Beluga Whale: నదిలోకి వచ్చి ఇరుక్కుపోయిన అరుదైన తెల్ల తిమింగలం.. వారం రోజుల తర్వాత సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్

బెలుగా వేల్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాన్సెస్కా గిల్లెట్
    • హోదా, బీబీసీ న్యూస్

ఫ్రాన్స్‌లోని సీన్ నదిలో చిక్కుకుపోయిన ఓ 'బెలూగా వేల్'‌ను ఎట్టకేలకు సురక్షితంగా తరలించారు.

13 అడుగుల పొడవైన ఈ తెల్ల తిమింగలం పారిస్‌కు సమీపంలోని సీన్ నదిలో వారం రోజులుగా చిక్కుకుపోయింది.

రక్షిత జీవజాతుల జాబితాలో ఉన్న ఇలాంటి బెలుగా వేల్స్ సాధారణంగా ఆర్కిటిక్ సముద్రంలో అతిశీతల ప్రాంతాల్లో నివసిస్తాయి.

వల సహాయంతో నీటి నుంచి దీన్ని బయటకు తీసుకొచ్చేటప్పటికి అక్కడ పది మందికి పైగా పశువైద్యులు సిద్ధంగా ఉండి దానికి చికిత్స చేశారు.

పోలీసులు, డైవర్లు సహా సుమారు 80 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.

బెలూగా వేల్

ఫొటో సోర్స్, EPA

అనారోగ్యంతో ఉన్న ఈ 800 కేజీల తెల్ల తిమింగలాన్నిబయటకు తేవడానికి రెస్క్యూ టీంలు 6 గంటలకు పైగా శ్రమించాయి.

నది నుంచి బయటకు తీసిన తరువాత ఒక రిఫ్రిజిరేటెడ్ ట్రక్‌లో దీన్ని సముద్ర తీరానికి తీసుకెళ్తున్నారు.

అక్కడ కొన్నాళ్లపాటు దీనికి చికిత్స చేసి కోలుకున్న తరువాత సముద్రంలోకి విడిచిపెట్టనున్నారు.

''ఇది ఒక సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్. టెక్నికల్ ఆపరేషన్ ఇది. దీనికి ఎంతో నైపుణ్యం అవసరం' అని యూరే ప్రిఫెక్చర్ సెక్రటరీ జనరల్ ఇసబెల్లా డోర్లియట్ పౌజె అన్నారు.

బెలుగా వేల్

ఫొటో సోర్స్, Reuters

ఇది సముద్రం నుంచి నదిలోకి ప్రవేశించి సుమారు 100 కిలోమీటర్ల దూరం వచ్చేసింది. సరైన ఆహారం లేక దాని ఆరోగ్యం మందగించింది.

ఈ తెల్ల తిమింగలాన్ని తరలించే సమయంలో జంతు నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటారు.

'తిమింగలానికి అంతర్గతంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. మనకు తెలియదు'' అని దక్షిణ ఫ్రాన్స్‌లోని మెరైన్‌ల్యాండ్ సీ యానిమల్ పార్క్‌కు చెందిన నిపుణుడు ఒకరు చెప్పారు.

మామూలుగా అయితే బెలూగా తిమింగలాలు చాలా దృఢమైనవని అన్నారు.

రెస్క్యూ టీమ్‌లు

ఫొటో సోర్స్, @SEASHEPHERDFRAN

ఫొటో క్యాప్షన్, సీన్ నది ఒడ్డున రెస్క్యూ టీమ్‌లు

రెస్క్యూ ఆపరేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ చేరారు. దీంతో సెయింట్ పియరీ లా గారెన్ వద్ద సీన్ నదీ తీరమంతా జనంతో నిండిపోయింది.

రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా మొదట దానికి శీతలీకరించిన హెర్రింగ్ చేపలు, బతికి ఉన్న ట్రౌట్ రకం చేపలను ఆహారంగా అందించినా అది తినలేదు. నదిలోంచే అలా వెనక్కు మళ్లీ సముద్రంలోకి పంపించే ప్రయత్నాలు చేసినా అది వెనుదిరగలేదు.

దాని సహజ ఆవాసం నుంచి బయటకువచ్చి ఇంతదూరం దక్షిణంగా ప్రయాణించి నదిలో ఎలా చిక్కుకుపోయిందనేది నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు.

వీడియో క్యాప్షన్, ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పగడపు దిబ్బలు

బెలుగాలు అప్పుడప్పుడు శరత్కాలంలో ఆహారం కోసం దక్షిణ దిశగా వెళ్తాయి. కానీ, ఇలా తమ సహజ ఆవాసాల నుంచి సుదూర ప్రయాణం చేయడం అరుదే.

నార్వేకు ఉత్తరాన స్వాల్‌బార్డ్ దీవుల సమూహ ప్రాంతంలో ఈ బెలూగా తిమింగలాలు ఎక్కువగా ఉంటాయని.. ఇది సీన్ నదికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని సముద్ర క్షీరదాలకు సంబంధించి అధ్యయనం చేసే ఫ్రాన్స్‌లోని పెలాగిస్ అబ్జర్వేటరీ తెలిపింది.

ఇంతకుముందు సీన్ నదిలోనే నార్మండీ సమీపంలో ఒక కిల్లర్ వేల్ చనిపోయింది. 2019లో గ్రేవ్స్‌ఎండ్ సమీపంలో థేమ్స్ నదిలోనూ మృత తిమింగలాన్ని గుర్తించారు.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం బీచ్‌: సముద్రంలో స్వచ్ఛ భారత్ చేస్తున్న స్కూబా డైవర్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)