విశాఖపట్నం: బీచ్‌లో ఇసుక నల్లగా మారడానికి కారణం ఏంటి, భయపడాల్సిన అవసరం ఉందా ?

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నల్లగా మారిన ఇసుక
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నల్లగా మారిన ఇసుక
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

గురువారం (11-08-22) విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఇసుక నల్లగా మారింది. సందర్శకులు ఎక్కువ ఉండే ఈ స్పాట్ లో ఇసుక నల్లగా మారడంతో సందర్శకులు అందోళనకు గురయ్యారు. ఆర్కే బీచ్ నుంచి ఉడా పార్కు వరకు ఉన్న తీర ప్రాంతంలో తరుచూ ఇసుక నల్లగా మారుతూ ఉంటుంది. అయితే ఇది తీరం పొడవునా కాకుండా అక్కడక్కడ మారుతూ ఉంటుంది.

ఎక్కువగా సందర్శకులు లేని చోట, లోతుగా ఉన్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుంది. అయితే గత రెండు రోజులుగా ఆర్కే బీచ్‌లో సందర్శకులు ఎక్కువగా తిరిగే దగ్గరే కనిపించడంతో చాలామంది ఆందోళన చెందారు. అయితే ఏ తీరంలోనైనా ఇసుక నల్లగా మారుతుందా? దానికి కారణలేంటి? ఇతర రంగుల్లోకి కూడా తీరంలోని ఇసుక మారుతుందా? రంగు మారడం దేనికి సంకేతం? ఇటువంటి అంశాలపై సముద్రగర్భ, జియాలజీ, వాతావరణ నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: తవ్వోడ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది?

'తీరంలో తెల్లని ఇసుక..నల్లగా మారింది'

ఆగస్టు 11 వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ కు వచ్చిన సందర్శకులకు నల్లని ఇసుక ఉన్న తీరం స్వాగతం పలికింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు. ఆ వైపుగా వెళ్తే ఏమవుతుందోనని కొందరు కంగారుపడ్డారు.

చాలా మంది అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. శుక్రవారం (12-08-22) నాటికి దాని తీవ్రత తగ్గినా ఇంకా కాస్త నల్లని ఇసుక తీరంలో కనిపిస్తుంది.

సాధారణంగా ఇలా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఇలా నల్లగా మారే స్పాట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గోకుల్ పార్క్ బీచ్, సబ్ మెరైన్ బీచ్, ఉడా పార్కు, పెదజాలరిపేట, జోడుగుళ్లపాలెం, తొట్లకొండ, భీమిలి...ఇలా అనేక తీర ప్రాంతాల్లో ఇది తరచూ జరిగే పరిణామమే.

ఆర్కే బీచ్
ఫొటో క్యాప్షన్, ఆర్కే బీచ్

'ఈ సీజన్ లో రంగు మారడం కామన్'

తీరంలో ఇసుక ఎందుకు అప్పుడప్పుడు నల్లగా మారుతుందనే విషయంపై ఆంధ్రాయూనివర్సిటీ సముద్రగర్భ అధ్యయన శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రసాదరావుతో బీబీసీ మాట్లాడింది. ఏ తీర ప్రాంతంలోనైనా ఇది సాధారణంగా కనిపించే పరిణామమేనని ఆయన చెప్పారు.

"ఒకచోటే తీరంలో ఇసుక నల్లగా మారదు. అది ఏదో ఒక చోట తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రదేశంలోనే కనిపించడానికి కారణంగా అక్కడ తీరం వద్ద ఉన్న లోతు, ఆ సమయంలో అక్కడ అలల తీవ్రత అనేది ఆధారపడుతుంది. ఏ తీర ప్రాంతంలోనైతే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయో, ప్రధానంగా ఏ ఖనిజాలు ఇనుమును థాతువుగా కలిగి ఉంటాయో, అక్కడ ఇసుక నల్లగా మారుతుంది. ఎందుకంటే ఇనుము దేనితోనైనా చర్య జరిపినా అది ముదురు నలుపు రంగులోకి మారే అవకాశాలే ఎక్కువ. తీరంలో ఉండే ఇసుకలోని సిలికాతో ఐరన్ చర్య కారణంగా ఇసుకకు నల్లని రంగుని వస్తుంది" రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రసాదరావు తెలిపారు.

"వందల ఏళ్లుగా తీరం నుంచి కొట్టుకొచ్చిన తీరంలోని ఎర్రని మట్టి, ఇసుకతో మేటలు వేసి భీమిలి సమీపంలోని ఎర్రదిబ్బలు ఏర్పడినట్లే. ఇక్కడ నల్లని ఇసుక మేటలు వేస్తుంది. అయితే ఈ ఇసుక చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి...అలలే మళ్లీ సముద్రంలోనికి తీసుకుని వెళ్లిపోతాయి. తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు ఉన్నా, ఏవైనా ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక అయా రంగులను సంతరించుకుంటుంది. కొన్ని కంటికి కనిపిస్తాయి. కొన్ని పరీక్షలు చేస్తే కానీ తెలుసుకోలేం. విశాఖ తీరం పొడవునా అనేక ఖనిజాలు ఉన్నాయనే విషయం పరిశోధనల్లో తేలింది" అని తెలిపారు.

విశాఖ ఆర్కే బీచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విశాఖ ఆర్కే బీచ్(ఫైల్ ఫొటో )

'స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువగా ఉంటే..."

ఏ తీరంలోనైనా అక్కడున్న ఇసుక రంగు మారడమనేది సాధారణమే. తీరంలో ఉన్న ఇసుక ఏ రంగులోకి మారుతుందనేది అక్కడున్న ఖనిజాలపైనే ఆధారపడి ఉంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రిటైర్డ్ రీజినల్ హెడ్ జీపీఎస్ మూర్తి బీబీసీతో చెప్పారు.

"ఇది తీరం పొడవునా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో అంటే జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తీరం వద్ద లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతం కోతకు గురవుతుంది. అలాగే ఇసుక మేటలను తీసే ప్రక్రియ (డ్రెడ్జింగ్) నిరంతరం జరుగుతూ ఉండే ప్రాంతం కూడా కోతకు గురవుతూనే ఉంటుంది. ఒకచోట కోతను నియంత్రిస్తే...మరొకచోట అవుతుంది. ఇది తీరాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. ఇలా కోతకు గురయ్యే సమయంలో ఆ తీర ప్రాంతంలోని అలల ఉధృతి కారణంగా ఇసుక ఒక చోటకు నెట్టివేతకు గురవుతుంది. అక్కడ స్పెసిఫిక్ గ్రాఫిటీ (Specific Gravity) ఎక్కువగా ఉన్న ఇసుక ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో ఆ ప్రాంతంలో ఇసుక నల్లగా కనపడుతుంది." అని జీపీఎస్ మూర్తి చెప్పారు.

ఇసుక నల్లగా మారితే ఆ ప్రాంతంలో ఖనిజాలున్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు
ఫొటో క్యాప్షన్, ఇసుక నల్లగా మారితే ఆ ప్రాంతంలో ఖనిజాలున్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు

'తీరం నల్లగా ఉంటే అది ఎకనామికల్ జోనే'

ఏదైనా తీర ప్రాంతంలో నల్లని ఇసుక ఎక్కువగా ఉందంటే అది ఎకనామికల్ జోన్ కిందే లెక్క. అంటే ఆ తీరంలో ఎక్కువ ఖనిజాలున్నాయని, అవి కూడా ఖరీదైనవని ఏయూ జియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

"తీర ప్రాంతంలో ఉండే ఖనిజాలను దాని స్పెసిఫిక్ గ్రావిటీ బట్టి రెండు రకాలుగా విభజిస్తారు. 2.98 కంటే స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువ ఉంటే వాటిని లోలెవెల్ మినరల్స్ అని, ఎక్కువగా ఉంటే హై లెవెల్ మినరల్స్ అంటారు. హైలెవెల్ మినరల్ తీరానికి కొట్టుకుని వస్తే అది తీరంలోని ఇసుకని నల్లగా మారుస్తాయి. ఎందుకంటే హైలెవెల్ మినరల్స్ లో ఇల్మనైట్ (Ilmenite), మోనోజైట్ (Monazite), హెమటైట్ (Hematite) వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్ని కూడా ఐరన్ ఓర్(ముడి ఇనుము)కు సంబంధించినవే. వాతావరణంలో హై ఎనర్జీ అంటే అలల ఉధృతి ఎక్కువగా ఉండటం, తీరం వద్ద గాలులు ఉండటం, అటుపోట్లు అధికంగా ఉన్నప్పుడు హైలెవెల్ మినరల్స్ తీరానికి కొట్టుకుని వస్తాయి. ఇవి అక్కడున్న ఇసుకతో చర్య పొందడం వలన ఆ ఇసుక నల్లగా మారతుంది" అని రాజశేఖర్ రెడ్డి వివరించారు.

'చీరాల తీరంలో తెల్లని ఇసుక'

కళింగపట్నం తీరం నుంచి బారువ తీరం వరకు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది. అది కూడా హైలెవెల్ మినరల్ మైనింగ్ జరుగుతుంది. అందుకే ఈ తీరాల్లో ఎక్కువగా నల్లని ఇసుక కనిపిస్తుంది. ఈ నల్లని ఇసుక కూడా తీరం నుంచి కిందవైపు ఎక్కువ పల్లంగా ఉండే ప్రాంతాల్లో ఉంటుంది. ఈ ప్రదేశాలను బెర్మ్ (BERM) అంటారని నిపుణులు చెబుతున్నారు.

"సాధారణంగా నల్లని ఇసుకని అనేక సముద్రతీర ప్రాంతాల్లో చూస్తాం. మిగతాదంతా తెల్లగా కనిపించే ఇసుకలానే కనిపిస్తుంది. అయితే ఆ తెల్లని ఇసుకలో 99 శాతం ఎటువంటి ఇతర ఖనిజాలు కలవకపోతే అది లోలెవెన్ మినరల్ ఏరియా అంటాం. ఇలాంటి ఇసుక లో ఎక్కువ భాగం క్వార్ట్జ్ ఖనిజం ఉంటుంది. దీనితో గాజుని తయారు చేయవచ్చు. అదే ఇందులో ఐదు, పది శాతం ఇతర మినరల్స్ కలిస్తే అప్పుడు ఏర్పడే క్వార్ట్జ్ నుంచి గ్లాజుని తయారు చేయాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. మనకు చీరాల తీరం వద్ద క్వార్ట్జ్ ఎక్కువగా ఉండే ఇసుక కనిపిస్తుంది" అని రాజశేఖర్ రెడ్డి వివరించారు.

ఆర్కే బీచ్

'నల్లని ఇసుక ఉంటే హై ఎనర్జీ ఉన్నట్లే'

తీరంలో నల్లని ఇసుక అన్ని సమయాల్లో కనిపించదు. అటుపోట్లు అధికంగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. ఒక రోజులో డిఫరెంట్ టైమ్ పిరియడ్స్‌లో ఇది జరుగుతుంది. వేవ్ కరెంట్స్, ఓషన్ వాటర్ స్పీడ్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు హైలెవెల్ మినరల్ తీరానికి కొట్టుకుని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పడే తీరంలోని ఇసుక నల్లగా కనిపిస్తుంది. తుపాను వచ్చిన వెంటనే తీరానికి వెళ్ల చూస్తే దాదాపు ప్రతిచోటా నల్లని ఇసుక కనిపిస్తుందని రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

"తీరానికి కొట్టుకొచ్చిన హైలెవెల్ మినరల్ లేదా లోలెవెవ్ మినరల్స్ అక్కడున్న వాతావారణ పరిస్థితుల కారణంగా అక్కడ ఎంత సేపు ఉంటాయనేది నిర్ణయమవుతుంది. వాతావరణం పరిస్థితుల కారణంగా తీరానికి వచ్చిన మినరల్స్ మళ్లీ రీఅడ్జస్ట్ అవుతూ మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. దాంతో మళ్లీ తీరంలో తెల్లని ఇసుకతో కనిపిస్తుంది. ఏ తీరంలో అయితే నల్లని ఇసుక కనిపిస్తుందో, అక్కడ హై ఎనర్జీ ఉన్నట్లు అంటే వాతావరణ పరిస్థితులు హై లెవెల్ లో ఉన్నట్లు, తెల్లని ఇసుక ఎక్కువగా ఉన్న తీరాల్లో వాతావరణం కామ్ గా ఉన్నట్లు అర్థం" అని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)