ఉషా మెహతా: స్వాతంత్ర్య పోరాట సమయంలో ఓ యువతి ‘రహస్య రేడియో’ ఎలా నడిపించారంటే...

ఉషా మెహతా

ఫొటో సోర్స్, Mani Bhavan Gandhi Sangrahalaya

    • రచయిత, పార్థ్ పాండ్య, రవి పర్మార్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బొంబాయి (ఇప్పుడు ముంబయి)లోని గోవాలియా టాంక్ గ్రౌండ్‌లో 1942 ఆగస్టు 8న ఓ పెద్ద సభ జరిగింది. గాంధీ చెప్పే మాటలను వినాలని, ఆ రోజు అక్కడికి వేల మంది వచ్చారు.

ఆ సభలో గాంధీ ప్రసంగిస్తూ... ‘‘ఈ రోజు నేను మీకో నినాదం ఇస్తున్నా. దీన్ని హృదయంలో ఉంచుకోండి- డూ ఆర్ డై’’ అని అన్నారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చేరాలని ప్రజలను అభ్యర్థించారు.

అప్పుడు సభలో పాల్గొన్నవారిలో ఉషా మెహతా అనే ఓ యువ విద్యార్థిని కూడా ఉన్నారు.

నిజంగానే గాంధీ ‘డూ ఆర్ డై’ నినాదానికి ఆమె తన హృదయంలోనే స్థానం ఇచ్చారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో తన వంతు పాత్ర పోషించారు.

ఉషా మెహతా

ఫొటో సోర్స్, ‘Freedom Fighters remember’

రహస్య రేడియో

‘క్విట్ ఇండియా’ ఉద్యమం మొదలవడంతో గాంధీ సహా కాంగ్రెస్‌లోని ప్రధాన నేతలను బ్రిటీష్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. వాళ్లందరినీ నిర్బంధంలోకి తీసుకోవడం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలన్నది బ్రిటీష్ ప్రభుత్వ ఉద్దేశం.

అయితే, అప్పటికే నాయకులు ఆ ఉద్యమం చాప కింద నీరులా విస్తరించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు చేశారు.

అలాంటి ఓ ఏర్పాటే ‘రహస్య రేడియో’. చరిత్ర పుస్తకాల్లో ‘కాంగ్రెస్ రేడియో’గా ఇది పేరుకెక్కింది.

ఉషా మెహతా కథ ఈ రహస్య రేడియోతో ముడిపడినదే.

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోని సరస్ అనే గ్రామంలో 1920, మార్చి 25న ఉషా మెహతా జన్మించినట్లు సీతా ఓఝా అనే ఆవిడ రాసిన ‘హోమేజ్ టు ఉషా మెహతా’ పుస్తకంలో ఉంది.

ఉషా తండ్రి బ్రిటీష్ పాలనలో జడ్జిగా పనిచేసేవారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత వారి కుటుంబ నివాసం బొంబాయికి మారింది.

ఉషా చిన్నతనంలోనే స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. కానీ, ఆమె తండ్రి ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నారు. అప్పటికి బ్రిటీష్ పాలనలో తాను జడ్జిగా ఉండటమే అందుకు కారణం.

అయితే, ఉషా మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.

నూలు వడకడం, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం, సహాయ నిరాకరణ... ఇలా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె చిన్నతనం నుంచే కార్యకలాపాలు మొదలుపెట్టారు.

ఈ వివరాలన్నీ నవీన్ జోషి రాసిన ‘ఫ్రీడమ్ ఫైటర్ రిమెంబర్’ అనే పుస్తకంలో ఉన్నాయి. ఉషా మెహతాను నవీన్ జోషి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఈ పుస్తకంలో ఉంది.

‘‘బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను గొంతెత్తి అరిచిన మొదటి నినాదం ‘సైమన్ గో బ్యాక్’. అప్పటికి నాకు ఎనిమిదేళ్లు’’ అని ఉషా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

గుజరాత్‌లో అప్పట్లో అబ్బాయిలు ‘వానర సేన’గా ఏర్పడ్డారు. ఉషా లాంటి అమ్మాయిలు ‘మంజర సేన’గా ఏర్పడ్డారు. గుజరాతీలో వానర అంటే కోతి అని, మంజర అంటే పిల్లి అని అర్థం.

అహ్మదాబాద్‌లో ఉషా మెహతా

1942 ఆగస్టులో బొంబాయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సదస్సులో గాంధీ, నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, మౌలానా ఆజాద్ లాంటి నాయకులు ప్రసంగించినప్పుడు ఉషా మెహతా అక్కడ ఉన్నారు.

ఈ ప్రసంగాలు విన్న తర్వాత... ఉషా, ఆమె సహచరులు రహస్య రేడియో స్టేషన్‌ను ప్రారంభించాలన్న కృత నిశ్చయానికి వచ్చారు. అందుకోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు.

‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్’ అనే పుస్తకం ప్రకారం... విఠల్‌దాస్ ఖఖ్కర్, చంద్రకాంత్ ఝవేరి, జగన్నాథ్ ఠాకుర్, నారిమన్ ప్రింటర్, మిర్జా ఈ ‘రహస్య రేడియో స్టేషన్’ కార్యకలాపాలాల్లో భాగమయ్యారు.

స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన వార్తలను ప్రసారం చేస్తూ, ప్రజలను సంఘటితం చేసేందుకు ఈ రహస్య రేడియో పనిచేసేది.

‘‘పత్రికల గొంతు నొక్కి, వార్తలపై నిషేధం విధించినప్పుడు.... దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా సమాచారం చేరవేసేందుకు రేడియో గొప్ప సాధనం’’ అని శంకర్ ఉమాకు 1969లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉషా చెప్పారు.

స్వాతంత్య ఉద్యమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి ఆ రోజుల్లో నిధుల లేమి పెద్ద సమస్యగా ఉండేది. ఉషా బృందం కూడా అదే సమస్యను ఎదుర్కొంది.

‘‘కొంత మంది బంధువులు స్వచ్ఛందంగా వాళ్ల నగలు తెచ్చిచ్చారు. వాటిని తీసుకునేందుకు మేం ఒప్పుకోలేదు’’ అని ఉషా... ఉమా శంకర్‌తో ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, తమ లాగే ఇతర బృందాలు కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఉషా తెలుసుకున్నారు. వాటిని సంప్రదించేందుకు ఆమె ప్రయత్నించారు. అలాంటి ఓ బృందంలోనే నెహ్రూ సన్నిహితుల్లో ఒకరైన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఉన్నారు.

రేడియో స్టేషన్ ఏర్పాటు చేసే ముందు లోహియాను తాను కలిశానని, రేడియో ఏర్పాటులో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని ఉషా చెప్పారు.

ఉషా బృందం కొందరి సాయం తీసుకుంది. ఓ స్నేహితుడి ద్వారా రేడియో ట్రాన్స్‌మిటర్ తయారు చేయించుకుంది. 1942 ఆగస్టు 14న వారి రేడియో ప్రసారాలు మొదలయ్యాయి.

ఉషా మెహతా

ఫొటో సోర్స్, Mani Bhavan Gandhi Sangrahalaya

ఎలా నడిచేదంటే...

‘‘ఇది కాంగ్రెస్ రేడియా. భారత్‌లోని ఓ చోటు నుంచి 42.34 ఎం ఫ్రీక్వెన్సీపై ఇది ప్రసారమవుతోంది’’ అని అర్థం వచ్చేలా ఆ రేడియో ప్రకటన ఉండేది.

ముంబయిలోని చౌపట్టి సమీపంలో ఓ భవనం పైఅంతస్తులో ఓ ప్రసార కేంద్రం నడిచేదని అరుణ్ చంద్ర ‘ద క్విట్ ఇండియా మూమెంట్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

ఉషా బృందం రేడియాకు సాంకేతిక పరమైన సాయం ‘షికాగో అండ్ టెలిఫోన్ కో.’ అందించేది.

‘‘మా రేడియోవి రహస్య కార్యకలాపాలు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తరచూ కొత్త చోట్లకు మారుతూ ఉండేవాళ్లం. మేం ప్రసారాలు అందించిన మూడు నెలల కాలంలో 6-7 సార్లు కొత్త చోట్లకు మారాం ’’ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉషా చెప్పారు.

ఆరంభంలో రోజూ రెండు సార్లు హిందీ, ఇంగ్లీష్‌ల్లో ప్రసారాలు వచ్చేవి. కానీ, ఆ తర్వాత ఒకే బులిటెన్‌కు పరిమతమయ్యారు. రోజూ రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది వరకూ ఇది వచ్చేది.

‘‘భారత్ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక దూతల నుంచి మాకు వార్తలు అందేవి. బొంబాయిలో ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా మాకు ముఖ్యమైన సమాచారం అందిస్తూ ఉండేది. చిట్టగాంగ్ బాంబు దాడి వార్త, జంషెడ్‌పూర్ ఆందోళనలు, బల్లియా ఘటనలపై వార్తలను మొదటగా ప్రసారం చేసింది మేమే. అప్పటి పరిస్థితుల కారణంగా దినపత్రికలు ఈ అంశాల గురించి రాసేవి కాదు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, ప్రజలకు వాస్తవంగా జరుతుగుతున్నదేదో ‘కాంగ్రెస్ రేడియో’ మాత్రమే చెప్పేది’ అని శంకర్ ఉమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉషా మెహతా చెప్పారు.

ఈ రహస్య రేడియా ద్వారా చాలా మంది ప్రముఖులు కూడా ప్రసంగించేవారు.

‘‘ఇప్పటివరకూ మనం ఉద్యమం చేశాం. ఇప్పుడు చేస్తుంది మాత్రం విప్లవం. విప్లవంలో గెలుపో, ఓటమో ఉంటుంది. ఇది ఒక పార్టీ విప్లవం కాదు, మొత్తం జాతి విప్లవం’’ అని లోహియా ఈ రేడియా ద్వారా ఓ సారి ప్రసగించారు.

బ్రిటీష్ పాలనలో బొంబాయి ప్రభుత్వ అదనపు సెక్రటరీగా పనిచేసిన హెచ్‌వీఆర్ అయ్యంగార్ ‘కాంగ్రెస్ రేడియో’ గురించి చెప్పినట్లుగా ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్’ పుస్తకం‌లో కొన్ని విషయాలను పేర్కొన్నారు.

‘‘నేను ఈ రేడియో ప్రసారాలు వినేవాడిని. కాంగ్రెస్ సోషలిస్టు భావజాలం అందులో ప్రస్ఫుటించేది. ‘స్వతంత్ర భారతం రైతులు, కార్మికులు, కూలీలదిగా ఉండబోతుంది’ అని ఓసారి, ‘స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న విప్లవం పేదల కోసం. స్వతంత్ర భారతం కార్మికులది, కర్షకులది’ అని మరోసారి ప్రసారమైంది. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ‘సోషలిస్టుల విప్లవ ఉద్యమం’గా గుర్తించింది’’ అని అయ్యంగార్ చెప్పినట్లు ఆ పుస్తకంలో ఉంది.

బ్రిటిష్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, UNIVERSAL HISTORY ARCHIVE/UIG VIA GETTY IMAGES

చివరికి పోలీసులకు దొరికిపోయారు

ప్రజల్లో కాంగ్రెస్ రేడియోకు మంచి ఆదరణ లభించింది.

అయితే, నిధుల లేమి, ప్రభుత్వ నిఘా ఉషా బృందానికి సమస్యలుగా ఉండేవి.

‘‘వీలైనంతగా తలా ఇంత పోగేసుకుని ఆర్థిక ఇబ్బందులను తీర్చుకున్నాం. కానీ, పోలీసు వ్యానులు నిత్యం మమ్మల్ని వెంబడించేవి. కొన్ని సార్లు వెంట్రుకవాసిలో తప్పించుకున్నాం’’ అని శంకర్ ఉమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉషా చెప్పారు.

చివరికి 1942, నవంబర్ 12న వారిని బ్రిటీష్ ప్రభుత్వ పోలీసులు పట్టుకోగలిగారు.

శంకర్ ఉమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఉషా గుర్తు చేసుకున్నారు.

అంతకు ఒక వారం ముందే షికాగో రేడియో కో. సహా ప్రముఖమైన రేడియో షాపుల్లో పోలీసులు తనిఖీలు చేశారని ఆమె చెప్పారు.

ఓ టెక్నీషియన్ నుంచి పోలీసులు సమాచారం రాబట్టుకోగలిగారు. ఆ తర్వాత నవంబర్ 12న పోలీసులు బాబుభాయ్ ఖఖ్కర్ కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో ప్రసారాలకు సంబంధించిన వస్తువులతో ఉషా అక్కడే ఉన్నారు.

పోలీసులు వస్తున్నట్లు మాకు తెలియగానే, కాంగ్రెస్ రేడియోకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, సాహిత్యాన్ని దాచే ప్రయత్నం చేశామని ఆమె చెప్పారు.

అక్కడి నుంచి వెంటనే ఉషా రికార్డింగ్ స్టేషన్‌కు పరుగుతీశారు. అక్కడ డాక్టర్ లోహియా, ఇతర సహచరులు సాయంత్రం ప్రసారం చేసే కార్యక్రమం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. వారికి విషయాన్నంతా ఉషా వివరించారు.

పోలీసులకు సమాచారం చేరవేసిన టెక్నీషియన్ సహాయకుడి సాయంతో మళ్లీ ఆ రోజు రేడియో ప్రసారాన్ని రోజులాగే ఉషా మొదలుపెట్టారు.

‘‘హిందుస్థాన్ హమారా గీతాన్ని, కొన్ని వార్తలను, ఒక చర్చ కార్యక్రమాన్ని ప్రసారం చేశాం. చివర్లో ‘వందేమాతరం’ గీతాన్ని ప్రసారం చేస్తుండగా పోలీసుల అలికిడి మాకు వినిపించింది’’ అని ఉషా చెప్పారు.

పోలీసు నివేదిక

ఫొటో సోర్స్, ‘Untold Story of Broadcast during Quit India Movem

నాలుగేళ్లు జైల్లో...

పరేఖ్ వాడీ భవనంలోని 106వ నెంబర్ గదిపై రాత్రి 9.05కు పోలీసులు దాడి చేశారు.

‘‘వాళ్లు తలుపులు బద్దలుకొట్టారు. ‘వందేమాతరం’ రికార్డు ప్రసారాన్ని ఆపాలని ఆర్డర్ వేశారు. మేం ఒప్పుకోలేదు. రేడియో ప్రసారం వింటున్న మా సహచరులకు ఆ చప్పుళ్ల ద్వారా మా అరెస్టు విషయం అర్థమవుతూ ఉంది’’ అని ఉషా వివరించారు.

పోలీసులు ట్రాన్స్‌మిటింగ్ సెట్‌ను, రూ.7వేల నుంచి రూ.10వేల విలువ చేసే 120 గ్రామోఫోన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏఐసీసీ సదస్సులకు సంబంధించిన ఫొటోలు, రికార్డింగులు ఉన్న 22 పెట్టెలు కూడా వారికి దొరికాయి.

ఉషా సహా మిగతావారిని అరెస్టు చేసి, లాకప్‌లో పెట్టారు. ఆ మరుసటి రోజు దర్యాప్తు మొదలైంది.

రెండు నెలల దర్యాప్తు తర్వాత ఉషా మెహతా సహా ఐదుగురు నిందితులపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ప్రత్యేక కోర్టులో ప్రముఖ రచయిత కన్నయ్యలాల్ మున్షి నిందితుల తరఫున వాదించారు.

‘‘కోర్టు విచారణ సాగిన ఆరు నెలలు తీవ్రమైన మానసిక హింస అనుభవించా. విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పిస్తామంటూ జైలు అధికారులు ఆశచూపారు. కానీ, నేను అంగీకరించలేదు’’ అని ఉషా చెప్పారు.

చివరికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఉషా మెహతాకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. బాబుభాయ్ ఖఖ్కర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, చంద్రకాంత్ ఝవేరీకి ఒక ఏడాది జైలుశిక్ష విధించింది.

1942 నుంచి 1946 వరకూ ఉషా జైలు శిక్ష అనుభవించారు. 1946 ఏప్రిల్‌లో ఆమె ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు.

‘‘జైలు నుంచి బయటకు వచ్చాక నాకు సంతోషంగా, గర్వంగా అనిపించింది. గాంధీ పిలుపు ‘డూ ఆర్ డై’ని, ఆచరించానన్న సంతృప్తి కలిగింది’’ అని ఉషా అన్నారు.

ఉషా జైలు నుంచి విడుదలయ్యాక పీహెచ్‌డీ చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలోని విల్సన్ కాలేజీలో 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

గాంధీ పీస్ ఫౌండేషన్‌కు అధ్యక్షురాలిగా ఉన్నారు. మణి భవన్ గాంధీ మ్యూజియం, గాంధీ మెమోరియల్ నిధి సంస్థలతో కలిసి పనిచేశారు.

1998లో భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ను ఉషా మెహతాకు అందజేసింది.

ఉషా మెహతా 80 ఏళ్ల వయసులో... 2000, ఆగస్టు 11న కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)