తెలంగాణ: ములుగులో సినిమా ఫక్కీలో లాయర్ మల్లారెడ్డి హత్య... ఎవరు చంపారు, ఎందుకు చంపారు?

లాయర్ మల్లారెడ్డి హత్య

ఫొటో సోర్స్, UGC/Ramachandra Family

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోజులు కాదు.. నెలలు కాదు.. రెండు ఏళ్ళ పాటూ ప్లాన్ చేసి మరీ ఒక లాయర్ ని చంపారు కిరాయి హంతకులు.. వరంగల్ వాళ్లు ప్లాన్ చేస్తే.. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ పథకాన్ని అమలు చేశారు.

ఈ ఆగష్టు 1వ తేదీ సాయంత్రం మల్లారెడ్డి అనే లాయర్ హత్య అచ్చం సినిమాల్లో చూపించినట్టే జరిగింది.

ములుగు జిల్లా పోలీసులు చెబుతోన్న వివరాల ప్రకారం, మల్లారెడ్డి ఆరోజు సాయంత్రం ములుగు పట్టణం నుంచి కారులో బయల్దేరారు.

అప్పటికే ఆయన కదలికల్ని గమనించే పనిలో ఉన్నారు ఇద్దరు నిందితులు. ఈ ఇద్దరూ ఫోన్ చేసి ఓకే అంటే, మల్లారెడ్డిని దారి కాచి చంపేసేందుకు, మరో నలుగురు ఎదురు చూస్తున్నారు.

ఆ నలుగురూ ములుగు శివార్లలో పందికుంట క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఉన్నారు.

''ఆ రోజు సాయంత్రం 6.30 కి మల్లారెడ్డి ములుగు నుంచి తన కారులో బయల్దేరారు. ఆ వెంటనే మల్లారెడ్డిని వెంబడిస్తోన్న ఇద్దరూ, పందికుంట దగ్గర ఎదురు చూస్తోన్న తోటి హంతకులకు సమాచారం ఇచ్చారు.

పందికుంట దగ్గర రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అందుకే వారు ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అనుకున్నట్టుగానే మల్లారెడ్డి కారు స్పీడు తగ్గింది. అప్పటికే అతణ్ణి వెంబడిస్తూ వస్తున్న ఆ ఇద్దరూ నిందితులూ, కారు స్పీడు తగ్గగానే తమ కారుతో మల్లారెడ్డి కారును ఢీకొట్టారు. అంతే మల్లారెడ్డి కారు ఆగింది.

కారుకు ఏమైందా అని చూడ్డానికి మల్లారెడ్డి కారు దిగారు. అదే అదనుగా అక్కడ కాపు కాసి ఉన్న నలుగురూ మల్లారెడ్డి మీద పడ్డారు. ఆయన్ను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి ఈడ్చుకు వెళ్లారు. మెడమీద, కడుపు మీద విచక్షణా రహితంగా కత్తితో పొడిచారు. మల్లారెడ్డి కూడా వీలైనంతగా తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

దీంతో నిందితుల్లో ఒకరైన జయరామ్ కి కూడా గాయాలు అయ్యాయి. మల్లారెడ్డి మాత్రం ఆ కత్తిపోట్లకు అక్కడికక్కడే చనిపోయారు.

ఆయన చనిపోయాడని తేల్చుకున్న తరువాత, నిందితులు అంతా అక్కడ నుంచి కారులో వెళ్లిపోయారు. ఇవి ములుగు పోలీసులు చెప్పి వివరాలు.

మల్లారెడ్డిని హత్య చేసిన ప్రాంతం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మల్లారెడ్డిని హత్య చేసిన ప్రాంతం

రెండేళ్ల పథకం!

నిజానికి మల్లారెడ్డిని చంపాలన్నది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు అంటున్నారు పోలీసులు. అతనికి స్థానికంగా కొన్ని భూమి తగాదాలు ఉన్నాయి. వాటి కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసుల భావన.

''గోనెల రవీందర్, పిండి రవి యాదవ్, వంచ రామ్మోహన రెడ్డి - ఈ ముగ్గురూ మల్లారెడ్డిని చంపించాలి అనుకున్న ప్రధాన వ్యక్తులు. వీరికి తడక రమేశ్ అనే ఆర్ఎంపీ సాయం చేశారు. వీళ్లంతా పాత వరంగల్ జిల్లాకు చెందిన వారు. ముందుగా ఈ నలుగురినీ అరెస్టు చేశాం. ఈ నలుగురూ కలసి హత్య చేయడం కోసం ఆరుగురిని ఎంచుకున్నారు. ఆ ఆరుగురిలో కొందరు వరంగల్ వారు, కొందరు పాత కర్నూలు జిల్లా వారు ఉన్నారు. రమేశే ఈ ఆరుగురికీ డబ్బు ఏర్పాటు చేశాడు.'' అన్నారు ములుగు పోలీసులు.

పోలీసుల కథనం ప్రకారం, హనుమకొండకు చెందిన పెరుమాండ్ల రాజు ఈ ఆరుగురిలో ముఖ్యుడు. హత్య కోసం తడక రమేశ్ ఇతణ్ణే సంప్రదించారు. రమేశ్, రాజు బంధువులు. రమేశే రాజుకు సూత్రధారులు ముగ్గురినీ పరిచయం చేశారు.

రూ. 18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం తరువాత, రాజు తన బృందాన్ని రంగంలోకి దించారు.

అందులో జయరామ్ (కర్నూలు), శివ (వరంగల్), వేణు (కర్నూలు), రమణ (నంద్యాల) - ఈ నలుగురూ హత్య పథకాన్ని అమలు చేశారు. వీళ్లందరితో హత్య గురించి రాజు తరచూ మాట్లాడుతుండేవాడు.

వీళ్లకు పెరుమాండ్ల రాకేశ్ అనే వ్యక్తి సహకరించాడు. దీంతో సూత్రధారులు, పాత్రధారులు, సహకరించిన వారూ అంతా కలపి పదిమంది తేలారు. పది మందీ అరెస్టయ్యారు.

హత్యా స్థలంలో పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యా స్థలంలో పోలీసులు

2020 నుంచి హత్య జరిగే వరకూ రాజు, హత్యలో పాల్గొన్న మిగిలిన నలుగురూ తరచూ కలిసేవారు. రూ.18 లక్షల్లో కొంత అడ్వాన్స్ తీసుకున్నారు. మల్లారెడ్డి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అడ్వాన్స్ తీసుకునేందుకు, పథకం వేసేందుకు ఎన్నోసార్లు వీళ్లు తరచూ నర్సంపేటలో కలుస్తుండే వాళ్లు. అన్ని రకాల సమాచారం సేకరించారు. అతను ఎప్పుడు ఎటు వెళ్తుంటాడు అనేది ఆరా తీసారు.

చివరకు 2022 ఆగస్టులో వారు హత్య చేశారు. హత్య తరువాత నిందితులు ఏ మాత్రం భయపడకుండా తడక రమేశ్ క్లినిక్ దగ్గర ఆశ్రయం పొందారు. వీరిని పోలీసులు పట్టుకున్నారు.

అయితే, కేసు నమోదు చేసిన తీరు, అరెస్టులపై మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసులో సరైన అనుమానితులను పట్టుకోలేదని మా అనుమానం. అసలు నేరస్తులు దొరకలేదనే అనుకుంటున్నాం. పోలీసులు చెబుతోన్న ప్రధాన నిందితుల వెనుక, వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా పెద్ద వాళ్లు ఉన్నారు. వాళ్లెవరో బయటకు రావాలి. మాకు భూమి వివాదాలు ఉన్నాయని తెలుసు. కానీ ప్రాణం తీసే అంత కాదు. పైగా కేవలం రూ.18 లక్షల కోసం అంత మంది వస్తారా? అసలు వారికి ఆయుధాలు ఎవరు సరఫరా చేశారు? ఇవన్నీ తేలాల్సి ఉంది’’ అని మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి బీబీసీతో అన్నారు.

‘‘మాకు ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉంది. వారిలో ఒకరు ఆంధ్రకు చెందిన వ్యక్తి. ఒకరు లోకల్. వారిద్దరూ వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి తిరిగారు. ఆరోజు ఆయన్ను ఎంఆర్ఓ ఆఫీసులో కలిశారు. అదే రోజు ఆ ఇద్దరిలో ఒకరి తల్లితండ్రులు మా ఇంటికి వచ్చి రాజీ పడదాం అనుకున్నట్టు తెలిసింది. అక్కడేదో తేడా జరగబోతుందని తెలిసే, వాళ్లు మా ఇంటికి రాజీకి రావాలనుకున్నారు. కానీ పోలీసులు ఆ ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్టు కనపడలేదు'' అన్నారామె.

''ఈ కేసులో ఇంకొందరికి ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం. వారికోసం వెతుకుతున్నాం. వాళ్లను కూడా త్వరలోనే పట్టుకుంటాం'' అని ములుగు ఎస్పీ చెప్పారు.

ప్రస్తుతం ములుగు ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. దీనిపై క్రైం నంబర్ 170/2022 గా వివిధ సెక్షన్ల కింద ములుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)