దరిశి చెంచయ్య: సింగపూర్ జైలులో కాల్పుల నుంచి తప్పించుకున్న తెలుగువాడు, దక్షిణ భారతాన తొలి రాజకీయ ఖైదీ అనుభవాలేంటి?

దరిశి చెంచయ్య
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

'...మిత్రులను కౌగిలించుకుని నవ్వు ముఖంతో లోపలికి నడిచాను. పొడవాటి హాలులో ఓ చివర ఐదుగురు సైనికులు రైఫిల్స్‌తో నిలబడి ఉన్నారు. ఇంకో చివర కొయ్య స్తంభం ఉంది. దానికి ఆనించి నన్ను నిలబెట్టారు. "ఏయ్ చెంచయ్యా, కాల్చమని ఆర్డర్ ఇస్తే చచ్చిపోతావ్.. ఒక్క నిమిషం టైమిస్తాను. ఆలోచించుకో. నీకు తెలిసిన విషయాలు చెప్పి తప్పించుకో"అన్నాడు.

"నాకు టైమ్ అవసరం లేదు కాల్చుకో అన్నాను". కాల్చడానికి ఆర్డర్ వచ్చింది. అయిదు తుపాకులు మోగాయి. కానీ దాని గుండ్లు నాకు తగల్లా. నా వైపు తిరిగి నవ్వాడు ఆఫీసరు.'

కొంతదూరంలో మరో గదికి తీసుకెళ్లారు. బలవంత్ సింగ్ కూర్చుని ఉన్నాడు. ఇద్దరం కౌగిలించుకున్నాం. "ఎంత హింస పెట్టారు, రహస్యాలు లాగడానికి..ఎంత ఉపాయం పన్నారు" అనుకున్నాం. అటు తర్వాత అమర్ సింగ్, ఠాకూర్ సింగ్, శివప్రసాద్ గుప్తా, ఛటర్జీ కూడా వచ్చారు..'

ఇదంతా స్వాతంత్ర్య సమరయోధుడు దరిశి చెంచయ్య స్వీయానుభవం. తన ఆత్మకథ ' నేనూ-నాదేశం.' అనే పుస్తకంలో ఈ సంగతులను ఆయన రాసుకున్నారు.

1912లో విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి, గదర్ పార్టీలో చేరి చిన్న వయసులోనే దేశవిముక్తి కోసమంటూ సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు చెంచయ్య. ఆ క్రమంలో పట్టుబడి వివిధ దేశాల జైల్లో గడపాల్సిన సమయంలో తమ గదర్ పార్టీ గురించి రహస్యాలు చెప్పాలంటూ బ్రిటిష్ సైన్యం అనుసరించిన పద్ధతులను ఆయన తన పుస్తకంలో వివరించారు.

గదర్ పార్టీ సభ్యులు

ఫొటో సోర్స్, VANCOUVER PUBLIC LIBRARY

ఫొటో క్యాప్షన్, గదర్ పార్టీ సభ్యులు

ఎవరీ చెంచయ్య..

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పెద్ద సంఖ్యలో త్యాగాలు చేసిన వారున్నారు. కొందరు ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పిస్తే, మరికొందరు దేశానికి విముక్తి లభించే వరకూ వివిధ పద్ధతుల్లో పోరాడుతూనే ఉన్నారు. పోరాటాల్లో కూడా కొందరు సాయుధ సమరానికి సిద్ధమయితే, మరికొందరు గాంధేయ పద్ధతులను అనుసరించారు.

1890లో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న కనిగిరిలో జన్మించిన దరిశి చెంచయ్య ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. సాధారణ వైశ్య కుటుంబానికి చెందిన చెంచయ్య ఉన్నత విద్యకోసం అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటికీ వెళ్లడంతో రాజకీయ కార్యాచరణకు ఆరంగేట్రం జరిగింది.

అప్పటికే గాడిచర్ల హరి సర్వోత్తమరావు అరెస్ట్, ఆంధ్రప్రదేశ్‌లో బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంగా ఉపన్యాసాల ప్రభావం వంటివి చెంచయ్యను కదిలించాయి.

చెంచయ్య అమెరికాలో అడుగుపెట్టిన సమయానికి అక్కడే ఉన్న పంజాబ్, ఇతర ఉత్తర భారతదేశానికి చెందిన యువకులు కొందరు దేశ విముక్తి కోసం ఆలోచిస్తూ గదర్ పార్టీ స్థాపనకు పూనుకున్నారు. 1912లో లాలా హరదయాళ్‌తో చెంచయ్యకు ఏర్పడిన పరిచయం ద్వారా గదర్ పార్టీ స్థాపనలో భాగస్వామిగా మారారు.

జితేంద్రనాథ్ లహరితో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా గదర్ పార్టీ ఏర్పాటుకి పూనుకున్నారు. తద్వారా దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించిన తొలితరం వీరుల్లో ఒకరిగా మారారు. అందులోనూ సాయుధ పోరాటంతో బ్రిటిష్ సేనలను తరిమికొట్టాలనే లక్ష్యంతో ఏర్పడిన గదర్ పార్టీలో ముఖ్య భూమిక పోషించడంతో చెంచయ్య రాజకీయ ప్రస్థానం ప్రముఖంగా మారింది.

గదర్ పార్టీ సభ్యులు

ఫొటో సోర్స్, VANCOUVER PUBLIC LIBRARY

ఫొటో క్యాప్షన్, గదర్ పార్టీ సభ్యులు

విప్లవకారుడిగా మారి..

సామాన్య కుటుంబం కావడంతో ఆర్థికంగా ఆయనకు అనేక సమస్యలుండేవి. తల్లి అభ్యంతరాలు కూడా ఉన్నప్పటికీ వాటన్నింటికీ సర్థిచెప్పుకుని అమెరికాలో అడుగుపెట్టిన చెంచయ్య.. తనకున్న జ్ఞానంతో మంచి విద్యాధికుడిగా, ఉన్నత స్థానంలో నిలుస్తాడని కుటుంబీకులు ఆశించారు. చిన్నతనంలోనే కనిగిరి తహశీల్దార్ అధికార దర్పం చూసి తాను కూడా అలానే తహశీల్దార్ అయ్యి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పానికి చెంచయ్య వచ్చారు.

ప్రాథమిక విద్యను కనిగిరిలో పూర్తిచేసి, హైస్కూల్ విద్య ఒంగోలు ఏబీఎంలో అభ్యసించారు చెంచయ్య. మద్రాస్ పచ్చయప్పన్ కాలేజీలో ఇంటర్ చదివారు. చిన్నప్పటి నుంచే హేతుబద్ధంగా ఆలోచిస్తూ అటు చదవుల్లో ముందు నిలిచిన చెంచయ్య, ఆలోచనలు మాత్రం దేశ విముక్తి పోరాటం చుట్టూ సాగినట్టుగా ఆయన స్వీయ చరిత్ర చెబుతోంది.

చివరకు కుటంబ సభ్యులు ఆశించిన దానికి భిన్నంగా చెంచయ్య రాజకీయ కార్యచరణలో భాగస్వామిగా మారి అమెరికా వెళ్లిన కొద్దికాలానికే గదర్ పార్టీ సభ్యులతో కలిసి తిరిగి భారత్‌కు పయనమయ్యారు.

బర్కిలీలో బీ‌ఎస్సీ చదివేందుకు అక్కడికి వెళ్లిన చెంచయ్యకు బ్రిటన్‌లో ఐసీఎస్ చదువుతూ, అది వదిలేసి దేశ స్వాతంత్ర్య కోసం పోరాటంలో దిగిన లాలా హరదయాళ్ పరిచయం కావడంతో అంతా మారిపోయింది. గదర్ అంటేనే విప్లవం అనే అర్థం ఉండడంతో విప్లవకారుడిగా చెంచయ్య మారిపోయారు.

గదర్ పార్టీ

అమెరికా నుంచి తిరిగి వస్తూ....

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత సరిహద్దులకు చేరి, అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడం ద్వారా సాయుధ గెరిల్లా పోరాటానికి సిద్ధం కావాలన్నది గదర్ పార్టీ వ్యూహం. 1914లో ఈ యుద్ధం ఆరంభమయ్యింది. బ్రిటన్ అందులో భాగస్వామి. దాంతో అదే అదనుగా బ్రిటిష్ ఇండియా మీద దాడికి గదర్ పార్టీ ప్రయత్నాలు చేసింది.

జర్మనీలో సాయుధ శిక్షణ పొందిన వారిలో 200 మందితో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి బృందాలుగా విడిపోయి భారతదేశానికి చేరుకునే ప్రయత్నం ప్రారంభించారు. అదే సమయంలో 8 మంది సాయుధ వీరులతో కలిసి, ఓడలో ఆయుధాలతో బర్మాకి చేరుకునే ప్రయత్నంలో చెంచయ్య కూడా ఇండియాకు పయనమయ్యారు.

కానీ గూఢచారుల సమాచారంతో చెంచయ్య బయలుదేరిన ఓడను బ్యాంకాక్ సమీపంలో బ్రిటిష్ సేనలు చుట్టుముట్టాయి. గదర్ పార్టీకి చెందిన వారిని చిత్రహింసలు పెట్టాయి. ఆ క్రమంలోనే చెంచయ్యతో కలిసి పయనమైన జోధ్ సింగ్ ప్రాణభయంతో అఫ్రూవర్‌గా మారిపోయి అనేక రహస్యాలను పోలీసులకు వెల్లడించినట్టు చెంచయ్య తన ఆత్మకథలో పేర్కొన్నారు.

చివరకు గదర్ పార్టీకి చెందిన వారి గురించి లభించిన సమాచారంతో అనేక మందిని అరెస్ట్ చేసి, రాజద్రోహం కేసులు పెట్టారు. వందలాది మందిని కాల్చివేశారు. అండమాన్ జైలులో నిర్బంధించడం, ఉరికంభం ఎక్కించడం వంటివి సాగాయి. దాంతో గదర్ పార్టీ ప్రస్థానం స్వల్పకాలంలోనే ముగింపునకు వచ్చేసింది.

లాహోర్ కుట్ర కేసు ఒరిజినల్ పత్రాలు
ఫొటో క్యాప్షన్, లాహోర్ కుట్ర కేసు పత్రాలు

అష్టకష్టాలు పడుతూ...

బ్రిటిష్ సేనలకు పట్టుబడిన వారిలో దరిశి చెంచయ్య సహా గదర్ పార్టీ వారంతా తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. బ్యాంకాక్‌లో అరెస్ట్ అయిన వారందరినీ రెండు నెలల తర్వాత సింగపూర్ తరలించారు. వారం రోజుల వారి పడవ ప్రయాణంలో నానా రకాల యాతనలు అనుభవించారు. ఇద్దరికి కలిపి కాళ్లు, చేతులకు సంకెళ్లు వేయడమే కాకుండా, వారిని ఓడపై ఓపెన్‌లో పడేయడంతో చలి తీవ్రత మూలంగా తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. మలమూత్రాలకు వెళ్లాలన్నా, తిండి తినాలన్నా అన్నీ అక్కడే.

వారం తర్వాత సింగపూర్‌లోని మిలటరీ జైలుకి చేరారు. అక్కడ విడివిడిగా గదుల్లో బంధించారు. పడుకోవడానికి ఓ బెంచీ, నీళ్లు తాగడానికి ఓ ముంత, మలమూత్రాలకు వెళ్లేందుకు ఓ కుండ ఇచ్చారు. తుడుచుకోవడానికి కాగితం కూడా ఇవ్వకుండా వేధింపులు పెట్టారు. పళ్లు తోముకోవడం, స్నానం చేయడం, గెడ్డం గీయడం వంటివి మరచిపోవాల్సిన దుస్థితి. చివరకు బందీలైన ఏడుగురిలో ఈ శిక్షకు ఒకరికి మతిభ్రమించగా, చెంచయ్య నరాల వ్యాధి బారిన పడ్డారు.

లాహోర్ కుట్రకేసు పేరుతో నమోదయిన కేసులో వీరంతా రాజద్రోహం కింద శిక్షలు అనుభవించారు. మరణం అంచుల వరకూ వెళ్లిన దశ నుంచి బయటపడిన చెంచయ్య దాదాపు 6 ఏళ్లకు పైగా నరకకూపం లాంటి జైలు జీవితంలోనే గడిపారు.

బ్యాంకాక్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి కలకత్తా, లాహోర్, దిల్లీ, కన్ననూర్, కోయంబత్తూర్, వెల్లూర్ వంటి జైళ్లలో ఆయన శిక్ష అనుభవించారు. జైళ్లలో లాఠీదెబ్బలు, కాళ్లతో, బూట్లతో తన్నులు నిత్యకృత్యంగా ఉండేవని చెంచయ్య తన అనుభవంగా చెప్పుకున్నారు. కొన్నిసార్లు ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేకుండా చేసి, జైలు గదుల్లో బంధించిన సందర్భాలున్నాయని ప్రస్తావించారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, HULTON ARCHIVE

జైలు నుంచి వచ్చి బహిరంగ రాజకీయాల్లో..

బ్రిటిష్ వారి రికార్డుల ప్రకారం 1919 నాటికి ఉన్న రాజకీయ ఖైదీల్లో కేవలం దరిశి చెంచయ్య మాత్రమే దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి. అత్యధికులు పంజాబ్, బెంగాలీలు కాగా కోయంబత్తూర్ జైలులో ఉన్న చెంచయ్యను 1919లో విడుదల చేశారు. అప్పటికే ఆరేళ్లుగా జైల్లో ఉన్న చెంచయ్యను ఖైదీగా కొనసాగించడానికి చట్ట ప్రకారం అవకాశం లేకపోవడంతో చివరకు విడుదల చేశారు.

ఆనాటికి దేశంలో గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య పోరాటం సాగుతోంది. రహస్య విప్లవ వీరుడిగా, సాయుధ సమరంతో దేశ విముక్తి కోసం ప్రయత్నించిన చెంచయ్య ఆ తర్వాత బహిరంగ రాజకీయాల్లో భాగస్వామి అయ్యారు. 1920-23 మధ్య అహ్మదాబాద్, కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు.

సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ తీర్మానాలు చేయడం లేదనే అసంతృప్తి చెంచయ్యను వెంటాడింది. దాంతో ఆయన స్వల్పకాలంలోనే కాంగ్రెస్‌తో విభేదించారు.

వీడియో క్యాప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో వెలుగునీడలు

సాంఘిక సంస్కరణల వైపు

దాదాపు దశాబ్ద కాలం పాటు రాజకీయ కార్యకలాపాలతో దేశం కోసం ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నా, మొక్కవోని ధైర్యంతో సాగిన చెంచయ్య చివరకు ఆనాటి పరిణామాలతో రాజకీయాలకు కొంత విరామం తీసుకున్నారు. అదే సమయంలో సాంఘిక దురాచారాలపై తన పోరాటాన్ని కొనసాగించారు.

వ్యభిచారాన్ని అరికట్టే ప్రయత్నాలకు ఆయన పూనకున్నారు. వేశ్యావృత్తిని నిర్మూలించాలని కృషి చేస్తున్న యామినీ పూర్ణతిలకమ్మను కలిశారు. వేశ్యలను 'కళావంతులు' అని పిలిచారు. ప్రస్తుతం ఆ పేరుతో ఓ కులం ఉంది. వేశ్యవృత్తి నివారణ కోసం వారందరికీ వివాహాలు చేయడమే పరిష్కారంగా భావించారు. ఆ ప్రయత్నం నాలుగేళ్ల పాటు సాగించారు.

ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి తన మిత్రుల సహకారంతో కందుకూరి వీరేశలింగం బాటలో వితంతు వివాహాలకు పూనుకున్నారు. ముఖ్యంగా వైశ్య కులంలో బాల వితంతుల కష్టాలు చూసిన ఆయన వారి విముక్తి కోసం ప్రయత్నించారు. పలువురికి వివాహాలు చేసి కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకు తోడ్పడ్డారు.

బోల్షివిక్ విప్లవం

ఫొటో సోర్స్, Getty Images

కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై..

1920లో రష్యాలో బోల్షివిక్ విప్లవం విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం పడింది. దాని ఫలితాలను స్వాగతిస్తూ ఓ క్రిస్టియన్ ఫాదర్ రాసిన పుస్తకం చెంచయ్యను కదిలించింది. మద్రాస్ కాస్మోపాలిటన్ క్లబ్ లైబ్రరీలో తాను చదివిన పుస్తకంలో రష్యాలో పాలనను క్రైస్తవ ఫాదరీ తిట్టకపోగా, క్రీస్తు చెప్పినవన్నీ రష్యా ప్రభుత్వం అమలు చేస్తోందని రాశారంటూ పేర్కొనడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

1936లో చండ్ర రాజేశ్వరరావుని కలిసిన చెంచయ్య కమ్యూనిస్టులకు చేరువయ్యారు. 1939లో మద్రాస్‌లో కార్మిక నాయకుడైన ఘాటేతో కలిసి అక్కడి కార్మికులను సమీకరించే ప్రయత్నాల్లో చెంచయ్య భాగస్వామి అయ్యారు.

బీడీ, చుట్టల కార్మికులు 50వేల మంది ఉన్న సంఘానికి చెంచయ్య నాయకత్వం వహించారు. మద్రాస్‌లో పారిశుధ్య కార్మికులను సంఘటితం చేశారు. దేశంలోనే శానిటరీ వర్కర్ల సంఘం నాటి మద్రాస్‌లోనే మొదటిసారిగా మొదలుకావడం, దానికి చెంచయ్య సారథ్యం వహించడం విశేషం.

మద్రాసులో సింప్సన్ కంపెనీ కార్మికుల సమ్మె ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఆ సమయంలోనే సింప్సన్ యాజమాన్యం ఫిర్యాదుతో మరోసారి చెంచయ్య అరెస్ట్ అయ్యారు. వెల్లూరులో ఆయన్ను ఖైదు చేశారు. కొంతకాలానికే మళ్లీ విడుదలయ్యారు. ఆయన 36 ఏళ్ల సామాజిక ఉద్యమ జీవితంలో 8 ఏళ్ల పాటు జైలులోనే గడపాల్సి వచ్చింది.

కమ్యూనిస్టు పార్టీలో కూడా ఆయన ఎక్కువ కాలం కొనసాగలేదు. అందుకు కారణం కూడా చెబుతూ తాను పార్టీలో చేరినా, పూర్తిస్థాయిలో కమ్యూనిస్టు కాలేకపోయానంటూ ఆయన వివరించారు. వ్యక్తిగత కారణాలు కూడా ఉండడంతో 1948లో ఆయన కమ్యూనిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

వీడియో క్యాప్షన్, కుమ్రం భీము ఎవరు? నిజాంపై ఎందుకు పోరాటం చేశారు?

చెంచయ్యకు తోడుగా భార్య

తొలుత విప్లవ పార్టీలో, ఆ తర్వాత కాంగ్రెస్‌లో, మళ్లీ సామాజిక సేవకుడిగా, చివరకు కమ్యూనిస్టుగా ఇలా రకరకాల రూపాల్లో సాగిన చెంచయ్య ప్రస్థానంలో ఆయనకు అన్ని వేళలా భార్య సుభద్ర తోడుగా నిలిచారు.

ఈ విషయాన్ని కూడా చెంచయ్య తన పుస్తకంలో పేర్కొన్నారు. తనకు 1920లో పరిచయమైన భార్య అనేక విధాలుగా సేవలు అందించడాన్ని ప్రస్తావించారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే ఆమె అనిబిసెంట్ వంటి వారితో కలిసి 'మహిళా భారత సమాజం' స్థాపించారు. ఆ తర్వాత అఖిల భారత మహిళా మహాసభకి కార్యనిర్వాహక సభ్యురాలిగా వ్యవహరించారు.

డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి వంటి వారితో కలిసి మాంటిసోరి స్కూళ్ల స్థాపనలోనూ సుభద్రమ్మ పాత్ర ఉంది. చాలాకాలం పాటు ఆ స్కూళ్ల నిర్వాహక కమిటీలో సుభద్ర ఉన్నారు.

మద్రాసులో హరిజన సేవా సంఘానికి మొదటి అధ్యక్షుడిగా ప్రకాశం పంతులు, కార్యదర్శిగా సుభద్ర ఎన్నిక కావడం విశేషం. వివిధ రూపాల్లో సేవా, రాజకీయ కార్యక్రమాల్లో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారు.

చెంచయ్య, సుభద్ర దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

వీడియో క్యాప్షన్, చింతామణి నాటకం నిషేధం: వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయం సబబేనా?

రచయితగానూ..

1890లో జన్మించి 22 ఏళ్ల వయసులో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగాలని అమెరికాలో అడుగుపెట్టి, విప్లవ వీరుడిగా మారి ప్రజాజీవితంలో ప్రవేశించి, వివిధ దశలను చూసిన దరిశి చెంచయ్య 1950 తర్వాత వరుసగా పలు పుస్తకాలు రచించారు. 1952లో ఆయన ఆత్మకథ ముద్రించారు.

'నేనూ- నాదేశం' పేరుతో ఆత్మకథతో పాటుగా 20 పుస్తకాలను రచించారు. వాటిలో గాంధీ, భగత్ సింగ్, అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్, వివేకానంద, రాజారామమోహన్ రాయ్ వంటి వారి జీవితాలు, కార్యచరణ గురించి పుస్తకాలు రాశారు.

పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు.

1964లో దాదాపు 74 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో వివిధ ఆరోగ్య సమస్యలు కూడా తోడు కావడంతో ఆయన కన్నుమూశారు.

ఆ తర్వాత కూడా దరిశి చెంచయ్యను దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. 1990లో ఆయన శత జయంతి వేడుకలు కూడా పలు సంఘాల ఆధ్వర్యంలో జరిగాయి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అజాదీ కా అమృతోత్సవ్ వేళ అనేక మంది త్యాగజీవులను గుర్తు చేసుకుంటున్న దశలో దరిశి చెంచయ్య వంటి వారిని కూడా తెలుగు నాట మననం చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)