బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?

కుడుముల పెద్ద బయన్న
ఫొటో క్యాప్షన్, కుడుముల పెద్ద బయన్న
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోరుతూ భారతదేశంలో వివిధ మార్గాల్లో పోరాటాలు సాగాయి. అనేక వర్గాలకు చెందిన వారు అందులో పాల్గొన్నారు. తొలుత ఉన్నత విద్యావంతులు స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం గొంతెత్తితే.. ఆ తర్వాత సామాన్యులు, ఆదివాసులు సైతం అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు.

ఈ ఉద్యమాలు వివిధ దశల్లో, వివిధ రూపాల్లో సాగాయి. అయితే అలాంటి స్వాతంత్ర్య పోరాటంలో కొన్ని తరగతులకు చెందిన ఉద్యమాలకు మాత్రం చరిత్రలో పెద్దగా చోటు దక్కలేదు. వాటిలో కొన్నింటికి ఇటీవల ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’’లో భాగంగా ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ గిరిజన తెగలు కూడా బ్రిటిష్‌ వారిపై తిరుగుబాట్లు చేశాయి. అందులో చెంచులకు చెందిన పోరాటాలకు ఇటీవల అధికారిక గుర్తింపు దక్కింది.

నల్లమల అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యాలను ఎదురించిన ఇద్దరు చెంచు జాతి గిరిజన వీరుల విగ్రహాలను తాజాగా ఏర్పాటు చేసి వారిని స్మరించుకున్నారు. ఈ పరిణామం తమ చెంచులకు లభించిన గుర్తింపుగా కొందరు భావిస్తున్నారు.

ఇలాంటి తెరమరుగైన అనేక మంది స్వాతంత్ర్య సంగ్రామ యోధులను గుర్తించాల్సిన అవసరం ఉందని చరిత్ర పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

హనుమంతప్ప
ఫొటో క్యాప్షన్, హనుమంతప్ప

అధికారిక గుర్తింపు...

చెంచుల హక్కుల కోసం, అటవీ సంపద కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకుడిగా ఐటీడీఏ ప్రస్తావించిన ఇద్దరు స్వంతంత్ర్య పోరాట యోధుల్లో ఒకరు కుడుముల పెద్ద బయన్న. రెండో వ్యక్తి హనుమంతప్ప.

ఇప్పుడు పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఉన్న తుమ్మబయలు గ్రామంలో ఈ ఇద్దరి విగ్రహాలను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఇటీవల ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మునిసిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ కలిసి వాటిని ఆవిష్కరించారు.

"చెంచులపై బ్రిటిష్ పెత్తనానికి వ్యతిరేకంగా వారు ఉద్యమించారని మాకు చిన్నప్పటి నుంచి మా తాతలు, తండ్రులు చెప్పేవారు. ఆ ఇద్దరినీ మా పూర్వీకులు, మేము కూడా ఆరాదించేవాళ్లం. కథలు, కథలుగా వారి సాహసాలను వినిపించేవారు. దీనిపై అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ వచ్చాము. కానీ ఎవరూ స్పందించలేదు. గతంలో విజ్డెన్ పత్రికలో కుడుముల బయన్న పోరాటం గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత చెంచుల జీవితాల గురించి రాసిన వివిధ పత్రికల్లో కూడా వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు వారిని స్వతంత్ర్య సమరయోధులుగా గుర్తించడం ఆనందంగా ఉంది"అని తుమ్మబయలు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, కుడుముల పెద్ద బయన్న కుటుంబ వారసుడిగా చెప్పుకుంటున్న మూగన్న అన్నారు.

చెంచుల హక్కుల కోసం పోరాడిన వారిని ప్రభుత్వం గుర్తించి, విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న మా కోరికను మన్నించడం ఆనందంగా ఉందన్నారు.

చెంచులు

తిరుగుబాటుతో..

పెద్ద బయన్న, హనుమంతప్ప కూడా అటవీ హక్కుల కోసం, వన్యప్రాణుల సంరక్షణ కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినట్టు ఐటీడీఏ విడుదల చేసిన పత్రాల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్ద దోర్నాల మండలం పెద్ద చేమ గ్రామానికి చెందిన పెద్ద బయన్నను, పెద్ద బయలోడు అని స్థానికంగా పిలిచేవారు. అటవీ సంపదపై పన్నులు, పులి, జింక చర్మాలతో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణపై అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటిని చాలాకాలం పాటు భరిస్తూ వచ్చిన చెంచులను సమీకరించి బయలోడు ఎదురుతిరిగారు. తుమ్మలబైలు గ్రామాన్ని స్థావరంగా చేసుకుని తిరుగుబాటు చేశారు.

ఆ సమయంలో బ్రిటిష్ జెండాను ఎగురవేయాలని ఆదేశించిన ఉత్తర్వులను ఉల్లంఘించిన బయలోడు, చెంచులతో కలిసి విల్లంబుల సాయంతో బ్రిటిష్ పాలకులను ఎదుర్కోవడం మొదలెట్టాడు. సమీపంలోని పిట్టబీతల బొక్క అనే ప్రాంతంలో స్థానికులను దాచిపెట్టి, తాను బ్రిటిష్ వారిని పక్కదారి పట్టించి, పదుల సంఖ్యలో బ్రిటిష్ సైన్యాలను తుదముట్టించడంతో విజయవంతమయ్యారు. ఈ పరిణామం పట్ల ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టించిన వారికి ఆనాడే రూ. 10వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

అదే సమయంలో పెచ్చెరువు మీదుగా తుమ్మబయలు చేరుకున్న బ్రిటిష్ అధికారులు స్థానిక చెంచులపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో తన వారి ప్రాణాలను కాపాడేందుకు తానే ముందుకొచ్చి లొంగిపోయిన పెద్ద బయన్నను చెట్టుకి కట్టేసి 1938 ఏప్రిల్ 25న కాల్చి చంపినట్టు ఐటీడీఏ పేర్కొంది.

కుడుముల పెద్ద బయన్న
ఫొటో క్యాప్షన్, కుడుముల పెద్ద బయన్న

అదే దారిలో హనుమంతప్ప..

పెద్ద బయలోడు పోరాటం సాగిస్తున్న సమయంలోనే కర్నూలు జిల్లా కొత్తపల్లిలో జన్మించిన మరో చెంచు జాతి యువకుడు హనుమంతప్ప కూడా పోరాటానికి దిగారు. ఈయన మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నారు. బ్రిటిష్ వారి సిబ్బంది స్థానిక చెంచు మహిళల పట్ల వ్యవహరించే తీరుతో ఆయన రగిలిపోయారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు చెంచు పెంటల్లో స్థానికులను సమీకరించి ఆయన గ్రూపులుగా ఏర్పాటు చేశారు. మరోవైపు హనుమంతప్పకు పెద్ద బయన్న పోరాటం కూడా తెలిసి ఆయనతో చేతులు కలిపారు.

పెద్ద బయన్న, హనుమంతప్ప ఏకకాలంలో వివిధ చెంచు గూడెంలలో ఉద్యమానికి సిద్ధం కావడంతో వారివురిని బ్రిటిష్ సైన్యం బంధించింది. చివరకు ఏప్రిల్ 25, 1938 నాడే బయన్నతో పాటుగా హనుమంతప్పను కూడా చెట్టుకి కట్టేసి కాల్చి చంపారని ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఐటీడీపీ వెల్లడించింది.

చెంచు జాతికి స్వేచ్ఛ కోరుతూ అసులువు బాసిన ఈ ఇరువురు చెంచు యోధులు అందరికీ చిర స్మరణీయం, స్ఫూర్తిదాయకం అంటూ కూడా పేర్కొంది.

హనుమంతప్ప
ఫొటో క్యాప్షన్, హనుమంతప్ప

ఇంకా చాలామందే ఉంటారు..

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఏకరూప సదృశ్యంగా లేదని చరిత్ర అధ్యాపకుడు పీఎస్ ఆంజనేయులు అన్నారు.

‘‘జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొన్ని ప్రధాన పట్టణాల్లో పోరాటం జరిగింది. అదే సమయంలో వివిధ సంఘాలు కూడా గ్రామ స్థాయిలో పోరాటాలు చేశాయి. అటవీ ప్రాంతంలో 1980ల నుంచే తిరుగుబాట్లు జరిగాయి.

వాటిని బ్రిటిష్ వారి గెజిట్‌లో కూడా ప్రస్తావించారు. అల్లూరి సారథ్యంలో మన్యం తిరుగుబాటుతోపాటు నల్లమలలో చెంచులు కూడా స్థానికంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కదిలారు. తమ గూడెంలలోకి బ్రిటిష్ వారు రాకుండా అడ్డుకున్నారు. తమ హక్కులను హరిస్తున్నారనే ఆందోళనతో వారిని తరిమికొట్టేందుకు కూడా పూనుకున్నారు. అందులో పెద్ద బయలోడు, హనుమంతప్ప వంటి వారు ముఖ్యులు’’అని ఆయన తెలిపారు.

ఆనాటి పోరాటంలో అనేక మంది పాల్గొన్నారని, వారికి సంబంధించి చరిత్రను ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు. చరిత్రలో కూడా అవకాశం ఉన్న వారికే చోటు దక్కుతుందని, ఆదివాసీ వీరులు అనేక మందిని నేటితరం గుర్తించుకోకపోవడానికి అదో కారణమని అన్నారు.

వీడియో క్యాప్షన్, కుమ్రం భీము ఎవరు? నిజాంపై ఎందుకు పోరాటం చేశారు?

చెంచులు ఎవరు

దేశంలోనే అంతరించిపోతున్న ఆదివాసీ జాతుల్లో ఒకటిగా చెంచులను కేంద్రం గుర్తించింది. ఇతర ఆదివాసీ గ్రూపులకు భిన్నంగా చెంచుల జీవనం ఉంటుంది. వారిని ప్రిమిటివ్ వల్‌నరబుల్ ట్రైబల్ గ్రూప్(పీవీటీజీ)గా పేర్కొంది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో చెంచుల జీవనం కనిపిస్తుంది. ప్రాచీన సంచార తెగలలో ఇది ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు ఎక్కువగా కనిపిస్తుంటారు. కృష్ణా నదిలో చేపల వేట, ఇతర అటవీ ఫలాల సేకరణ ఆధారంగా జీవనం సాగిస్తూ ఉంటారు. క్రమంగా వ్యవసాయం చేస్తూ కొన్నిరకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంనాటి మహబూబ్‌నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతాలలో ప్రస్తుతం వారు జీవిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిళ లక్ష్మీనరసింహా స్వామి దేవాలయాలు చాలాకాలం పాటు చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావించుకుంటారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరిగే పూజాకార్యక్రమంలో చెంచులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు పార్వతీ దేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు.

చెంచుల అక్షరాస్యత అతి స్వల్పం. అదే సమయంలో పులుల అభయారణ్యం కోసమంటూ పలు చెంచు పెంటలను బలవంతంగా ఖాళీ చేయించడం వంటి పరిణామాలు గతంలో కొన్ని వివాదాలకు దారితీశాయి. వారికి తగిన పరిహారం కూడా ఇవ్వకుండా గూడెం నుంచి ఖాళీ చేయించడం పట్ల అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. చెంచుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేసింది.

వీడియో క్యాప్షన్, ఆ గిరిజనులంతా తమ దేవతకు కనుబొమ్మలు మొక్కుగా ఇవ్వాల్సిందే.. లేకపోతే..

చెంచులను కాపాడాలి..

అంతరించిపోతున్న చెంచుల పోరాట యోధులకు ఇన్నాళ్లకు గుర్తింపు వచ్చిందని ఉత్తా లక్ష్మమ్మ అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాల కోసం ఆమె, తన భర్తతో కలిసి స్థలం అందించారు.

‘‘మా జాతి వీరులను గుర్తించుకోవాలని మా తండ్రులు చెప్పేవారు. ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. చెంచులు కనుమరుగయిపోతున్నారు. వారిని కాపాడాలి. అటవీ హక్కులతో పాటుగా చెంచుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలి. పులుల కోసం చెంచులను గ్రామాల నుంచి తరిమేసే బదులుగా, అడవి, పులులను కాపాడుతున్న చెంచులకు తగిన అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం’’అని ఆమె బీబీసీతో అన్నారు.

గిరిజన వీరులను గుర్తించాము..

దేశ విముక్తి ఉద్యమంలో పోరాడిన అనేక మందికి తగిన గుర్తింపు దక్కలేదనే వాదన ఉందని, తమ ప్రభుత్వం గిరిజన వీరులకు కూడా గుర్తింపునిస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.

"చెంచులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడిన వారి గురించి మా ప్రభుత్వానికి సమాచారం రాగానే స్పందించాము. ఐటీడీఏ నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేశాము. వారిచరిత్రకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాము. తెలుగు నేల నలుమూలలా గిరిజనులు అనేక పోరాటాలు చేశారు. వాటికి తగిన ప్రాధాన్యత దక్కలేదు. అందుకే ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా ఇది చేశాము. అన్ని గిరిజన తెగల్లోనూ ఇలా పోరాడిన వారిని గౌరవిస్తాం. అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి గిరిజనుల పోరాటానికి గౌరవాన్నికల్పించాము. చెంచుల సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వారి సంక్షేమానికి పాటుపడతాం" అంటూ ఆయన బీబీసీకి వివరించారు.

ఇంతకాలంగా ఐటీడీఏ ఈ విషయంలో ఎందుకు జాప్యం చేసిందనే దానిపై తమ వద్ద సమాచారం లేదని శ్రీశైలం ఐటీడీఏ సహాయక ప్రాజెక్ట్ అధికారి బీబీసీకి తెలిపారు.

తెరమరుగైన వారు ఇంకా ఉన్నారు..

చెంచులను ఐక్యం చేసి బ్రిటీష్ వారిపై పోరాడిన వీరులకు సకాలంలో గుర్తింపు రాలేదని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎల్ రమేష్ అన్నారు. చరిత్రకు ఎక్కని అనేక మంది వీరులకు ఇటీవల ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుర్తింపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.

‘‘చెంచుల తిరుగుబాటు గురించి చాలామంది దగ్గర విన్నాం. కానీ తగిన రాత పూర్వక ఆధారాలు లేవు. పెద్ద బయ్యన్న, హనుమంతప్పకు గుర్తింపునివ్వాలంటూ వారి వారసులు చాలా లేఖలు రాశారు. అనేకమంది అధికారులకు వినతిపత్రాలు కూడా అందించారు. కానీ తగిన పరిశోధన జరగలేదు. వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకోలేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే దీనికి కారణం. చెంచు జాతి గిరిజనుల్లో తమ పెద్దలుగా వారి గురించి కథలు నేటికీ చెబుతూ ఉంటారు. వీరులుగా వారిని పూజిస్తారు. వీరి విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించలేదు. ఇన్నాళ్లకు వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా స్వతంత్ర్యపోరాటంలో వారి పాత్రను గుర్తించడం అభినందనీయం’’ అని బీబీసీతో అన్నారు రమేష్.

తెరమరుగైన అనేక మంది స్వతంత్ర్య సమరయోధులను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వారి పోరాటాలను భావితరాలకు తెలియజేసే ప్రయత్నం జరగాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)