'మాచర్ల నియోజక వర్గం' రివ్యూ: కమర్షియల్ హంగుల్లో మరుగున పడిన కథ

ఫొటో సోర్స్, @actor_nithiin
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కమర్షియల్ సినిమా అంటే ఏమిటి? ఈ విషయంలో ఇంకా కొంతమంది దర్శకులకు, హీరోలకు క్లారిటీ రాలేదేమో అనిపిస్తోంది. హీరో ఇంట్రడక్షన్, పాటలు, ఫైటులు, విలన్ తో ఛాలెంజ్‌లూ.. ఇదే కమర్షియల్ సూత్రమని నమ్ముతున్నారు.
పాటలూ, ఫైట్లూ.. వీటి మధ్య కథ, బలమైన పాత్రలు, సంఘర్షణ ఇవన్నీ అవసరమని అనిపించకపోవడం కొన్ని సినిమాల పాలిట శాపంగా మారుతోంది. ఆర్.ఆర్.ఆర్ , పుష్ఫ, కేజీఎఫ్ పక్కా కమర్షియల్ కథలు. వీటిలో పాటలూ, ఫైట్లకు లోటు లేదు.
కానీ.. అవి మాత్రమే ఆయా సినిమాలకు విజయాలు కట్టబెట్టలేదు. వాటిలో బలమైన పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల్ని కలుపుతూ ఓ కథ ఉంది. క్యారెక్టరైజేషన్లు కనిపించాయి. అందుకే ఆ సినిమాలు హిట్టయ్యాయి.
కేవలం పాటలూ, పోరాటాలే కమర్షియాలిటీ అనుకొంటే మాత్రం.. ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం...`మాచర్ల నియోజక వర్గం`.

ఫొటో సోర్స్, Macherla Niyojakavargam/FB
టీనేజ్ కుర్రాడి నుంచి కలెక్టర్ వరకూ
మాచర్లలో రాజప్ప (సముద్రఖని) రాజకీయంగా చక్రం తిప్పుతుంటాడు. ముఫ్పై ఏళ్లుగా అక్కడ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుంటాయి. తనకు అడ్డొచ్చిన కలెక్టర్లని కూడా దారుణంగా చంపేస్తుంటాడు. కట్ చేస్తే.. విశాఖపట్నంలో చాలా సరదాగా, చలాకీగా తిరిగేసే అబ్బాయి సిద్దార్ధ్ (నితిన్). ఐఏఎస్ పూర్తి చేసి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటాడు.
తనకు బీచ్‌లో స్వాతి (కృతిశెట్టి) అనే అమ్మాయి కనిపిస్తుంది. తొలి చూపులోనే స్వాతిని ఇష్టపడతాడు. స్వాతిది కూడా మాచర్లే. తను ఓ పని మీద విశాఖ పట్నం వస్తుంది. సిద్దార్థ్ దూకుడు చూసి ఇష్టపడుతుంది. అయితే.. సిద్దార్థ్ కి చెప్పకుండానే తిరిగి మాచర్ల వెళ్లిపోతుంది. అక్కడకు వెళ్లేసరికి స్వాతి ప్రమాదంలో ఉందని తెలుస్తుంది.
రాజప్ప మనుషులు..స్వాతిని చంపడానికి వెంటపడతారు. అసలు స్వాతికీ, రాజప్ప మనుషులకూ ఉన్న విరోధం ఏమిటి? స్వాతి విశాఖపట్నం ఎందుకు వచ్చింది? అదే కర్నూలు జిల్లాకి కలెక్టరుగా వెళ్లిన సిద్దార్థ్.. మాచర్లలో పరిస్థితులు చక్కబెట్టాడా, లేదా? అక్కడ ఎన్నికలు నిర్వహించగలిగాడా, లేదా? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, @actor_nithiin
ఫక్తు సూత్రాలు.. రొటీన్ సన్నివేశాలు
రొటీన్ కథలపై ఓ జోకు ఉంది. కట్ చేస్తే ఫైటు..కట్ చేస్తే పాట అని సరదాగా అంటుంటారు. ఆ జోకుని.. ఈ సినిమాతో కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి నిజం చేశాడు.
హీరోయిన్‌ని ఆట పట్టిస్తున్న రౌడీలు, వాళ్లని అడ్డుకుని హీరో చితగ్గొట్టడం, తన హీరోయిజం చూపించడం, వెంటనే ఓ పాట వేసుకోవడం- చాలా చాలా తెలుగు సినిమాల్లో చూశాం.
ఇప్పుడు మళ్లీ అలాంటి సీన్‌తోనే హీరోని పరిచయం చేసి, తాను ఇంకా పాత సినిమాల కాలంలోనే ఉన్నానని.. తొలి రీల్ లోనే నిరూపించుకొన్నాడు దర్శకుడు. అక్కడి నుంచి అంతా ఫక్తు పాత సినిమా సూత్రాలపై అల్లుకొన్న సీన్లే.
హీరోయిన్‌ని చూడడం.. వెంటనే ప్రేమలో పడిపోవడం, కట్ చేస్తే... అదే హీరోయిన్ యాధృచ్చికంగా హీరో పక్కింట్లోనే దిగడం.. ఇలా సినిమా అంతా వినూత్నం, వైవిథ్యం అనే పదాలకు ఆమడ దూరంలోనే సాగిపోతుంటుంది.
అసలు ఈ సినిమా కథ...హీరో-విలన్ మధ్య సంఘర్షణ మాత్రమే. మాచర్లలో తిరుగేలేని రెడ్డప్పని ఎదిరించి అక్కడ ఎన్నికలు నిర్వహించడం...ఇది మాత్రమే. అయితే ఫస్టాఫ్ అంతా.. అర్థం పర్థం లేని కామెడీ, లవ్ ట్రాకుతో నడిపేశాడు. ఇంట్రవెల్ వరకూ అసలు కథలోకి వెళ్లలేదు దర్శకుడు. రాసుకొన్న కథ రేఖామాత్రం అయినప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉంటుంది.
అయితే ఆ ఫిల్లింగ్ సీన్లయినా.. బాగుండేలా చూసుకోవాలి. `మాచర్ల...` విషయంలో అది జరగలేదు. గుంతలకిడి గుర్నాథంలా..వెన్నెల కిషోర్ ని రంగంలోకి దించారు. ఈగో తో కామెడీ పండించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది దారుణంగా బెడసి కొట్టింది.
సాధారణంగా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. తన దగ్గర డైలాగ్ లేనప్పుడు కూడా...నవ్వించగలడు. కానీ ఈ సినిమాలో మాత్రం పేజీల కొద్దీ డైలాగులు చెబుతాడు. అయినా, నవ్వు రాదు.
వెన్నెల కిషోర్ కనిపించగానే నవ్వడం అలవాటైన ప్రేక్షకులు కూడా ఈసారి మాత్రం వెన్నెల కిషోర్ కనిపిస్తే భయపడతారు. ఆ స్థాయిలో ఆ పాత్రని తీర్చిదిద్దారు. పైగా ఎయిటీస్ విలన్ టైపులో మేనరిజం ఒకటి.
రెండో హీరోయిన్ నిధి గా...కేథరిన్ కనిపిస్తుంది. ఆ పాత్రకు మేకప్ ఎక్కువ. కాస్ట్యూమ్స్ తక్కువ. అసలు ఇలాంటి పాత్రని డిజైన్ చేయడంలో అర్థం పరమార్థం ఏమిటో దర్శకుడికే తెలియాలి. సినిమాని ఇంటర్వెల్ వరకూ లాక్కురావడానికి దర్శకుడు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.

ఫొటో సోర్స్, Macherla Niyojakavargam/FB
ద్వితీయార్థం.. అంతే నిరర్థకం
పోనీ ద్వితీయార్థం నుంచైనా కథ ముందుకు సాగుతుందనుకొంటే అదీ లేదు. అసలు కలెక్టరేంటి? కలెక్టర్ విషయంలో పాటించే ప్రోటోకాల్ ఏమిటి? అనే విషయాలపై దర్శకుడికి కనీస అవగాహన లేదేమో అనిపిస్తోంది.
ఓ ఎమ్మార్వో (బ్రహ్మాజీ)కీ కలెక్టర్ (నితిన్)కీ మధ్య జరిగే సంభాషణ చూస్తుంటే అసలు స్క్రిప్టుపై దర్శకుడు సరిగా హోంవర్క్ చేయలేదనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో కలెక్టర్ గా కంటే ఓ మాస్ హీరోగానే ప్రవర్తిస్తుంటాడు. అలాంటప్పుడు హీరో కలెక్టర్ అవ్వడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటో అర్థం కాదు.
రూల్స్ ని అడ్డుపెట్టి, అసలు ఎవరికీ తెలియని చట్టాలు బయట పెట్టి, తన బుర్రతో మైండ్‌గేమ్ ఆడి, రెడ్డప్పని తికమక చేసినప్పుడు కదా..అసలైన హీరోయిజం బయటకు వచ్చేది. అదంతా పక్కన పెట్టి, ఓ కలెక్టర్ రోడ్డు మీదకొచ్చి ఫైట్లు చేస్తుంటే, జాతర్లో ఐటెమ్ గాళ్‌తో డాన్స్ చేస్తుంటే మన సినిమా ఇక్కడే ఆగిపోయిందేంటి? అనే బాధ కలుగుతుంది.
సెకండాఫ్‌లో కామెడీకి కరువొచ్చిందన్న ఫీలింగ్ తో వెన్నెల కిషోర్ ని మళ్లీ రంగంలోకి దింపారు. ఈసారి అతనిపై సన్నివేశాలు తక్కువ ఉండడం వల్ల.. ప్రేక్షకులకు బాధ తప్పింది. క్లైమాక్స్ లో కూడా అంతే. ఈ సినిమాని ఎంత రొటీన్ గా మొదలెట్టాడో, అంతే రొటీన్ గా ముగించాడు.
సినిమా మొత్తమ్మీద.. ఒక్కటంటే ఒక్క చోట కూడా `దర్శకుడు తెలివిగా ఆలోచించాడు`, `ఈ సీన్ బాగా తీశాడు` అని మచ్చుకి కూడా అనిపించదు. ఓ కొత్త దర్శకుడికి నితిన్ అవకాశం ఇచ్చాడంటే, తన బ్యానర్‌లోనే సినిమా తీస్తున్నాడంటే.. ఆ దర్శకుడేదో కొత్త పాయింట్ తో నితిన్ ని మెప్పించాడన్న ఆశ కలుగుతుంది.
అయితే ఈ సినిమా అంతా చూశాక.. నితిన్ ఈ కథకు ఎలా పడిపోయాడబ్బా? అనే డౌటు వస్తుంది.

ఫొటో సోర్స్, @MeherRamesh
నితిన్ ఒక్కడే తన భుజాలపై
నితిన్ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లయ్యింది. ఈ 20 ఏళ్లలో హిట్లు కొట్టాడు. ఫ్లాపులూ తిన్నాడు. అయితే తన సొంత బ్యానర్‌లో సినిమా చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు.
ఈ సినిమా సొంత నిర్మాణ సంస్థలో తీసిందే. కానీ ఆ జాగ్రత్త కనిపించలేదు. ఇరవై ఏళ్లుగా నటుడిగా ఏం చేశాడో, ఈ సినిమాలోనూ అదే చేశాడు. డాన్సుల్లో అదే స్పీడు. సీన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించేటప్పుడు అదే జోరు. కానీ.. బలహీనమైన కథలో నితిన్ కష్టం వృథా అయ్యింది.
కృతిశెట్టిది కూడా పెద్దగా చెప్పుకోదగిన పాత్ర కాదు. వెన్నెల కిషోర్ కి లెంగ్తీ పాత్రే దక్కింది.కానీ ఉపయోగం లేకుండాపోయింది. సముద్రఖని విలనిజమైనా కాపాడుతుందనుకుంటే అదీ జరగలేదు. సముద్రఖని గెటప్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ.. తమిళ సినిమా శైలిలో ఉన్నాయి తప్పితే.. తెలుగు స్టైల్ కనిపించలేదు.
అసలు సముద్రఖనిని డ్యూయల్ రోల్ లో చూపించాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో అర్థం కాదు. దాని వల్ల సినిమాకొచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. రాజేంద్రప్రసాద్, మురళీ శర్మలవి మరింత రొటీన్ పాత్రలు. అంజలి ఐటెమ్ గాళ్‌గా తెరపై కనువిందు చేయడానికి తన వంతు ప్రయత్నం చేసింది.

ఫొటో సోర్స్, Macherla Niyojakavargam/FB
ఫైట్ల బొనాంజ
ఈ సినిమాలో ఫైట్లకు లెక్కేలేదు. మాటి మాటికీ వచ్చి పడిపోతుంటాయి. కానీ ఫైటుకి ముందు ఉండాల్సిన ఎమోషన్ మాత్రం ఎక్కడా కనిపించదు. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం బాగానే డిజైన్ చేశారు.
పాటల్లో `రా.. రా..రెడ్డి` ఒక్కటే ఊపు తెస్తుంది. అక్కడ కూడా `రాను రానంటూనే చిన్నదో` ని గుర్తు చేస్తే తప్ప జోష్ రాలేదు. రీ రికార్డింగ్ లో ఓ చోట..విక్రమ్ ఆర్.ఆర్. బిట్ ని వాడుకొన్నారు. ఇలా పాత సినిమాల పాటల్ని, ఆర్.ఆర్ బిట్లనీ వాడుకుంటే తప్ప సీన్ లు పండవని దర్శకుడు ముందే గ్రహించాడన్నమాట.
దర్శకుడిగా రాజశేఖర్‌కి ఇది తొలి చిత్రం. అయితే ఎడిటర్ గా తనకు చాలా అనుభవం ఉంది. ఈ సినిమాకి కేవలం ఆయన దర్శకుడిగా కాకుండా ఎడిటర్ గా పనిచేసినా, తనకు తానే నిష్పక్షపాతంగా వ్యవహరించినా, సగం సీన్లు తీసేసి, కొత్తగా మళ్లీ తెరకెక్కించమని చెప్పేవాడేమో..?
ప్రపంచ సినిమా మారింది. ఆ మార్పు ఎలా ఉందో.. ఓటీటీల రూపంలో తెలుగు ప్రేక్షకుడు గ్రహిస్తున్నాడు. ఇప్పటికీ ముతక కథల్ని, ఫక్తు కమర్షియల్ సూత్రాలను నమ్ముకొని సినిమాలు తీయడం.. ఆత్మహత్యా సదృశ్యమే.
థియేటర్లకు జనం రావడం లేదని దర్శక నిర్మాతలు గొంతు చించుకోవడం మాత్రమే కాదు, వాళ్లేం తీస్తున్నారో, ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నారో గ్రహించాల్సిన అవసరం దర్శక నిర్మాతలపై చాలా ఉంది. వాణిజ్య చిత్రమంటే..ఫైట్లూ, పాటలే కాదు.. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొనే కథ, కథనాలు కూడా ఉండాలి అని గ్రహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- క్విట్ ఇండియా: ఈ నినాదం ఎలా పుట్టింది, ఈ ఉద్యమంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన యోధులెవ్వరు?
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














