ఆదివాసీ సంప్రదాయంలో ఘనంగా ఆధునిక వివాహాలు... ఇదే ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్

గిరిజనులు

ఫొటో సోర్స్, NIL CHAUDHARI

    • రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(ఆగస్ట్ 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) గుజరాత్‌లోని తాపీలో ఇటీవల జరిగిన ఓ గిరిజన వివాహం చాలా భిన్నమైనది. ఆ చుట్టుపక్కల ఇలాంటి వివాహాలు ఈ మధ్య జరగలేదు.

పెళ్లి ఇంటిని వర్లి పెయింటింగ్‌తో ముస్తాబు చేశారు. వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు లాంటి ఇంట్లో పండించే కూరగాయలు, చిరు ధాన్యాలకు ఇక్కడ పూజలు చేశారు.

పూర్వీకులను ప్రసన్నం చేసుకునేందుకు ఓ వృద్ధుడు జపించిన మంత్రాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇది నీల్ చౌధరి పెళ్లి.

గిరిజన సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్న అతికొద్ది మందిలో చౌధరి ఒకరు. ఆయన తల్లి దండ్రులు మాత్రం బ్రాహ్మణుడి చేతుల మీదుగా వైదిక ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

కానీ, నీల్ లాంటి కొందరు మాత్రం వైదిక విధానాలకు బదులుగా తమ ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతిని అనుసరించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలకు ముందు ఇక్కడ గిరిజన సంప్రదాయంలోనే పెళ్లిళ్లు జరిగేవి.

గిరిజనులు

ఫొటో సోర్స్, NIL CHAUDHARI

పెరుగుతున్న ట్రెండ్...

ఇప్పుడు పాత కాలంలానే పెళ్లిళ్లు, మరణానంతర కార్యక్రమాలను చేసుకోవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ట్రెండ్ కొన్నేళ్ల క్రితం మొదలైంది. అయితే, ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతోంది. ముఖ్యంగా తమ సంప్రదాయ విధానాలకు మళ్లీ పునరుజ్జీవం పోయాలని ఇక్కడి గిరిజన యువత భావిస్తోంది.

మొదట్లో నర్మదా, రాజ్‌పిప్లా జిల్లాల్లో ఈ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు దక్షిణ జిల్లాలైన తాపీ, నవ్‌సరీలకూ ఇది విస్తరించింది.

నిజానికి గుజరాత్‌లోని కొన్ని గ్రామాలు పూర్తిగా సంప్రదాయ విధానాలవైపు వెళ్లిపోయాయి. ఆధునిక వైదిక సంస్కృతులు, క్రైస్తవ ఆచారాలను వీరు పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యంగా వాఘ్‌దేవ్ లేదా పులి దేవుడు లాంటి ప్రాచీన దేవతలను వారు పూజించడం మొదలుపెట్టారు.

కొన్నిచోట్ల వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రాచీన కాలంలో నిర్వహించే ‘‘మందడియా’’ లాంటి పూజలు కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. నిజానికి చాలా మంది వీటిని పూర్తిగా మర్చిపోయారు. కానీ, ఇప్పుడు గిరిజన యువత మళ్లీ వీటిని గుర్తు చేస్తున్నారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, NIL CHAUDHARI

సొంత ఆచారాలు

జననం, మరణం, పెళ్లిళ్లలో గిరిజనులకు సొంత ఆచారాలు ఉంటాయి. ఇవి వైదిక ఆచారాలు, క్రైస్తవ పద్ధతుల కంటే భిన్నంగా ఉంటాయి.

అయితే, గత కొన్ని దశాబ్దాలుగా వీటిని అనుసరించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. కొన్నిచోట్ల వీటిని అనుసరించే వారే కరవయ్యారు. గుజరాత్‌లోని ఉత్తర సబర్‌కాంఠా నుంచి దక్షిణాన నవ్‌సరీ వరకూ పెద్దమొత్తంలో గిరిజన ప్రజలు జీవిస్తుంటారు.

ఇక్కడ 25కిపైగా గిరిజన తెగలు మనకు కనిపిస్తాయి. రాథ్‌వాస్, చౌధరీలు, వసవాస్‌ లాంటి తెగల జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే, వీరు ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తింపును ధ్రువీకరించుకునే సమయంలో చాలా ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ముఖ్యంగా వీరికి కుల ధ్రువ పత్రాలు తీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయి.

‘‘మా ఆధారం, గుర్తింపులను కోల్పోతే ఇక ఉనికే ఉండదని మాకు అర్థమైంది. అందుకే తల్లిదండ్రులు చేసిన తప్పులను ఇప్పుడు పిల్లలు తెలుసుకుంటున్నారు. అందుకే తమ పురాతన మతాల వైపు వారు అడుగులు వేస్తున్నారు’’అని కేవడియా ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు ప్రఫుల్ వసవ చెప్పారు.

ప్రాచీన సంప్రదాయాలకు ఊరిపి పోయాలని ప్రచారం చేపడుతున్న అతికొద్ది మందిలో ప్రఫుల్ కూడా ఒకరు.

గిరిజనులు

ఫొటో సోర్స్, NIL CHAUDHARI

చాలా మంది ఇప్పటికీ...

అయితే, ఇప్పటికీ చాలా మంది గిరిజనులు, చాలా గ్రామాలు వైదిక, క్రైస్తవ సంప్రదాయాలను అనుసరించేందుకు మొగ్గు చూపుతున్నాయి. కానీ, కొందరు మాత్రం మూలాలను ఎప్పటికీ మరచిపోకూడదని నొక్కి చెబుతున్నారు.

‘‘మన సంప్రదాయాలు, మన ఆచారాలే మనకు గుర్తింపు. ఇవి ఏదో ఒక ఏడాది లేదో రెండేళ్లలోనో పుట్టిన సంప్రదాయాలు కావు. వీటిని ఏళ్లపాటు మా పూర్వీకులు పాటించారు. కానీ, మాలో చాలా మంది వీటిని వదిలిపెట్టేశారు. కానీ, నేడు ప్రకృతిని ఆరాధించడం, భవిష్యత్తును కాపాడమే ముఖ్యమని మేం తెలుసుకున్నాం. ఇప్పుడు మేం ఆ దిశగా అడుగులు వేస్తున్నాం’’అని చౌధరి చెప్పారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

నీల్ చౌధరి తరహాలోనే భవిన్ ధోదియా కూడా ఇటీవల ప్రాచీన సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు.

‘‘ఆదివాసీ అంటే నిరాడంబరతకు మారుపేరు. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లు చాలా హైఫైగా మారిపోయాయి. వేడుకల కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా కుటుంబాలు దివాలా తీస్తున్నాయి. మా పురాతన పెళ్లిళ్లు సౌభ్రాతృత్వానికి అద్దం పట్టేవి. ఉదాహరణకు మా దగ్గర మండపాన్ని గ్రామస్థులంతా కలిసి కడతారు. మా పెళ్లిళ్లలో ఖరీదైన కార్యక్రమాలేవీ ఉండవు. మా పొలాల్లో పండేవి, ఇంట్లో విరివిగా దొరికేవి మాత్రమే మా వేడుకల్లో కనిపిస్తాయి’’అని భవిన్ చెప్పారు.

ప్రాచీన సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్న యువకుల్లో అజయ్ వసవ కూడా ఒకరు. ‘‘ఇప్పుడు ప్రాచీన విధానాలను అనుసరిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నా పెళ్లి కూడా అలానే జరిగింది’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆదివాసీ అమ్మాయిలకు భరత నాట్యం నేర్పిస్తూ ఆనందాన్ని పంచుతా అంటున్న కౌసల్య శ్రీనివాసన్

ఎందుకు ఇలా..

ఎందుకు చాలా మంది వైదిక విధానాలను వదిలిపెట్టేస్తున్నారు? అని అజయ్‌ను బీబీసీ ప్రశ్నించింది. ‘‘మన సంప్రదాయాలను మరచిపోతే మనకు ఉనికే ఉండదు. ఈ విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. మేం గిరిజన విధానాలను అనుసరించకపోతే.. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు కూడా క్రమంగా నీరుగారిపోతాయి’’అని ఆయన అన్నారు.

‘‘మేం ‘ఏమిటో’ అలానే ఉండాలని అనుకుంటున్నాం. అందుకే గిరిజన సంప్రదాయాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. అప్పుడే ప్రజలు వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడతారు’’అని దమయంతీ బెహెన్ చెప్పారు. చాలా మంది గిరిజన పిల్లలు తమ పూర్వీకులు మాట్లాడే భాషను మాట్లాడలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, గుడ్డి నమ్మకాలు, మహిళలపై వివక్ష చూపించే పద్ధతులను తాము నమ్మమని చెప్పడం లేదని ఆమె అన్నారు. ముఖ్యంగా అలాంటి సామాజిక సమస్యలను నిర్మూలించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆదివాసీ మహిళ ఆయుర్వేద హెయిర్ ఆయిల్.. అమెరికాకు ఎగుమతి

పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో పూజలు నిర్వహించే మహిళా పండితుల్లో మమతా చౌధరి ఒకరు. ‘‘చర్చిల్లో, వైదిక క్రతువుల్లో కార్యక్రమాలకు మహిళలు నేతృత్వం వహించడం మనకు కనిపించదు. కానీ, మేం శతాబ్దాలుగా పూజలు చేయిస్తున్నాం. దీన్ని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తాం’’అని ఆమె చెప్పారు.

‘‘మా గిరిజన సంప్రదాయాలపై నాకు అవగాహన ఉంది. మేం మా అంతరాత్మలతో పూర్వీకులను పూజిస్తాం’’అని ఆమె అన్నారు.

గిరిజనుల అన్ని ఆచారాలు ప్రకృత్రికి దగ్గరగా, శాస్త్రీయ బద్ధంగా ఉంటాయని ఆమె పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)