Turkey: భూగర్భంలో మహానగరం, 18 అంతస్తుల్లో సొరంగాలతో అనుసంధానం

డెరిన్‌కుయుకి చేరేందుకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన 600కు పైగా సొరంగ మార్గాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జీనా ట్రూమన్
    • హోదా, బీబీసీ ట్రావెల్

ఇది భూగర్భంలో దాగిన నగరం కథ. తుర్కియేలోని కపడోషియా నగరం సమీపంలో 85 మీటర్ల అడుగున దశాబ్దాలుగా జన సంచారం లేని నగరం ఒకటి బయటపడింది.

కపడోషియాలోని లవ్ వ్యాలీలో వీచే దట్టమైన గాలులకు నేల మీది ధూళి గాలిలోకి ఎగురుతోంది. , గులాబీ, పసుపు వర్ణంలో ఉన్న పర్వత శ్రేణులు, లోతైన లోయలతో ఆ ప్రాంతం నిండిపోయింది. దూరంగా చిమ్నీల ఆకారంలో ఏర్పడిన సహజ శిలా నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అక్కడి వాతావరణం వెచ్చని, గాలులతో కూడుకుని అద్భుతమైన సౌందర్యంతో నిండిపోయింది.

కొన్ని దశాబ్దాల క్రితం అగ్ని పర్వతాలు బద్దలై పుట్టగొడుగుల ఆకారంలో మొనదేలి ఉన్న కొన్ని శిలలు సహజంగా రూపొందాయి.

సెంట్రల్ తుర్కియేలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం హైకింగ్ లేదా హాట్ ఎయిర్ బెలూన్ల కోసం ప్రస్తుతం కొన్ని లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.

కానీ, కపడోషియా భూగర్భంలో ఒక భారీ అద్భుతం దాగి ఉంది. భూగర్భంలోని ఈ నగరంలో ఒకే సారి 20,000 మంది సంచరించవచ్చు.

ఎలెన్‌గుబు (ప్రస్తుత డెరిన్‌కుయు) అనే ఈ ప్రాచీన నగరం భూమికి 85 మీటర్ల అడుగున నిక్షిప్తమై ఉంది. ఇందులో 18 అంతస్తుల్లో సొరంగాలు ఉన్నాయి.

ప్రపంచంలోనే భూగర్భంలో ఉన్న అతి పెద్ద నగరం ఇది. ఈ నగరంలో కొన్ని వేల ఏళ్ల పాటు జనజీవనం కొనసాగింది. ఈ ప్రాంతం ఫ్రిజియన్‌ల నుంచి పెర్షియన్ లు, బైజంటైన్ యుగంలో క్రైస్తవుల వరకు చాలా చేతులు మారుతూ వచ్చింది.

చివరకు 1920లో గ్రీసు దేశానికి తుర్కియేకి మధ్య జరిగిన యుద్ధంలో కపడోషియా గ్రీకులు ఓడిపోవడంతో వారంతా మూకుమ్మడిగా ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ భూగర్భంలో ఉన్న గదులు కొన్ని వందల మైళ్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉంటాయి.

ఇదే ప్రాంతంలో కనిపెట్టిన 200కు పైగా చిన్న చిన్న భూగర్భ నగరాలు ఈ సొరంగంతో అనుసంధానమై ఉండవచ్చని చెబుతారు. ఈ నిర్మాణం పెద్ద భూగర్భ నెట్‌వర్క్ సృష్టించిందని అంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని డెరిన్‌కుయు అని పిలుస్తున్నారు.

డెరిన్‌‌కుయును 1963లో ఒక స్థానికుడు కనిపెట్టారు. ఆయన పెంపుడు కోళ్లు ప్రతిరోజు కనిపించకుండా మాయమవుతూ ఉండటం, వాటిని ఆయన వెతడకం ఈ భూగర్భ నగరాన్ని కనిపెట్టేందుకు దారి తీసింది.

ఆయన ఇంటిని పునర్నిర్మించుకుంటున్న సమయంలో ఏర్పాటు చేసిన ఒక ఖాళీ ప్రదేశం నుంచి ఆయన కోళ్లు రోజూ మాయమైపోతూ ఉండేవి. అయితే, అవి తిరిగి కనిపించేవి కావు. ఆయన ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించి భూమిని తవ్వి చూడగా భూమి లోపలకు వెళ్లేందుకు ఒక చీకటి మార్గం కనిపించింది.

ఆ తర్వాత మరో 600 ఇళ్ల లోపల నుంచి డెరిన్‌కుయు నగరానికి ప్రవేశద్వారాలు దొరికాయి.

ఈ ప్రవేశ మార్గాలను తవ్వకాలలో భూగర్భంలో దాగిన నివాసాలు, ఆహార నిల్వలు, పశువుల శాలలు, పాఠశాలలు, మద్యం దుకాణాలు, ఆఖరుకు ఒక ప్రార్ధనా మందిరం ఆనవాళ్లు కూడా కనిపించాయి. దీంతో, ఈ భూగర్భ నగరం సందర్శకుల తాకిడితో నిండిపోయింది.

1985లో ఈ ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చారు.

కప్పడోషియా

ఫొటో సోర్స్, Getty Images

ఈ నగర నిర్మాణం ఎప్పుడు జరిగిందనే విషయం కచ్చితంగా తెలియదు. క్రీస్తు పూర్వం 370లో ఏథెన్స్ కు చెందిన సెనో ఫోన్ రచించిన అనా బాసిస్ గ్రంధంలో ఈ నగరం ప్రస్తావన కనిపిస్తుంది.

ఈ పుస్తకంలో ఆయన కప్పడోషియా చుట్టుపక్కల భూగర్భంలో నివసిస్తున్న అనటొలియన్‌ల గురించి రాశారు.

ఈ ప్రాంతంలోని భూమిలో నీరు లేకపోవడంతో ఇలాంటి తవ్వకాలకు కప్పడోషియా అనువైన ప్రాంతమని ఫ్లోరిడా యూనివర్సిటీలో క్లాసికల్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియా డీ జియోర్ జీ చెప్పారు.

ఇక్కడున్న రాళ్లను సులువుగా మలిచే అవకాశముంది.

"ఈ ప్రాంత భౌగోళిక తత్త్వం భూగర్భ నిర్మాణాలకు అనువుగా ఉంది" అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, విదేశాలను తలదన్నే ఎన్నో టూరిస్ట్ స్పాట్‌లు విశాఖ జిల్లాలో.. చూశారా మీరు..

స్థానికంగా లభించే లైమ్‌ స్టోన్ మట్టి మెత్తగా ఉండటంతో మామూలు ఉలితో చెక్కడం చాలా సులభమైంది. ఈ నేల తీరు వల్లే చిమ్నీల మాదిరిగా కనిపించే రాతి శిలలు, లింగాకారంలో ఉన్న శిలా నిర్మాణాలు ఇక్కడ సహజంగా ఏర్పేడేందుకు తోడ్పడ్డాయి.

అయితే, ఈ నగరాన్ని ఎవరు సృష్టించారనేది ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ భూగర్భ నగర నిర్మాణానికి హిటైట్ లు నాంది పలికి ఉంటారని భావిస్తారు. వీళ్లు క్రీస్తు పూర్వం 1200లో ఫిర్ జియాన్ ల నుంచి దాడికి గురైనప్పుడు ఈ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టి ఉంటారని మెడిటరేనియన్ సొరంగాల అంశంలో నిపుణులు ఏ బెర్టినీ ఒక వ్యాసంలో రాశారు.

ఆయన సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఈ సొరంగాల్లో హిటైట్‌లకు చెందిన కొన్ని కళారూపాలు లభించాయి.

కానీ, ఈ నగరంలో ఎక్కువ భాగాన్ని ఫిర్‌జియాన్‌లు నిర్మించి ఉండవచ్చు. వీళ్లు ఇనుము యుగంలో అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్ లు. "విస్తృతమైన భూగర్భ సౌకర్యాలను నిర్మించే సాధనాలు వీరి దగ్గర ఉండేవి" అని డీ జియోర్జీ చెప్పారు.

పశ్చిమ అనటోలియా ప్రాంతంలో రాతి నిర్మాణాల పై భవనాలను రూపొందించి అద్భుతమైన రాతి ద్వారాలను నిర్మించే నైపుణ్యం వీరికి ఉంది. వీరి రాజ్యం డెరిన్ కుయుతో పాటు పశ్చిమ, మధ్య అనటోలియా అంతా విస్తరించి ఉండేదని అనుమానం" అని చెప్పారు.

డెరిన్‌కుయులో 18 అంతస్తుల్లో సొరంగాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

మొదట్లో డెరిన్‌కుయులో వస్తువులను భద్రపరచడానికి వాడేవారు. కానీ, ప్రధానంగా ఇది విదేశీ ఆక్రమణదారుల నుంచి రక్షించుకోవడానికి తాత్కాలిక స్థావరంగా ఉపయోగించటం మొదలయింది.

కపడోషియా కొన్ని దశాబ్దాలుగా బలమైన రాజ్యవంశాల అధీనంలో ఉండేది.

"క్రైస్తవ మతానికి చెందిన బైజాంటైన్ రాజ్యం పై ఇస్లామిక్ దాడులు మొదలైన 7వ శతాబ్దంలో ఈ భూగర్భ ఆవాసాలను పూర్తిగా వినియోగించుకున్నారు" అని డీ జియోర్‌జీ చెప్పారు.

ఈ ప్రాంతంలో ఫిర్ జియాన్ లు, పర్షియన్ లు, సెల్ జుక్ లు పాలించి ఈ భూగర్భ నగరాన్ని విస్తరించారు.

కానీ, బైజాంటైన్ పాలనలో డెరిన్‌కుయు జనాభా పెరిగి భూగర్భంలో సుమారు 20,000 మంది నివాసం ఉండగలిగే స్థాయికి చేరింది.

వీడియో క్యాప్షన్, తిరుపతి పక్కన, శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన అందాలు.. చూశారా..

ఈ భూగర్భ నగరాన్ని 270 రూపాయలు చెల్లించి చూడవచ్చు.

తేమతో నిండిపోయి, ఇరుకుగా ఉన్న సొరంగాలు, కొన్ని దశాబ్దాల పాటు కాగడాల మంటతో నల్లగా మారిన గోడలను చూడగానే, లోపల ఇరుక్కుపోయిన భయం ఆవరించింది. కానీ, డెరిన్ కుయును పాలించిన రాజ్యాలన్నీ కళ్ల ముందు కనిపించాయి.

ఇరుకుగా ఉన్న ప్రవేశ ద్వారాల లోంచి లోపలకు వెళ్లడం కష్టంగా అనిపించింది.

దీపాల వెలుగులో ఉన్న అర టన్ను బరువున్న గుండ్రని రాళ్లు సొరంగం లోపల ఉన్న 18 అంతస్తులకు మధ్య తలుపుల్లా అమర్చి ఉన్నాయి. వాటిని లోపల వైపు నుంచి మాత్రమే కదల్చగలరు. బయట నుంచి దాడి చేసే వారిని సులభంగా కనిపెట్టేందుకు వీలుగా ఈ రాళ్ల మధ్యలో రంధ్రాలు ఏర్పాటు చేశారు.

"అయితే భూగర్భంలో నివాసం ఉండటం చాలా దుర్లభంగా ఉండేది" అని నా గైడ్ సల్మాన్ చెప్పారు. ఇక్కడుండే మనుషులు కాలకృత్యాలు కోసం సీలు చేసిన మట్టి జాడీలను ఉపయోగించేవారు. కాగడాల వెలుగులోనే కాలం గడుపుతూ, ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో ఖననం చేసేవారు.

ఈ భూగర్భ నగరంలో నిర్మించిన ప్రతీ అంతస్తుకు ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించేవారు. పాడి పశువులను భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పశువులశాలల్లో కట్టేవారు. నగరం లోపల నివాస స్థలాలు, సెల్లార్ లు, పాఠశాలలు, సమావేశ ప్రాంగణాలు ఉన్నాయి.

ఈ సెల్లార్ లలో వైన్ ఉత్పత్తి చేసేవారని తెలుస్తోందని డీ జియోర్జీ అన్నారు.

ఇవన్నీ చూస్తుంటే ఈ భూగర్భ నగరంలో కొన్ని నెలల పాటు గడిపేందుకు డెరిన్‌కుయు వాసులు సిద్ధమై ఉండేవారని ఆయన అంటారు.

బయట నుంచి దాడి చేసే వారిని సులభంగా కనిపెట్టేందుకు వీలుగా గుండ్రని రాళ్ల మధ్యలో రంధ్రాలు ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ భూగర్భ నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన వెంటిలేషన్ విధానం, నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మంచి నీటి బావి ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈ రెంటి చుట్టూ డెరిన్‌కుయు నిర్మాణం కేంద్రీకృతం అయి ఉండవచ్చని భావిస్తారు. ఇక్కడున్న 50కి పైగా వెంటిలేషన్ షాఫ్ట్‌లు భూగర్భ నగరమంతా గాలి సమానంగా వీచేటట్లు సహాయపడేవి.

ఇందులో బావిని 55 మీటర్ల లోతులో తవ్వారు.

డెరిన్‌కుయు ఒక్కటే కపడోషియాలో ఉన్న ఏకైక భూగర్భ నగరం కాదు.

445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరం అనటోలియన్ భూభాగంలో ఉన్న 200 నగరాల్లో అతి పెద్దది.

ఈ నగరానికి చేరేందుకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన 600కు పైగా సొరంగ మార్గాలున్నాయి. భూగర్భం నుంచి బయటకు వచ్చేందుకు అత్యవసర మార్గాలు కూడా ఉన్నాయి.

అయితే, కపడోషియా భూగర్భ రహస్యాలను ఇంకా పూర్తిగా బయటికి రాలేదు.

2014లో నెవ్‌సెహిర్ ప్రాంతంలో మరింత పెద్ద, పటిష్టమైన భూగర్భ నగరాన్ని కనిపెట్టారు.

డెరిన్‌కుయు నగరాన్ని కపడోషియన్ గ్రీకులు వదిలిపెట్టి వెళ్లడంతో ఇది 1923లో కనుమరుగైంది.

ఈ నగర నిర్మాణం జరిగిన 2,000 ఏళ్ళ తరువాత 1923లో దాన్ని విడిచిపెట్టారు. కొన్ని అల్లరి కోడి పిల్లలు ఈ భూగర్భ నగరాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఒక చారిత్రక వైభవం ఆధునిక ప్రపంచానికి పరిచయమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)