అగ్నిపథ్ యోజన: అగ్నివీరుల భవిష్యత్‌పై 10 ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు

అగ్నిపథ్ యోజన

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సైన్యంలోని మూడు విభాగాల్లో నియామకాల కోసం అగ్నిపథ్ యోజనను వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఇది చాలా గొప్ప పథకమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, చాలా వర్గాల నుంచి దీనిపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

గత వారం రోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో విధ్వంసకర నిరసనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలలో రైళ్లకు నిప్పు కూడా పెట్టారు.

నిరసనల నడుమ సీనియర్ సైన్యాధికారులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి పథకంపై వివరణ ఇచ్చారు. ఇది చాలా మంచి పథకమని వారు చెప్పారు.

మరోవైపు వెంటనే నియామక ప్రక్రియలు కూడా మొదలుకాబోతున్నట్లు సైన్యం కూడా ప్రకటించింది. అగ్నివీరుల నియామకంపై వాయు సేన సోమవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకానికి సంబంధించిన పది కీలక అంశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీ కోసం..

అగ్నిపథ్ యోజన

ఫొటో సోర్స్, ANI

లైన్

1. ప్రశ్న: అగ్నిపథ్ పథకం ఏమిటి? దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

లైన్

సమాధానం: జవాన్లు, ఎయిర్‌మెన్, సెయిలర్లు లాంటి నియామకాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని కోసం సైన్యం, నావికా దళం, వాయు సేన విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తాయి.

జవాన్లలో ప్రాథమిక స్థాయి నియామకాలకు సంబంధించి ఇతర నియామక పథకాలను ఇక్కడితో నిలిపివేస్తారు.

మీ వయసు 17.5 ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్య ఉంటే ఈ పథకం కింద మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ గత రెండేళ్లుగా నియామక పరీక్షలు జరగలేదు. అందుకే ఈ ఒక్క ఏడాదికిగాను గరిష్ఠ వయో పరిమితిని రెండేళ్లు పెంచారు.

అంటే ప్రస్తుత నోటిఫికేషన్‌కు గరిష్ఠంగా 23ఏళ్ల వయసు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అగ్నిపథ్ యోజన

ఫొటో సోర్స్, Getty Images

లైన్

2. ప్రశ్న: అధికారుల నియామకాలు కూడా అగ్నిపథ్ పథకం కిందే జరుగుతాయా?

లైన్

సమాధానం: లేదు. ఆఫీసర్ స్థాయి నియామకాలు ఈ పథకం కింద జరగవు.

వారి నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక ప్రక్రియలు కొనసాగుతాయి.

లైన్

3. ప్రశ్న: ఈ పథకం కింద ఎంత మంది జవాన్లు సైన్యంలో చేరొచ్చు?

లైన్

సమాధానం: రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, తొలి ఏడాది సైన్యంలోని మూడు విభాగాల్లో కలిపి మొత్తంగా 46,000 మందిని తీసుకుంటారు.

వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్య 50,000 నుంచి 60,000కు పెరుగుతుంది.

ఆ తర్వాత ఏళ్లలో దీన్ని 90,000 నుంచి 1.20 లక్షలకు పెంచుతారు.

అగ్నిపథ్ యోజన

ఫొటో సోర్స్, ANI

లైన్

4. ప్రశ్న: ప్రస్తుతం సైన్యంలోని మూడు విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వీటిలో ఎన్నింటిని అగ్నిపథ్ కింద భర్తీ చేస్తారు?

లైన్

సమాధానం: డిసెంబరు 2021 నాటికి మొత్తంగా సైన్యంలో 97,177, నావికా దళంలో 11,166, వాయు సేనలో 4,850 జవాను పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ నియామకాలు చేపట్టడకపోవడం వల్లే ఇన్ని ఖాళీలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఏటా కొంతమంది జవాన్లు తమ సర్వీసు పూర్తవడంతో పదవీ విరమణ తీసుకుంటారు. మరికొందరు ముందస్తుగానే పదవీ విరమణ తీసుకుంటారు.

ఒక్క సైన్యంలోనే ఏటా 60,000 మంది పదవీ విరమణ తీసుకుంటారు. దీనికి అదనంగా 14,000 మంది ముందస్తు పదవీ విరమణ కోరుకుంటారు.

అయితే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులన్నీ అగ్నిపథ్ పథకం కింద భర్తీ చేయరు.

లైన్

5. ప్రశ్న: అగ్నిపథ్ పథకం కింద విధుల్లోకి చేరే జవాన్ల వేతనాలు, ఇతర అలవెన్సులు మిగతా జవాన్ల కంటే భిన్నంగా ఉంటాయా?

లైన్

సమాధానం: మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి ఇచ్చే అలవెన్సులు, ప్రయాణ భృతి, ఇతర అలవెన్సుల్లో ఎలాంటి తేడా ఉండబోదని సైన్యాధికారులు చెప్పారు.

అయితే, అగ్నిపథ్ పథకం కింద చేరేవారికి డియర్‌నెస్ అలవెన్సు, మిలటరీ సర్వీస్ పే ఇవ్వరు.

అగ్నిపథ్ యోజన

ఫొటో సోర్స్, Getty Images

లైన్

6. ప్రశ్న: నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులకు పింఛను, గ్రాట్యుటీ లాంటి సదుపాయాలు కల్పిస్తారా?

లైన్

సమాధానం: సర్వీసులో ఉండేటప్పుడు క్యాంటీన్‌తోపాటు ఇతర ఆరోగ్య సదుపాయాలన్నీ ఉంటాయని సైన్యం వెల్లడించింది.

అయితే, నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత వీరికి పింఛను లేదా గ్రాట్యుటీ లాంటి సదుపాయాలు ఉండవు. మాజీ జవాన్లకు ఇచ్చే వైద్య, క్యాంటీన్ సదుపాయాలు కూడా వీరికి ఇవ్వరు.

లైన్

7. ప్రశ్న: అగ్నివీరులకు పదోన్నతులు ఉంటాయా?

లైన్

సమాధానం: అగ్నివీరులను సైన్యంలో ప్రత్యేక ర్యాంకుగా గుర్తిస్తారు.

నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కొంతమందిని పూర్తికాల జవాన్లుగా తీసుకుంటారు. అప్పుడు వీరికి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) నిబంధనలు వర్తిస్తాయి.

వీడియో క్యాప్షన్, అగ్నిపథ్ పథకంపై 10 సందేహాలు, వాటికి సమాధానాలు
లైన్

8. ప్రశ్న: ఇతర జవాన్లలానే అగ్నివీరులకూ గుర్తింపు ఉంటుందా?

లైన్

సమాధానం: ఉంటుంది. అగ్నివీరులకు ప్రత్యేక బ్యాడ్జిలు ఇస్తారు. ఇవి పూర్తికాల జవాన్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి.

సర్వీసులో ఉండేటప్పుడు మిగతా పూర్తికాల జవాన్లలానే అగ్నివీరులకూ గుర్తింపు, గౌరవం దక్కుతాయి.

లైన్

9. ప్రశ్న: సియాచిన్, జలాంతర్గాములు లాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అగ్నివీరులతో పనిచేయిస్తారా?

లైన్

సమాధానం: విధులు, బదిలీల విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండబోవని సైన్యంలోని మూడు విభాగాలు స్పష్టంచేశాయి.

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు
లైన్

10. ప్రశ్న: నిరసనల నడుమ భిన్న మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు రాలేదని చెప్పొచ్చా?

లైన్

సమాధానం: ఈ పథకాన్ని విమర్శిస్తున్న చాలా మంది ఇదే అంటున్నారు.

అయితే, రక్షణ శాఖ మొదట ఈ పథకాన్ని ప్రకటించిన తర్వాత, దీనికి అనుబంధంగా మిగతా మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తాయని, అంతా సమన్వయంతో ముందుకు వెళ్తామని ముందే ప్రణాళిక వేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు అగ్నివీరులకు ప్రాధాన్యమిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశముందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)