Aamir Khan-Laal Singh Chaddha: హిందీ సినిమాలపై విద్వేష ప్రచారాల వెనుక ఎవరున్నారు?

ఫొటో సోర్స్, Aamir Khan Productions
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
ఇద్దరు బాలీవుడ్ అగ్ర కథానాయకులు ఆన్‌లైన్‌లో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఈరోజు విడుదల కాబోతున్న వారి సినిమాలను అడ్డుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి ప్రచారాలతో ఏమైనా ప్రభావం ఉంటుందా?
ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ సినిమా రక్షా బంధన్ ఆగస్టు 11న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై నిషేధం విధించాలని సోషల్ మీడియాలో ఇటీవల కొన్ని ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.
లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తున్న బాలీవుడ్‌తో ప్రేక్షకులకున్న సంబంధం మారుతోందని చెప్పడానికి ఈ ట్రెండ్స్ సంకేతమని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇలాంటి వ్యతిరేక ప్రచారాలతో ఎంత వరకు నష్టం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం.
కోవిడ్-19 వ్యాప్తి నడుమ విధించిన లాక్‌డౌన్‌లతో మూటగట్టుకున్న నష్టాల నుంచి బాలీవుడ్ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతానికి థియేటర్లు తెరచుకున్నప్పటికీ, బాక్సీఫీస్ దగ్గర పెద్ద సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. దీంతో మరో సంక్షోభం దిశగా బాలీవుడ్ వెళ్తోందని సినీ విమర్శలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కొన్ని దక్షిణాది సినిమాలు హిందీ ప్రేక్షకులను కూడా ఈ మధ్య విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకిలా..
టామ్ హాంక్స్ నటించిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెరకెక్కిన లాల్ సింగ్ ఛడ్డాతోపాటు నలుగురి చెల్లెళ్లకు అన్నగా మారిన అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా భారీ బడ్జెట్ సినిమాలు.
అయితే, గతంలో ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపిస్తూ.. ‘‘వీరు భారత్, హిందూ వ్యతిరేకులు’’అని కొన్ని రైట్ వింగ్ సంస్థలు ఆన్‌లైన్‌లో ప్రచారాలు చేపడుతున్నాయి.
మత అసహనంపై 2015లో మాట్లాడిన ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలపై మళ్లీ ఇప్పుడు చర్చలను లేవదీస్తున్నాయి. అయితే, తనకు భారత్ అంటే చాలా ఇష్టమని ఆమిర్ ఖాన్ మరోసారి నొక్కిచెప్పారు.
2014లో హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ వర్గాలపై దాడుల నడుమ అప్పట్లో ఆమిర్ ఖాన్ మాట్లాడారు. దీనిపై వివాదం రాజుకోవడంతో తన వ్యాఖ్యలను అసందర్భోచితంగా ఉపయోగిస్తున్నారని ఆయన ఖండించారు.
‘‘నాకు భారత్ అంటే ఇష్టంలేదని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్ముతుంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజమూ లేదని నేను పునరుద్ఘాటిస్తున్నాను. దయచేసి నా సినిమాలను చూడండి. ఎలాంటి ఆంక్షలూ పెట్టొద్దు’’అని మీడియాతో ఆమిర్ ఇటీవల చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది మరీ కష్టం..
రక్షా బంధన్ విషయంలో ఏం తప్పు జరిగిందో స్పష్టంగా చెప్పడం చాలా కష్టం. హిందీ జాతీయవాదులను ఆకట్టుకునే రీతిలో అక్షయ్ కుమార్ చాలా సినిమాలు చేశారు. అయితే, గోరక్షుల దాడులను విమర్శిస్తూ రక్షా బంధన్ సినిమా స్క్రీన్ రైటర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. మరికొందరు అయితే, దేవాలయాల్లో పాలను వృథా చేస్తున్నారని అక్షయ్ గతంలో చేసిన ట్వీట్లను ప్రస్తావిస్తున్నారు. ఇంకొందరు అయితే, 2012లో ఒక సినిమాలో మతపెద్దలను విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపైనా చర్చ మొదలుపెట్టారు.
‘‘సినిమాలను నిషేధించాలని ఆన్‌లైన్‌లో డిమాండ్లు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఇవేమీ సహజంగా పుట్టుకొచ్చినవి కాదు. వీటి వెనుక రైట్ వింగ్ అజెండా ఉంది’’అని సినీ విమర్శకుడు ఉదయ్ భాటియా అన్నారు.
ఇలాంటి ప్రచారాల్లో సాధారణంగా కొందరి మనోభావాలను దెబ్బ తీశారని చెబుతుంటారు. కానీ, ఇలా ఆలోచించడం దారుణం. ప్రజలకు వినోదం పంచడానికే ఈ సినిమాలు తీస్తారు’’అని భాటియా వ్యాఖ్యానించారు.
కానీ, ఈ ఏడాది బాలీవుడ్ పెద్ద హిట్‌లలో చిన్న బడ్జెట్‌తో తీసిన ‘‘కశ్మీర్ ఫైల్స్’’ ఒకటి. 1990ల్లో కశ్మీర్ నుంచి హిందువుల వలసలను తమదైన కోణంలో చూపిస్తూ ప్రజలను విభజించేలా తీసిని సినిమా ఇదంటూ దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
‘‘జాతీయవాదం, హిందూ ప్రతిష్ట, చారిత్రక హిందూ ప్రముఖులు, గతంలో హిందువులు ఎదుర్కొన్న అరాచకాలు, సైన్యాన్ని గొప్పగా చూపించడం.. ఇవే నేటి బాలీవుడ్ ప్రముఖ సినిమా సబ్జెక్టులుగా మారాయి’’అని సినీ విమర్శకురాలు సౌమ్య రాజేంద్ర ఇటీవల వ్యాఖ్యానించారు.
కొన్ని ఏళ్లుగా..
కొన్ని ఏళ్లుగా భారత సినిమా పరిశ్రమల్లో బీజేపీ హిందూ రైట్ వింగ్ సిద్ధాంతాలకు మద్దతు పలికేవారు, వాటిని విమర్శించేవారి మధ్య విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది.
చాలా మంది సినీ ప్రముఖులు తమ రాజకీయ అభిప్రాయాలను బయట పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని వారు భయపడుతున్నారు.
వివాదాస్పద అంశాలపై సినిమా తీసేవారిపై భారీగా ట్రోలింగ్, కొన్ని సార్లు పోలీసు కేసులు కూడా వచ్చి పడుతున్నాయి.
దీనికి అదనంగా 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మరో కొత్త ప్రచారం కూడా జరిగింది. ప్రముఖుల పిల్లలకు మాత్రమే బాలీవుడ్‌లో అవకాశం ఉంటుందని, మిగతావారికి చోటు దక్కదని విశ్లేషణలు వచ్చాయి. అయితే, దీనిలో కొంతవరకు నిజం ఉండొచ్చని, ఇలాంటి సవాళ్లు అన్ని రంగాల్లోనూ ఉంటాయని కొందమంది సినీ ప్రముఖులు మీడియా ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కాఫీ విత్ కరణ్‌లోనూ
సోషల్ మీడియాలో ట్రోలింగ్, దీంతో సినీ పరిశ్రమపై పడుతున్న ప్రభావం గురించి పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లోనూ చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది.
‘‘మా పరిశ్రమను దారుణంగా విమర్శిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి’’అని సినీ ప్రముఖుడు కరణ్ జోహార్ ఒక ఎపిసోడ్‌లో వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తమ పబ్లిక్ ఇమేజ్ విషయంలో సినీ ప్రముఖులు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. మరోవైపు ఇలాంటి అసత్య ప్రచారాలతో బాక్సీఫీస్‌పై పెద్దగా ప్రభావం పడదని కొందరు అంటున్నారు.
‘‘పరిశ్రమపై నిజమైన ప్రజల అభిప్రాయాలు ఈ ప్రచారాల్లో కనిపించవు. నేడు హిందీ ప్రముఖుల్లో అక్షయ్ కుమార్ పేరు మొదట్లో ఉంటుంది. కానీ, ఆయన సినిమానే బ్యాన్ చేయాలని ట్రెండ్ చేస్తున్నారు’’అని భాటియా అన్నారు.
మరోవైపు ఆమిర్ ఖాన్ నిర్మించిన దంగల్‌తోపాటు పద్మావత్ విషయంలోనూ రైట్ వింగ్ సంస్థల నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ హిట్‌లుగా నిలిచాయని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అన్నారు.
‘‘అందరూ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే, ఇలాంటి ప్రచారాలతో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలంటే ముందుగా సినిమా విడుదల అవ్వాలి. ప్రేక్షకుల స్పందనే అన్నింటికీ సమాధానం చెబుతుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘నెగెటివ్ ప్రచారాలు చేపట్టేవారు సినిమాల గురించి అసత్య వార్తలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ప్రేక్షకులకు సినిమా నచ్చితే, దాన్ని ఎవరూ ఆపలేరు’’అని ఆదర్శ్ అన్నారు.
అయితే, బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాలన్నీ మంచివే అనుకోవడానికి వీల్లేదని భాటియా అంటున్నారు. కానీ, ఇప్పటికైతే ప్రేక్షకులే న్యాయనిర్ణేతలని చెప్పారు.
ఆన్‌లైన్‌లో ఇలాంటి అసత్య ప్రచారాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి త్వరలో తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- పాప్ స్మియర్: మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













