందీ
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో తొమ్మిదేళ్ల దళిత చిన్నారి చనిపోవడంతో ఆ కుటుంబసభ్యులు బాలుడి మృతదేహంతో స్థానిక స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వారి డిమాండ్లను ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన ఆగింది.
కాగా చనిపోయిన విద్యార్థి చదువుకున్న సరస్వతి విద్యా మందిర్ పాఠశాల గుర్తింపు రద్దు చేశారు. జిల్లా విద్యాధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
నిజానికి ఆ ప్రైవేట్ స్కూల్‌లో ఆ దళిత బాలుడిని టీచర్ కొట్టడం వల్లే మరణించాడని.. కుండలో నీళ్లు తాగినందుకు ఉపాధ్యాయుడు ఆ చిన్నారిని కొట్టారని ఆరోపణలున్నాయి.
'ఉపాధ్యాయుడు కొట్టడం'తో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడికి 23 రోజుల పాటు వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స అందించారు. చివరకు అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆగస్ట్ 13న ఆ బాలుడు మరణించాడు.
ఆదివారం మధ్యాహ్నం బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ ఆందోళనలు చేస్తుండడంతో జిల్లా అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. అయితే, కుండలో నీళ్లు తాగినందుకు బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టారనడానికి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.
జలోర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సైలా తాలూకా సురానా గ్రామంలో సరస్వతి విద్యాలయం ఉంది. ఈ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇందర్ కుమార్ మేఘ్వాల్ మూడో తరగతి చదివేవాడు. జులై 20న ఆ విద్యర్థిని పాఠశాల డైరెక్టర్ చైల్ సింగ్ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
సుమారు 40 ఏళ్ల చైల్‌సింగ్ కొట్టడం వల్ల 9 ఏళ్ల ఇందర్ కుమార్ మేఘవాల్ చెవి మరియు కంటికి గాయాలయ్యాయని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
దీనిపై మేఘ్వాల్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'జులై 20న ఇందర్ కుమార్ మేఘ్వాల్ స్కూల్‌కు వెళ్లాడు... ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో దాహం వేయడంతో అక్కడున్న కుండలో నీళ్లు తాగాడు. స్కూల్ డైరెక్టర్ చైల్ సింగ్ కోసం ప్రత్యేకంగా ఆ కుండంలో నీళ్లుంచినట్లు మేఘ్వాల్‌కు తెలియదు. తన కోసం ప్రత్యేకంగా ఉంచిన కుండలో నీళ్లు దళితుడైన ఇందర్ కుమార్ తాగడంతో చైల్ సింగ్ కొట్టారు. దీంతో ఇందర్ కుమార్ చెవి, కంటికి గాయాలయ్యాయి'' అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గాయపడిన ఇందర్ కుమార్‌ను కుటుంబసభ్యులు 23 రోజుల పాటు వేర్వేరు ఆసుపత్రులకు తిప్పారు. చివరకు విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఉదయ్‌పూర్‌లోని ఆస్పత్రి నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో రెండు రోజులు చికిత్స పొందిన తరువాత ఇందర్ కుమార్ ఆగస్టు 13న మరణించాడు.
మృతుడు ఇందర్ కుమార్ ముగ్గురు అన్నదమ్ముల్లో అందరికంటే చిన్నవాడు. ఇందర్ కుమార్ మృతి తరువాత మేనమామ కిశోర్ కుమార్ మేఘ్వాల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో స్కూల్ డైరెక్టర్ చైల్ సింగ్‌పై ఆరోపణలు చేశారు.
మృతిచెందిన బాలుడి మరో మేనమామ మీఠాలాల్ మేఘ్వాల్ బీబీసీతో మాట్లాడారు. నీరు తాగినందుకు చైల్ సింగ్.. ఇందర్ కుమార్‌ను కొట్టినట్లు ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
జలోర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ బీబీసీతో మాట్లాడుతూ... కుండలో నీళ్లు తాగినందున టీచర్ కొట్టారని ఇంకా తేలలేదని చెప్పారు. 'నేను స్కూల్‌కి వెళ్లి చూశాను. అక్కడ తరగతి గదుల బయట ఒక మంచి నీళ్ల ట్యాంక్, దానికి కుళాయిలు ఉన్నాయి. 7వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులతోనూ నేను మాట్లాడాను. మంచినీళ్ల కోసం కుండ ఏమీ లేదని వారు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం' అన్నారు ఎస్పీ.
కాగా ఇందర్ కుమార్ క్లాసులో పెంకితనంతో వ్యవహరిస్తుండటంతో చెంపదెబ్బ కొట్టానని చైల్ సింగ్ విచారణలో చెప్పారని ఎస్పీ తెలిపారు.
చెంపదెబ్బ కొట్టడం వల్ల చిన్నారి ఎలా మరణించాడన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఎస్పీ.. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
అయితే, చైల్ సింగ్ కోసం ఉంచిన కుండలోని నీళ్లను ఇందర్ కుమార్ తాగిన తరువాతే చైల్ సింగ్ కొట్టారని స్థానిక జర్నలిస్ట్ ఓం ప్రకాశ్ అంటున్నారు.
మరోవైపు స్కూల్ డైరెక్టర్ చైల్ సింగ్, విద్యార్థి తండ్రి మధ్య ఫోన్ సంభాషణగా చెబుతున్న ఆడియో టేప్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
అందులో చికిత్స కోసం సాయం చేయాలంటూ చైల్ సింగ్‌ను విద్యార్థి తండ్రి అభ్యర్థిస్తున్నట్లుగా ఉంది. కానీ, చైల్ సింగ్ కొట్టడానికి గల కారణాల ప్రస్తావన మాత్రం లేదు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
ఆగస్ట్ 13న రెండు వీడియోలు కూడా బయటపడ్డాయి. అందులో ఒకదాంట్లో విద్యార్థి బాధతో విలపిస్తున్నట్లుగా ఉంది. విద్యార్థి ముఖానికి ఆక్సిజన్ పైప్ ఉంది. కుడి కన్ను వాపు ఉంది. కుటుంబసభ్యులు పదేపదే మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా నొప్పితో బాధపడుతున్న బాలుడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఇది ఆ బాలుడిని కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు తీసిన వీడియో.
విద్యార్థి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.. కానీ వారెవరూ దీనిపై స్పందించలేదు.
మరో వీడియోలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న విద్యార్థి ఇందర్ కుమార్‌ను కుటుంబసభ్యులు 'ఎవరు కొట్టారు' అని ప్రశ్నించడం ఉంది. 'చైలాజీ మాస్టర్ కొట్టారా?' అని కూడా అడుగుతున్నారు. విద్యార్థి దానికి చిన్నగా తలూపడం కనిపిస్తోంది ఆ వీడియోలో.
అప్పుడు కుటుంబసభ్యులు... 'ఎక్కడ కొట్టారు' అని ప్రశ్నించగా చెవి వెనుక వైపు చూపించాడు ఆ బాలుడు. ఇందర్ కుమార్‌ను తొలుత చికిత్స కోసం బగోడా తీసుకెళ్లారు. అక్కడి నుంచి భిన్మల్, దీసా, మెహసానా, ఉదయ్‌పూర్ తీసుకెళ్లారు. చివరకు అహ్మదాబాద్ తీసుకెళ్లగా అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన తరువాత ఆగస్ట్ 13 ఉదయం మరణించాడు.
ఇందర్ కుమార్ మృతితో దళిత సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఘటనకు నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ ఆగస్టు 16న రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చిన్నారి మృతిపై సీఎం అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తంచేశారు. విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. బాలుడి కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి ఈ ఘటనను ఖండించారు. రాజస్థాన్‌లో ఇలాంటి కుల దురహంకార ఘటనలు నిత్యం జరుగుతున్నాయని ఆమె అన్నారు.
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల ప్రాణాలు, గౌరవం కాపాడడంలో విఫలమవుతోందని ఆమె ఆరోపించారు.
రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా విడుదల చేసిన ఒక ప్రకటనలో... 'కొన్నాళ్లుగా రాజస్థాన్‌లో ఇలాంటివి నిత్యకృత్యమైపోయాయి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్సైట్లను రెండు, మూడేళ్లుగా అప్డేట్ చేయడం లేదు ఎందుకు?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
- సల్మాన్ రష్దీ: ఎన్టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












