జపాన్ బీచ్‌లో మనుషులపై దాడులు చేస్తున్న డాల్ఫిన్.. అరచేతులపై కరవడంతో భయాందోళనలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లియో శాండ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సాధారణంగా డాల్ఫిన్లను మనుషులకు హాని తలపెట్టని జీవులుగా చూస్తారు. కానీ, జపాన్ సముద్ర తీరంలో ఒక డాల్ఫిన్ ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తుల అరచేతులను కరిచింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఒకరిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
డాల్ఫిన్లు మనుషుల పై దాడి చేయడం గురించి అరుదుగా వింటాం. అలా అని అవి పూర్తిగా దాడి చేయవని చెప్పేందుకు కూడా లేదు.
డాల్ఫిన్ ఒక వ్యక్తి రెండు అరచేతులను గాయపరిచినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అదే రోజు మధ్యాహ్నం మరో వ్యక్తిని కూడా కరవడంతో ఆయన ఎడమ చేతికి గాయాలయ్యాయి.
గత వేసవిలో ఇదే డాల్ఫిన్ కనీసం ఆరుగురిని గాయపరిచి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జపాన్‌లోని ఫుకుయ్ నగరానికి దగ్గర్లో ఉన్న కొషీనో బీచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ బీచ్ ఈత కొట్టేవారికి, డాల్ఫిన్‌లకు కూడా ప్రసిద్ధి.
సముద్ర తీరం దగ్గరకు డాల్ఫిన్లు రాకుండా ఉండేందుకు అధికారులు తీరంలో అల్ట్రాసోనిక్ ట్రాన్స్మిటర్లను ఏర్పాటు చేశారు. వీటి నుంచి వచ్చే హై ఫ్రీక్వెన్సీ శబ్దాలు డాల్ఫిన్లను తీరం దగ్గరకు రాకుండా అడ్డుకుంటాయి.
తీరంలో ఈత కొట్టేందుకు వచ్చే వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. నీటిలోకి వెళ్లడం ఆపమని ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఈ దాడులను చేస్తున్న డాల్ఫిన్ జాతి గురించి స్పష్టత లేదు.
ఈ తీరంలో ఉండే డాల్ఫిన్లు మనుషులతో కలిసి మెలిగేందుకు అలవాటు పడ్డాయని స్థానిక మీడియా పేర్కొంది. సముద్రంలో నీరు మోకాలు లోతు ఉండే చోట కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయని చెప్పారు.
మనుషులతో పాటు ఈత కొట్టేందుకు డాల్ఫిన్లు చాలా ఒత్తిడికి గురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల డాల్ఫిన్ల ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు.
2013లో ఐర్లాండ్‌లో10 రోజుల వ్యవధిలో ఒకే డాల్ఫిన్ ఇద్దరు మహిళలను గాయపరిచింది. అందులో ఒకరికి పక్కటెముకలు బాగా గాయపడ్డాయి.
ఒక ఏడాది తర్వాత ఐదుగురు వ్యక్తులను డాల్ఫిన్ చుట్టుముట్టడంతో వారిని ఐరిష్ తీరం నుంచి రక్షించాల్సి వచ్చింది.
ఒక్కొక్కసారి డాల్ఫిన్లు మనుషులతో మాత్రమే కాకుండా తోటి సముద్ర జీవులతో కూడా చాలా హింసాత్మకంగా ప్రవర్తిస్తాయని అంటారు.
కార్న్‌వాల్‌లో డాల్ఫిన్లు చేసే దాడిలో భాగంగా సూది ముక్కుతో ఉండే ఒక సముద్ర జీవిని గాలిలోకి ఎగరేస్తున్నట్లు కనిపించాయి.
ఇవి కూడా చదవండి:
- 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













