Agnipath Scheme: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అగ్నిపథ్ అగ్నివీర్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"ఆగస్టు 14 నుంచి ఆగస్టు 31 వరకు అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా విశాఖలో జరగనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి అవసరమయ్యే టెంట్లు, టేబుళ్లు, బారికేడ్లు, స్టేషనరీ, మంచినీళ్లు, భోజనాలు, రవాణా వంటి సౌకర్యాలకు కోటిన్నర రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. ఈ ఖర్చుల విషయంలో కార్పొరేట్ యాజమన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జిల్లా యంత్రాగానికి ఆర్థిక సహకారం కనీసం రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా అందిచాలని కోరుతున్నాం" అని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ జూలై 29న రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రతిష్మాత్మకంగా నిర్వహించే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలకు కేంద్ర రక్షణశాఖ నిధులు ఇవ్వదా? ఏ రాష్ట్రం పరిధిలో ఈ ర్యాలీలు జరిగితే, వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమైనా నిధులు సమకూర్చదా? కార్పొరేట్ కంపెనీలను అడగాల్సిన అవసరం ఎందుకు?

'18 రోజుల ర్యాలీ.. రూ. కోటిన్నర పైగా ఖర్చు'

కోవిడ్ తర్వాత ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలు పెద్దగా జరగలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీం తెచ్చింది. ఇందులో ఎంపికైన వారిని అగ్నివీరులు అని పిలుస్తారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో వివిధ విభాగాలలో పని చేయొచ్చు.

ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. ప్రతిభ ఉన్న వారిని సెలెక్ట్ చేసి, మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందికి ఆర్మీ రెగ్యులర్ రిక్రూట్ మెంట్ తరహాలో రెగ్యులరైజ్ చేస్తారు. వారు 15 సంవత్సరాల పాటు వివిధ విభాగాలలో నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

అగ్నివీరుల ఎంపిక కోసం రిక్రూట్ మెంట్ ర్యాలీ విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్టు 14 నుంచి 18 రోజుల పాటు జరుగుతుంది.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అగ్నిపథ్ అగ్నివీర్

"విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసు, విశాఖ జిల్లా అధికార యంత్రాగం కలిసి ఈ అగ్నివీరుల ఎంపిక ర్యాలీని నిర్వహిస్తోంది. ఇది 18 రోజుల పాటు జరుగుతుంది. ఆర్మీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం రోజుకు 4 నుంచి 5 వేల మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. అంటే 18 రోజులకు సుమారు 70 వేల నుంచి 90 వేల మంది పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నివీరుల ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ విశాఖ వస్తారు. ర్యాలీకి హాజరయ్యే వారికి భోజనం, తాగునీరు, వసతి, రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు ర్యాలీ జరిగే చోట పోలీసు బందోబస్తు, బారికేడ్లు, స్పీకర్లు వంటివి కూడా అవసరం" అని జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున రాసిన లేఖలో ఉంది.

"వీటన్నింటికి 18 రోజులకు రూ. 1, 54, 04,100 అవుతుందని అంచనా. ఈ ఖర్చుని కార్పొరేట్ కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటిలో భాగంగా కనీసం రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా అందించాలని కోరుతున్నాం" అని విశాఖ జిల్లా కలెక్టర్ లేఖలో పేర్కొన్నారు.

ఆర్మీ నియామకాల నిర్వణ ఖర్చు భరించాల్సింది ఎవరు?

దేశంలో ఆర్మీకి సంబంధించిన ఏ రిక్రూట్ మెంట్ ర్యాలీ అయినా అది ఎక్కడ జరుగుతుందో అక్కడున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసుల (ఏఆర్వో) పరిధిలోకి వస్తాయి. అంటే వారే ఈ ర్యాలీలను నిర్వహిస్తారు. ఇందుకు ఆ రాష్ట్ర/జిల్లా యంత్రాంగం సపోర్ట్ చేస్తుంది.

ప్రధానంగా అయా రాష్ట్రాల లేదా జిల్లాల యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయి. అయితే ఆర్మీ ఉద్యోగాల్లో ప్రాధమికంగా దేశ దారుడ్య పరీక్షలు జరుగుతాయి. దీనికి స్థానిక అధికార యంత్రాంగం సహకారం అవసరం, అందుకే ఏఆర్వోలు, స్థానిక యంత్రాంగం కలిసి ఈ ర్యాలీలను నిర్వహిస్తాయి.

"దేశ వ్యాప్తంగా కొన్ని జిల్లాలను కలిపి, అక్కడ ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసులను రక్షణ శాఖ నిర్వహిస్తుంది. అలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, గుంటూరులలో, తెలంగాణలో సికింద్రాబాద్ లో ఉన్నాయి. ఇక్కడ గతంలో జరిగిన ఒక్కో ర్యాలీలో కనీసం 50 వేల మంది, గరిష్ఠంగా లక్ష మంది పాల్గొనేవారు. ఇలాంటి ర్యాలీలకు హాజరయ్యే వారికి కావలసిన సదుపాయాలన్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తే, ఆర్మీ అధికారులు రిక్రూట్ మెంట్ ర్యాలీలు పూర్తి చేస్తారు. సాధారణంగా వీటికి అయ్యే ఖర్చుని ఆ ర్యాలీ జరిగే జిల్లాల యంత్రాంగమే భరిస్తుంది" అని రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి వెంకట రమణ బీబీసీతో చెప్పారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అగ్నిపథ్ అగ్నివీర్

'ఇదేమి తొలిసారి కాదు'

సాధారణంగా ప్రతి ఆరు లేదా మూడు నెలలకు ఒక ఆర్మీ ర్యాలీ ఆ జోనల్ లేదా ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీస్ పరిధిలో జరగుతూ ఉండేవి. దేశంలో 2020-21లో 97 ర్యాలీలు, 2021-22లో 87 ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నా కోవిడ్ కారణంగా మొత్తం 47 మాత్రమే నిర్వహించారు. ఇప్పుడు కేంద్రం అగ్నిపథ్ స్కీంతో ముందుకు వచ్చింది. వీటిని కూడా ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసులే నిర్వహిస్తున్నాయి.

"ఏఆర్వోలు ర్యాలీలు నిర్వహించినప్పుడు వాటికి అవసరమయ్యే మౌలిక సుదపాయలు, ఇతర ఏర్పాట్లను జిల్లా యంత్రాంగమే చూస్తుంది. గతేడాది గుంటూరులో జరిగిన ర్యాలీలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అగ్నిఫథ్ స్కీంలో కూడా అగ్నివీరుల ఎంపిక అదే విధంగా జరుగుతోంది. ఇలా జరగడం ఇదేమి మొదటి సారి కాదు, నేను ఆర్మీలో చేరినప్పటీ నుంచి చూస్తూనే ఉన్నాను. ర్యాలీలు జరిగే ప్రదేశం అయా జిల్లా యంత్రాంగం పరిధిలో ఉంటుంది కాబట్టి, వారి సహకారాన్ని ఆర్మీ అధికారులు కోరుతారు" అని విశాఖ ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయం ఉద్యోగి ఒకరు తెలిపారు.

"ఒక ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయ సిబ్బందిగా మేం మాపైనున్న జోనల్ కార్యలయం ఇచ్చే ఆదేశాలు అమలు చేస్తాం. ఇప్పుడు నిర్వహిస్తున్న అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ కూడా అటువంటిదే. ఇతర ఆర్థిక సహకారం వంటి విషయాలు చెన్నైలోని జోనల్ రిక్రూట్ మెంట్ కార్యాలయం చూస్తుంది. జిల్లా యంత్రాంగం ఏదైనా సమచారం కోరినా, అది మేం అక్కడ నుంచి తీసుకునే ఇవ్వాలి" అని ఆ ఉద్యోగి తెలిపారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున
ఫొటో క్యాప్షన్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున

‘విరాళాలు తప్పనిసరి కాదు, స్వచ్ఛందమే’ - కలెక్టర్

అగ్నిపథ్ స్కీంలో అగ్నివీరుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ర్యాలీకి ఆర్థిక సహాయం కోరడంపై విశాఖ జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జునతో బీబీసీ మాట్లాడింది.

"ఇలాంటి విషయాల్లో సహాయం ఎవరైనా చేయవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీసే. ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు. విశాఖపట్నంలో జరుగుతున్న ర్యాలీ కాబట్టి దీనికి మా జిల్లా యంత్రాంగం సహకరిస్తుంది. అది మ్యాన్ పవరైనా, ఆర్థిక అవసరాలైనా. కార్పొరేట్ కంపెనీల నుంచి వారు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఖర్చు చేసే వాటిని ఈ అవసరం కోసం కూడా ఇవ్వమని కోరాం. అది స్వచ్ఛందమే. ఇవ్వాలని ఆర్డరు మాత్రం కాదు. వ్యక్తిగతంగా కూడా ఎవరైనా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయాలన్నా చేయవచ్చు" అని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బీబీసీతో చెప్పారు.

'విరాళాలు రాకపోతే ప్రభుత్వమే భరిస్తుంది'

"నేను పని చేసిన మూడు, నాలుగు చోట్ల ఆర్మీ ర్యాలీలు నిర్వహించాం. వాటికి కూడా గతంలో ఇలాగే ఆర్థిక సహకారం కోరాం. అయితే ఆర్థిక సాయం అందినా, అందకపోయినా ర్యాలీ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇటువంటి ర్యాలీలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదు. కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఎప్పుడు జరిగినా కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే యువతకు అవకాశాలు ఉంటాయి. అందుకే దీనికి అయా జిల్లాల సహకారం ఉంటుంది. ఇది దేశ రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి, ఎవరికైనా ఆసక్తి ఉంటే వారు కూడా సహాయం చేయవచ్చు" అని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు.

"కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఆర్మీకి కార్పొరేట్ కంపెనీలు సహాయం చేయడం ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ఖచ్చితంగా చేయాలని ఏమి లేదు. ఈ ర్యాలీ నిర్వహణఖు కావాలసిన ఆర్థిక సహకారం అనుకున్నంత వచ్చినా, రాకపోయినా...ర్యాలీ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు రానివ్వం. దానికి తగ్గ ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది" అని కలెక్టర్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఏపీ: 'జవాన్ కాలేకపోయా..కానీ ఆయుధాలు తయారు చేస్తున్నా..'

యువజన మంత్రిత్వ శాఖ స్పందన..

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో యువజన మంత్రిత్వ శాఖ ఉంది. ఈ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో డిపార్ట్ మెంట్ ఆఫ్ యూత్ అడ్వాన్స్ మెంట్ పేరుతో నడుస్తోంది. దీనికి మంత్రిగా ఆర్కే రోజా సెల్వమణి ఉన్నారు.

విశాఖపట్నంలో జరగనున్న అగ్నిపథ్ స్కీం ర్యాలీకి యువజనశాఖ ఆర్థిక వనరులు సమకూర్చే విషయంపై స్పందన కోరేందుకు మంత్రితో పాటు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వాణి మెహన్ ను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం బీబీసీ చేసింది. అయితే వారు ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.

వీడియో క్యాప్షన్, అగ్నిపథ్ స్కీమ్‌పై ఈ నిరసనలకు కారణమేంటి? దేశ వ్యాప్తంగా ఎందుకింత అగ్ని రాజేసింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)