భారత్‌లో ఎయిడ్స్ మందుల కొరత

జైప్రకాష్
    • రచయిత, శరణ్య రిషికేష్
    • హోదా, బీబీసీ న్యూస్

దిల్లీకి చెందిన జైప్రకాష్ (44) ఎయిడ్స్ చికిత్సలో భాగంగా రోజుకు రెండు మాత్రలు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా గత మూడు వారాలుగా రోజుకు 11 మాత్రలు తీసుకుంటున్నారు.

ఎయిడ్స్ చికిత్స కోసం ఆయన తీసుకోవాల్సిన మందుల డోసేజీ లభించకపోవడం వల్లే ఇలా 11 మాత్రలు తీసుకుంటున్నారు. ఆయన తక్కువ డోసేజీ ఉన్న చిన్న పిల్లల మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు.

ఆయన ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ఎయిడ్స్ ఔషధాల పై ఆధారపడుతున్న కొన్ని వేల మంది హెచ్ ఐవీ బాధితుల్లో ఒకరు. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ ) ద్వారా ఎయిడ్స్ చికిత్స కోసం ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది.

దిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) ముందు నిరసనలు చేస్తున్న ఎయిడ్స్ నిరోధక ప్రచారకర్తలతో పాటు ఆయన కూడా ఉన్నారు.

నాకో.. ఔషధ సంస్థలకు టెండర్లను జారీ చేసి మందులను సేకరిస్తుంది.

ఎయిడ్స్ చికిత్సలో భాగంగా సాధారణంగా సూచించే Dolutegravir 50mgకి కూడా తీవ్రమైన కొరత ఉందని ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకిన వారందరికీ చికిత్సలో భాగంగా నాకో ఈ ఔషధాన్ని సూచిస్తుంది.

ఈ మందులను ఎయిడ్స్ బాధితులు ప్రతిరోజూ తీసుకోవాలి. చికిత్సలో అవాంతరాలు చోటు చేసుకోవడం వల్ల వైరల్ లోడ్ పెరిగి హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెంది మందులకు స్పందించే గుణం తగ్గిపోతుందని నిపుణలు చెబుతున్నారు. దీంతో పాటు క్షయ లాంటి ఇన్ఫెక్షన్‌లకు దారి తీసే ప్రమాదం కూడా ఉందని చెబుతారు. ఈ ఔషధాలు ప్రైవేటు మెడికల్ షాపుల్లో లభిస్తున్నప్పటికీ, వాటిని కొనుక్కోగలిగే శక్తి అందరికీ ఉండదు.

హరిశంకర్ సింగ్

గతంలో ఏఆర్‌టీ కేంద్రాలు కనీసం ఒక నెల రోజులకు సరిపడేలా ఔషధాలను ఇచ్చేవని హరిశంకర్ సింగ్ అనే వ్యక్తి చెప్పారు.

"కానీ, గత కొన్ని నెలలుగా రెండు వారాలకు మాత్రమే సరిపోయే మందులను ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. క్రమేపీ ఈ వ్యవధి కూడా తగ్గిపోయింది. తరచుగా ఏఆర్‌టీ సెంటర్లకు వెళ్లలేనివారికి ఇది చాలా ఇబ్బందిగా ఉంటోంది" అని ఆయన ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను వైద్య మంత్రిత్వ శాఖ ఖండించింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

"జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఔషధాల కొరత లేదా చికిత్సలో అవాంతరాలు, ఏఆర్‌వి ఔషధాల కొరత ఉన్న పరిస్థితులు తలెత్తలేదు" అని బీబీసీతో చెప్పింది.

టెండర్ జారీ చేయడంలో ఆలస్యం జరగడం వల్ల ప్రస్తుతం చికిత్సలో అవాంతరాలు చోటు చేసుకున్నాయని ప్రచారకర్తలు అంటున్నారు. టెండర్‌లో షార్ట్ లిస్ట్ అయిన సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో ఈ ప్రక్రియలో మరింత జాప్యం జరిగిందని అంటున్నారు.

అయితే, ఈ ఆరోపణకు వైద్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా సమాధానమివ్వలేదు. కానీ, ఔషధాల సరఫరాకు కొత్త ఆర్డర్‌లను పెట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఔషధాల స్టాక్ ఖాళీ అవ్వకముందే కొత్త సరుకు వస్తుందని చెప్పింది.

హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్న భారతదేశంలో సుమారు 23లక్షల మంది బాధితులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్న భారతదేశంలో సుమారు 23లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.

మల్టీ నేషనల్ సంస్థలు ఉత్పత్తి చేసే ఖరీదైన మూడు రకాల ఔషధాల మిశ్రమాన్ని సిప్లా సంస్థ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిన మూడు సంవత్సరాల తర్వాత నుంచి ఉచిత సరఫరా మొదలుపెట్టారు.

అంతకు ముందు ఈ మందుల కోసం రోగికి ఏడాదికి 12,000 డాలర్లు (సుమారు రూ. 9,55,560) ఖర్చయ్యేవి. ఇంత ఖర్చును ప్రభుత్వం లేదా సామాన్య మానవులు ఎవరూ భరించలేరు" అని ఉద్యమకారులు లూన్ గాంగ్టే అన్నారు.

సిప్లా చేస్తున్న ఉత్పత్తితో వీటి ధర ఏడాదికి రూ.27,870 లకు చేరింది. అప్పటి నుంచి అందరూ కొనుక్కోగలిగే హెచ్‌ఐవీ ఔషధాలను భారత్ చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరా చేయడం మొదలుపెట్టింది.

కానీ, ఈ ధరను కూడా చాలా మంది భరించలేరని ఉద్యమకారులు అంటున్నారు. దీని వల్ల ఎయిడ్స్ రోగుల చికిత్సకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత ఔషధాల కార్యక్రమం చాలా కీలకం అని చెబుతున్నారు.

లూన్ గాంగ్టే

యాంటీ రెట్రోవైరల్ ఔషధాల నిల్వలను నాకో పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత పరిస్థితిని కూడా నాకో సమీక్షించింది. 85% మంది ఎయిడ్స్ బాధితులు తీసుకునే టీ ఎల్ డీ టాబ్లెట్ నిల్వలు తగినంత ఉన్నాయని చెప్పింది.

"ప్రస్తుతం దేశంలో మొదటి, రెండవ స్థాయి యాంటీ రెట్రోవైరల్ చికిత్స తీసుకుంటున్న 95% మంది రోగులకు సరిపోయేంత ఔషధ నిల్వలు ఉన్నాయి" అని నాకో చెప్పింది.

"కానీ, ప్రాణాలను కాపాడే ఈ మందులు కనీసం ఒక వ్యక్తికి దొరకకపోయినా కూడా అది ఆమోదించదగిన విషయం కాదు" అని పీఎల్‌హెచ్‌ఐవి గ్రూపుతో పని చేస్తున్న మనోజ్ పరదేశీ చెప్పారు.

"చాలా మందిని ఔషధాలను మందుల షాపుల్లో కొనుక్కోమని సూచించారు. సమస్య అంతా టీఎల్‌డీ చికిత్స తీసుకోని వారికి, చిన్న పిల్లల ఔషధాలు అవసరమైన వారితో ఉంది" అని అన్నారు.

"15 - 20 రోజుల పాటు మందులు తీసుకోకపోయినంత మాత్రాన పెద్ద నష్టం ఏమీ జరగదు" అని 1986లో ఇండియాలో తొలి ఎయిడ్స్ క్లినిక్ ను ప్రారంభించిన డాక్టర్ ఈశ్వర్ గిలాడా అన్నారు.

గత రెండు నెలలుగా భారతదేశంలో హెచ్‌ఐవీ మందుల కొరత కొనసాగుతుండడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.

"ఔషధ సరఫరాలు పునరుద్ధరణ అయిన తర్వాత బాధితులు మందులను తరచుగా తీసుకోకపోవడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశముంది" అని అన్నారు.

"భారతదేశంలో రోగులపై ఔషధాలు ప్రభావం చూపిస్తున్నాయో లేదో తెలుసుకునే పరీక్షలు చేయరు" అని అన్నారు.

"దీంతో పాటు ఇది ప్రజల నమ్మకం పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఔషధాలను కొనుక్కునే బాధ్యత పూర్తిగా రోగి పై పెట్టకూడదు" అని అన్నారు.

హెచ్‌ఐవీ ఔషధాల కొరతకు వ్యతిరేకంగా నిరసనలు

హెచ్‌ఐవీ ఔషధాల కొరత ఏర్పడటం ఇది మొదటిసారి కాదు. 2014లో బాధితులు ఔషధాల కొరత ఎదుర్కొన్నారు. గత కొన్నేళ్లలో చాలా సార్లు ఔషధాల కొరత ఏర్పడింది.

హెచ్‌ఐవీ ఔషధాల సేకరణకు అవలంబించే సుదీర్ఘమైన టెండర్ ప్రక్రియతో పాటు లాభాలు తక్కువగా ఉండటం వల్ల చాలా సంస్థలు టెండర్ వేయడానికి ముందుకు రావని డాక్టర్ గిలాడా అన్నారు.

"గత కొన్ని దశాబ్దాలుగా ఎయిడ్స్ నిరోధించడంలో భారతదేశం చాలా పురోగతి సాధించింది. భారతదేశం ఔషధాలను సరఫరా చేసి ఉండకపోతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా మారి ఉండేది" అని చెప్పారు.

"భారతదేశం చాలా పనులను సక్రమంగా నిర్వర్తించింది. కానీ, చాలా పనులను మరింత మెరుగ్గా చేయాల్సి ఉంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)