#IndiaAt75 దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ఆమె అనేక త్యాగాలు చేశారు. సొంత ఆస్తిని సైతం సమాజ సేవకు వినియోగించారు. తన జీవితాన్ని ప్రజా సేవకే వినియోగించారు. సుదీర్ఘకాలం పాటు జైలు జీవితం గడిపారు. అలాంటిది చివరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె మాటలు వింటే చాలామంది ఆశ్చర్యపోతారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్ట్ అయిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు పొందిన దువ్వూరి సుబ్బమ్మ అవసాన దశలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
'స్వాతంత్య్ర పోరాటంలో మహిళా నాయకులు' పేరుతో రాజమండ్రి నుంచి ముద్రించిన పుస్తకంలో పేర్కొన్న దాని ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన రామచంద్రాచార్యులకు చెందిన ఇంటిలోని ఓ గదిలో దువ్వూరి సుబ్బమ్మ చివరి రోజులు గడిచాయి.
ఆ సమయంలో 1954లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో టంగుటూరి ప్రకాశం ఆమెను పరామర్శించేందుకు కడియం వచ్చారు. ఆ సమయానికి సుబ్బమ్మ గదిలో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదు.
ప్రకాశం రాక సమాచారంతో ఆయన కోసం అప్పటికప్పుడు చెక్కతో ఒక కుర్చీని రామచంద్రాచార్యులు చేయించారని పుస్తకంలో ఉంది. నాటి సీఎం ప్రకాశంతో మాట్లాడుతూ "ఒరేయ్! పంతులూ ఎలా ఉందిరా? ఈ నల్లోళ్ల పరిపాలన"అని సుబ్బమ్మ అడిగినట్టు ప్రస్తావించడం విశేషం.

ఎవరీ దువ్వూరి సుబ్బమ్మ...
రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌కు సమీపంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న మహిళామణుల విగ్రహాలతో ఓ పార్క్ ఏర్పాటు చేశారు. ఆ పార్కులో దువ్వూరి సుబ్బమ్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటంలో అరెస్ట్ అయిన తొలి తెలుగు మహిళగా ఆమె విగ్రహం వద్ద పేర్కొన్నారు.
దువ్వూరి సుబ్బమ్మ 1880 నవంబర్ 15న జన్మించారు. ఆమె స్వగ్రామం ప్రస్తుతం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం. ఆమె తండ్రి మల్లాది సుబ్బావధాని. తల్లి పేరు వెంకట రమణమ్మ.
దువ్వూరి వెంకట సుబ్బయ్యను ఆమె చిన్నతనంలోనే వివాహం చేసుకున్నారు. నాటి ఆచారాన్ని బట్టి పదేళ్ల వయసులోనే ఆమెకి పెళ్లి జరిగింది. వారికి పిల్లలు పుట్టకముందే భర్త మరణించడంతో బాల వితంతువుగా మారాల్సి వచ్చింది.
భర్త మరణం, బిడ్డలు లేకపోవడంతో ఇక తన జీవితాన్ని దేశ సేవకు అప్పగించాలని ఆమె సంకల్పించుకుని స్వాతంత్ర్య పోరాటం వైపు మొగ్గు చూపినట్టు ఆమె జీవితం గురించి రాసిన వివిధ పుస్తకాల్లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, DINODIA
జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా...
1920ల నాటికి దేశంలో జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాలు విస్తృతమయ్యాయి. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణ వంటివి ఉధృతంగా సాగాయి. సరిగ్గా వాటి ప్రభావంతో దువ్వూరి సుబ్బమ్మ కూడా స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
కానీ ఆమెకు అక్షర జ్ఞానం లేకపోవడంతో సమీపంలోని కడియం గ్రామానికి వెళ్లి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. సాహిత్యాభిలాషతో తెలుగు, సంస్కృతం భాషల్లో పాండిత్యం సాధించారు.
జాతీయ కాంగ్రెస్ సభలకు 1921లో కాకినాడ వేదికయ్యింది. ఆ సందర్భంగా నిర్వహించిన రాజకీయ సభలో దువ్వూరి సుబ్బమ్మ పాల్గొన్నారు. ఆ సభల్లోనే 'సంపూర్ణ స్వాతంత్ర్య లక్ష్యం' తీర్మానాన్ని బలపరుస్తూ సుబ్బమ్మ మాట్లాడారని ఆ జీవిత చరిత్రకి సంబంధించిన పుస్తకాల్లో ప్రస్తావించారు.
ఆనాటి సభలకు టంగుటూరు ప్రకాశం అధ్యక్షులుగా వ్యవహరించారు. సుబ్బమ్మ వాగ్ధాటి.. ఆయనతో పాటుగా ఇతర కాంగ్రెస్ నాయకులను ఆకట్టుకుందని తెలిపారు. నాటి నుంచి సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం సహా కాంగ్రెస్ పార్టీ పిలుపులన్నింటా పాల్గొంటూ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో ఆమె భాగస్వామిగా మారారు.

ఫొటో సోర్స్, Getty Images
అరెస్టయినా మొక్కోవోని ధైర్యంతో..
ఆనాటికి మహిళలు ఉద్యమాల్లోకి రావడమే అరుదు. వివిధ ఆంక్షలున్న సమాజంలో మహిళగా దువ్వూరి సుబ్బమ్మ దూసుకురావడంతో ఆనాటి నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా చెబుతారు.
కేవలం ఆందోళనల్లో పాల్గొనడం, ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా, తన గంభీర స్వరంతో పాటలు పాడుతూ అందరినీ ఆకర్షించిన నాయకురాలిగా సుబ్బమ్మ పేరు మారుమ్రోగింది. ఆమెకి వరుసకి మేనమామ అయిన చిలకమర్తి లక్ష్మీ నర్సింహం రాసిన'భరత ఖండంబు చక్కని పాడియావు'పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించడంతో సుబ్బమ్మ అందరికీ చేరువయ్యారు.
విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమాల్లో ఆమె ముందు వరుసలో నిలిచారు. ఖద్దరు వస్త్రాలను ప్రోత్సహించేలా ప్రచారం నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆమెను పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు. జైలుకి కూడా తరలించారు.
ఆ సందర్భంలోనే సుబ్బమ్మను పోలీసులు నిర్భంధించి, క్షమాపణ కోరితే విడిచి పెడతామనే షరతు పెట్టగా ఆమె నిరాకరించినట్టు 'స్వాతంత్య్ర పోరాటంలో మహిళా నాయకులు' అనే పుస్తకంలో రాశారు. "నా కాలి గోరు కూడా ఆపని చేయదంటూ" ఆమె సమాధానం చెప్పినట్టుగా ఉంది.
కొంతకాలం రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆ తర్వాత ప్రస్తుతం తమిళనాడులో ఉన్న వెల్లూరు జైలులో కూడా ఆమె శిక్ష అనుభవించారు. ఎన్నడూ వెనకడుగు వేయకుండా ఆమె స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ.. ఆనేక మంది మహిళలను కూడా ముందుండి నడిపించిన చరిత్ర ఆమెకు ఉంది.
లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి..
గోదావరి తీరంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించేవారు. మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారిని ఉత్తేజ పరిచేవారు. దేశ విముక్తి కోసం బ్రిటిష్ వారితో సాగిస్తున్న ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేసేందుకు ప్రయత్నించేవారు. ఆ క్రమంలోనే ఓసారి పెద్దాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె లాఠీలకు సైతం ఎదురొడ్డి ముందుకు సాగారని చరిత్ర పరిశోధకుడు వంగలపూడి శివకృష్ణ అన్నారు.
"ఒకసారి పెద్దాడ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఓ తోటలో వనభోజనాలంటూ మహిళలను సమీకరించారు. ఆ పేరుతో రాజకీయ సభ జరుగుతోంది. ప్రారంభంలోనే దువ్వూరి సుబ్బమ్మ కూడా దేశభక్తి గీతాలు పాడి స్వాతంత్ర్యోద్యమ నాయకులను ఉత్తేజపరిచారు. అది గ్రహించిన బ్రిటిష్ సైనికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తోటలోకి చేరుకుని విచక్షణా రహితంగా మహిళలు, యువకులపై దాడి జరిపారు. అప్పుడు చాలామంది చెల్లాచెదురు కాగా దువ్వూరి సబ్బమ్మ మాత్రం బ్రిటిష్ సైనికులను ఎదురించి నిలబడ్డారు లండన్ పార్లమెంటులో సైతం ఈ ఘటన ప్రస్తావనకు వచ్చింది. The Peddapuram incedent పేరిట అప్పటి ప్రధాన ఆంగ్ల పత్రికలన్నీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రచురించాయి. ఈ ఘటనకు బాధ్యుడైన అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డప్పుల సుబ్బారావుని బ్రిటిష్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది"అంటూ ఆయన బీబీసీకి వివరించారు.
ఆమె బయట ఉద్యమాలు చేయడమే కాకుండా జైల్లో సైతం దేశభక్తి గీతాలు పాడుతూ, అందరిలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నంలో ఉండేవారని శివకృష్ణ తెలిపారు.

ఫొటో సోర్స్, HULTON ARCHIVE
గాంధీ నుంచి ప్రశంసలు..
సుమారు మూడు దశాబ్దాల పాటు గాంధీ పిలుపునందుకుని ప్రతీ కార్యక్రమంలోనూ పాల్గొన్న దువ్వూరి సుబ్బమ్మని అనేక మంది జాతీయ నేతలు కూడా అభినందించారు. గాంధీ అయితే ఏకంగా ఆమెను 'దేశబాంధవి' అంటూ ప్రస్తావించారని ఆమె విగ్రహం వద్ద పేర్కొన్నారు.
ఒకవైపు స్వతంత్ర్య పోరాటం సాగిస్తూనే మహిళలను చైతన్య పరిచేందుకు స్త్రీ విద్య అత్యవసరం అని ఆమె గుర్తించారు. అందుకు అనుగుణంగా విద్యారంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు విరాళాలు సేకరించారు. ఆనాడే రాజమండ్రిలో బాలికల పాఠశాలను స్థాపించడంలో ఆమెది ముఖ్యపాత్ర. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ఆమె తన వంతు ప్రయత్నం చేశారని స్వాతంత్ర్య సమరయోధుల పార్క్ నిర్వహణ కమిటీకి చెందిన జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.
"దువ్వూరి సుబ్బమ్మ అంటే గోదావరి తీరంలో మహిళా చైతన్యానికి మూలస్తంభం వంటివారు. గాంధీ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, సామాన్య మహిళల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిలించారు. సామాజిక స్పృహ మహిళలకు అత్యవసరం అని చెప్పేవారు. మహిళా ఉద్యమాల్లో దువ్వూరి సుబ్బమ్మ వంటి వారు అగ్రగణ్యులు. ఆమెతో పాటుగా దేశం కోసం త్యాగం చేసిన మహిళా మణులందరినీ గుర్తు చేసుకోవడమే లక్ష్యంగా మహిళా మణుల పార్క్ నిర్వహిస్తున్నాం"అని ఆమె బీబీసీకి తెలిపారు
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు "స్వేచ్ఛను పొందండి. ఆనందాన్ని అనుభవించండి, ఈ శుభవేళలో తీపి తినండి" అంటూ అందరికి మిఠాయిలు పంచిపెట్టిన సుబ్బమ్మ అప్పటికే తన అస్తినంతా కాంగ్రెస్ కార్యక్రమాల కోసం అప్పగించారు. చివరకు సొంత బిడ్డలు, ఆస్తి కూడా లేకుండానే ఆమె గడిపేశారు.
స్వాతంత్ర్యం తర్వాత కూడా...
దేశ స్వాతంత్ర్య పోరాటంలో సుదీర్ఘకాలం గడిపిన దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్ర్యానంతరం కూడా సుదీర్ఘకాలం పాటు జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. వృద్ధాప్యంలో కూడా దేశాభివృద్ధి కోసం ఆమె నిత్యం తపించేవారు.
చివరి రోజుల్లో ఆమె జీవితం కడియంలో సాగింది. అక్కడే ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద సుబ్బమ్మ చేసిన వ్యాఖ్యలు నేటికీ చాలామంది గుర్తు చేస్తుంటారు.
చివరకు 1964 మే 31వ తేదీన ఆమె మరణించారు. ఆమె చేసిన త్యాగాలు గుర్తు చేసేలా రాజమహేంద్రవరం పార్కులో ఉన్న ఆమె విగ్రహం వద్దకు అనేక మంది సందర్శకులు వచ్చి నివాళులర్పిస్తుండడం విశేషం.
ఇవి కూడా చదవండి:
- ఆదివాసీ సంప్రదాయంలో ఘనంగా ఆధునిక వివాహాలు... ఇదే ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్
- విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పినందుకు భార్యను హత్య చేసిన భర్త
- తెలంగాణ: ములుగులో సినిమా ఫక్కీలో లాయర్ మల్లారెడ్డి హత్య... ఎవరు చంపారు, ఎందుకు చంపారు?
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














