ఇరాన్: ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే చాలామంది అమ్మాయిలు కన్యత్వ సర్టిఫికేట్‌లు తీసుకురావాలి

కన్యాత్వ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిరోజ్ అక్బరియన్, సోఫియా బెట్టీజా
    • హోదా, బీబీసీ న్యూస్

ఇరాన్‌లో చాలా కుటుంబాలు పెళ్ళికి ముందు అమ్మాయి కన్యత్వానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అమ్మాయి కన్య అని నిరూపిస్తూ సర్టిఫికేట్‌లు కావాలని కూడా కొంత మంది అబ్బాయిలు అడుగుతారు. అయితే, ఇలాంటి విధానం మానవ హక్కులకు వ్యతిరేకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గత ఏడాదిగా ఈ విధానానికి వ్యతిరేకంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు.

"నువ్వు కన్యవు కాదు కాబట్టే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిజం తెలిస్తే నిన్నెవరూ పెళ్లి చేసుకుని ఉండేవారు కాదు". ఈ మాటలను మరియం భర్త ఆమెతో మొదటి సారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత అన్నారు.

ఆమెకు మొదటి సారి సెక్స్‌‌లో పాల్గొన్న తర్వాత రక్తస్రావం జరగలేదు. తాను కన్యనే అని గతంలో ఎవరితోనూ సెక్స్‌లో పాల్గొనలేదని చెప్పినా ఆమె భర్త నమ్మలేదు. ఆమెను కన్యత్వ సర్టిఫికేట్ తెమ్మని అడిగారు.

ఇరాన్‌లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం అసాధారణమేమి కాదు. వివాహం నిశ్చయం అయిన వెంటనే చాలా మంది అమ్మాయిలు డాక్టర్ దగ్గరకు వెళ్లి గతంలో వారెప్పుడూ సెక్స్‌లో పాల్గొనలేదని ధృవీకరించే సర్టిఫికేట్‌లు తెచ్చుకుంటారు.

కానీ, కన్యత్వ పరీక్షకు శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

మరియం కన్నె పొర వదులుగా ఉందని వైద్యులు ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చారు. దీని వల్ల ఆమెకు సెక్స్ జరిగిన తర్వాత కూడా రక్తస్రావం అయ్యే అవకాశం లేదు.

"నా ఆత్మాభిమానం దెబ్బ తింది. నేనేమి తప్పు చేయలేదు. కానీ, నా భర్త మాత్రం నన్ను అవమానిస్తూనే ఉన్నారు. ఇక భరించలేకపోయాను. దాంతో, నేను కొన్ని మందులు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను" అని చెప్పారు.

సరైన సమయానికి ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ఆమె బ్రతికారు. "నేనా చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నేను 20 కేజీల బరువు తగ్గిపోయాను" అని చెప్పారు.

కన్యాత్వ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

కన్యత్వ పరీక్షలకు వ్యతిరేకంగా పిలుపు

ఇరాన్‌లో చాలా మంది మహిళల కథ కూడా మరియం కథ లాంటిదే. పెళ్లికి ముందు కన్యగా ఉండటం చాలా మంది అమ్మాయిలకు, కుటుంబాలకు చాలా కీలకమైన విషయం. ఇది వారి సాంస్కృతిక ఆచారాల్లో లోతుగా పెనవేసుకుపోయిన ఒక విలువ.

కానీ, ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కన్యత్వ పరీక్షలకు ముగింపు పలకాలని ఇరాన్‌లో మహిళలు, పురుషులు కూడా ప్రచారం చేపడుతున్నారు.

గత నవంబరులో కన్యత్వ పరీక్షలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ పిటిషన్ నమోదయింది. ఈ పిటిషన్‌కు ఒక నెల రోజుల్లోనే 25,000 సంతకాలు వచ్చాయి. ఇరాన్‌లో ఇంత పెద్ద ఎత్తున కన్యత్వ పరీక్షలను బహిరంగంగా సవాలు చేయడం ఇదే మొదటిసారి.

"ఇది వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమే. ఇది చాలా అవమానకరం" అని నెడా అన్నారు. నెడా 17ఏళ్ల విద్యార్ధినిగా టెహ్రాన్‌లో ఉండేటప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ వల్ల కన్యత్వాన్ని పోగొట్టుకున్నారు.

"నాకు చాలా భయం వేసింది. నా కుటుంబానికి తెలిస్తే ఏమవుతుందోననే భయం చుట్టుముట్టింది". అన్నారామె.

దీంతో, నెడా తన కన్నెపొరను రిపేర్ చేయించుకోవాలని అనుకున్నారు.

ఇరాన్‌లో చాలా కుటుంబాలు పెళ్ళికి ముందు అమ్మాయి కన్యత్వానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు.

ఫొటో సోర్స్, Manuella Bonomi

ఫొటో క్యాప్షన్, కన్యాత్వ పరీక్షలు (ప్రతీకాత్మక చిత్రం)

ఇలా రిపేర్ చేయించుకోవడం చట్టవ్యతిరేకం కాదు. కానీ, వీటికి చాలా ప్రమాదకరమైన సామాజిక ప్రతికూలతలు ఉంటాయి. ఈ ప్రక్రియ చేసేందుకు చాలా ఆస్పత్రులు అంగీకరించవు.

దీంతో, నెడా ఈ ప్రక్రియను రహస్యంగా చేసే ఒక ప్రైవేటు క్లినిక్‌ను ఆశ్రయించారు. దీనికి, ఆమె చాలా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. "నేను ఆదా చేసుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్‌తో పాటు ఉన్న బంగారమంతా అమ్మేసాను" అని చెప్పారు.

కన్నెపొరను సరిచేసే ప్రక్రియలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత తనదే అంటూ పత్రాల పై సంతకాలు కూడా చేశారు. ఆ తర్వాత ఒక మంత్రసాని ఈ ప్రక్రియను నిర్వహించారు. ఇందుకోసం ఆమెకు 40 నిమిషాలు పట్టింది.

కానీ, నెడాకు మాత్రం ఈ ప్రక్రియ చేసిన తర్వాత కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. "నేను చాలా బాధపడ్డాను. నా కాళ్లను కూడా కదపలేకపోయేదానిని" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆమె మొత్తం విషయాన్ని తల్లితండ్రుల నుంచి దాచిపెట్టి ఉంచారు.

"నాకు చాలా ఒంటరిగా అనిపించింది. కానీ, ఎవరికైనా దొరికిపోతానేమోననే భయం నా నొప్పిని దాచిపెట్టుకునేలా చేసింది".

చివరకు ఆమె భరించిన నొప్పికి ఫలితం కనిపించలేదు. ఒక ఏడాది తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కానీ, ఆ అబ్బాయితో సెక్స్ తర్వాత ఆమెకు రక్తస్రావం జరగలేదు. ఆమెకు జరిగిన కన్నెపొర రిపేర్ ప్రక్రియ విఫలమయింది.

"నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు" అని ఆమె బాయ్ ఫ్రెండ్ ఆరోపించారు. "నేనొక అబద్ధాలు చెప్పే అమ్మయినని నిందిస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు" అని చెప్పారు.

కన్యాత్వ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

కుటుంబం నుంచి ఒత్తిడి

కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అనైతికమని, వాటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇండోనేసియా, ఇరాక్, టర్కీ లాంటి చాలా దేశాల్లో వీటిని కొనసాగిస్తున్నారు.

కోర్టు కేసులు, అత్యాచార ఆరోపణల కేసుల్లో మాత్రమే కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తామని ఇరాన్ మెడికల్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

కానీ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న చాలా మంది జంటల నుంచి కన్యత్వ సర్టిఫికేట్‌ల కోసం అభ్యర్ధనలు వస్తూ ఉంటాయి. చాలా మంది వీటి కోసం ప్రైవేటు క్లినిక్‌లకు వెళుతూ ఉంటారు.

ఈ పరీక్షలను గైనకాలజిస్ట్ లేదా మంత్రసాని నిర్వహించి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. ఇందులో అమ్మాయి పూర్తి పేరు, తండ్రి పేరు, జాతీయ గుర్తింపు పత్రం వివరాలు, ఒక్కొక్కసారి ఆమె ఫోటో కూడా ఉంటాయి. ఈ సర్టిఫికేట్ లో అమ్మాయి కన్నె పొర ఉన్న తీరును వర్ణిస్తూ "ఈ అమ్మాయి కన్య అని అనిపిస్తోంది" అని అంటూ సర్టిఫికేట్ ఇస్తారు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో ఈ పత్రం పై ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేస్తారు. సాధారణంగా ఇలా సంతకాలు చేసేవారిలో అమ్మాయి తల్లి ఉంటుంది.

డాక్టర్ ఫరీబా కొన్నేళ్లుగా ఇలాంటి సర్టిఫికేట్‌లు జారీ చేస్తున్నారు. ఇది చాలా అవమానకరమైన ఆచారం అని ఆమె అంగీకరించారు. కానీ, ఆమె చాలా మంది అమ్మాయిలకు సహాయం చేస్తున్నానని భావిస్తున్నారు.

"అమ్మాయిలు తమ కుటుంబాల నుంచి చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సార్లు కొంత మంది కోసం అబద్ధం చెబుతూ ఉంటారు. ఎవరైనా పెళ్ళికి ముందే సెక్స్‌లో పాల్గొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే వారి కుటుంబాలకు మాత్రం ఆ అమ్మాయి కన్య అని చెబుతూ ఉంటాను" అని చెప్పారు.

కన్యాత్వ పరీక్షలు

ఫొటో సోర్స్, AFP

కానీ, చాలా మంది పురుషులకు కన్యగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. "పెళ్ళికి ముందే అమ్మాయి కన్యత్వాన్ని పోగొట్టుకుంటే ఆ అమ్మాయిని నమ్మలేం. ఆమె మరొక వ్యక్తి కోసం భర్తను వదిలిపెట్టి వెళ్లిపోయే అవకాశాలుంటాయి" అని షిరాజ్‌కు చెందిన 34ఏళ్ల ఎలక్ట్రీషియన్ అలీ అన్నారు.

ఆయన ఇప్పటి వరకు 10 మంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. "నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను" అని అన్నారు.

ఇరాన్ సమాజంలో ద్వంద్వ ప్రమాణాలున్నాయని ఆయన ఒప్పుకున్నారు. కానీ, సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికి కారణాలేవీ కనిపించడం లేదని అన్నారు.

"పురుషులకు మహిళల కంటే ఎక్కువ స్వేచ్ఛ ఉందని సామాజిక నియమాలు కూడా ఆమోదిస్తున్నాయి" అని అన్నారు. ఇదే అభిప్రాయం చాలా మంది పురుషులకు ఉంటుంది. ముఖ్యంగా, గ్రామీణ, సంప్రదాయ వర్గాల్లో ఇలాంటి భావనలు ఎక్కువగా ఉంటాయి.

కన్యత్వ పరీక్షలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రదర్శనలు పెరుగుతున్నప్పటికే, ఇరాన్ సంస్కృతిలో ఈ అలవాటు లోతుగా పాతుకుపోవడం వల్ల దీని పై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించడం త్వరలో సాధ్యం కాదని చాలా మంది భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, లండన్ చేరేనాటికి పటేల్ దంపతుల చేతిలో కేవలం 12 పౌండ్లున్నాయి.

భవిష్యత్తులో ఆశ

భర్త పెట్టిన వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకోవాలని అనుకున్న నాలుగేళ్ల తర్వాత మరియం కోర్టులో విడాకులు పొందగలిగారు. ఆమె ఇప్పుడు సింగిల్ వుమన్. "తిరిగి మరో పురుషుడిని నమ్మడం చాలా కష్టం. భవిష్యత్తులో మరో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు" అని అన్నారు.

కన్యత్వ సర్టిఫికేట్‌లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్ పిటిషన్ పై సంతకాలు చేసిన చేసిన కొన్ని వేల మంది అమ్మాయిలతో పాటు మరియం కూడా ఉన్నారు. అయితే, ఆమె బ్రతికి ఉండగా ఈ విషయంలో మార్పులు వస్తాయని మాత్రం ఆమె ఊహించడం లేదు. దేశంలో ఒక రోజుకు మహిళలు కూడా సమానత్వం సాధిస్తారని ఆమె నమ్ముతున్నారు.

"ఒక రోజుకు సమానత్వం సాధిస్తామని నమ్ముతున్నాను. నేను అనుభవించిన పరిస్థితిని మరో అమ్మాయి భరించకుండా ఉండే రోజు వస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

ఈ కథనంలో మాట్లాడిన వారి పేర్లను మార్చాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)