‘ఎథికల్ సఫారీ’లు ఈ డాల్ఫిన్లను బతికిస్తాయా?

గోవా, హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు

ఫొటో సోర్స్, Terra Conscious

    • రచయిత, కారా తేజ్‌పాల్
    • హోదా, అటవీప్రాణుల పరిరక్షురాలు

పూజా మిత్ర మమ్మల్ని బోటును గట్టిగా పట్టుకొమ్మని చెప్పారు. కెప్టెన్ సామ్ బోటును చపోరా నదీముఖం నుంచి అరేబియా సముద్ర జలాల్లోకి పోనిచ్చాడు. తీరం నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్లాక సామ్ మోటర్‌ను నిలిపేసి, తన చేతితో ఒక వైపు చూపాడు. అప్పుడు కనిపించాయి - హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు.

అవి గాలిని వదులుతూంటే ఒక రకమైన శబ్దం వెలువడుతోంది. మేం కొద్ది దూరం నుంచి వాటిని గమనించాం. సూర్యుడు పైకి ఎగబాకుతుండగా తిరిగి తీరానికి చేరుకున్నాం.

అక్కడికి దక్షిణాన ఉన్న గోవాలోని సింక్వెరిమ్ బీచ్‌లో డాల్ఫిన్‌లను చూసే అనుభవం అంత బాగుండదు. అక్కడ డజన్ల కొద్దీ ఆపరేటర్లు పోటీ పడుతూ మనిషికి కేవలం 300 రూపాయలు తీసుకుని డాల్ఫిన్లు చూపిస్తామని చెబుతుంటారు. ప్రతి ఉదయం పర్యాటకులను తీసుకుని ఆపరేటర్లు డాల్ఫిన్లను అన్వేషిస్తూ సముద్రంలోకి వెళుతుంటారు.

పూజా సింక్వెరిమ్‌కు 2014లో వచ్చారు. 'డబ్యూడబ్యూఎఫ్-ఇండియా గోవా మెరైన్ ప్రోగ్రామ్' సమన్వయకర్తగా ఆమె రెండేళ్లు ప్రముఖ పర్యావరణవేత్త దీపానీ సుతారియా కింద శిక్షణ పొందారు. దీపానీ నేతృత్వంలో డబ్యూడబ్యూఎఫ్ బృందం డాల్ఫిన్ వాచింగ్‌పై మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే 40 మంది బోటు యజమానులకు కూడా శిక్షణను ఇచ్చారు.

గోవా, హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు

ఫొటో సోర్స్, Meesha Holley

80 డాల్ఫిన్ల సమూహం

నేను పూజాను కలిసినపుడు ఆమె స్థాపించిన డాల్ఫిన్ల పరిరక్షణ సంస్థ 'టెర్రా కాన్షియస్' వయసు ఏడాది కూడా లేదు.

''నేను బోటు యజమానులందరికీ ఎథికల్ టూరిజం కూడా లాభదాయకమే అని నచ్చచెప్పాల్సి వచ్చింది. టూర్ ఆపరేటర్లు, పర్యాటకుల మధ్య సరైన సంబంధాలు నెలకొల్పాల్సి వచ్చింది'’ అని ఆమె తెలిపారు.

గోవాలో కనిపించే హంప్‌బ్యాక్ డాల్ఫిన్లను భారత వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1972 కింద అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతుల జాబితాలో చేర్చారు. ఈ డాల్ఫిన్లు తీరానికి చాలా దగ్గరగా నివసిస్తాయి. అయితే అప్పుడప్పుడూ తమ ఆహారమైన మేవ చేపలను వేటాడుతూ నదుల్లోకి వస్తుంటాయి.

''సాధారణంగా మాకు నాలుగైదు డాల్ఫిన్లు కలిసి గుంపుగా కనిపిస్తాయి. కానీ ఒకసారి మేం 80 డాల్ఫిన్ల సమూహాన్ని చూశాం'' అని చందు చెప్పాడు. చందు టెర్రా కాన్షియస్ బృందంలో ఒకరు. అతని కుటుంబం మహారాష్ట్ర నుంచి వలస వచ్చి రెండు తరాల క్రితం గోవాలో స్థిరపడింది.

గోవా, హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు

ఫొటో సోర్స్, Meesha Holley

ప్రొపెల్లర్‌ల దెబ్బకు..

టెర్రా కాన్షియస్ అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా డాల్ఫిన్లను దగ్గరగా చూసే ఏర్పాటు చేస్తుంది. డాల్ఫిన్లు కనిపించగానే వాటికి 50 మీటర్ల దూరంలో కెప్టెన్ బోటు మోటర్‌ను ఆపేస్తాడు. డాల్ఫిన్లు కనిపించినా, కనిపించకపోయినా, ప్రతి ట్రిప్ ద్వారా బోటు ఆపరేటర్లకు నికరమైన ఆదాయం లభిస్తుంది. పర్యాటకులకు కూడా మంచి అనుభూతి మిగులుతుంది.

సామ్ మోర్జిమ్‌లో 13 ఏళ్లుగా డాల్ఫిన్లను చూపించే బోట్లను నడుపుతున్నాడు. మొదటిసారి పూజా అతని వెంట వెళ్లినపుడు, సామ్ డాల్ఫిన్ల గుంపు వెంటపడ్డాడు. దాంతో బోటును ఆపాలంటూ పూజ గట్టిగా అరవాల్సి వచ్చింది.

మేం జెట్టీ (వారధి)పై ఉన్న చిన్న గుడిసెలో కూర్చుని ఉండగా, రాజేశ్ అక్కడికి వచ్చాడు. అతను తన సోదరులతో పాటు మరో డాల్ఫిన్ బోటును నడుపుతున్నాడు. అతని మూడ్ అప్పుడంత బాగా లేదు. అప్పుడే ఒడ్డుకు ఒక డాల్ఫిన్ కళేబరం కొట్టుకువచ్చింది. బహుశా ఏదైనా చేపలు పట్టే ట్రాలర్ ప్రొపెల్లర్ తగిలి అది మరణించి ఉండొచ్చు.

గోవా తీరంలో ఏవైనా సముద్ర జీవులు కానీ తాబేళ్లు కానీ మరణిస్తే టెర్రా కాన్షియస్ వెంటనే ఆ సమాచారాన్ని సేకరిస్తుంది. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇతర సభ్యులకు ఆ సమాచారాన్ని చేరవేస్తారు. గత 11 నెలలో ఇలా 81 అసహజ మరణాలను గుర్తించారు. వాటిలో 20 డాల్ఫిన్లు, ఒక తిమింగలం, 52 తాబేళ్లు ఉన్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్టులో చాలా డాల్ఫిన్లు అవి ఉండాల్సిన బరువుకన్నా తక్కువగా ఉన్నట్లు తేలింది. అవి ఎక్కువ భాగం ట్రాలర్ల కారణంగానే మరణించినట్లు గుర్తించారు.

గోవా, హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు

ఫొటో సోర్స్, Meesha Holley

ప్రస్తుతం వర్షాకాలం. నదీ ప్రవాహం పెరిగితే కొద్ది కాలం పాటు డాల్ఫిన్లకు మానవ కార్యకలాపాల నుంచి విరామం లభిస్తుంది. ఇలాంటి సమయంలో డాల్ఫిన్‌లను చూపించే బోటు యజమానులు తెగిపోయిన తమ వలలను కుట్టుకుంటారు. బోటు రిపేర్లుంటే చేసుకుంటారు. కొంత మంది టెర్రా కాన్షియస్‌తో కలిసి శిక్షణ పొందుతారు.

అయితే పర్యాటకులు 'ఎథికల్ డాల్ఫిన్ సఫారీ'ని అనుసరించనంత వరకు టెర్రా కాన్షియస్ లేదా దాని భాగస్వాముల శ్రమ నిష్ఫలమే.

గోవా చాలా జీవ వైవిధ్యం కలిగినది. కానీ ఆ సహజమైన సంపద బొగ్గు మైనింగ్, రియల్ ఎస్టేట్, అడ్డూఅదుపూ లేని ట్రాలర్లు, అనియంత్రిత టూరిజం కారణంగా ప్రమాదంలో పడుతోంది. అయినా పూజా మిత్ర, చందు, సామ్, రాజేశ్‌లాంటి నవతరం దాన్ని రక్షించడానికి చాలా శ్రమిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)