ఆమిర్ ఖాన్, కిరణ్ రావు: విడాకులు తీసుకున్న మరుసటి రోజు కలిసి మాట్లాడుతూ ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, @_kiranraokhan/insta
"విడాకులు తీసుకుంటున్నాం" అని ప్రకటించిన మరుసటి రోజు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కలిసి మాట్లాడుతూ, "మేం చాలా సంతోషంగా ఉన్నాం" అని చెప్పారు.
'పానీ ఫౌండేషన్'కు సంబంధించిన వారం రోజుల ఆన్‌లైన్ కార్యక్రమానికి వారిద్దరూ కార్గిల్ నుంచి హాజరవుతున్నారు.
"మీరు మా విడాకుల ప్రకటన వినే ఉంటారు. మీకు బాధ కలిగి ఉండవచ్చు. కానీ, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇప్పటికీ ఒకే కుటుంబం. మా అనుబంధంలో మార్పు వచ్చింది. కానీ, మేమిద్దరం ఇప్పటికీ కలిసే ఉన్నాం. మేము ఇలాగే సంతోషంగా ఉండాలని మీరంతా ఆశ్వీర్వదించండి" అని ఆమిర్ ఖాన్ అన్నారు.
"మేమిద్దరం ఇకపై కూడా కలిసి పనిచేస్తామని మీకు మాట ఇస్తున్నాం" అని కిరణ్ రావు చెప్పారు.
లాక్‌డౌన్ మొదలైన దగ్గర నుంచి పానీ ఫౌండేషన్ ఆన్‌లైన్ చర్చలు నిర్వహిస్తోంది. అందులో వీరిద్దరూ పాల్గొంటున్నారు.
తామిద్దరం విడిపోతున్నట్లు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు శనివారం ఒక సంయుక్త ప్రకటన చేశారు.
"ఈ 15 సంవత్సరాలు ఎంతో అందంగా గడిచాయి. మేము జీవితకాలానికి సరిపడా ఆనందం, అనుభవాలు, నవ్వులు పంచుకున్నాం. మా అనుబంధంలో నమ్మకం, గౌరవం, ప్రేమ పెంపొందాయి. ఇప్పుడు మా జీవితాల్లో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. భార్యాభర్తలుగా కాకుండా, పిల్లలకు తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా ఉండాలనుకుంటున్నాం.
కొంతకాలం నుంచి మేమిద్దరం దూరదూరంగానే ఉంటున్నాం. ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాత మాకు తేలికగా ఉంది. మా అబ్బాయి ఆజాద్‌ను కలిసే పెంచుతాం. తల్లిదండ్రులుగా మా ప్రేమను అందిస్తాం. సినిమాలు, పానీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టులలో కలిసి పని చేస్తాం.
మా శ్రేయోభిలాషులు మమ్మల్ని ఆశ్వీర్వదించి, మాకు శుభం కలగాలని కోరుకుంటారని ఆశిస్తున్నాం. మా విడాకులను ఒక ముగింపుగా కాక, ఓ సరి కొత్త ప్రయాణానికి నాందిగా చూడాలని ఆశిస్తున్నాం" అని ఆ ప్రకటనలో తెలిపారు.
లగాన్ చిత్రం సెట్స్‌లో అమీర్ ఖాన్, కిరణ్ రావు కలిశారు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కిరణ్ రావు పనిచేశారు.
2005 డిసెంబర్ 28న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.
ఆమిర్ ఖాన్‌కు ఇది రెండో పెళ్లి. అంతకుముందు, రీనా దత్తాతో 16 ఏళ్ల వివాహ బంధం తరువాత 2002లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- సిరాజుద్దౌలా: ‘146 మంది బ్రిటిష్ సైనికులను కలకత్తాలోని చీకటి గదిలో రాత్రంతా బంధిస్తే తెల్లవారేసరికి 23 మందే మిగిలారు’
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








