బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?

ఆందోళన చేస్తున్న విద్యార్ధులు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

హిందూ పురాణాల ప్రకారం విద్యాధిదేవత అయిన 'శ్రీ జ్ఞాన సరస్వతి'కి నెలవు 'బాసర'. బడి ఈడు పిల్లలకు ఓనమాలు దిద్దించే 'అక్షరాభ్యాసాలకు' దేశవ్యాప్త గుర్తింపు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. గోదావరి నది తెలుగు నేలలో ప్రవేశించే ప్రాంతం కూడా.

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఓ మూలన విసిరేసినట్టుగా ఉండే బాసర ఇటీవల వరుస విద్యార్థి నిరసన కార్యక్రమాలతో వార్తల్లో నిలిచింది.

శాంతియుతంగా గాంధేయ పద్దతిలో ఎండా, వాన, రాత్రి, పగలు సాగించిన విద్యార్థుల ఆందోళన అన్ని పక్షాల మద్దతు, సంఘీభావం పొందింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏకతాటి పై సాగిన విద్యార్థి పోరాటాన్ని ఇది గుర్తుచేసిందన్న అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటోందంతా 'ట్రిపుల్ ఐటీ', బాసర క్యాంపస్ లో ఈ మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితుల గురించి. 8 వేల పైచిలుకు విద్యార్థులతో బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విద్యార్థి క్యాంపస్ లలో ఒకటిగా ఉంది.

బాసర ట్రిపుల్ ఐటీ

ఉన్నత లక్ష్యం తో ఏర్పడ్డ యూనివర్సిటీ

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రెండో ఫేజ్ ఐఐటీలను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఐటీ కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల పేర్లు పోటాపోటీగా వినిపించాయి. అయితే, ఫైనల్ లిస్ట్ లో మాత్రం బాసర, హైదరాబాద్ నిలిచాయి. విమానాశ్రయం ఇతరత్రా మౌలిక వసతుల కారణాలతో హైదరాబాద్ లో ఐఐటీ ఏర్పాటైంది.

ఈ నేపథ్యంలో ఐఐటీ ల స్థాయిలో సాంకేతిక విద్యను అందించేందుకు మార్చ్ 2008 లో ఆనాటి వైఎస్సార్ ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్' (యూనివర్సిటీని) స్థాపించి దానికింద నూజివీడు, ఇడుపులపాయ, బాసర లో క్యాంపస్ లను ఏర్పాటు చేసి 'ట్రిపుల్ ఐటీ'లుగా పిలిచారు.

వీడియో క్యాప్షన్, బాగా చదివి డాక్టర్ కావాలనుకుంటోన్న ప్రియాంశు కుమారి

గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి పరీక్షల్లో టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ (ఐటి,ఇంజనీరింగ్) విద్యను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ రూపంలో అందించేలా కోర్సు లను రూపొందించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నానోటెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పరిశ్రమలు, మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారిగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను తయారు చేసే లక్ష్యం ట్రిపుల్ ఐటీ ల వెనుక ఉంది.

ప్రతి క్యాంపస్ లో ఏటా ఎంపికైన వెయ్యి మంది విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2015 లో బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

విద్యార్థులుఆందోళనలకు కారణాలేంటి?

సుమారు 270 ఎకరాల్లో విస్తరించిన బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను 6 వేల మంది విద్యార్థుల విద్యా, ఆవాసం, క్రీడలు ఇతరత్రా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. పూర్తిగా ప్రభుత్వ గ్రాంట్ ల పై నడిచే విద్యా సంస్థ కావడంతో ఆర్థిక స్వయం సమృద్ది కోసం ఈమధ్య కాలంలో 'గ్లోబల్ కోటా' కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను అందుబాటులో తెచ్చి అడ్మిషన్ల సంఖ్య పెంచారు.

అయితే, అదే స్థాయిలో సౌకర్యాలు పెరగక పోవడం, నిర్ణయాలు తీసుకునే కీలక స్థానాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో విద్య, భోజన, ఇతర వసతుల్లో నాణ్యత పడిపోయిందని, దేశంలో ఉన్నత విద్యా సంస్థల పనితీరు సూచించే 'నాక్' (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రేటింగ్స్ లో 'సి' గ్రేడ్ కు బాసర ట్రిపుల్ ఐటీ పరిమితం కావడం దీనికి ఉదాహరణ అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ పలుమార్లు మౌలిక వసతుల కోసం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి. ఈసారి విద్యార్థులకు తోడుగా క్యాంపస్ వద్ద వారి తల్లిదండ్రులు, వివిధ రాజకీయ, సామాజిక, విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగారు.

మరణించిన విద్యార్ధి సంజయ్‌కు నివాళిగా విద్యార్ధుల ర్యాలీ

ఫొటో సోర్స్, UGC

ఇవీ డిమాండ్లు:

ప్రధానంగా 12 డిమాండ్ల సాధన దిశగా బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు పోరాటం జరుగుతోంది.

ఛాన్స్ లర్ నియామకం, శాశ్వత వైస్ ఛాన్సలర్ , డైరెక్టర్ల నియామకం, ఐసిటీ (ఇన్ఫార్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఆధారిత విద్యాబోధనలో భాగంగా ల్యాప్ టాప్ లు పంపిణీ, బోధనా సిబ్బంది ఖాళీల భర్తీ, మెస్ లో నాణ్యమైన భోజనం, హాస్టళ్లలో వసతుల కల్పన, ఇతర యూనివర్సిటీ లతో ఒప్పందాలు లాంటివి వీటిలో ఉన్నాయి.

నాణ్యత లేని మెస్ కాంట్రాక్ట్ రద్దు, యూనిఫామ్ పంపిణీ, హాస్టళ్ల లో మంచాలు, దుప్పట్లు, షూస్ పంపిణీ, శుభ్రమైన తాగునీరు, క్యాంపస్ లో పరిశుభ్ర వాతావరణం కల్పించడం లాంటివి మరికొన్ని డిమాండ్లు.

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల చదువులతో ముడిపడి ఎన్నో ప్రధాన సమస్యలు ఉన్నా, మీడియా ద్వారా బయటకు ఎక్కువగా ఇక్కడి మెస్ ల నిర్వహణ ఫోకస్ అయ్యింది. ఈ మధ్య వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పీయూసీ-2 కు (ప్రీ యూనివర్సిటీ కోర్స్) చెందిన ఈ క్యాంపస్ విద్యార్థి శాబోతు సంజయ్ కిరణ్(17) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటివద్ద చనిపోయారు. నాణ్యత లేని బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనమే సంజయ్ చనిపోవడానికి ప్రధాన కారణమని అతని తల్లిదండ్రుల ఆరోపించారు.

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ముందు పోలీస్ పహారా
ఫొటో క్యాప్షన్, బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ముందు పోలీస్ పహారా

''బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్ వచ్చినప్పుడు నీ కొడుక్కి కంప్యూటరు జాబు వస్తదని, నౌకరి వచ్చి మంచి బుద్దిమంతుడవుతాడని మా ఊరి వారు అన్నారు. కానీ అక్కడ ఫుడ్డు, వాతావరణం బాగలేదు అనేవాడు. మా ఆశ నిరాశయ్యింది, మమ్మల్ని విడిచి మా బాబు పై లోకానికి నౌకరీకి పోయిండు. ఇట్లవుతదని ఎవరికి ఎరుక?'' అని సంజయ్ కిరణ్ తల్లి శాబోతు శ్రీలత బీబీసీతో అన్నారు.

'అంత ఖర్చుపెట్టి, పెద్దపెద్ద బిల్డింగులు కట్టి కాలేజీ పెట్టినవారు పిల్లలకు సరైన భోజనం పెట్టడానికి ఎందుకు చేతనైత లేదు. మీ కాలేజీలో చదివిన పిల్లలు బాగుపడితే ప్రభుత్వానికే పేరొస్తది కదా? ఫుడ్డే కనుక బాగుంటే నా కొడుకు మంచి భవిష్యవంతుడయ్యేది''

''మా బాబుకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు. ఫుడ్డు బాగా పెట్టండి, చదువు మంచిగ చెప్పండి. పరిశుభ్రమైన నీరు ఇవ్వండి. మీకు(ప్రభుత్వానికి) చాతకాక పోతే పిల్లల తల్లిదండ్రుల నుండి కొంత ఫీజు తీసుకొనైనా వారికి భోజనాలు బాగా పెట్టండి. మా కడుపుకోత ఇంకొకరికి రాకూడదు'' అని శ్రీలత అన్నారు.

సంజయ్ కుమార్ తల్లి శ్రీలత

''విద్యార్థి చనిపోవడం మా 'ఆర్జీయూకేటీ' కే విషాదమైన ఘటన. ప్రొటెస్ట్ లు జరుగుతున్న సమయంలోనే తల్లిదండ్రుల సంజయ్ ను ఇంటికి తీసుకెళ్లారు. మాకున్న సమాచారం మేరకు ఆ అబ్బాయికి ఆరోగ్య సమస్యలు గతం నుండి ఉన్నాయి. అతని మెడికల్ కండీషన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది నైతికంగా సరైంది కాదు'' అని బాసర ట్రిపుల్ ఐటీ ఇంఛార్జ్ వీసీ, తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ బీబీసీతో అన్నారు.

''అయితే, ఈ ఘటన నుండి మేం నేర్చుకున్నాం. విద్యార్థుల హెల్త్ రికార్డ్ గతం నుండే నిర్వహిస్తున్నాం. అయితే దాన్ని డిజిటలైజ్ చేయాల్సి ఉంది. విద్యార్థి క్యాంపస్ రాగానే అతని సమగ్ర ఆరోగ్య రిపోర్ట్ తయారు చేసుకుంటాం. వీసీ డాష్ బోర్డ్ తయారు చేశాం. ప్రతి రోజు రెండుసార్లు విద్యార్థుల ఆరోగ్య రిపోర్ట్ తెప్పించుకుని పర్యవేక్షిస్తాం'' అని ప్రొఫెసర్ వెంకట రమణ అన్నారు.

8 వేల పైచీలుకు విద్యార్థుల ఉండే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మూడు మెస్‌లు ఉన్నాయి. అవి తమ అవసరాలకు సరిపోవని, సంఖ్య మరింత పెంచి నాణ్యమైన భోజనం అందించాలన్నది విద్యార్థుల దీర్ఘకాలిక డిమాండ్.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

రాజ్యంగం కల్పించిన హక్కులనే అడుగుతున్నాం-విద్యార్థులు

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నెల రోజుల క్రితం తెలంగాణ విద్యాశాఖ మంత్రి బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. త్వరలో పరిస్థితులు చక్కబెడతామని, విద్యార్థుల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పీయూసీ-1,2 విద్యార్థుల మెస్ లో భోజనం వికటించి సుమారు వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి.

'గతంలోనూ ఇక్కడ విద్యార్థుల ఆందోళనలు జరిగాయి. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడం మాకున్న దీర్ఘకాలిక సమస్య. అకాడమిక్ కార్యక్రమాలు, వర్క్ షాప్ ల ఏర్పాటుకు ఇబ్బంది అవుతోంది. 2015 నుండి వీసీ లేరు. రెగ్యులర్ వీసీ స్థానంలో ఇంఛార్జ్ ను ఇవ్వడం నిరాశపరిచింది. ఇంఛార్జ్ అనే పదానికి మేము వ్యతిరేకం'' అని ఆగష్టు 4న రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి బృందం సభ్యుడు మాదేశ్ సుంకరి బీబీసీతో అన్నారు.

ఇంఛార్జ్ వీసీ ప్రొఫెసర్ వెంకట రమణ
ఫొటో క్యాప్షన్, ఇంఛార్జ్ వీసీ ప్రొఫెసర్ వెంకట రమణ

'వాష్ రూమ్ లకు డోర్లు లేక బకెట్లు అడ్డుపెట్టుకుంటున్నాం. క్యాంపస్ లో పారిశుధ్యం లేదు, కారిడార్ల లోకి పాములు వస్తున్నాయి. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఆధారిత టెక్నాలజీతో బోధన జరగాలి. రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించాలి. ఖాళీలు భర్తీ చేయాలి. ఎటు చూసినా సమస్యలే ఉన్నాయి కాబట్టే మేము పోరాడాల్సి వచ్చింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా ఆందోళన వెళ్లలేదు. అయితే అదే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులనే మేం అడుగుతున్నాం’’ అని ఆయన అన్నారు.

సమస్యలు పరిష్కారంతోనే బాసర ట్రిపుల్ ఐటీకి మళ్లీ మంచి రోజులు వస్తాయన్న ఆశాభావం ఇక్కడి విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల నివాళి

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

విద్యార్థులకు సంఘీభావం

తెలంగాణలో ఇంటర్ స్థాయి నుండి ఇంజనీరింగ్ విద్య ను అందించే ట్రిపుల్ ఐటీలో పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అట్టడుగు వర్గాల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని, ప్రభుత్వ రంగంలో నాణ్యమైన సాంకేతిక విద్యకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు దూరం అవుతారన్న వాదనలు ఉన్నాయి.

వివిధ యూనివర్సిటీల విద్యార్థులు, వివిధ వర్గాల నుండి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పోరాటానికి సంఘీభావం వ్యక్తం అయింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విద్యార్థులకు మద్దతు పలికారు.

జాతీయ స్థాయిలోనూ ఇది చర్చకు వచ్చింది.

'విద్యార్థుల న్యాయబద్దమైన డిమాండ్ల ను సిల్లీ డిమాండ్ లు అనడం తెలంగాణ భవిష్యత్తుపై కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష ధోరణికి నిదర్శనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల వెలకట్టలేని భాగస్వామ్యాన్ని ఆయన మరిచిపోయారా?''అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

తెలంగాణ లో ఉన్నత విద్య, యూనివర్సిటీలను నీరుగార్చి విద్యావ్యవస్థను ధ్వంసం చేసే ప్రక్రియ సాగుతోందని 'సోషల్ డెమోక్రటిక్ ఫోరం'( ఎస్‌డీఎఫ్) ఆరోపించింది.

''9వేల మంది విద్యార్థుల భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆరోగ్యాల సంగతేంటి? పేదవర్గాల పిల్లల విద్యను నీరుగార్చడం, విద్యను ప్రైవేట్ పరం చేసే కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ట్రిపుల్ ఐటీ కి నిధులు తగ్గాయి. తెలంగాణ ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్న ప్రశ్నేలేదు’’ అని ఎస్‌డీఎఫ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి బీబీసీతో అన్నారు.

‘‘ప్రభుత్వం ఎంతో డబ్బును వృథా చేస్తోంది. పేదవర్గాల పిల్లలు చదువుకుని ప్రశ్నించే తత్వం అలవర్చుకోవద్దని, వారికి ఓటు బ్యాంకు గానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు’’ అని విమర్శించారాయన.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

ప్రభుత్వ స్పందన ఎలా ఉంది?

సరైన సమయంలో, సరైన వేగంతో ప్రభుత్వం స్పందించలేదనన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన నుండి రెగ్యులర్ వీసీ, డైరెక్టర్లు లేక సమస్యల పరిష్కారానికి సరైన యంత్రాంగం కరువైంది. చాలా కాలం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే ఇక్కడి పాలనా వ్యవహారం సాగింది.

ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పెద్దపల్లి సతీశ్ కుమార్ ను ఇంఛార్జ్ డైరెక్టర్ గా , తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకట రమణలను ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియమించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా, ఇంఛార్జ్ లతో పైపైనే తప్ప పెద్దగా లాభం ఉండదని విద్యార్థులు వాదిస్తున్నారు.

ఇంఛార్జ్‌ల నియామకం తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పుల పరిశీలనకు బీబీసీ 'బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్'ను సందర్శించి ఇంఛార్జ్ డైరెక్టర్ తో మాట్లాడింది.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

అయితే విద్యార్థులు,హాస్టళ్లు, మెస్‌ల దగ్గరికి వెళ్లేందుకు మాకు అనుమతి లభించలేదు. క్యాంపస్ లో బహిరంగ పోలీస్ (విజిబుల్ పోలీసింగ్) కాపలా కొనసాగుతోంది. ప్రధాన గేటు ముందే పోలీస్ వాహనం మాకు ఎదురైంది. పరిస్థితులు చక్కబడ్డాయని చెబుతునే, క్యాంపస్ లో పోలీసులను మోహరించడంపై డైరెక్టర్ సతీశ్ కుమార్ ను బీబీసీ వివరణ కోరింది.

''కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం, విద్యార్థులతో చర్ఛించాక వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. వాటిని పరిష్కరిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చక్కదిద్దడానికి మాకు కొంత సమయం కావాలి. రెండు నెలల లోపు బాసర ట్రిపుల్ ఐటీ ఒక ఉత్తమ విద్యా సంస్థ అని నిరూపిస్తాం'' అని ప్రొఫెసర్ సతీశ్ కుమార్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, టీచర్ కావాలనే లక్ష్యం చేరుకోవడానికి పేపర్ గర్ల్‌గా మారిన బాలిక

'24 గంటలు పనిచేసేలా లైబ్రరీ నడిపిస్తున్నాం. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుచేశాం. మెస్‌లో రోజు వారి నాణ్యత పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెస్తాం. క్యాంపస్‌లో సగం కంటే ఎక్కువ అమ్మాయిలే ఉంటారు. మా విద్యార్థుల సెక్యూరిటీ మాకు ఎంతో ప్రధానమైనది. ట్రిపుల్ ఐటీ ప్రారంభం నుండే ఇక్కడ డీఎస్పీ ర్యాంక్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు’’ అని ప్రొఫెసర్ సతీష్ కుమార్ వివరించారు.

కరోనా కూడా ఇక్కడి సమస్యలకు ఒక కారణం అయిందని, ఆ సమయంలో గ్రౌండ్స్, మెస్సులు, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ వంటి వసతులు వాడుకలో లేక పని చేయకుండా పోయాయని ట్రిపుల్ ఐటీ అధికారులు అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు తమ అడ్మిషన్ టైమ్‌లో చెల్లించే హెల్త్ ఇన్సు‌రెన్స్ డబ్బులు గత రెండేళ్లుగా విద్యాసంస్థ బ్యాంక్ ఖాతాలో మగ్గుతున్నాయి.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతి పత్రం అందిస్తున్న విద్యార్ధులు

ఫొటో సోర్స్, SGC RGUKT/TWITTER

ఫొటో క్యాప్షన్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతి పత్రం అందిస్తున్న విద్యార్ధులు

కరోనా సమయంలో ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీలకు ముందుకు రాలేదని, త్వరలో వారి నుండి కొటేషన్లు ఆహ్వానించి విద్యార్థులకు ఇన్సురెన్స్ అందిస్తామని ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ బీబీసీ తో చెప్పారు.

''విద్యార్థుల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ఇన్నాళ్లు సరైన వ్యవస్థ లేదు.సరిదిద్దేందుకు కమిటీలు వేశాం. బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. గత 15 రోజుల్లో రూ.16 కోట్ల నిధులను ప్రభుత్వం అందుబాటులో తెచ్చింది. రావాల్సిన మరో 25 కోట్ల నిధులు గుర్తించాం. అదనపు నిధులు కూడా అడుగుతున్నాం. విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్పులపై సంబంధిత అధికారులను కలిశాం. షూస్, యూనిఫామ్ పర్చేస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వసతులు పెంచేందుకు అవసరమైమ సమగ్ర అంచనాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం అడిగింది'' అని ఆయన అన్నారు.

ఇంఛార్జ్ డైరెక్టర్ పెద్దపల్లి సతీశ్ కుమార్
ఫొటో క్యాప్షన్, ఇంఛార్జ్ డైరెక్టర్ పెద్దపల్లి సతీశ్ కుమార్

‘‘దేశంలో చాలా విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ సమస్య ఉంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను మార్చి పరిశ్రమల సహకారంతో ఇంటర్న్‌షిప్‌ను బలోపేతం చేయాలన్న ఆలోచన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చేస్తోంది. దీంతో విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. త్వరలో మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ తో ఎంవోయూ కుదుర్చుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్టర్, వీసి, వారిపైన ఎగ్జిక్యుటివ్ కమిటీ అన్నీ ఉన్నాయి. సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంది. కానీ విద్యాసంస్థ విశ్వసనీయతను, రిప్యుటేషన్ ను తగ్గించుకోవద్దు. విద్యాసంస్థకు విద్యార్థులకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. బహుశా ఇన్నాళ్లూ వారి సమస్యలు చెప్పేందుకు ఒక సరైన విధానం, వ్యవస్థ లేకపోవడమే దీనికి ఒక కారణం కావొచ్చు'' అని ప్రొఫెసర్ వెంకట రమణ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, చూపులేని ఈ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు ఎలా రాశారంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)