ఝార్ఖండ్: అమ్మాయి ట్రాక్టర్‌తో పొలం దున్నితే ఊరికి అరిష్టమా, గ్రామబహిష్కరణ చేస్తామని యువతిని ఎందుకు బెదిరిస్తున్నారు

ఫొటో సోర్స్, MD SARTAJ ALAM/BBC
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలం
- హోదా, బీబీసీ కోసం
ఝార్ఖండ్‌లోని మారుమూల ప్రాంతాలలో ఒకటైన గుమ్లా జిల్లాలోని దహుతోలి గ్రామానికి చెందిన మంజు ఒరాన్ పేరు ప్రస్తుతం మీడియాలో నానుతోంది. అలా ఆమె పేరు వినిపించడానికి గల కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
‘ట్రాక్టర్‌తో పొలం దున్నడం’ అనే తప్పు చేశావంటూ మంజు ఒరాన్‌ను గ్రామస్తులు తమ గ్రామం నుంచి బహిష్కరించాలని తీర్మానించారు. శతాబ్దాలనాటి గ్రామ సంప్రదాయాలను ఆమె నాశనం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపణలు చేశారు. ఇలా అభ్యంతరాలు తెలిపిన వారిలో పురుషులే కాదు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అయితే మంజు పొలం దున్నడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె ట్రాక్టర్ నడపడాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఒరాన్ కమ్యూనిటీలో గతంలో ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లను ప్రస్తావిస్తున్నారు.
"మంజు ఒక ఆడపిల్ల. ఒరాన్ కులంలో అమ్మాయిలు పొలం దున్నడం నిషేధం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆఖరికి పొలాలు బీడుపడినా సరే...ఆచారం ప్రకారం ఆడపిల్ల పొలం దున్నకూడదు'' అని ఈ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ సుగ్రు ఒరాన్ అనే వ్యక్తి స్పష్టం చేశారు. ''మహిళలు చేసే పని మహిళలే చేయాలి, పురుషులు చేసే పనిని పురుషులే చేయాలి'' అని ఆయన వాదించారు.

ఫొటో సోర్స్, MD SARTAJ ALAM/BBC
ఇది దురదృష్టం!
మహిళలు పొలం దున్నడం అశుభమా? ఈ ప్రశ్నకు ఆమె బంధువు సుక్రు ఒరాన్ స్పందించారు. ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సుక్రు ఓరాన్ మంజు ఒరాన్‌కు వరసకు సోదరుడు అవుతారు.
"గిరిజన సమాజంలో ఇలాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ కారణంగానే మంజు ఒరాన్ వైఖరిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఖండించదగినది. పైగా మంజు పొలాన్ని ఎద్దులతో దున్నలేదు. ట్రాక్టర్‌తో పొలం దున్నిందని గ్రామస్తులు గుర్తించాలి. ఇది అశుభం కాదు" అన్నారాయన.
''ఈ రోజు ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా మారింది. మంజు కూడా స్వావలంబన కావాలని కలలు కంటోంది. అందుకే ఓ ట్రాక్టర్ కొని దానితో వ్యవసాయం చేయాలనుకుంది. మహిళలు స్వావలంబన కోసం చదువుకుంటున్నట్లే, పనిలో ముందుకు సాగుతున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు నడుపుతున్నారు" అన్నారు సుక్రు ఒరాన్
అభ్యంతరం వ్యక్తం చేసిన వారిలో ఒకరు, వృత్తిరీత్యా సాహియా (కమ్యూనిటీ హెల్త్ వర్కర్) అయిన నలభై ఐదేళ్ల మహిళ కందినే ఒరాన్ కూడా ఉన్నారు. ఆమె ఈ వివాదంలోని మరో కోణాన్ని బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, MD SARTAJ ALAM/BBC
క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన ప్రవీణ్ మింజ్ అనే గ్రామస్థుడు దహుతోలి గ్రామంలోని ఒరాన్ కులానికి చెందిన రెండు కుటుంబాలను మతం మార్చాడని ఆమె వెల్లడించారు. ఈ విషయమై గ్రామస్తులు జూలై 2న గ్రామసభ నిర్వహించారు. మతం మారిన రెండు కుటుంబాలను, ప్రవీణ్ మింజ్‌ను సామాజిక బహిష్కరణ చేశారు.
"ప్రవీణ్ మింజ్ పొలాలను గ్రామస్థులెవరూ సాగు చేయరాదని గ్రామస్థులు గ్రామసభలో తీర్మానించారు. అయినా ప్రవీణ్ మింజ్ పొలాలను మంజు దున్నారు. దీనిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి" అని కందినె ఒరాన్ అన్నారు.
సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్న ప్రవీణ్ మింజ్‌ను బీబీసీ సంప్రదించింది.
"గ్రామానికి చెందిన బంధన్ ఒరాన్ భార్య, బంధిన్ ఒరాన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు క్రైస్తవ మత ప్రార్థనకు వెళ్లడం ప్రారంభించారు. బ్రిస్ముని ఒరాన్ కూడా దేవుడి ఆశీస్సులు పొందిన తర్వాత నుంచి ప్రార్థనకు హాజరవుతున్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. నేను ఆ రెండు కుటుంబాల మతం మార్చానని వారు నాపై ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు'' అని ప్రవీణ్ అన్నారు.
"నా కుటుంబం రెండు తరాల కిందటే క్రైస్తవంలోకి మారింది. బంధన్ ఒరాన్ కుటుంబంగానీ, బ్రిస్ముని ఒరాన్ కుటుంబంగానీ క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు. సామాజిక బహిష్కరణ తర్వాత, రెండు కుటుంబాలకు చెందిన పద్నాలుగు మంది సభ్యులు గ్రామాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది'' అన్నారు ప్రవీణ్.

ఫొటో సోర్స్, MD SARTAJ ALAM/BBC
తన ఎకరన్నర భూమిని మంజు వ్యవసాయం కోసం కౌలుకు తీసుకున్నట్లు ప్రవీణ్ మింజ్ అంగీకరించాడు. ఈ పొలాన్ని దున్నేందుకు మంజు ట్రాక్టర్‌తో దున్నడంతో వివాదం నెలకొంది.
"నా కుటుంబానికి ఎక్కువ పొలం లేదు. అందువల్ల వ్యవసాయం చేయాలన్న నా లక్ష్యం నెరవేరేలా కనిపించలేదు. అందుకే నేను ప్రవీణ్ మింజ్ పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. కానీ, నేను లీజుకు తీసుకుంది ప్రవీణ్‌ను గ్రామ బహిష్కరణ చేయకముందు'' అని మంజు ఒరాన్ వివరించారు.
''ప్రవీణ్ పొలాన్ని కౌలుకు తీసుకున్నందుకు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులకు నేను ఒక విషయం చెప్పాను. మీరు ప్రవీణ్‌ను బహిష్కరించిన తర్వాత కూడా అతనికి కిరాణ సరుకులు అమ్ముతున్నారు. అలాంటప్పుడు నేనెందుకు వ్యవసాయం చేయకూడదు'' అని తాను వారితో వాదించినట్లు మంజు వెల్లడించారు.
''మంజు చేసిన పనికి గ్రామస్థులంతా విచారంలో ఉన్నారు. ఆమె ప్రవీణ్ పొలాన్ని దున్నడం మానేస్తే మా అందరి పరువు నిలబడుతుంది'' అని మరో గ్రామస్థుడు కరంచంద్ ఒరాన్ అన్నారు.
గ్రామస్తుల మాట వినకపోతే, ఈ విషయం గిరిజనులకు చెందిన అత్యున్నత సొసైటీ 'పద'వరకు వెళుతుందని, అక్కడ ఆమెకు శిక్ష విధిస్తారని కరంచంద్ అన్నారు.

ఫొటో సోర్స్, MS SARTAJ ALAM/BBC
మంజు ఏమంటోంది?
మంజు తల్లి అంగని భగత్‌కు 58 సంవత్సరాలు, ఆమె ఆరోగ్యం అంత బాగుండదు. తండ్రి లాల్దేవ్ భగత్‌కు 65 సంవత్సరాలు. తమ్ముడు శంకర్ భగత్ మానసికంగా బలహీనుడు. 33 ఏళ్ల వినోద్ భగత్ మంజుకి అన్నయ్య. అతనితో కలిసి మంజు పొలం సాగు చేస్తున్నారు.
నిజానికి మంజు వ్యవసాయాన్ని తన వృత్తిగా మార్చుకోవాలనుకున్నారు. అందుకే గతేడాది కొంత పొలాన్ని లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది కూడా పదెకరాల భూమిని కౌలుకు తీసుకోగా, ఆమె తండ్రికి 6 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయం, కొంత అప్పు, స్నేహితుల సహకారంతో పాత ట్రాక్టర్ కొనుగోలు చేశారు మంజు.
మంజు గ్రామ బహిష్కరణ వ్యవహారం తెలిసి తాను ఆశ్చర్యపోయానని ఆ ప్రాంతానికి చెందిన బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అన్నారు. మంజుపై ఎవరైనా జరిమానా లేదా సామాజిక బహిష్కరణ గురించి మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, MD SARTAJ ALAM/BBC
గిరిజన కమ్యూనిటీ రియాక్షన్
'దహుతోలిలో మతమార్పిడి జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. రెండేళ్లుగా ఈ ప్రాంతంలో పని చేస్తున్నాను. మంజు ఒరాన్ లాంటి కేసు ఈ ప్రాంతంలో మొదటి సంఘటన. కాబట్టి దీనిని సాధారణ కేసుగా పరిగణించకూడదు. మంజు విషయంలో స్థానిక అధికారుల నుంచి నివేదిక కోరాను'' అని గుమ్లా ఎస్‌డీఎం రవికుమార్ ఆనంద్ అన్నారు.
గిరిజన సంఘం 'రాజీ పాధా' ను నడిపిస్తున్న కెప్టెన్ లోహ్రా ఒరాన్, ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా గిరిజనుల సమస్యలపై సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.
మంజు భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తోందని, అది తప్పుకాదని, మహిళలు వ్యవసాయం చేయాలని ఆయన అన్నారు. అయితే, ప్రవీణ్ మింజ్‌ను బహిష్కరించడం తప్పేమీ కాదనీ, అలాగే, ఒరాన్ కమ్యూనిటీ నుంచి క్రైస్తవంలోకి మారిన వారు తిరిగి తమ మతాన్ని స్వీకరించే వరకు వారికి పొలాలు ఇవ్వకూడదని, తమ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం గిరిజనుల భూములను ఇతరులకు ఇవ్వడం కుదరదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MD SARTAJ ALAM
చదువుకున్న అమ్మాయి మంజు
దిల్లీ, పంజాబ్, ఇటుక బట్టీల్లో పనిచేసే మహిళలు కూడా తనలాగే గ్రామాల్లో వ్యవసాయం చేసి ముందుకు సాగాలని మంజు అన్నారు. సమాజంలోని ఆడపిల్లలందరికీ ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నానని, అందువల్ల మహిళలపై దోపిడి తగ్గుతుందని ఆమె అన్నారు.
వ్యవసాయంతో పాటు మంజు చదువును కొనసాగిస్తోంది. 2017లో ఆమె 10వ తరగతి పాసయ్యారు. 2019లో ఇంటర్ పాసయ్యారు. లాక్డౌన్ కారణంగా, మూడేళ్లుగా ఆమె తన గ్రామమైన దహుతోలిలో ఉంటున్నారు. ఈ సంవత్సరం మంజు గుమ్లాలోని ఇగ్నో సెంటర్‌లో సంస్కృతం ఆనర్స్‌లో అడ్మిషన్ తీసుకున్నారు మంజు.
ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మంజు వ్యవసాయంలో ఎక్కువ సమయం గడపడం వల్ల కాలేజీలో రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చదువుకోలేకపోయానని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













