తుషార్ సుమేరా, IAS: పదో తరగతి ఇంగ్లిష్‌లో 35, లెక్కల్లో 36 మార్కులే వచ్చాయి, అయినా ఐఏఎస్ ఎలా అయ్యారంటే...

తుషార్ సుమేరా

ఫొటో సోర్స్, Facebook/Tushar D. Sumera,IAS

    • రచయిత, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ కోసం

‘‘పదో తరగతిలో నాకు ఇంగ్లిష్‌లో 35 మార్కులే వచ్చాయి. లెక్కల్లో వచ్చింది 36 మార్కులే. కాలేజీ అడ్మిషన్ ఫామ్ నింపేటప్పుడు కూడా తప్పుసు చేశాను. కానీ, పట్టుదల, కఠోర శ్రమతో ఐఏఎస్ అయ్యాను.’’

గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కలెక్టర్ తుషార్ సుమేరా వ్యాఖ్యలివి. ఆయన పదో తరగతి మార్కుల షీటు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. మన జీవితంలో విజయాలకు మన గ్రేడులకు ఎలాంటి సంబంధమూ లేదంటారు ఆయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గుజరాత్‌ సౌరాష్ట్ర ప్రాంతంలోని మారుమూల చోటీలా గ్రామంలో తుషార్ పెరిగారు. ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.

దళపత్ భాయ్, గౌరీబెన్‌లకు తొలి సంతానంగా తుషార్ జన్మించారు. దళపత్‌ భాయ్ మూడో తరగతి ప్రభుత్వ ఉద్యోగి. గౌరీబెన్ స్కూల్ టీచర్. స్కూల్‌లో తుషార్ సాధారణ విద్యార్థే.

ఆయన కుటుంబ నేపథ్యం, ఐఏఎస్ ఆఫీసర్‌గా అయ్యేందుకు ఆయన చేసిన కృషిపై ఆయనతో బీబీసీ గుజరాతీ మాట్లాడింది.

తుషార్ సుమేరా

ఫొటో సోర్స్, Facebook/Tushar D. Sumera,IAS

పరీక్షల్లో అత్తెసరు మార్కులు

స్కూలు పరీక్షల్లో తనకు అంత మంచి మార్కులు వచ్చేవి కాదని తుషార్ సుమేరా చెప్పారు.

‘‘12వ తరగతిలోనూ నాకు మంచి మార్కులు రాలేదు. దీంతో కొంతమంది సూచనలపై సోషల్‌లో డిగ్రీ చేద్దామని నిర్ణయించుకున్నాను’’అని ఆయన వివరించారు.

‘‘ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేయాలని అనుకున్నాను. అయితే, అడ్మిషన్ ఫామ్‌ను పూరించడంలో తప్పు చేశాను. క్యాపిటల్ అక్షరాల్లో పేరును రాయమని దానిలో సూచించారు. కానీ, నేను స్మాల్ అక్షరాల్లో రాసేశాను. అయితే, ఇంటి పేరును మాత్రం క్యాపిటల్ అక్షరాల్లో రాశాను. తప్పులు చేసినప్పటికీ, ఎప్పుడూ ఆశాభావాన్ని కోల్పోలేదు. చదువులో ముందుకు వెళ్లేందుకే ప్రయత్నించాను’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, బాల్య వివాహాన్ని తప్పించుకొని ఐఏఎస్ వైపు అడుగులు

‘‘డిగ్రీలో చేరినప్పుడు ప్రొఫెసర్ గుప్తాను కలిశాను. ఇంగ్లిష్ మెరుగుపడాలంటే ఇంగ్లిష్ పత్రికలు చదవాలని ఆయన సూచించారు. కాలేజీ రోజుల్లో రోజూ ఉదయం మూడు గంటలపాటు ఇంగ్లిష్ పత్రికలు చదివేవాణ్ని. చదివేటప్పుడు ప్రతి పదంపై దృష్టి పెట్టేవాణ్ని. వాక్య నిర్మాణాన్ని కూడా జాగ్రత్తగా గమనించేవాణ్ని’’అని ఆయన తెలిపారు.

‘‘రోజూ పత్రికలు చదవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, సామాజిక పరిస్థితులు లాంటి అంశాలపై అవగాహన వచ్చేది. పత్రికల వల్లే నేను ఇంగ్లిష్ మొదటి సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేయగలిగాను’’అని ఆయన చెప్పారు.

‘‘ఆ తర్వాత ఎంఏ చేశాను. చదువు పూర్తయ్యాక ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నెలకు జీతం రూ.2,500 వచ్చేది’’అని ఆయన తెలిపారు.

‘‘ఇతరుల్లా నేను కూడా ప్రభుత్వ ఉద్యోగంతో సంతృప్తి చెంది ఉండొచ్చు. కానీ, నాకు ఏదైనా కొత్తగా చేయాలని అనిపించింది’’అని ఆయన చెప్పారు.

తుషార్ సుమేరా

ఫొటో సోర్స్, Facebook/Tushar D. Sumera,IAS

యూపీఎస్సీ కోసం ప్రయత్నం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి ప్రయత్నించాలని అనుకున్నప్పుడు తన మనసులో వచ్చిన ఆలోచనలు గురించి తుషార్ వివరించారు.

‘‘ఆ రోజుల్లో సురేంద్రనగర్ జిల్లా డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా వినోద్ రావ్ వచ్చారు. ఆయన్ను నేను కలిశాను. ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పాను’’అని తుషార్ చెప్పారు.

‘‘ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత, మీరు కూడా ఐఏఎస్ కావొచ్చని ఆయన చెప్పారు. ఈ సారి వచ్చేటప్పుడు మీతోపాటు మీ నాన్న గారిని కూడా తీసుకురండని అన్నారు’’అని ఆయన తెలిపారు.

‘‘ఐఏఎస్ అధికారి అయితే ఎలా ఉంటుందో ఆయన మా నాన్నగారికి వివరించారు. ఇది సాధారణ ఉద్యోగం కాదని చెప్పారు. దీంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది’’అని ఆయన చెప్పారు.

‘‘అప్పుడే అంబేడ్కర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆమ్రపాలి మర్చెంట్.. ఐఏఎస్ అవ్వాలనుకునే యువతకు సాయం చేస్తున్నారని తెలిసింది. నేను ఆమెను కలిశాను. ఆమె కూడా నాలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కారణమయ్యారు’’అని తుషార్ వివరించారు.

వీడియో క్యాప్షన్, క్షమాబిందు: తనను తాను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి సెక్స్ గురించి ఏమన్నారంటే...

ఈ ప్రయాణంలో తన తండ్రికి కూడా ప్రధాన పాత్ర ఉందని తుషార్ తెలిపారు. ‘‘ఈ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలని మా నాన్న చెప్పారు. లక్ష్యాలను మధ్యలో వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు’’అని తుషార్ వివరించారు.

అయితే, జీవితంలో మంచి భరోసానిచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టడం మంచిపనేనా? అనే సందేహం మొదట్నుంచీ తనను వెంటాడేదని ఆయన చెప్పారు.

‘‘అప్పుడు నా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. వీటిలో మొదటిది సెలవు పెట్టడం, రెండోది పూర్తిగా ఉద్యోగం మానేయడం. సెలవు పెడితే నా విద్యార్థులపై ప్రభావం పడుతుందని భావించాను. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, యూపీఎస్సీకి సన్నద్ధం కావడం మొదలుపెట్టాను’’అని తుషార్ చెప్పారు.

యూపీఎస్సీకి సన్నద్ధం అయ్యేందుకు తుషార్.. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేషన్‌(ఎస్‌పీఐపీఏ)లో చేరారు. అక్కడ పాఠాలు చెప్పే సతీశ్ పటేల్, జశ్వంత్ ఆచార్యలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని ఆయన అన్నారు.

పరీక్షలకు సన్నద్ధం అయ్యేటప్పుడే తన నైపుణ్యాలకు తుషార్ పదునుపెట్టారు.

వీడియో క్యాప్షన్, కొడుకు ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే...

‘‘మార్కుల షీటును పట్టించుకోవద్దు’’

పరీక్షల సమయంలోనూ తన కుటుంబం కష్టాలను ఎదుర్కొందని తుషార్ అన్నారు. ‘‘సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి వచ్చిన తర్వాత నేను సురేంద్రనగర్ వెళ్లాను. నన్ను చూడటానికి అక్కడకు మా తమ్ముడు వచ్చాడు. మా నాన్నను అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారని, ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని చెప్పాడు. ఆ శస్త్రచికిత్స తర్వాత మా నాన్న నాలో మరింత స్ఫూర్తి నింపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు నీ లక్ష్యాన్ని సాధించాలని ఆయన నాతో అన్నారు’’అని తుషార్ చెప్పారు.

‘‘ఇంట్లో నేను పెద్దవాడిని అయినప్పటికీ, మా తమ్ముళ్లే అన్నీ చూసుకునే వారు. దీంతో చదువుపై నేను ఎక్కువ శ్రద్ధ పెట్టగలిగాను. ఐదేళ్లపాటు ఇంట్లో ఒక్క పండగకు కూడా రాలేదు. సెలవు అన్నదే లేకుండా కష్టపడ్డాను. మన తెలివికి మార్కుల షీటు కొలమానం కాదని నేను భావిస్తాను. ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ, కుటుంబ సాయమే ఈ పోరాటంలో విజయం సాధించడానికి తోడ్పడతాయి’’అని ఆయన అన్నారు.

తుషార్ మాటలతో వాజుభాయ్ పర్సానా, భాగ్యేష్ ఝా కూడా అంగీకరించారు. వీరిద్దరూ ఐఏఎస్‌లుగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

వీడియో క్యాప్షన్, IAS, IPS అధికారుల డెప్యుటేషన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మధ్య వివాదం ఎందుకు?

తను ఎదుర్కొన్న కష్టాలపై వాజుభాయ్ మాట్లాడుతూ.. ‘‘మేం చిన్న గ్రామంలో ఉండేవాళ్లం. మాకు పెద్దగా ఏమీ తెలియదు. అయితే, చిన్నప్పుడు నాకు దొరికిన టీచర్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. నన్ను మంచి ప్రభుత్వ ఉద్యోగిలా వారే మార్చారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఉంటే మార్కుల గురించి ఎవరూ పట్టించుకోరు. నిబద్ధత, ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ మనకు విజయాలను తెచ్చిపెడతాయి’’అని అని చెప్పారు.

వాజుభాయ్ చెప్పిన అంశాలతో భాగ్యేష్ కూడా అంగీకరించారు. ‘‘అప్పట్లో నేను టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేసే వాణ్ని’’అని భాగ్యేష్ చెప్పారు. నిబద్ధత, కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసమే విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

‘‘మార్కుల షీటు కంటే ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమే ముఖ్యం’’అని మరోసారి భాగ్యేష్ పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)