Yuan Wang 5: చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ, చైనా నౌక 'యువాన్ వాంగ్ 5' తమ దేశంలోని హంబన్‌తోట నౌకాశ్రయానికి రావడానికి శ్రీలంక అనుమతించింది. ఇదే విషయాన్ని శ్రీలంక విదేశాంగ శాఖ ధృవీకరించింది.
మొదట, ఈ నౌక ఆగస్టు 11న శ్రీలంక చేరుతుందని ప్రకటనలు వెలువడ్డాయి. దాంతో, భారత్ ఆందోళనలు వ్యక్తం చేసింది. వాటిని దాటవేస్తూ శ్రీలంక ప్రభుత్వం చైనా నౌకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువాన్ వాంగ్ 5 ఆగస్టు 16న హబన్‌తోట పోర్ట్ చేరనుంది.
ఆగస్టు 9న చైనా పరిశోధనా నౌక హంబన్‌తోటకు బయలుదేరి, దారిలో ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
చైనా తమ సైనిక కార్యకలాపాలకు ఈ నౌకాశ్రయాన్ని ఉపయోగించుకోవచ్చని భారత్ భయపడుతోంది. 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,944 కోట్లు) విలువ గల హంబన్‌తోట నౌకాశ్రయం ఆసియా, యూరప్ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది.
శ్రీలంక అప్పు చెల్లించలేక హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్లకు తనఖా పెట్టినప్పటి నుంచి భారత్ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.
ఇప్పుడు చైనా నౌకను అనుమతిస్తూ శ్రీలంక తీసుకున్న నిర్ణయం భారత్‌కు షాకింగానే ఉంటుంది.
చైనా నౌక ఆగస్టు 16 నుంచి వారం రోజుల పాటు హంబన్‌తోట ఓడరేవులో ఆగుతుందని పీటీఐ తెలిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రిక కథనం.

ఫొటో సోర్స్, AFP
’గూఢచారి నౌక’
యువాన్ వాంగ్ 5 నౌక అంతర్జాతీయ షిప్పింగ్, పరిశోధన-సర్వే నౌక అని చైనా చెబుతోంది. అయితే, ద్వంద్వ ప్రయోజనాలను నెరవేర్చే ఈ నౌకను ’గూఢచారి నౌక’ అని కూడా పిలుస్తున్నారు.
హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా కార్యకలాపాలపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, శ్రీలంకపై చైనా ప్రభావం పెరుగుతున్న తీరు కూడా భారత్‌కు ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి.
చైనా నౌకపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, నౌకను పంపే ప్రణాళికను వాయిదా వేయాలని గతంలో శ్రీలంక చైనాను కోరింది.
భారత ప్రభుత్వం, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో నేరుగా మాట్లాడి ఈ అంశంలో ఆందోళన వ్యక్తం చేసిందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, నౌకను ఆ ఓడరేవులో నిలిపేందుకు ఎందుకు అనుమతించకూడదనే దానిపై భారత్ సంతృప్తికరమైన కారణాలు తెలుపలేదని కూడా చెప్పాయి.
శ్రీలంక విదేశాంగ శాఖ చైనా నౌక గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో "యువాన్ వాంగ్ 5, ఆగస్టు 16న హంబన్‌తోట ఓడరేవు చేరుకుంటుందని చైనా రాయబార కార్యాలయానికి దౌత్యపరమైన లేఖ" అందిందని, దానికి సంబంధించిన "క్లియరెన్స్ కోసం రాయబార కార్యాలయం దరఖాస్తు పెట్టుకుందని" తెలిపింది.
అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన తరువాత ఆగస్టు 13న శ్రీలంక, చైనా నౌకకు క్లియరెన్స్ ఇచ్చిందని, ఆగస్టు 16 నుంచి 22 వరకు యువాన్ వాంగ్ 5 నౌకను హంబన్‌తోట ఓడరేవులో నిలిపి ఉంచుతారని శ్రీలంక విదేశాంగ శాఖ వెల్లడించింది.
చైనా నౌక శ్రీలంకకు ఆగ్నేయంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉందని, నెమ్మదిగా హంబన్‌తోట పోర్టు వైపు కదులుతున్నదని ఓడరేవు అధికారులు శుక్రవారం తెలిపారు.
చైనా నుంచి ఒత్తిడి
చైనా పేద దేశాలకు రుణాలు ఇచ్చి, వారిపై ఒత్తిడి పెంచుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.
కాగా, చైనా తన విస్తరణ విధానాన్ని కొనసాగించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తోంది.
శ్రీలంకకు దక్షిణాన ఉన్న హంబన్‌తోట ఓడరేవు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశం. చైనా నుంచి అప్పు తీసుకుని శ్రీలంక దీన్ని నిర్మించింది.
మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్ష హయాంలో కోట్ల రూపాయలతో సాయంతో దీన్ని నిర్మించారు. చైనా నుంచి వచ్చే సరుకులను ఇక్కడ దిగిమతి చేసుకుని, దేశం నలుమూలలకు రవాణా చేస్తారు. దీన్ని నిర్మించడానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ సహాయం చేసింది కాబట్టి, ఈ రేవులో 85 శాతం వాటా ఆ బ్యాంకుకు ఉంది.
శ్రీలంకకు భారీ రుణాలిచ్చే దేశాల్లో చైనా ఒకటి. శ్రీలంకలో భారత్ ఉనికిని తగ్గించేందుకు చైనా అక్కడి రోడ్లు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఆందోళనలు
చైనా హంబన్‌తోట నౌకాశ్రయాన్ని సైనిక కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని భారత్ ఆందోళనలు వ్యక్తం చేసింది. అయితే, కేవలం ఇంధనం నింపుకోవడానికే చైనా తమ నౌకను ఈ ఓడరేవులో నిలుపుతోందని శ్రీలంక వివరణ ఇచ్చింది.
శ్రీలంకలోని ఈ ప్రాంతం తమిళనాడుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, జాఫ్నాలో చైనా ఉనికి భారతదేశానికి ముప్పుగా పరిణమించవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. చైనా నుంచి నాలుగు బిలియన్ డాలర్ల (సుమారు రూ. 31,852 కోట్లు) సహాయం కోరుతోంది. ఆ మేరకు ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి.
అటు చైనాకు లేదా ఇటు భారత్‌కు కోపం తెప్పించకుండా మధ్యేమార్గం సాధించడం శ్రీలంక ముందున్న లక్ష్యం. అయితే, రెండు పెద్ద దేశాల మధ్య సమతూకం సాధించడం అంత సులువు కాదు. భారత శ్రీలంకకు 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 27,870 కోట్లు) సాయం అందించింది.
2020లో తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాల మధ్య సైనిక ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనలో కనీసం 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి దగ్గరగా శ్రీలంకలో చైనా నౌకను నిలిపడం పట్ల భారత్ భయాందోళలనను వ్యక్తం చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
హంబన్‌తోట పోర్ట్ ప్రాముఖ్యం
- 1.5 బిలియన్ డాలర్ల విలువైన హంబన్‌తోట ఓడరేవు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటి.
- ఈ నౌకాశ్రయాన్ని చైనా ప్రభుత్వ సంస్థ అయిన చైనా మర్చంట్ పోర్ట్ హోల్డింగ్స్ నిర్మించింది. చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్‌కు ఇందులో 85 శాతం వాటా ఉంది.
- ఈ ఓడరేవు నిర్మాణం మొదలైన దగ్గర నుంచి వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
- అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్ష ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మించారు. చైనా నుంచి సరుకులను ఇక్కడ దిగుమతి చేసుకుని, దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.
- ఒక కొత్త చట్టం ద్వారా తమ దేశంలో చైనా వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడానికి శ్రీలంక ప్రయత్నిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ కథనం. అలాగే, భద్రత నియంత్రణను కూడా తమ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
యువాన్ వాంగ్ 5 ఓడ
చైనా ఈ నౌకను పరిశోధన, సర్వే నౌక అని పేర్కొంది. ఉపగ్రహాలు, రాకెట్లు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను ట్రాక్ చేయడానికి చైనా ఈ తరహా నౌకలను ఉపయోగిస్తుంది.
చైనా వద్ద ఇలాంటివి ఏడు నౌకలు ఉన్నాయి. వీటికి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల నుంచి పనిచేయగల సామర్థ్యం ఉంది. ఉపగ్రహాలు, రాకెట్లు మొదలైనవాటిని ట్రాక్ చేయడానికి భూమిపై స్టేషన్లు ఉన్నట్లే, ఈ నౌకలు సముద్రంలో స్టేషన్లు అన్నమాట.

ఫొటో సోర్స్, ISHARA S. KODIKARA/AFP/GETTY IMAGES
అమెరికా కూడా సందేహాలు వ్యక్తం చేసింది
యువాన్ వాంగ్ 5 నౌకపై అమెరికా కూడా సందేహాలు వ్యక్తం చేసింది. పీఎల్ఏ వ్యూహాత్మక మద్దతు దళం (ఎస్ఎస్ఎఫ్) వీటిని నిర్వహిస్తోందని అమెరికా రక్షణ శాఖ ఒక నివేదికలో తెలిపింది. పీఎల్ఏ వ్యూహాలు, సైబర్-ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, సైకలాజికల్ వార్‌ఫేర్ మిషన్లను ఎస్ఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది.
ఈ నౌకను చైనాలోని జియాంగ్నాన్ షిప్‌యార్డ్‌లో నిర్మించారని, 2007 నుంచి ఇది చైనాకు సేవలందిస్తోందని పై నివేదిక పేర్కొంది. 222 మీటర్ల పొడవు, 25.2 మీటర్ల వెడల్పు ఉన్న ఈ నౌకలో అత్యాధునిక ట్రాకింగ్ టెక్నాలజీని అమర్చారని, ఇది గత నెలలో చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ నిఘా మిషన్‌లో పాల్గొందని ఈ నివేదికలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా, ఆ మాట నిజమేనా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఓసారి ఒక వ్యక్తి తన కోళ్ల కోసం వెతుకుతుంటే, 20,000మంది నివసించగల భూగర్భ నగరం బయటపడింది
- ఆజాద్ కపూర్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్... ఎవరు వీరంతా? వీరి పేర్ల వెనుక చరిత్ర ఏమిటి
- విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















